సైనిక జీవితం భయరహితమా? | A Soldier life is fearless? | Sakshi
Sakshi News home page

సైనిక జీవితం భయరహితమా?

Published Sun, Feb 18 2018 12:55 AM | Last Updated on Sun, Feb 18 2018 9:42 AM

A Soldier life is fearless? - Sakshi

ఆదిత్య హృదయం
మనందరమూ దేశభక్తులమే. కానీ ఒక సైనికాధికారి కుమారుడిగా, ఆత్మగౌరవం కలిగిన, దృఢమైన ప్రజాస్వామ్య దేశంలో మన సాయుధ బలగాలు దేశ ప్రజల ప్రేమను పొందడానికి ప్రత్యేక హక్కును కలిగిలేవని చెప్పాలనుకుంటున్నాను. మనకు సేవచేసే నర్సులు, వైద్యులు, పూజారులు, మౌల్వీలు, రైతులు, కూలీలు వంటివారిని అభిమానించడం కంటే మన సైన్యాన్ని ప్రేమించడంలో ఉన్నత మనోభావాలకు తావుండదు. నిజానికి, మిలటరీ డ్రమ్‌ వాయిస్తూ, మనం ప్రత్యేకమైన వారమని, లేదా అలాంటి పని చేస్తున్నందుకు మనం ఇతరులకంటే అధికులమని భావించడమంటే అది ప్రజాస్వామ్య దేశంగా మన అపరిపక్వతనే ప్రతిబింబిస్తుంది.

పైగా సైన్యం పేరుతో మన దేశంలో నానా చెత్తా మాట్లాడుతున్నారు. సైన్యంతో నాకు ప్రత్యేక బాంధవ్యం ఉన్నందువల్ల, సైన్యాన్ని గౌరవించడంలో నేనెవరికీ తీసిపోనందువల్ల, సైన్యం పట్ల ఈ వాగాండబరాన్ని సరిచేయవలసిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను సైన్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే, దానిగురించిన అసందర్భ ప్రసంగాలతో నేను తలపడాలని భావిస్తున్నాను.

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రసంగాన్ని చూపుతున్న ఒక వాట్సాప్‌ వీడియోను నేను ఇక్కడ ఉదాహరణగా చూపుతున్నాను. ఆడంబరంగా జిగేలుమంటున్న వేదికపై నిలుచుని ఆమె ఒక సైనికాధికారి బిడ్డగా ఉండటంలోని అనుభూతి గురించి మాట్లాడారు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఆ వేదికమీద ఆమె చెప్పవలసి వచ్చిన మాటలు నాకు నవ్వు తెప్పించాయి. 

సైనికుల ఇళ్లు ఇతరుల ఇళ్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటాయని చెబుతూ అనుష్క తన ప్రసంగం ప్రారంభించారు. ఎందుకంటే సైనికుల ఇళ్లలో క్రమశిక్షణ రాజ్యమేలుతూ ఉంటుందట. అంటే సైనిక కుటుంబాల్లోని తల్లులు, తండ్రులు తమ పిల్లలను ఏ సందర్భంలోనూ పాడు చేయలేదని నేను భావించవచ్చా? ఆ కుటుంబాల్లో ప్రేమికులు, ప్రేయసిలు ఉండరా? అయినా, సైనికుల పిల్లలు ఏడవరా? వారు అబద్ధాలు అడరా లేక ఎవరినీ గిల్లరా? నాన్న యూనిఫాం ధరిస్తారు కనుక మనం ఇతరులకంటే విభిన్నంగా ఉంటామా? మనం చన్నీటి స్నానాలు, శారీరక వ్యాయామాలు, నిత్య కవాతులు వంటి ప్రత్యేక లక్షణాలతోటే పెరిగామా? ఇవేమీ కాదు.

తనకే సొంతమైన కాల్పనిక పలాయనతత్వంలో అనుష్క శర్మ చిక్కుకుపోయారు. పైగా తమ భర్తలు, తండ్రులు యుధ్ధానికి వెళ్లేటప్పుడు వారి భార్యలు లేదా పిల్లలు ఎలా స్పందిస్తారనే అంశం విషయంలో ఆమె చక్కెర పూత పూసినట్లుగా మాట్లాడారు. సైనికుల తల్లులు దృఢంగా ఉంటారు. తమలోని ఉద్వేగాలను దాచిపెడతారు. ఆ విషయంలో వారు ప్రత్యేకమైన వారే అంటే నేను వ్యతిరేకించను. కానీ వారిలో జాతీయ స్ఫూర్తిని ఆసాంతం కుమ్మరించడం తప్ప.. వారిలో భయం ఉండదని, ఆందోళనలు వారి దరికి చేరవనే స్థాయిలో అనుష్క స్పందించారు. భారతీయ సైనికాధికారి చివరిసారిగా యుద్ధరంగానికి ఎప్పుడు వెళ్లాడు? ఆయన భార్యా పిల్లలు అనుష్క సూచించిన తరహా దేశభక్తికి చెందిన ఉద్వేగాన్ని ఎప్పుడు అనుభూతి చెందారు? కార్గిల్‌ని పూర్తిస్థాయి యుద్ధంగా భావించకుంటే మీరు 1971నాటి యుద్ధకాలానికి వెళ్లాలి. నేను పొరపాటు పడకపోతే అనుష్క ఆనాటికి బహశా జన్మించి ఉండరు. నేను అప్పుడు బోర్డింగ్‌ స్కూలులో చదువుతుండేవాడిని. కానీ యుద్ధం తలుపులు తట్టగానే మా ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైంది. 

మనం కాస్త నిజాయితీగా ఉందాం. యుద్ధం సంభవించిన మరుక్షణం సైనిక హృదయాలు బద్దలవుతాయి. ఎందుకంటే తమ ప్రియతములు అత్యున్నత త్యాగానికి సిద్ధపడాల్సి ఉందనే ఎరుక సైనికుల భార్యలు, పిల్లలకు ప్రతి క్షణమూ అర్థమవుతుంది. రాబోయే చెడు వార్తను మోసుకొచ్చే టెలిగ్రాం లేక టెలిఫోన్‌ కోసం భయకంపితులవుతూ ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం మీరు భయంతో జీవించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే భయంకరమైన యుద్ధ రంగంలో కాకుండా, సైన్యంలోనే మరొక క్షేమకరమైన డెస్క్‌ జాబ్‌లో నాన్న పనిచేస్తే బావుంటుందని మీరు భావించే క్షణాలు కూడా ఎదురవుతాయి.

సైనిక కుటుంబాల మనోభావాలకు పూతమందు పూయడం సులభమే కానీ అది అవివేకం. పైగా ఏ సందర్భంలో అయినా అలా చేయడం తప్పే అవుతుంది. సమాజంలోని ఇతరుల కంటే వారు భిన్నమైన వారని మాయమాటలు చెబితే వారిని మీరు గౌరవించినట్లు కాదు. అది వారిని సమాజం నుంచి దూరం చేస్తుంది, ఎవరికీ లేని ప్రత్యేకతల్లోకి నెడుతుంది. అంతిమంగా వారిని అమానవీకరిస్తుంది. ఎందుకంటే సైనికుల కుటుంబ సభ్యులు కూడా మీకు లాగే నాకు మల్లే రక్తం చిందిస్తారు. వారు బాధలను, భయాన్ని అనుభూతి చెందుతారు. తమ ప్రియతముల నుంచి చాలాకాలం దూరమవుతారు. మన కంటే వారు ధైర్యంగా ఉండవచ్చు. కానీ వారిలోని సాధారణ మానవ లక్షణాలను మీరు గుర్తించ నిరాకరిస్తే వారిలోని గొప్పగుణాలను మీరు గౌరవించినట్లు కాదు.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net
కరణ్‌ థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement