east
-
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ నగర్లో శిలాఫలకాలను పగలగొట్టారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం వేసిన శిలాఫలకాలను తానే స్వయంగా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ మూకల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది. ఇంకా ప్రతిచోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు తగులబెట్టడం, కొట్టడం, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో ఉండటానికి వీలులేదంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. -
విశాఖ పోర్టు.. ఏమిటో లోగుట్టు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా.. ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకు రావడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కస్టమ్స్ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. దూరమైనా సరే కొందరు విశాఖ పోర్టును ఎంపిక చేసుకుంటున్నారన్న కోణంలోనూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు.. డ్రై ఈస్ట్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని దర్యాప్తు బృందం శనివారం విచారించింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బయట పడటంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరా తీస్తుంటే.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సంధ్య ఆక్వా సంస్థకు విశాఖలో ఫీడ్ యూనిట్ లేదు. ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. అంటే.. విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్‌ని ప్రకాశం యూనిట్‌కు తరలించేందుకు సంధ్య ఆక్వా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అలాంటప్పుడు.. నౌకని నేరుగా విశాఖ పోర్టుకు కాకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్‌ని కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ.. ప్రకాశంకు తరలించాల్సి వస్తే.. కట్టుపల్లికి ఈ నౌకని బెర్తింగ్ కోసం పర్మిషన్ పెట్టుకోవాలి. దీని వల్ల.. సమయం, వ్యయం కూడా సదరు సంస్థకు ఆదా అవుతుంది. కానీ.. విశాఖకు ఎందుకు తరలించారన్న విషయంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై సీబీఐ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. పోర్టు సిబ్బంది సహకారంపై సీబీఐ కన్ను విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో కస్టమ్స్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. కస్టమ్స్ విభాగం వారు అడ్డుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో హడావిడి చెయ్యడం తగదంటూ సీబీఐతో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఫోన్లో జోక్యం చేసుకోవడంతో.. డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ ముందుకు వెళ్లగలిగింది. దీనిపై సీబీఐ గుర్రుగా ఉంది. కస్టమ్స్ విభాగం వ్యవహారంపైనా సీబీఐ కన్నేసింది. కస్టమ్స్‌లో దిగువ స్థాయి సిబ్బంది కొంత మంది.. కంటైనర్స్ తీసుకొస్తున్న సంస్థలతో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల విశాఖలో 600కు పైగా ఈ–సిగరెట్ బాక్సుల్ని నగర పోలీసులు పట్టుకున్నారు. ఇవి కూడా కంటైనర్ ద్వారా విశాఖ చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ–సిగరెట్స్‌ని భారత్‌లో నిషేధించారు. అలాంటప్పుడు విశాఖ ఎలా చేరాయని ఆరాతీస్తే.. కంటైనర్ టెర్మి నల్లో కస్టమ్స్ని దాటుకొని నగరానికి వచ్చా యని తెలిసింది. ఇలా.. పలు అంశాల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన కొందరు దిగువ స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. ఈ తరహా నిషేధిత సరుకు బయటకి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు నిజమేనని ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. శనివారం కూడా మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి సంస్థ ఎండీ, డైరెక్టర్లను విచారించింది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు.. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆదివారం కూడా వారు మరోమారు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిందని తెలిసింది. -
రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి!
సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. 33 మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత భక్తులు దక్షిణ దిశ నుండి నిష్క్రమణ కావాలని ఉంటుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన రామాలయ విశేషాల గురించి తెలియజేసింది. మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాలు. ఇందులో 25 నుంచి 30శాతం స్థలంలో మాత్రమే ఆలయం నిర్మితమవుతోంది. మిగిలిన ప్రాంతం పచ్చదనంతో కూడి ఉంటుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ.. ఆలయంలోని బాలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన చేసే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు ప్రధాన ద్వారాలు సిద్ధం కానున్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థన, భజనలకు ఐదు మంటపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉండనున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ సముదాయంలో మౌలిక సదుపాయాలు విరివిగా ఉంటాయన్నారు. నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటాయన్నారు. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేస్తున్నమని, ఇక్కడ సామాను ఉచితంగా ఉంచుకోవచ్చన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నూతన ఆలయం నాగర్ శైలిలో ఉంటుందని, ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేకశైలి అని చెప్పారు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారని, ఇది దక్షిణ దేవాలయాల నిర్మాణ శైలికి ఉదారహణ అని తెలిపారు. ఆలయ నలుమూలల్లో సూర్య భగవానుడు, గణపతి, శివుడు, భగవతి అలయాలు ఉంటాయని, మధ్యలో బాలరాముడు కొలువుదీరుతాడన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ
-
War Moves East: ఇక తూర్పుపైకి
లివీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద డోన్బాస్ ప్రాంతాలపై భారీ దాడికి రష్యా సిద్ధపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ‘ఇందుకోసం సైన్యాన్ని భారీగా అక్కడికి పంపుతోంది. అక్కడి డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకోవడమే దాని లక్ష్యం. అక్కడి పొపస్న, రుబిజిన్ నగరాలను ఆక్రమించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడి ఇతర పట్టణాలు, ప్రాంతాలపై కాల్పులకు దిగింది’ అని చెప్పింది. డోన్బాస్‌పై దాడి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెనక్కు వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుందని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్ పరిసరాల్లోని పలు కీలక ప్రాంతాలు కూడా తిరిగి ఉక్రెయిన్ నియంత్రణలోకి వచ్చినట్టు చెప్పింది. రష్యా కాల్పులు మాత్రం భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. మారియుపోల్ రేవులో దాడి ధాటికి ప్రయాణికుల నౌక మునిగిపోతున్నట్టు సమాచారం. బుచాలో ప్రాణాలు కోల్పోయిన పౌరులను వలంటీర్లు శ్మశానానికి తీసుకొచ్చిన దృశ్యం యుద్ధంలో చిక్కుబడ్డ వారిని సురక్షితంగా తరలించేందుకు మారియుపోల్, బెర్డియాన్స్క్, తొక్మక్, సెవెరొ డొనెట్స్క్, లిసిచాన్స్క్, పొపస్న తదితర చోట్ల మంగళవారం మరో ఏడు మానవీయ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అంతులేని అకృత్యాలకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరాల ఆరోపణలపై విచారించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ‘‘పుతిన్ కర్కోటకుడు. బుచాలో జరిగినవి క్షమించరాని ఘోరాలు’’ అంటూ దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌లో నిర్వాసితుల సంఖ్య 1.2 కోట్లు దాటినట్టు ఐరాస పేర్కొంది. వీరిలో 45 లక్షల మంది దాకా దేశం వీడినట్టు అంచనా. దౌత్య సిబ్బంది బహిష్కరణ పలు దేశాలు తమ రష్యా రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మందుపాతర్లు పెట్టొద్దని రష్యాకు ఐరాస విజ్ఞప్తి చేసింది. అవి పౌరుల ప్రాణాలను బలిగొంటాయని గుర్తుంచుకోవాలని మందుపాతరల ఉత్పత్తి, వాడకాన్ని నిషేధించేందుకు ఏర్పాటైన ఐరాస కన్వెన్షన్ ప్రెసిడెంట్ అలీసియా అరంగో ఒల్మోస్ అన్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉండగా రష్యాతో ఇంధన ఒప్పందాలు కుదుర్చుకోవడమే గాక ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని పొరపాటు చేశానని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్ అభిప్రాయపడ్డారు. యుద్ధ భయం, ఆకలిచావుకు బలైన తన తల్లి సమాధి వద్ద విషణ్ణవదనంతో ఆరేళ్ల పిల్లాడు వ్లాద్ తన్యుయ్. కీవ్ సమీపంలో తీసిందీ ఫొటో. గ్యాస్ సరఫరాకు నోర్డ్‌స్ట్రీమ్ 2 పైప్‌లైన్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోకుండా ఉండాల్సిందన్నారు. తూర్పు యూరప్ దృష్టిలో జర్మనీ విశ్వసనీయతను ఇది బాగా తగ్గించిందని అంగీకరించారు. యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ త్వరలో కీవ్‌లో జెలెన్స్కీతో భేటీ కానున్నారు. యుద్ధం వల్ల ఆసియాలో పలు దేశాల ఆర్థి్థక వ్యవస్థలు సుదీర్ఘకాలం పాటు నెమ్మదిస్తాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఒకటి జోస్యం చెప్పింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు బుచా హత్యాకాండ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల విషయంలో దృఢంగా వ్యవహరించాలని ఈయూ సభ్య దేశాలన్నీ పట్టుదలతో ఉన్నాయి. రష్యాపై సంయుక్తంగా మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ వెల్లడించారు. వీటిలో భాగంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని యూరప్ భావిస్తోంది. రష్యా నుంచి యూరప్ ఏటా 400 కోట్ల యూరోల విలువైన బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నరమేధానికి బలై బుచాలో సొంతింట్లో నిర్జీవంగా పడి ఉన్న ఒక వృద్ధురాలు యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి మరింత పెంచాల్సిన అవసరముందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ అన్నారు. అయితే కీలకమైన గ్యాస్ దిగుమతులపై నిషేధం అంశాన్ని ఆమె ప్రస్తావించలేదు. రష్యా బ్యాంకింగ్ రంగంలో 23 శాతం వాటా ఉన్న మరో నాలుగు మేజర్ రష్యా బ్యాంకులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐటీపరంగా రష్యాను బలహీనపరిచే మరిన్ని ఆంక్షలను కూడా ఈయూ ముందు ఆమె ప్రతిపాదించారు. రష్యా చమురు వద్దు: అమెరికా రష్యా నుంచి చమురు, ఇతర దిగుమతులను పెంచుకోవడం భారత ప్రయోజనాలకు మంచిది కాదని అమెరికా వ్యాఖ్యలు చేసింది. రష్యాపై ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌సింగ్ ఇటీవల ఇవే వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఇతర దేశాలతో కలిసి అమెరికా విధించిన ఆంక్షలకు అంతా కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. భారత్ తన చమురు అవసరాల్లో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది 1 శాతం కంటే తక్కువే. -
కాపులు, పోలీసుల మధ్య తోపులాట
కంచాలతో రోడ్డేకేందుకు యత్నం జగ్గంపేట : కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద కాపులు, పోలీసుల మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది. కంచాలతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 26న ముద్రగడ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని అడ్డు చెప్పడంతో.. పోరు సీఎం వర్సెస్ ముద్రగడగా మారింది. ఓట్ల కోసం కాపు జాతికి రిజర్వేషన్లను ఎరవేసి వారి ఓట్లతో పీఠం ఎక్కిన చంద్రబాబుకు ఆ హామీని గుర్తు చేయడం రుచించడం లేదు. జాతి కోసం కుటుంబంతో పోరుబాట సాగిస్తున్న ముద్రగడ..తనకు కంటిలో నలుసుగా మారినట్టు భావిస్తున్న సీఎం.. ఆయనను అణచివేసి ఉద్యమం నీరుగార్చేందుకు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగ్గంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్య.. ముద్రగడను ఉద్దేశించి చేసిందనంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. నిరవధిక పాదయాత్ర పేరిట ముద్రగడ రోజూ బయటకురావడం, ఆయనను పోలీసులతో నిలువరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం రోడ్కెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే పరిష్కారం చేయకుండా.. ముద్రగడను టార్గెట్‌గా చేయడాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కంచాలు మోగించి... ముద్రగడ, కాపు జేఏసీ నాయకులు, మహిళలు గురువారం కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రకం నిరసనలు వ్యక్తం చేస్తోన్న కాపు జేఏసీ నాయకులు నల్ల చొక్కాలను ధరించారు. కంచాలతో నిరసన సందర్భంగా ముద్రగడ ఇంటి నుంచి ఒక్కసారి గేటు వరకు పెద్ద సంఖ్యలో వచ్చి రోడుపై ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు వాసురెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆరేటి ప్రకాష్, చక్కపల్లి సత్తిబాబు, గుండా వెంకటరమణ, తుమ్మలపల్లి రమేష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సంకెళ్లు వేయండి.. కాపు జాతిపై కక్ష సాధింపు ఎన్ని రోజులని నిలదీశారు. -
జిల్లాను సస్యశ్యామలం చేస్తా
ప్రతి ఏకరాకు నీరు ఇస్తాం ఈ ఏడాది జూన్‌లోనే నీరు ఇచ్చాం జగ్గంపేట సభలో సీఎం చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం/ జగ్గంపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి, జల్లాను సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం గం.2:25 నిమిషాలకు పురుషోత్తపట్పం ఎత్తిపోతల పథకాన్ని ఒక మోటారు ఆన్ చేసి ప్రారంభించిన సీఎం అక్కడ విలేకర్లతో మాట్లాడిన అనంతరం 3:41 గంటలకు జగ్గంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జల్లాలో 31,02,852 భూమి ఉండగా అందులో 13,67,362 వ్యవసాయ భూమి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 12,07,960 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌కు జూన్‌లోనే నీరు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు. ఫలితంగా తుపాన్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చాన్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాలను తానే ప్రారంభించి పూర్తి చేశానని, పురుషోత్తపట్నం ద్వారా జిల్లాలో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత వరకు ఈ ఏడాది చివరికి పురుషోత్తపట్నంలో 10 పంపులు ఏర్పాటు చేసి ఏలేరు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంలో అధికారులు సెలవులు తీసుకోకుండా కష్టపడ్డారని అభినందించారు. -
‘అల’వోకగా
సర్కారు బడుల్లో..‘ఆనంద లహరి’ జిల్లాలో 135 పాఠశాలలు ఎంపిక మొదటి దశ ప్రారంభం 1.2 తరగతులకు నూతన అభ్యసన ప్రక్రియ రిషివ్యాలీ తరహాలో విద్యాబోధన విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించిందేకు విద్యాశాఖ అధికారులు ఆనందలహరి (అల)పథకాన్ని రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతి విద్యార్థులకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో తరగతి గదులను నూతనంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు ఆడుకుంటూ అక్కడే ఉన్న బోధనోపకరణాలను సందర్భోచితంగా ఉపయోగించుకుంటారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి, మండలానికి రెండు పాఠశాలల వంతున ఎంపిక చేశారు. మొదటి దశలో రెవెన్యూ డివిజన్లలో ‘ఆనందలహరి’ కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం ప్రారంభించారు. - రాయవరం(మండపేట) రాష్ట్ర వ్యాప్తంగా ఈ ‘అల’ అభ్యసన విధానం అమలు చేసేందుకు 1,342 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 135 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. మొదటి దశలో ఏడు రెవెన్యూ డివిజన్లలో ప్రారంభిస్తుండగా..కాకినాడ రూరల్ మండలం పండూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. మిగిలిన డివిజన్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. స్వీయం..సరళం.. ‘అల’ విధానంలో ఆయా పాఠశాలల్లో 1, 2 తరగతులు చదివే విద్యార్థులకు ఈ విధానంలో బోధన సాగిస్తారు. విద్యార్థులు పుస్తకాలను ఇంటి నుంచి తీసుకుని రావాల్సిన పనిలేదు. ఐదుగురు ఒక విద్యార్థులకు ఒక ట్యాబ్ వంతున ఇస్తారు. ఇక్కడ బోధన అంతా స్వీయ అభ్యసనంతో పాటు సరళమైన విధానంలో ఉంటుంది. ఒక అడుగున్న టేబుల్ చెస్ బోర్డు తరహాలో ఏర్పాటు చేసి కుర్చీలు ఉంటాయి. గోడ అంతా బ్లాక్ బోర్డు ఉంటుంది. పిల్లలకు బ్లాక్ బోర్డు మీద కొంత భాగం కేటాయిస్తారు. అక్కడే అందుబాటులో షెల్ఫ్ ఉంటుంది. అందులో బోధన ఉపకరణాలను తీసుకుని పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల సహకారంతో సొంతంగా అవగాహన పొందుతారు. విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాబోధన ఉంటుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థికి సహకారంగానే ఉంటాడు. బోధన అభ్యసన పద్ధతులను, గుర్తించిన విధానం మేరకు వారి స్థాయిని గుర్తిస్తారు. ఈ విధానంలో ఎప్పటికప్పుడు ఏ మేరకు విద్యార్థులు అవగాహన చేసుకుకున్నారో? లేదో? స్పష్టమవుతోంది. కృత్యాధార బోధన ద్వారా గణిత భావనలు సందర్భానుసారంగా ఆసక్తికరంగా, ఆనందకరంగా వైవిధ్యంగా ఉండడంతో ఆసక్తిగా పాల్గొంటారు. మొదటి దశలో ఆనందలహరి ప్రారంభమైన పాఠశాలలివే.. రెవెన్యూ డివిజన్ పాఠశాల కాకినాడ పండూరు రాజమహేంద్రవరం కొంతమూరు అమలాపురం భట్లపాలెం పెద్దాపురం మరువాడ రామచంద్రపురం ఉండూరు రంపచోడవరం బోసిగూడెం ఎటపాక యర్రంపేట విద్యార్థులకు చేరువవుతుంది.. ఈ విధానం తప్పనిసరిగా విద్యార్థులకు చేరువవుతుంది. ఇటు విద్యార్థులపై అటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేని రీతిలో ఆటపాటలతో కూడిన బోధన సాగుతుంది. ఈ విధానంలో నిరంతర మూల్యాంకనం చేరుతుంది. రిషివ్యాలీ విధానంలో ఆనందలహరి ఉంటుంది. ఈ విధానం తప్పనిసరిగా విజయవంతమవుతుంది. ఇప్పటికే ఈ విధానంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ. -
కలెక్టరేట్ ఎదుట ఆందోళనల హోరు
కాకినాడ సిటీ : సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టాయి. నిరసనల అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేతను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ చేనేత కులాల సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళన నిర్వహించారు. చిలపనూలుపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, చేనేతను అన్ని రకాల పన్నుల నుంచి శాశ్వతంగా మినహాయించాలని డిమాండ్ చేశారు. చేనేత కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం, జిల్లా అధ్యక్షుడు చింతకింద రాము, చేనేత ఉద్యమ రాష్ట్ర నాయకులు వై.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్ఈజెడ్ బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాకలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కేఎస్ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో పదివేల ఎకరాల అక్రమ భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. నేటికీ ఒక్క పరిశ్రమా రాలేదని, సెజ్ విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలన్నారు. సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేఎస్ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బావిశెట్టి నారాయణస్వామి, కన్వీనర్ చింతా సూర్యనారాయణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి పాల్గొన్నారు. మారేడుబాక గ్రామస్తుల ఆందోళన మద్యం షాపు తొలగించాలని కోరుతూ మండపేట మండలం మారేడుబాక గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కలాశాలతో పాటు ప్రైవేటు పాఠశాల, కళాశాల, వినాయక గుడి, జనావాసాలకు సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. ఎస్సీలుగా గుర్తించి మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా అంశంపై ఈనెల 10న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్టు ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జార్జి శ్రీమంతుల తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్.ప్రభువరం, కె.రాజేష్‌బాబు, జే.మేరీమధురవాణి పాల్గొన్నారు. -
వారి దారి.. చెరోదారి
రచ్చకెక్కిన బీజేపీ రాజకీయం తీవ్రమైన రెండు వర్గాల పోరు ఉపరాష్ట్రపతి పదవికి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నికైన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం పెంచుకునేందుకు.. అవసరమైన టీడీపీతో మైత్రి కొనసాగకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బీజేపీలో రెండు వర్గాల విభేదాలు జిల్లాలో ముదిరిపాకన పడ్డాయి. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో, ఇంతవరకూ అంతర్గతంగా సాగుతోన్న వర్గాల పోరు ఇప్పుడు రచ్చ ఎక్కింది. టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని, నగరపాలక సంస్థ ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన.. ఆయన సొంత అభిప్రాయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ సమావేశంలో స్పష్టం చేయడం.. టీడీపీతో పొత్తు విషయంపైనే పోరు సాగుతోందన్న అనుమానాలను ఈ రెండు వర్గాలు నివృత్తి చేసేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వీరి పోరుకు వేదిక కావచ్చు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జాబితాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో బీజేపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. 2016లో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకుల మధ్య పోరు ఇప్పుడు రసకందాయంలో పడింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్ అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో చెరో అభ్యర్థిని పోటీకి దింపిన విషయం విదితమే. ఆ ఎన్నికలలో వీర్రాజు బలపర్చిన యెనిమిరెడ్డి మాలకొండయ్య గెలుపొందారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం కాకినాడ శశికాంత్‌నగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు నివాసంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపొందిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు వీర్రాజు వర్గం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్న విషయం విదితమే. పార్టీ కార్యాలయం ఏర్పాటుపై వివాదం తమకు ఆహ్వానం పంపకుండానే పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇటీవల శాంతినగర్‌లో ఏర్పాటు చేయడంతో పైడా వర్గీయులు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పలేదని పైడా వర్గం పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య తన అనుచరులతోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారని, పార్టీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఈ విషయం రాష్ట్ర పార్టీ అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధం ఉన్నట్టు సమాచారం. పార్టీలో గ్రూపులు ఉన్నాయని ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఇన్చార్జి పూడి తిరుపతిరావు అంగీకరించారు. రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ చెరో దారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు విషయంలో రెండు వర్గాలు వేర్వేరుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి రెండు వర్గాలు తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కూడా పైడా వర్గీయులు దూరంగా ఉన్నారు. రెండు వర్గాలతో పార్టీ కార్యాలయంలో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పినా, పార్టీ కార్యాలయానికి వచ్చేది లేదంటూ పైడా వర్గం భీష్మించుకుని కూర్చుంది. బీజేపీలో అంతర్గత పోరును టీడీపీ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. -
సీఎం వస్తున్నారని అధికారుల హడావుడి
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబునాయుడు పరిశీలనకు సోమవారం వస్తున్నారని అధికారులు ఉరుకులు,పరుగులు తీస్తున్నారు. ఉదయం నుండి అధికారులు పలు ఏర్పాట్లుపై దృష్టిసారించారు. సీఎమ్ కాన్వాయ్‌కు ఎటువంటి అవంతాలు కలుగకుండా రోడ్డు మార్గంలో కాన్వాయ్ ట్రైల్ రన్ వేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ స్వాదీనం: సీతానగరం డిగ్రీకళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను అధికారుల స్వాదీనం చేసుకున్నారు. కళాశాల ఆవరణలో ఐరన్ బారికేట్లు ఏర్పాటు చేశారు. అధికారులు తప్ప ఎవరిని లోపలికి రానీయకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి అర్బన్ ఎస్పీ రాజకుమారి, నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీనివాస్‌లు హెలీప్యాడ్ వద్ద పరిశీలించారు. ఏలూరు డీఐజీ రామకృష్ణ, ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకేటేష్లు కళాశాల నుంచి కాన్యాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు ఆ మార్గంలో పలు ఏర్పాట్లు .. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం 10 కిలోమీటర్లు పొడవునా రోడ్డును మరమ్మతులు చేశారు. అలాగే ఏటిగట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డు కిరువైపులా తెల్ల రంగుతో బోర్డర్‌ను ఏర్పాటు చేశారు. సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల వద్ద ఏటిగట్టుపై ఉన్న బస్ స్టాఫ్ షెడ్లకు తెల్లరంగులు అద్దారు. అలాగే రోడ్డు మార్గంలో మైలురాళ్ల కు పసుపు రంగులు వేసి, కిలోమీటర్లు గుర్తించే అంకెలు వేశారు బారికేడ్ల ఏర్పాటు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద ఏటిగట్టుపై ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పరిశీలించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పలు ఏరాట్లు చేశారు. పురుషోత్తపట్నంలో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామాల వద్ద ఏటిగట్టుపై యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పహారా కాస్తున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది పికెట్లు ఏర్పాటు చేశారు. మండలంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలులతో కలసి మండలానికి 800 మంది సిబ్బంది తరలివచ్చారు. -
‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..
-టీవీ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల యానాం : సేవా దృకృథంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు టీవీ యాంకర్ కనకాల సుమ పేర్కొన్నారు.శనివారం స్ధానిక కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.60 వేల విలువచేసే ప్రొజెక్టర్, స్క్రీన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరో, తనభర్త రాజీవ్ కనకాల, తాను కలిసి మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సొమ్ముతో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కనకాల రాజీవ్ మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి తదితర చోట్ల ప్రొజెక్టర్లు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, సూర్యప్రకాష్, నళినీకుమారి,మహ్మద్ యాకూబ్ తదితరులు పాల్గోన్నారు. -
గాలి మేడలు
- మూడేళ్లలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 40,167 - పూర్తిచేసినవి 7,784 - పేదలను మభ్యపెట్టేందుకు సరికొత్త ఎత్తుగడ - పల్స్ సర్వేలోని ఇళ్లకు అర్హుల ఎంపిక పేరిట గ్రామ సభలు - నాడు జిల్లాకు 4.85 లక్షల గృహాలు అవసరంగా గుర్తింపు - 15వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు సర్కారు ఆదేశాలు - స్వల్ప వ్యవధిలో అర్హుల నిర్ధారణపై పెదవి విరుస్తున్న అధికారులు - తొలిరోజు ఫించన్ల కోసం వచ్చిన లబ్ధిదారులతోనే సభల నిర్వహణ మండపేట : ఆది నుంచి గృహ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా పేదలను మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది. 2016 స్మార్ట్ పల్స్ సర్వేలో అవసరంగా గుర్తించిన 4.85 లక్షల ఇళ్లకుగాను తాజాగా మరోమారు అర్హుల ఎంపిక పేరిట గ్రామసభల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. అందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువిచ్చింది. కేవలం 15 రోజుల వ్యవధిలో మండలంలో అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తొలిరోజు చాలాచోట్ల సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో తంతు నడిపించేశారు. కేవలం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ‘మమ’ అనిపించుకునేందుకే ప్రభుత్వం ఈ గ్రామసభలు నిర్వహిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హామీ ఏది బాబూ... అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలంలో రూ.1.5 లక్షలతో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మిస్తాం. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలు సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ తుంగలోకి చంద్రబాబు తొక్కారన్న విమర్శలున్నాయి. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా 2016 ఏప్రిల్ 14న పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇంకేముంది పేదల పక్కా ఇళ్ల నిర్మాణం జోరందుకుంటుందని అంతా భావించగా గాలి మేడలేనని ఆన్లైన్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మూడు ఆర్ధిక సంవత్సరాలకుగాను జిల్లాకు మొత్తం 40,167 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో కేవలం 7,784 మాత్రమే పూర్తికావడం గమనార్హం. తొలి విడతగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 23,765 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తయ్యాయి. 2017–18లో 13,494 ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2,908 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికి ఒక ఇల్లు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్ల పథకం ఇప్పటికే అభాసుపాలవుతోంది. మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపుతూ ప్రైవేటు ప్లాట్లలో కూడా లేని విధంగా చదరపు అడుగుకు రూ. 1,953 ధర నిర్ణయించి విమర్శలు ఎదుర్కొంటోంది. లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోతుండటంతో తొలివిడత వాయిదాల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువును కూడా పొడిగించింది. మభ్యపెట్టే ఎత్తుగడ... పేదల ఇళ్ల నిర్మాణంలో ఆది నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు తాజాగా వారిని మభ్యపెట్టే ఎత్తుగడ వేసింది. స్మార్ట్ పల్స్ సర్వే పేరిట 2016 సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే. అందులో జిల్లాలో సుమారు 14 లక్షల కుటుంబాలకుగాను 4.85 లక్షల మంది పేదవర్గాలకు చెందిన కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 4.85 లక్షల మందిలో ఎంత మంది అర్హులనే విషయాన్ని గ్రామసభల ద్వారా ఈనెల 15వ తేదీలోగా గుర్తించి నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చింది. కొన్ని మండలాల్లో 10 నుంచి 15 వేలు వరకు అర్హులు ఉన్నట్టుగా అప్పట్లో గుర్తించారు. అధిక శాతం మండలాల్లో 20కు పైగా పంచాయతీలు ఉండటం, ఎంపిక చేసిన వారు వేలల్లో ఉండటంతో 15 రోజుల వ్యవధిలో వారిలో పారదర్శకంగా అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు అంటున్నారు. రెండు వారాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉండటంతో చాలాచోట్ల గ్రామసభలు తూతూమంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1వ తేదీ కావడంతో పంచాయతీల వద్దకు సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో చాలాచోట్ల పంచాయతీ కార్యాలయాల వద్ద వారితోనే అధికారులు తొలిరోజు గ్రామసభలు తంతు నడిపించారు. ఎంపిక చేసిన పేరుల్లో అనర్హులు ఉంటే చెప్పాలని అడుగుతుండగా తెల్లమొహం వేసి చూడటం సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వంతయింది. పల్స్ సర్వేలో గుర్తించిన వారిలో అర్హులెవరనేది నిర్ధారించాల్సి ఉందని, అయితే వారికి ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరు చేసే విషయమై స్పష్టత లేదని హౌసింగ్ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కోరే అవకాశం ఉందని భావిస్తున్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణనికి 2011 సెక్‌డేటా ఆధారంగా కేంద్రం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పల్స్‌సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను కేంద్రం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామ సభలు నేపథ్యంలో త్వరలోనే తమ సొంతింటి కల సాకారమవుతుందని పేదవర్గాల ఆశాభావం వ్యక్తచేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలపకుంటే మూడేళ్లలో కేవలం40 వేల ఇళ్లు మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు రానున్న రెండేళ్లలో దాదాపు 4.5 లక్షలు ఇళ్లు ఎలా మంజూరు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం పేదవర్గాల వారిని మభ్యపెట్టేందుకు ఇగో ఎత్తుగడని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు నిధులు విడుదల చేసి పూర్తిచేయడంతోపాటు ఎన్నికల వాగ్ధానాలను చంద్రబాబు అమలు చేయాలని కోరుతున్నారు. -
మడ అడవుల పరిరక్షణ కార్పొరేట్ సంస్థలదే
– సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలోని మడ అడవుల పరిరక్షణ ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలోని హోటల్ రాయల్‌పార్క్‌లో ఎగ్రీ ఫౌండేషన్ ప్రీ కార్పొరేట్ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుందర్బన్ తరువాత జిల్లాలో ఉన్న మడ అడవులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జిల్లాలో ఆయిల్, సహజవాయువు, ఫెర్టిలైజర్స్ షిప్పింగ్ పోర్ట్స్ వ్యవహారాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు వాతావరణ పరిరక్షణ కోసం మైక్రో ప్లాను రూపొందించి వాటిని అమలు చేయాలన్నారు. కోరంగి మడఅడవుల పరిరక్షణకు కార్పొరేట్ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓను కలెక్టర్ కోరారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.రవికుమార్ మాట్లాడుతూ ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోస్తా జీవ పరిరక్షణ కోసం ఆయిల్, సహజవాయువు, ఆక్వా కల్చర్, టూరిజం, ఫెర్టిలైజర్స్, ఫిషరీస్ వంటి ఏడు సంస్థలను గుర్తించామన్నారు. ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ డి.పద్మావతి రూపొందించిన పిన్ఫిష్ అట్లాస్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాదికారి నందిని సలారియా, ఓఎన్జీసీ ఇడి అలోక్ సుందర్, కోరమండల్ జీఎం జ్ఞానసుందరం, వన్యప్రాణి విభాగ డీఎఫ్ఓ ప్రభాకరరావు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువతను మత్తులో ముంచేశారు..
గంజాయి, నిషేధిత మందుల విక్రయాల గుట్టురట్టు ఆరుగురు నిందితుల అరెస్ట్ రూ.2 లక్షలు స్వాధీనం కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : తీగ లాగితే.. డొంక కదిలింది. ఏజెన్సీ నుంచి గంజాయి యథేచ్ఛగా జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్టు స్పష్టమైన నేపథ్యంలో.. తాజా సంఘటనను పరిశీలిస్తే.. గంజాయితోపాటు మత్తు కలిగించే మందులు జిల్లాలోనే గుట్టుగా విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. యువత, విద్యార్థులు, కూలీలకు వీటిని విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. జిల్లా ప్రజలను దిగ్భ్రాంతి చెందేలా ఉన్న ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ విలేకరులకు వివరించారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు, గంజాయి మత్తులో ముంచి నిందితులు అక్రమార్జన చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆయన వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మత్తు పదార్థాలు, గంజాయి యువతకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో...నగరంలోని రేచర్లపేట, మిలటరీ రోడ్డులో ఉంటున్న పాత నేరస్తుడు బెజవాడ రవి ఇంటిపై పోలీసులు.. అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వోలతో కలిసి దాడి చేశారు. అక్కడ అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 కిలోల గంజాయి, రూ.2,03,020 లక్షలు, 189 టోసెక్స్ కాఫ్ సిరఫ్, 197 ఎస్కుల్ప్ కాఫ్ సిరఫ్ బాటిళ్లు, 3,465 నిట్రోవిట్ 10 ఎంజీ, 170 నిట్రోసన్ 10.5 ఎంజీ ట్యాబెట్లు, 5 ఎవిల్ ఇంజెక్షన్లు, 10 లుపెజెరిక్, 3 ఫినెర్జెన్ ఇంజెక్షన్లు, 10.2 ఎంఐ సిరంజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాపుల సిబ్బందిని కూడా... డాక్టర్ల ప్రిస్కెప్షన్ లేకుండానే అధిక పరిమాణంలో వందల సంఖ్యలో ట్యాబెట్లు, కాఫ్ సిరప్‌లను నిందితులకు విక్రయిస్తూ యువత ఆరోగ్యం చెడిపోవడానికి కారణమవుతున్న సాయిరామ్ మెడికల్స్‌కు చెందిన దాసరి సత్యనారాయణ(అంగర), శ్రీమౌనిక మెడికల్, జనరల్ స్టోర్‌కు చెందిన కంకటాల వెంకట మల్లేశ్వరరావు (అంగర), ప్రసాద్ అండ్ సన్స్‌కు చెందిన నండూరు సత్యభాస్కరరావు (భీమవరం), దుర్గాభవాని మెడికల్స్‌కు చెందిన నడిపూడి దుర్గాప్రసాద్ (ఏలూరు)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యధిక ధరలకు విక్రయం... రూ.100 ధర ఉండే దగ్గు మందును రూ.200 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. సిరఫ్ బాటిల్‌ని తాగితే రెండు రోజుల పాటు మత్తులో ఉంటారు. నిట్రోవిట్ ట్యాబ్లెట్‌ను రూ.3 నుంచి రూ.4కు కొని రూ.100కు విక్రయిస్తున్నారు. మూడు ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకుంటే రెండు, మూడు రోజుల వరకు మత్తులో ఉంటారు. ఆ ఇద్దరూ.. పాత నేరస్తులే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇద్దరూ పాత నేరస్తులే. కాకినాడ రేచర్లపేట మిలటరీ కాలనీకి చెందిన బెజవాడ రవి, జగన్నాథపురం గౌరీశంకర్పేటకు చెందిన అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయిని సిగరెట్లలో కూరి యువత, విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అంగర, భీమవరం, ఏలూరు వంటి వేర్వేరు ప్రాంతాల నుంచి మెడికల్ షాపుల నుంచి సంపాదించిన టోసెక్స్, ఎస్కుల్ప్ కాఫ్ సిరప్లు, నిత్రోవిట్, నిట్రోసన్ టాబ్లెట్లు, ఎవిల్ ఇంజెక్షన్లను యువత, విద్యార్థులు, కూలీలకు విక్రయిస్తున్నారు. ప్రిస్కెప్షన్ లేకుండా మత్తు ట్యాబ్లెట్లు, దగ్గు సిరప్, పలు రకాల ఇంజెక్షన్లను ఈ మెడికల్ షాపుల నుంచి వారు సులువుగా సంపాదిస్తున్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు మత్తు పదార్ధాలు, గంజాయి వంటి ఉత్పేరకాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు ఎస్పీ గున్ని సూచించారు. అక్రమార్జన కోసం వీటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువతను వ్యసనపరులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్జన కోసం కళాశాలలకు వెళుతోన్న విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని సన్మార్గంలో నడచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలు, ముఖ్య కూడళ్ల వద్ద గస్తీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో కళాశాలల నిర్వాహకులు నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, సీఐ ఈశ్వరుడు, ఎస్సైలు హరీష్‌కుమార్,కేవీ రామారావు, సీహెచ్ సుధాకర్, ఎం.ఏసుబాబు, హెచ్‌సీ గోవిందరావు, పీసీ చిన్నా,శ్రీరామ్,అజేయ్,వర్మా,రాము, బాబు, మారుతిలను అభినందించారు. -
‘బెల్టు’ ఎలా.. తెగుద్ధి
- బెల్లు బిగించిందీ వారే ... - ‘బెల్టు’ తీయడం సాధ్యమేనా..? – పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులు – మద్యం దుకాణదారులే వీటి నిర్వాహకులు – మద్యం సరఫరా చేస్తున్న దుకణాలపై చర్యలు నిల్ – దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా 25 శాతం పెరిగిన అమ్మకాలు - ప్లీనరీలో జగన్ దశలవారీ మద్య నిషేధ ప్రకటనతో బాబు సర్కారు హడావుడి - జిల్లాలో మహిళల ఆందోళనలతో మరింత బెంబేలు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రోత్సహించిందీ వారే ... ఆగ్రహిస్తున్నట్టుగా నటిస్తున్నదీ వారే ... ఇప్పుడు తొలగిస్తామని హడావుడి చేస్తున్నదీ ఆ వర్గమే... ఇందంతా హైడ్రామాగా అధికార పార్టీ నేతలు రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మద్యం పాలసీలో దాదాపు ప్రతి దుకాణానికి పట్టణాల్లో కనీసం రెండు, గ్రామీణ ప్రాంతాల్లో పది వరకు అనుబంధంగా బెల్టు షాపులు ఉండగా అధికారులు అనేక కారణాల వల్ల వాటికి జోలికి వెళ్లలేదు. పాలసీ ముగిసే చివరి రెండు నెలల్లో ప్రభుత్వం తామేదో చేస్తున్నామని చెప్పడానికి బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిషనర్ రాకతోపాటు ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో అధికారులు మే నెల 20వ తేదీ నుంచి జిల్లాలో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేసి 289 మందిని అరెస్ట్ చేశారు. ఇలా ఓ పక్క నమోదు చేస్తుండగానే మరో పక్క పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి మద్యం కొత్త పాలసీ (2017–19) అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవకాశమున్న 545 దుకాణాలకుగాను లాటరీలో 534 దుకాణాలకు అధికారులు లైసెన్స్‌లు జారీ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500, 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన, ఇళ్లు, పాఠశాలలకు దగ్గరగా ఏర్పాటు చేయడంపై మహిళలు, స్థానికుల తీవ్ర అభ్యంతరాలతో దుకాణాల ఏర్పాటు నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 18వ తేదీ వరకు 534 దుకాణాలకుగాను 424 దుకాణాలు ఏర్పాటయ్యాయి. దుకాణదారులే ‘బెల్టు’ నిర్వాహకులు... మద్యం కొత్త పాలసీ వచ్చిన తరువాత పైన పేర్కొన్న కారణాల వల్ల దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో దుకాణదారులు తమ సిబ్బందితోనే పాత దుకాణాలకు సమీపంలోని ఇళ్లు, బడ్డీ కొట్లు, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ మద్యం విక్రయిస్తున్నారు. ఇలా 24 గంటలపాటు మద్యం అందుబాటులో ఉంచారు. 25 శాతం పెరిగిన అమ్మకాలు... దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా మద్యం అమ్మకాలు మాత్రం 25 శాతం పెరగడం బెల్టు దుకాణాలు ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఉదహరణకు రాజమహేంద్రవరం మద్యం డిపో పరిధిలో గత నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు(మద్యం పాత పాలసీ) రూ.30 కోట్ల అమ్మకాలు జరగ్గా ఈ నెల 1 నుంచి 18వ తేదీ వరకు (మద్యం కొత్త పాలసీ) రూ.37 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ డిపో పరిధిలో రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ పరిధిలోని ఏడు సర్కిళ్లు (రాజమహేంద్రవరం ఉత్తరం, దక్షిణం, ఆలమూరు, రాయవరం, కొరుకొండ, అడ్డతీగల, రంపచోడవరం) అమలాపురం సర్కిల్ పరిధిలోని రెండు (రామచంద్రపురం, కొత్తపేట) వెరసి తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 229 దుకాణాలకుగాను 221 దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు జారీ చేశారు. 221 దుకాణాలకుగాను 181 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇంకా 40 దుకాణాలు (18 శాతం) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గత నెల ఈ నెల 1 నుంచి 18వ తేదీకి మధ్య జరిగిన మద్యం అమ్మకాల మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు 25 శాతం పెరగడం బెల్టు దుకాణాల ఎలా ఏర్పాటు చేశారో స్పష్టమవుతోంది. సూత్రధారులను వదిలి పాత్రధారులపై ప్రతాపం... ఎక్సైజ్ అధికారులు చెబుతున్న 284 కేసుల నమోదు, 289 మంది అరెస్ట్‌లు కేవలం ఆ సమయంలో అక్కడ మద్యం అమ్ముతున్న వారిపై నమోదు చేసినవే. కానీ ఆయా బెల్టు షాపులు ఏర్పాటు చేసిన, చేయించిన, మద్యం సరఫరా చేసిన దుకాణదారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చేయాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేసి రికార్టుల పరంగా ఉన్నతాధికారులుకు చూపిస్తున్నారు. కానీ నిబద్ధతతో బెల్టు షాపులు నిర్మూలించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు పని చేస్తున్న దాఖలాలు లేవు. పనిచేస్తే కాలిపోతామంటూ కొందరు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం మద్యం దుకాణం ఏర్పాటు, నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చూడడం, బెల్టు దాకాణాల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపడానికి అధికారులకు నిబద్ధత ఎంతో అవసరం. కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి.. దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో కొంత మంది బెల్టు షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు. మే, జూన్ నెలల్లో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బుధవారం నుంచే దాడులు చేస్తున్నాం. బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించిన మద్యం వ్యాపారులు, వారికి మద్యం సరఫరా చేసే మద్యం దుకాణదారులపై కూడా ఇకపై కేసులు నమోదు చేస్తాం. – బి. అరుణారావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కాకినాడ -
అంబా...అని అరిచినా...
ఒకే రోజు 20 ఆవుల మృత్యువాత కమిటీ సభ్యుల నిర్లక్ష్యం బట్టబయలు ఏడాదిగా విమర్శలున్నా పట్టించుకోని అధికారులు కాకినాడ రూరల్: గోవు సర్వ దేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే గోవును హిందువులు తల్లి లాంటిదని, పాలిచ్చి పెంచేదని, అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తూ దాన్ని గోమాతగా పూజిస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో చేసే ముత్యాల ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేందుకు ఆవుపేడను ఉపయోగిస్తారంటే దాని ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. అలాంటి పవిత్ర గోమాతలకు రక్షణగా ఉండాల్సిన జంతు హింస నివారణ సంఘం ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్లక్ష్యం చూపించడంతో ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. ఈ ఆవరణంతా బురద, దోమలు, అడుగు వేస్తే ఊబిలో దిగబడిపోయే విధంగా ఉండడంతో గత ఐదారు రోజులుగా వందలాది ఆవులు ఒంటి కాళ్లపై నిలబడి ఉండడం, సరైన పశుగ్రాసం లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 20కి పైగా ఆవులు చనిపోవడం చూస్తే నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు, ఇతరేతర సంఘాలకు చెందిన వారు స్థానికంగా రోడ్లపై తిరిగే ఆవులను, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గోవధకు తరలిస్తున్న ఆవులను పట్టుకొని ఈ సంఘ సభ్యులకు అప్పగిస్తారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మేత లేకపోవడంతో అనేక ఆవులు మృత్యువాత పడుతుంటాయి. మరికొన్ని ఆవులను ఇక్కడ నుంచి తరస్తుంటారు... అయితే ఇవి ఎక్కడికి తరలిస్తారనేది ఎవరికీ తెలియని ప్రశ్నగానే ఉందని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మొత్తం దాతల విరాళాలపైనే నడుస్తుంది. గతంలో ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణకు కొంత నిధులు కేటాయించేదని, సంఘం తమదంటే తమదని రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కోర్టుకు వెళ్లడంతో నిధులు నిలిపివేయడంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయని సంఘ సభ్యులే చెబుతున్నారు. తరువాత పూర్తిగా విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. సంరక్షణ సరిగ్గా లేక... గోవులకు మేత కూడా సరిగ్గా వేయకపోవడంతో అవి బక్కచిక్కి మృత్యువాత పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేకపోవడంతో ఇష్టమొచ్చిన రీతిగా కోత గడ్డికి బదులుగా మిషన్ గడ్డిని పెట్టడంతో అవి తినలేక బక్కచిక్కి ఆకలితో అలమటిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ఆవుకు 11 కేజీల పచ్చిగడ్డి పెట్టాలి. కాని ఇక్కడ పచ్చిగడ్డి అనేదే కనిపించదు. కదిలిన అధికార యంత్రాంగం... ఈ ప్రాంగణంలో ఒకే రోజు 20కి పైగా ఆవులు చనిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. పశుగ్రాసం కరువుతోనే ఆవులు మరణించినట్లు అధికారులు నిర్థారించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా పశువైద్య జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్టీవో రఘుబాబుల పర్యవేక్షణలో 27 మంది పశువైద్యులు బుధవారం ఉదయమే జంతుహింస నివారణ సంఘానికి చేరుకొని పశువులకు ఇంజెక్షన్లు చేశారు. 10 నుంచి 20 వరకు ఆవులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో సంఘ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఒకానొక సమయంలో ముష్టి ఘాతాలకు దిగారు. ప్రస్తుతం ఉన్న సంఘాన్ని రద్దు చేసి, స్థానికంగా ఉన్న పెద్దలకు నిర్వహణ అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మూగ జీవులను అమ్ముకొంటున్నారని ఉన్న జీవాలకు కనీసం గడ్డి కూడా వేయడంలేదంటూ స్థానికులు అధికారుల ఎదుట ఆందోళన చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని జేడీ వెంకటేశ్వరరావు వివరించారు. ప్రత్యేక జేసీబీతో ఆ ప్రాంతంలో ఉన్న ఊబిలా మారిన బురదను తొలగించే పనులు చేపట్టారు. ఈ విచారణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీంబాషా, కాకినాడ అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం పెరిగినా.. సమస్యలే సమస్తం
- పంచాయతీల దుస్థితి - పన్నుభారం మోపినా అదే పరిస్థితి - పాలకవర్గాలు లేనిచోట మరింత అధ్వానం - పట్టించుకునే నాథుడే కరువు అమలాపురం : పంచాయతీల్లో ఇంటి పన్నుతోపాటు పనిలో పనిగా ఆస్తి విలువ కూడా పెంచిన చంద్రబాబు సర్కారు సామాన్యులపై మోయలేనంత భారం మోపింది. ఇలా పన్నులు పెంచడం ద్వారా పంచాయతీల సాధారణ నిధులు పెరుగుతాయని, చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే పెంచిన పన్ను మొత్తాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్న పంచాయతీ పాలకులు, అధికారులు.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కోటి రూపాయల ఆదాయం పెరిగిన పంచాయతీల్లో సహితం వేల రూపాయల్లో ఖర్చయ్యే పనులు కూడా చేపట్టడం లేదు. ప్రజారోగ్యానికి కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి డ్రైన్ల ఆధునికీకరణ వంటి వాటిని పట్టించుకోవడంలేదు. రోడ్ల గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గోతులు పడి, కొద్దిపాటి వర్షానికే అవి బురదమయమవుతున్నాయి. చాలా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీరందడంలేదు. విద్యుద్దీపాలు కూడా వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పట్టణాలకన్నా నగరాలను ఆనుకొని ఉన్న పంచాయతీల్లో అపార్ట్మెంట్లు, భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైవేలు, ప్రధాన రహదారులకు చేరువలో కమర్షియల్ కాంప్లెక్సులు సహితం ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. విచిత్రంగా ఇక్కడే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఆయా పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అక్కడ ఎన్నికలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అధికారుల పాలనే సాగుతోంది. ప్రజల తరఫున ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. అనపర్తి మేజర్ పంచాయతీ పరిస్థితి కూడా అంతే. వందలు, వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంచాయతీ చూసినా సమస్యలే.. - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను ఆనుకొని ఉన్న పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం నగర విస్తరణ అంతా పంచాయతీల్లోనే సాగుతోంది. ముఖ్యంగా హకుంపేట, ధవళేశ్వరం, బొమ్మూరు, కోలమూరుల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది. ఇంటి పన్నులు పెంచడంతో ›ప్రతి పంచాయతీ ఆదాయం రూ.కోటికి పైగా పెరిగింది. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రధాన డ్రైన్ల నిర్మాణం జరగడం లేదు. దీంతో జనావాసాలను మురుగునీరు ముంచెత్తుతోంది. ఈ పంచాయతీలకు పాలకవర్గం లేదు. నగరంలో విలీన ప్రతిపాదనతో ఈ పంచాయతీలకు ఎన్నికలు లేవు. అధికారుల పాలనలో వీటిల్లో అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది. - కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆదాయం రూ.3 కోట్లకు చేరింది. ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, తూరంగి పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయంతోపాటు ఈ గ్రామాల్లో సమస్యలు కూడా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. రమణయ్యపేటలో డ్రైనేజీ సమస్యల తీవ్రంగా ఉంది. నూతన నిర్మాణాలకు అనుగుణంగా ఇక్కడ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు రహదారులు ముంపునకు గురవుతున్నాయి. - అనపర్తి పంచాయతీకి ప్రస్తుతం పాలకవర్గం లేదు. దీనిని ప్రభుత్వం నగర పంచాయతీగా ప్రకటించగా, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు లేకుండాపోయాయి. ఒకవిధంగా ఇది మున్సిపాలిటీతో సమానం. అధికారుల పాలన పుణ్యమా అని స్థానికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. - సామర్లకోట మండలం వేట్లపాలెంలో పంచాయతీ ఆదాయం గతంలో రూ.52 లక్షలు కాగా, ఇప్పుడు ఆదాయం రూ.1.20 కోట్లు. ఆదాయం రెట్టింపైనా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. - అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీ ఆదాయం రూ.8 లక్షలు కాగా, ఇప్పుడు ఏకంగా ఐదురెట్లు పెరిగి రూ.40 లక్షలు అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కామనగరువు పంచాయతీ ఆదాయం రెండు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. - జిల్లాలోని కీలకమై గ్రామ పంచాయతీల్లో రావులపాలెం ఒకటి. కోనసీమకు ఒకవిధంగా వాణిజ్య రాజధాని. ఈ పంచాయతీ ఆదాయం రూ.1.24 కోట్లకు పెరిగింది. ఇక్కడ ప్రధాన డ్రైన్, దాని నిర్వహణ తీరు చూస్తే ప్రజలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పట్టణంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. -
జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట
– మూడో తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు – జిల్లా సమస్యల ప్రస్తావనకు వేదికైన వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ - జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ – చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లాకు సముచిత స్థానం దక్కింది. జిల్లాలోని ప్రధాన సమస్యలు ప్రస్తావించేందుకు పార్టీ అవకాశం ఇవ్వడంతో ప్లీనరీలో మూడో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఛాన్స్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు లభించింది. జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలు చర్చించేందుకు జాతీయ ప్లీనరీ కూడా వేదికైంది. జ్వరాల జిల్లాను ఆదుకోండి... గుంటూరు వేదికగా జరుగుతున్న వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మూడో తీర్మానం ప్రవేశపెట్టారు. పౌష్టికాహారం లోపంతో చాపరాయి వంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మృత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాల్లేక సతమతమవుతున్నారని, గిరిజనులను ఆదుకోవాలని కోరారు. విష జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇతరత్రా వ్యాధులతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు సంభవిస్తున్న ప్రతిసారీ ఏజెన్సీలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏజెన్సీలో పర్యటించి, గిరిజనులకు సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వం సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి డెల్లా ఆధునికీకరణ దారుణంగా తయారైందని, వైఎస్సార్ హయాంలో గొప్పగా చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వానంగా మార్చారని, ఆధునికీకరణ జరిగేలా చూడాలని కోరారు. ఇంటి పన్నులు భారీగా పెంచేశారని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకూ చేశారని, పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, కాసుల కోసం అన్నట్టుగా పనులు చేపడుతున్నారని, కాంట్రాక్టులు, ముడుపుల కోసం కాకుండా నిర్వాసితుల కోసం ఆలోచించాలని కోరుతూ తీర్మానం ప్రవేశం పెట్టారు. కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని, లంక గ్రామాల్లో కోతలను అరికట్టేందుకు గ్రోయిన్లు నిర్మించాలని, కాటవరం, చాగల్నాడు. కలవచర్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని, ర్యాలీ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, జగ్గంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మండపేట ఇళ్ల నిర్మాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతుల్లో చేపడుతున్న పనులు రద్దు చేయాలని, బీసీల అభివృద్ధిపైన టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే సానుకూలంగా స్పందించాలంటూ తదితర డిమాండ్లు చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వీటికి జాతీయ ప్లీనరీలో ఆమోదం తెలపాలని నాయకులను కోరారు. అవినీతి చక్రవర్తిపై జిల్లాలో చర్చ... వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ వేదికపై ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో బినామీలను రంగంలోకి దించి పెద్ద అవినీతికి పాల్పడగా, ఇప్పుడు రాజధాని, విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడి లక్షల కోట్లు ఆర్జించినట్టుగా ఆధారాలతో సహా పుస్తకాల ప్రచురించడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. 66 కుంభకోణాలకు పాల్పడి రూ.3.75 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడారని తెలియగానే ప్లీనరీ జరిగిన గుంటూరు వేదిక ప్రాంగణంలోనే కాదు జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడీ అవినీతి చక్రవర్తి పుస్తకం హాట్ టాపిక్‌గా మారింది. వేలాదిగా తరలి వెళ్లిన నేతలు... జాతీయ ప్లీనరీ జరుగుతున్న గుంటూరుకు శనివారం ఉదయం జిల్లా నేతలు భారీగా తరలివెళ్లారు. వైఎస్సార్ జయంతి వేడుకలు ముగించుకొని నేతలంతా అక్కడికి పయనమయ్యారు. నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నేతలు భారీగా తరలి వెళ్లడంతో గుంటూరు ప్రాంగణంలో జిల్లా మార్క్ స్పష్టంగా కనిపించింది. -
ఇసుక మస్కా...
మూతపడిన ర్యాంపులు గడువుకు ముందే జాగ్రత్తపడిన ఇసుకాసురులు భారీగా పోగేసుకున్న ఇసుక నిల్వలు వదరలతో స్తంభించిన తవ్వకాలు నిల్వచేసి పదిరెట్ల హెచ్చు ధరలకు విక్రయాలు ఉచిత ఇసుక విధానం అభాసుపాలు అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం మరోసారి అభాసుపాలైంది. గోదావరికి వరద పోటు తగిలిందో లేదో, అక్రమార్కులు చెలిరేగిపోతున్నారు. ఒకవైపు ప్రధాన ర్యాంపుల గడువు పూర్తికావడం.. వరద వల్ల తవ్వకాలు సాగకపోవడంతో...అడ్డదారిలో నిల్వ చేసిన ఇసుక ధరను ఏకంగా పదిరెట్లు పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. గోదావరికి వరదలను ఎదుర్కొనేందుకు కేవలం నెల రోజుల ముందు ఇరిగేషన్ అధికారులు సన్నహాలు చేస్తుంటారు. కాని ఇసుక అక్రమార్కులు మాత్రం ఇందుకు రెండు, మూడు నెలల ముందునుంచే వరద సమయంలో ఇసుక విక్రయాలకు భారీగా నిల్వలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలులోకి తెచ్చిన తరువాత కూడా నిల్వలు చేయడం మానలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక విక్రయాలు జరగడం లేదని, అధికార టీడీపీకి ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే ర్యాంపుల్లో పాగా వేసి విక్రయాలు చేస్తున్నారనడానికి ఈ నిల్వలు చూస్తేనే అర్థమవుతోంది. గోదావరికి వరద పోటు తగలకముందే ర్యాంపుల సమీపంలోని రహస్య ప్రాంతాల్లోను, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకన్నట్టుగా ఇసుకను భారీ ఎత్తున నిల్వచేశారు. ఎప్పుడైతే తవ్వకాలు దాదాపుగా నిలిచిపోయాయో.. అక్రమార్కులు ఇసుక ధరలను ఇష్టానుసారం పెంచేశారు. ఉచిత ఇసుక వల్ల ర్యాంపుల నిర్వహణ, తవ్వకాలకు యూనిట్‌కు రూ.125 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో యూనిట్‌కు రూ.500 చొప్పున అనధికారికంగా వసూళ్లు జరిగేవి. ఎప్పుడైతే తవ్వకాలు నిలిచిపోయాయో అనధికార నిల్వల వద్ద యూనిట్ ధర రూ.2 వేలు చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. పనిలో పనిగా లారీ రవాణా చార్జీలను సైతం పెంచేశారు. ఆత్రేయపురం నుంచి అమలాపురం ఒకప్పుడు మూడు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.4 వేలు వరకు అవగా, ఇప్పుడది రూ.9 వేలు పలుకుతోంది. జిల్లాలో సీతానగరం మండలం ముగ్గుళ్ల, వంగలపూడి, కపిలేశ్వరపురం, వేమగిరి, జొన్నాడ వంటి ర్యాంపులు గడువు ముగియడంతో తవ్వకాలు నిలిపివేశారు. మిగిలిన ర్యాంపుల్లో వరదల వల్ల తవ్వకాలు ఆగాయి. జొన్నాడకు తిరిగి అనుమతి వచ్చినా వరదల వల్ల తవ్వకాలు చేసే అవకాశం లేదు. ఇవన్నీ ముందే ఊహించిన అక్రమార్కులు పలు ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేశారు. నిర్మాణాల కోసమంటూ 20 నుంచి 50 యూనిట్ల చొప్పున ఇసుక నిల్వ చేశారు. కొత్తపేట, పి.గన్నవరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక నిల్వలున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఎక్కువుగా ఇసుక నిల్వలున్నాయి. అధికారులు దాడులు చేసినా ఇళ్ల నిర్మాణాల కోసమంటూ అక్రమార్కులు చెప్పుకునేందుకు వీలుచిక్కుతోంది. ఇటీవల ఆత్రేయపురం మండలం అంకంపాలెం, రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, రావులపాలెం శివారు గౌతమీ ఏటిగట్టు వద్ద ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అయితే రెండు మండలాల్లో ఇంతకు పదిరెట్లు ఇసుక నిల్వలున్నట్టు అంచనా. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేసి వాటిని తమకు తక్కువ ధరకు అందించాలని సామాన్యులు కోరుతున్నారు. -
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్‌సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్‌సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్‌సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్‌సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్‌సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్‌సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
ఆపదవేళ.. ఆప్తబంధువులా..
- చాపరాయి బాధితులను పరామర్శించిన జగన్ - గిరిజనుల్లో భరోసా నింపిన వైఎస్సార్ సీపీ అధినేత - అభయారణ్యం, ప్రమాదకర ఘాట్‌లో 70 కిలోమీటర్లు సాగిన ప్రయాణం సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరిని కదిపినా కన్నీళ్లే. ఏ ఒక్కరిని పలుకరించినా కష్టాలే. తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తలచుకొని ఆ అడవి బిడ్డలు కొండలు ప్రతిధ్వనించేలా రోదిస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన అభాగ్యులు.. తల్లీబిడ్డలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న బాధితులు.. ఇలా ఒకరేమిటి? అనేకమంది బాధిత గిరిజనుల కన్నీళ్లు తుడిచే సదాశయంతో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీలో పర్యటించారు. బాధిత గిరిజన కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఎంత కష్టమైనా వెనుకాడలేదు. దట్టమైన అభయారణ్యంలో.. ఘాట్ రోడ్డు మీదుగా.. సాహసోపేతంగా పయనించి గిరిజనుల చెంతకు వెళ్లారు. కొండంత కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆదుకుంటానని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి బాధితులను శనివారం ఉదయం పరామర్శించిన జగన్.. అనంతరం మారేడుమిల్లి మీదుగా చాపరాయి గ్రామానికి వెళ్లారు. మారేడుమిల్లి నుంచి దట్టమైన అడవి, ఘాట్ రోడ్డులో ప్రయాణించి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు. మార్గం మధ్యలోని గ్రామాల్లో తనకోసం ఎదురు చూస్తున్న గిరిజనుల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ తన పయనం సాగించారు. ఆకుమామిడికోట, బొడ్డుమానివీధి, విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం బొడుగుమామిడి, పోతవరం, రంపచోడవరం నియోజకవర్గం దారగడ్డ, యొడ్లకొండ గ్రామాల్లో తనకోసం రోడ్డుపైకి వచ్చిన గిరిజనులు చూసిన ఆగిన జగన్.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఆయా గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను జగన్‌కు మొర పెట్టుకున్నారు. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. తాగడానికి కనీసం గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వాగుల్లో నీరు తాగుతున్నామని, స్నానానికి వర్షపు నీటిని వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఆస్పత్రికి వెళదామన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బోరుమన్నారు. నీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయని వాపోయారు. పాకల్లో ఉంటున్న తమకు ప్రభుత్వం తమకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. 70 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయారు. మాకు మీరే దిక్కు ‘‘ఇవే సమస్యలతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీరు, తిండి, రోడ్లు వేయించండి. మీరే మాకు దిక్కు. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి’’ అంటూ ఆయా గ్రామాల గిరిజనులు జగన్‌కు విన్నవించారు. వారి కష్టాలను, సమస్యలను సావధానంగా విన్న జగన్.. అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని చెప్పారు. తోలు మందం చంద్రబాబుకు సమస్యలు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అయినా విడవకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిష్కారమయ్యే పింఛన్లు, రేషన్ కార్డులవంటి వాటిని పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలకు సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు. ప్రతిపక్షంగా సమస్యల పరిష్కారంపై పోరాడదామని, మన ప్రభుత్వం వచ్చాక అందిరికీ మంచి చేస్తామని హామీ ఇచ్చారు. చేయి ఇచ్చి నడిపించిన గిరిజనులు గ్రామాల్లో వాగులు, వంకలు దాటేందుకు స్థానిక గిరిజనులు జగన్‌కు సహాయం చేశారు. తమ చేతిని అందించి జగన్‌ను తమ ఊరి నుంచి సాగనంపారు. కటారికోట గ్రామంలో కర్రెల వంతెనను ఓ మహిళ జగన్ చేయిపట్టుకుని దాటించింది. కటారికోట దాటిన తర్వాత చాపరాయి గ్రామానికి మధ్య ఏడు కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వాహనాలు కొండలు ఎక్కలేకపోయాయి. జగన్ కాన్వాయ్‌లో సెక్యూరిటీ వాహనాలు చాపరాయికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. స్థానికంగా సమకూర్చిన వాహనంలో జగన్ చాపరాయి గ్రామం వెళ్లారు. వాగులు, వంకలు దాటి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనతో ఏజెన్సీ ప్రజల మోముల్లో తమ సమస్యలు ఇకనైనా తీరతాయన్న ఆనందం కనిపించింది. ఒక్కొక్కరి తలపై నిమురుతూ వారిని ఆప్యాయంగా పలుకరించడంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు ఆనందంతో కంటతడిపెట్టారు. సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ చాపరాయి గ్రామానికి వచ్చిన వై.రామవరం మండలం బొడ్డగండి నుంచి సీతమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన సీతమ్మ.. చాపరాయి గ్రామంలో తమ పంచాయతీ సమస్యలను చెప్పుకొంది. జగన్‌తో ఆమె మాట్లాడుతూ ‘‘మా ఊరిలో తాగడానికి నీరు లేదు. రోడ్లు లేవు. ఎవ్వరూ పట్టించుకోవడంలేదు’’ అంటూ తమ సమస్యలు పరిష్కరించేందుకు సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ వచ్చాడని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘మాకు నీవే దిక్కు కొడుకా.. ఏమి చేస్తవో’’ అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. సీతమ్మ కొడుకు జగన్ అని ఆమె అనగానే అక్కడ ఉన్న గిరిజనులు చప్పట్లతో హోరెత్తించారు. -
- జగనన్నా...చూడన్నా...
మరణశయ్యపై మన్యం - మలేరియా, విషజ్వరాలకు ప్రాణాలు అర్పణం - పట్టించుకోని పాలకులు - గిరిజన గ్రామాలకు కనీస వసతులు కరువు - జ్వరాల నివారణ చర్యలు శూన్యం - ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైద్య పోస్టులు ఖాళీ - పల్లెలకు అందని వైద్య సేవలు - గ్రామాల్లో జరగని స్ప్రేయింగ్ - దోమతెరలకు అతీగతి లేదు - చాపరాయి ఘటనతోనైనా కనువిప్పు కలగదా? సాక్షి ప్రతినిధి, కాకినాడ : సాధారణంగా చినుకు పడితే ఊరూవాడా పులకరిస్తుంది. కానీ మన్యం పరిస్థితి వేరు. చినుకుల సీజన్ వస్తుందంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. రుతు పవనాలు ఇక్కడ మృత్యు పవనాలవుతున్నాయి. వరుణుడికంటే ముందే యముడు వస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మన్యం మరణశయ్యగా మారిపోతుంది. అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్సుగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రోగ నివారణ, నియంత్రణ, రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, వైద్య సిబ్బంది పర్యవేక్షణ, మందుల సరఫరా, చికిత్స విషయాల్లో సరైన చర్యలు తీసుకోనందున గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏటా వందల ప్రాణాల్ని మలేరియాకి, విషజ్వరాలకు అర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా మన్యం గజగజ ‘తూర్పు’ మన్యం ఏటా మరణాలతో గజగజలాడుతోంది. గతేడాది ఇదే సమయంలో కాళ్ల వాపు వ్యాధితో 16 మంది గిరిజనులు చనిపోయారు. ఇక, పౌష్టికాహారం లోపం, రక్తహీనతతో ఏడాది కాలంలో 60 మంది శిశువులు, బాలింతలు మృతి చెందారు. ఇప్పుడేమో ఒక్క చాపరాయిలోనే 16 మంది మరణించారు. మన్యంలో మలేరియా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవరెక్కడ చనిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకుంది. చాపరాయి ఘటన వెలుగు చూడకముందు జిల్లాలో అసలు మరణాలే లేవని అధికారులు బుకాయించారు. వాస్తవానికి ఇక్కడ జూన్ 8వ తేదీ నుంచి రోజుకొకరు, ఇద్దరు చొప్పున మరణిస్తూ వస్తున్నారు. కానీ, బయటి ప్రపంచానికి తెలియలేదు. ఒక్క చాపరాయిలోనే ఇలా ఉంటే ఏజెన్సీలోని 11 మండలాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ 2,979 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్‌లోనే వేలాదిగా కేసులొచ్చాయి. ఏటా ఇదే పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమవడం లేదు. సగానికి పైగా గ్రామాల్లో మలేరియా తీవ్రత రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధుల్లోని 11 మండలాల్లో 1,180 గ్రామాలున్నాయి. వీటిలో అధిక గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల సంఖ్య 434గా గుర్తించారు. చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీలు హైరిస్క్ జోన్లో నిలిచాయి. మలేరియా నియంత్రణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 2,187 మలేరియా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఈ ఏడాది జూన్ వరకు ఆ సంఖ్య 2,979గా ఉంది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 3 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలి. ఈ మేరకు 2015లో ప్రతిపాదనలు పంపిస్తే గత ఏడాది లక్షా 35 వేల దోమతెరలు మాత్రమే మంజూరయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఈ ఏడాది 2 లక్షల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఇంతవరకూ ఒక్క దోమతెరను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. నామమాత్రంగా స్ప్రేయింగ్ మలేరియా నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా యాంటీ లార్వా స్ప్రే చేయాలి. ప్రభుత్వం రెండేళ్లుగా విలీన మండలాల్లో స్ప్రేయింగ్ అనే మాటనే మరిచిపోయింది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 7 మండలాల్లో రెండు విడతలుగా చేయాల్సిన స్ప్రేయింగ్‌ను ఒక విడతే చేసినట్టు చెబుతున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా మే నెలాఖరుకు తొలి విడత స్ప్రేయింగ్ పూర్తవ్వాలి. రెండో విడత జూన్ నాటికి పూర్తి చేయాలి. కానీ, రెండో విడతకు సంబం«ధించి స్ప్రేయింగ్ డబ్బాలు ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మలేరియా నియంత్రణకు ప్రైమాక్విన్ డ్రగ్ సరఫరా ఉండటం లేదు. ఈ మందు అందుబాటులో లేకపోవడంతో పీహెచ్‌సీలకు వచ్చే మలేరియా వ్యాధిగ్రస్తులకు క్లోరోక్విన్, పారాసిటమాల్‌తోనే సరిపెడుతున్నారు. దీంతో వ్యాధి నయం కాకపోగా మరింత తీవ్రమవుతోంది. వైద్య పోస్టులు ఖాళీ మన్యంలోని పీహెచ్‌సీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏజెన్సీలో వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పోస్టు ఎంతో కాలంగా ఇన్‌చార్జీలతో నడుస్తోంది. దీంతో వారు పూర్తిస్థాయిలో రంపచోడవరంలో ఉండి పర్యవేక్షణ చేయడం లేదు. జిల్లా టీబీ కంట్రోల్ అధికారికి ఏడీఎంఅండ్‌హెచ్‌ఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఫైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ వైద్యాధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ అదనపు వైద్య, ఆరోగ్య అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉంది. జిల్లా లెప్రసీ అధికారి ఈ పోస్టులో ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. వీరంతా ఇన్‌చార్జ్‌లు కావడంతో ఏజెన్సీకి అందుబాటులో ఉండటం లేదు. అలాగే ఉన్న ఒక్క సివిల్ సర్జన్ స్పెషలిస్టు పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్ ఆఫీసర్లు (వైద్యులు) 38కి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీహెచ్ఓ 8 పోస్టులకు రెండు ఖాళీగా ఉన్నాయి. ఎంపీహెచ్ఎస్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరు గ్రామస్థాయిలో జ్వరాల కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కనీస సౌకర్యాలు కరువు ఏజెన్సీలోని గ్రామాలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఊటలు, చెలమనీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఏజెన్సీలోని 1,180 గ్రామాల్లో 300 వరకూ తాగునీటికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. స్వచ్ఛ జలాలు అందకపోవడంతో కలుషిత నీరు తాగి గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. పౌష్టికాహారం లోపమైతే చెప్పనక్కర్లేదు. సిబ్బంది అక్కడికెళ్లడమే గగనమనుకుంటే పౌష్టికాహారం అందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. గతంలో వెలుగు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం వీటిని ఎత్తేశారు. పౌష్టికాహారం లోపంవల్లనే గిరిజనులు రక్తహీనతకు గురై వ్యాధుల బారిన పడుతున్నారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని 11 మండలాల్లో మెజార్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 844 గ్రామాలున్నాయి. వాటిలో 298 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో 336 గ్రామాలున్నాయి. ఇక్కడ 96 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. 5 సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 57 గ్రామాలకుగాను 19 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. మొత్తం 1237 గ్రామాలకుగాను 413 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్ల సౌకర్యం లేదు. రహదారుల విషయంలో ఇంత దారుణమైన పరిస్థితులు అక్కడున్నాయి. ఇక్కడ కాలిబాటే దిక్కు. అత్యవసర పరిస్థితుల్లో కావిడి, జెట్టీలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక మార్గం మధ్యలోనే రోగులు చనిపోతున్నారు. ఆ మధ్య ఒక శిశువు కూడా ఈవిధంగానే మృతి చెందింది. ఇక మంజూరైన 90 రోడ్లు అటవీ శాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిపోయాయి. అటవీ అభ్యంతరాలను తొలగించేందుకు ఐటీడీఏ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ఇదిలా ఉండగా విలీన మండలాల్ని విసిరేసిన వాటిగా ప్రభుత్వం వదిలేసింది. తాజాగా 16 మంది మృతి చెందిన చాపరాయి పరిస్థితి మరింత దారుణం. ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కాటారికోట గ్రామం నుంచి చాపరాయికి ఘాట్ రోడ్డు కావడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఆరు బోర్లున్నాయి. వాటిల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదు. దీంతో కొండకాలువ(వాగు) నీటినే వినియోగిస్తున్నారు. వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ ఏజెన్సీలో వర్షాకాలం వస్తే కొండవాగులు పొంగి ప్రవహిస్తాయి. దీంతో గిరిజనులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా గ్రామంలో మగ్గిపోవాల్సిందే. అనేక గ్రామాలకు వంతెనలు, కల్వర్టులు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఏజెన్సీ ఏడు మండలాల్లో సుమారు 100 గ్రామాలకు వంతెనలు లేవు. రంపచోడవరం సమీపంలోని ధరమడుగుల గ్రామానికి చేపట్టిన వంతెన నిర్మాణం సగంలో వదిలేశారు. మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కొండకాలువపై వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వారం వారం అందని వైద్య సేవలు వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో గిరిజనులకు సోకుతున్న వ్యాధిమూలాలను కనిపెట్టలేకపోతున్నారు. దీంతో వ్యాధులు ముదిరి గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. మరణాలు వెలుగు చూశాకే వైద్య సిబ్బంది, అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప ముందు జాగ్రత్తలు చేపట్టడం లేదు. జిల్లాస్థాయి అధికారులు ప్రతి నెలా మూడు రోజులపాటు ఏజెన్సీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలుకు నోచుకోవడంలేదు. మరోవైపు స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన కింది స్థాయి సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే గ్రామాలకు వెళ్లి తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. -
ధైర్యం చెబుతూ... భరోసానిస్తూ...
- చాపరాయి బాధితులకు జగన్ ఓదార్పు - అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి - తరలివచ్చిన వెస్సార్సీపీ నేతలు కాకినాడ, కాకినాడ క్రైం: అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ... త్వరలోనే కోలుకుంటారని భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చాపరాయి విషజ్వరాల బాధితులకు ఓదార్పునిచ్చారు. ఏజెన్సీలోని చాపరాయి విషజ్వరాలు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. పీడియాట్రిక్ వార్డులో ఉన్న చిన్నారులు విజయ, కనకమ్మ, కె.స్వామిరెడ్డి, పల్లాల చిట్టెమ్మతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులతో కూడా మాట్లాడి మెరుగైన సేవలు అందించాల్సిందిగా కోరారు. దాదాపు 30 నిమిషాలపాటు అక్కడ గడిపిన జగన్ నలుగురు బాధితులతోనూ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితులతోపాటు చాపరాయి ప్రాంతంలో రేషన్ సరుకులు, మంచినీరు, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునే విధంగా రోగులకు పౌష్టికాహారాన్ని, ఇతర సేవలను అందించాలని ఇన్చార్జ్ సూపరింటెండెంట్ జీఎస్‌ఎన్‌మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంవో శ్రీరామచంద్రమూర్తి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ, వైద్యులు డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ గిరిధర్‌లకు సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులను జగన్ స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి ధైర్యం చెప్పడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చినట్లయిది. జగన్‌కు ఘన స్వాగతం... పశ్చిమగోదావరి జిల్లా నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పాముల రాజేశ్వరిదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర, జిల్లా యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ భాస్కర్‌తోపాటు వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లాకమిటీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జగన్ వస్తున్న సమాచారం తెలియజేయడంతో పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగాను, పార్టీ శ్రేణుల నినాదాలతో కోలాహలంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించగా రాజమహేంద్రవరం ప్రాంతంలో వైఎస్ హయాంలో ఇచ్చిన నివాసాలను జన్మభూమి కమిటీ సభ్యులు బలవంతంగా తొలగించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండకుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, ఎన్.ఎస్.రాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర బీసీసెల్ క్యాదర్శి అల్లిరాజబాబు, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డిజమీలు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, హరినా«ద్, ముమ్మిడివరం ప్లోర్‌లీడర్ కాశి మునికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కె.ఆదిత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.