♦ ఆదిత్య హృదయం
పద్మావత్ సినిమాను నిషేధించాలని బీజేపీ రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టడంతో తాను శిక్షకు గురైనట్లు బీజేపీ భావిస్తుం డటం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. బీజేపీకి చెందిన 6 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై సంపూర్ణ నిషేధాన్ని ప్రకటించాయి లేక ప్రతిపాదిం చాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు సిని మాను ఆయా రాష్ట్రాల్లో ప్రదర్శించాల్సిందిగా ఆదేశించింది. మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఈ సినిమాపై నిషేధం విధించకూడదని కూడా ఆదేశించింది. ఇది కచ్చితంగా బీజేపీకి ఘోర పరాభవమే కాకుండా దాని రాజకీయ సంకట స్థితిని కూడా సూచిస్తుంది.
పద్మావత్ సినిమాను ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, తాము నియంత్రించలేమని బీజేపీ ప్రభుత్వాలు తొలి నుంచీ వాదిస్తూ వచ్చాయి. సినిమాను విడుదల చేస్తే కలిగే విపత్తును, హింసాత్మక స్థితిని ఎదుర్కొనడం కంటే నిషేధిస్తే సరిపోతుందని అవి భావించాయి. కానీ ఈ వాదన ఆమోదనీయం కాదు. ఎందుకంటే శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వాల వాస్తవ బాధ్యతే కాకుండా వాటి ప్రాథమిక కర్తవ్యం కూడా. కాబట్టి ఇలాంటి వాదన ప్రభుత్వాల మెడకే చుట్టుకుంటుంది.
రాజ్యాంగం ప్రకారం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యున్నతమైన విలువ. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారికి వ్యతిరేకంగా పౌరులను కాపాడవలసిన ప్రభుత్వ బాధ్యతను ఇది నిర్దేశిస్తుంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎత్తిపట్టి, కాపాడడంలో తమ అసమర్థతను చాటిచెబుతూ, బీజేపీ ప్రభుత్వాలు తమ ప్రాథమిక విధినే తిరస్కరిస్తున్నాయి. వాస్తవానికి, తాము నిర్వర్తించాల్సిన విధిని నెరవేర్చలేకపోతే, ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. సిని మాను ప్రదర్శించాలని, ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని తాను ఆదేశిస్తున్నప్పుడు అలా చేయకుంటే రద్దు చేస్తానని న్యాయస్థానం బెదిరించకపోవచ్చు కానీ, ప్రభుత్వాలు తమ రాజ్యాంగ విధిని ఉల్లంఘిస్తున్నాయని మాత్రం గుర్తు చేయవచ్చు.
హింసకు దారితీసే ఘటన.. దాని నిషేధానికి కారణం కాకూడదన్న అంశాన్ని బీజేపీ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అయినా.. ఇతరులను చీకాకు పెట్టే, ఇబ్బందిపెట్టే హక్కు లేకుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇక అర్థం ఏమిటి? వాస్తవానికి హింసాప్రవృత్తిని అలవాటుగా చేసుకున్న వారు సాగించే దుర్మార్గ చర్యలకు, హింసకు వ్యతిరేకంగా వాక్ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడానికే తప్ప, ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వాలను ఎన్నుకోరు కదా.
విషాదకరంగా, పద్మావత్ సినిమాను ప్రదర్శించే స్థితి ఇప్పటికీ ఉన్నట్లు కనిపించడం లేదు. కర్ణి సేన ఇప్పటికీ చిత్ర పంపిణీదారులను, ప్రేక్షకులను బెదరగొట్టే పనులకు సిద్ధమవుతోంది. తెగించి సినిమాను ప్రదర్శిస్తే తమ థియేటర్లకు ఏం జరుగుతుందో అనే భయంతో చాలామంది పంపిణీదారులు పద్మావత్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలామంది ప్రేక్షకులు కూడా సినిమాకు దూరం కావచ్చు.
నిజానికి, బీజేపీ తన రాజకీయనేతల పిరికితనం లేక మద్దతు ద్వారా కర్ణిసేన రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ వివాదం మొదట్లోనే దృఢంగా స్పందించి ఉంటే కర్ణిసేన చర్యలకు అడ్డుకట్ట వేసి ఉండవచ్చు. కానీ అలా జరిగి ఉండలేదు. ఇప్పుడు, తీవ్ర అసమ్మతి లేక నిరసన నేప థ్యంలో శాంతిభద్రతలను అమలు చేయడం భారత్‌లో అంత సులువైన విషయం కాదని నేను ఒప్పుకుంటాను. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా అరుదుగా విలువ ఇచ్చాయనే అభిప్రాయంతో కూడా నేను ఏకీభవిస్తాను. భారత్ గడ్డమీదికి చేరకముందే సల్మాన్ రష్దీ పుస్తకం ‘శాటనిక్ వెర్సెస్’ని నిషేధించాలని మన శ్రీమాన్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో నిర్ణయించారు కదా మరి. అలాగే, పద్మావత్– పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదట్లో ప్రదర్శించిన సందిగ్ధత కూడా బీజేపీ విచారకరమైన వైఖరికి ప్రతిరూపంగానే ఉండిందంటే సందేహమే లేదు. కాని ఇదంతా అతి పెద్ద సమస్యను ఎత్తి చూపుతుంది. మన రాజకీయనేతలు వారు ఎదుర్కొనే సవాళ్లకు ఎక్కువగా భయపడతారు కానీ వారిని ఎన్నుకున్న ప్రజల హక్కులు, స్వేచ్ఛలను పరిరక్షించడానికి బాధ్యత వహించరు.
కాబట్టి, సుప్రీంకోర్టుకు అభినందనలు. దాని లోపాలు, అసంపూర్ణతలు, వైరుధ్యాలను పక్కనబెట్టి, ఈ ఉదంతంలో అది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వేచ్ఛకు తన మద్దతును తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశానికి రాజ స్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల తక్షణ స్పందన ఏమంత ఆశాజనకంగా లేదు. సుప్రీం ఆదేశంపై సమీక్ష కోరతానని రాజస్థాన్ ప్రభుత్వం చెప్పగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టునే నిలదీసింది. హద్దుల్లేని ఈ తిరస్కారానికి సుప్రీంకోర్టు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఉన్నత న్యాయస్థానం అతి త్వరలోనే దీనికి సిద్ధపడుతుందని నా విశ్వాసం.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు,
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment