అమ్మా.. నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్నా..
డబుల్ బెడ్‌రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి సీఎం ఫోన్
ఖమ్మం రూరల్ (పాలేరు): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూం లబ్ధిదారురాలికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ఆరా తీశారు. బుధవారం ఇదే గ్రామంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11:28 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం పర్సనల్ సెక్రటరీ డబుల్ బెడ్‌రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి ఫోన్ చేసి.. కేసీఆర్ గారు మాట్లాడతారంటూ చెప్పారు.
అనంతరం సీఎం కేసీఆర్ ఫోన్‌లో నాగమణితో మాట్లాడుతూ.. అమ్మా.. మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి... డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎలా ఉన్నాయి, గ్రామంలో ఎంతమంది ఒంటరి మహిళలున్నారని అడిగారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే ఎలా ఉంటుందని అడిగారు. మద్దులపల్లిని మరో గంగదేవిపల్లిలాగా చేసుకోవాలని, అందుకు ప్రభుత్వ సహాయసహకారాలు అందిస్తామన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడం, సీఎంతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం రావడంతో నాగమణి ఆనందానికి అవధుల్లేవు. సాధారణ మహిళనయిన తనతో కేసీఆర్ ఆప్యాయంగా మాట్లాడిన తీరును చెబుతూ ఉబ్బితబ్బిబైంది.