బెడిసికొట్టిన చంద్రబాబు ఎత్తుగడ | TDP Fails To Prove Swiss Challenge In Assembly | Sakshi

తుస్‌ చాలెంజ్‌

Dec 18 2019 4:51 AM | Updated on Dec 18 2019 1:59 PM

TDP Fails To Prove Swiss Challenge In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావించి టీడీపీ శాసనసభలో మరోసారి బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం అనుసరించిన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని సమర్థించుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇక సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం అంటూ చేసిన వాదన కూడా ఆయన చదివి వినిపించిన లేఖతోనే నీరుగారిపోవడంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. అమరావతి అంశంలో తమ ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

పత్రాలు ఉంటే కదా.. తేవడానికి
రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఎన్నో ఏళ్ల క్రితమే తప్పుబట్టిన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అనుసరించడం వెనుక భారీ అవినీతి దాగుందని దుయ్యబట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రస్‌ అల్‌ ఖైమాకు చెందిన ఆన్‌రాక్‌ సంస్థతో స్విస్‌ చాలెంజ్‌ విధానంలోనే అల్యూమినియం ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని విమర్శించారు.

అమరావతి కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్సార్‌ ప్రభుత్వం ఆన్‌రాక్‌ సంస్థతో స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఒప్పందం చేసుకుందని టీడీపీ నిరూపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా’’ అని సవాల్‌ విసిరారు.  తన ఆరోపణలను నిరూపిస్తానని అన్న చంద్రబాబు తన పక్కనే ఉన్న అచ్చెన్నాయుడుకు ఏదో చెప్పి బయటకు పంపించారు. కాసేపటికి అచ్చెన్నాయుడు ఒట్టి చేతులతో సభలోకి వచ్చారు. వెంటనే మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘అచ్చెన్నాయుడూ.. ఏవీ పత్రాలు? తేలేదా? ఉంటే కదా తేవడానికి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరించలేదు’’ అని స్పష్టం చేశారు. దాంతో చంద్రబాబు మాట మార్చారు. వైఎస్సార్‌ ప్రభుత్వం ఆన్‌రాక్‌ సంస్థతో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘స్విస్‌ చాలెంజ్‌ విధానానికి, ఎంవోయూకు తేడా తెలియని చంద్రబాబు మొన్నటివరకు సీఎంగా ఉండటం మన ఖర్మ. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు గత ఐదేళ్లు సీఎంగా ఉండటంతోనే ఎక్కువ నష్టం జరిగింది’’ అని ఘాటుగా విమర్శించారు.

బాబు చెప్పేవన్నీ అబద్ధాలే 
అమరావతి నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని చంద్రబాబు చెప్పడాన్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని, ఓ కంపెనీతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. వెంటనే చంద్రబాబు స్పందిస్తూ.. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. ఆ లేఖలో ‘సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం’ అని ఉండటాన్ని వైఎస్సార్‌సీపీ సభ్యుడు పార్థసారథి ప్రశ్నించారు.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని బొత్స విమర్శించారు. ఎన్‌.జనార్థన్‌రెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేస్తే.. తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలకు ఆయనే శంకుస్థాపన చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని బొత్స సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement