అన్ని కులాల వారికీ సమన్యాయం
అన్ని కులాల వారికీ సమన్యాయం
Published Wed, Mar 22 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
రాజ్యాంగబద్ధంగానే కులాల మార్పు, చేర్పులు
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ
బీసీల్లో కాపుల చేర్పుపై కాకినాడలో ప్రజాభిప్రాయసేకరణ
కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయమై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విచారణను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. కమిషన్‌కు తమ వాదనలు, ఆవేదనలు వినిపించేందుకు జిల్లా నలుమూలల నుంచీ బీసీ సామాజికవర్గాల వారు, కాపు సామాజిక వర్గాల వారు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలి వచ్చారు. తమ వాదనలను పూర్తిగా వినిపించకుండా ఆటంకం కల్పించారని బీసీ ప్రతినిధులు కమిషన్ ముందు నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సీఎంకు బాకా ఊదడానికే వచ్చారని ఆ సామాజిక వర్గీయులు విరుచుకుపడ్డారు. కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆర్‌ఎంసీ కళాశాల పరిసరాలు, నగరంలో ముఖ్యకూడళ్లలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : అన్ని కులాల వారికీ సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే అంశం, వెనుకబడిన వివిధ కులాల వారి గ్రూపుల మార్పుపై ఆయన నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బీసీ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ అన్ని కులాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో నిర్వహించగా తూర్పు గోదావరి జిల్లా 13వది అన్నారు. 1994 నుంచి అనేక కులాల వారు బీసీల్లో చేర్పు కోసం , గ్రూపుల మార్పు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని చెప్పారు. కమ్మకులం తప్ప అన్ని అగ్రకులాలూ బీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అన్ని కులాల వారి ఆర్థిక, సామాజిక తదితర స్థితిగతులు తెలుసుకొనేందుకు సమగ్ర పల్స్ సర్వే చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఉంటారని కమిషన్ భావిస్తోందన్నారు. ఈ సర్వే అన్ని జిల్లాల్లో చేపట్టి ఆరు రకాల ప్రశ్నావళిని కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టామన్నారు. మార్పులు కోరిన కులాలు, చేర్పులు కోరిన కులాలకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమైనదిగా కమిషన్ భావిస్తోందన్నారు. ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చాలంటే నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనేది నిబంధన అన్నారు. దీనికి బీసీ కమిషన్ కట్టుబడి ఉంటుందన్నారు. బీసీల్లో గ్రూపుల మార్పు లేదా బీసీల్లో చేర్పు కోరుతున్న వారు దానికి గల అన్ని అర్హతలతో పాటు పూర్తి సమాచారాన్ని కమిషన్‌కు ఇవ్వాలన్నారు.
మాదే కులమో మాకే తెలియదు..
తోలు బొమ్మల వారు ఏ కులానికి చెందిన వారో ప్రభుత్వం చెప్పటం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన బాలకృష్ణ వాపోయారు. తమని బీసీలో చేర్చాలని కోరగా రాష్ట్రంలో అన్ని తోలు బొమ్మలాట వర్గాల వారు ఒకే కులం పేరుతో ముందుకు వస్తే కమిషన్ పరిశీలిస్తుందని జస్టిస్ మంజునాథ చెప్పారు. యాదవులను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఎ’కు మార్చాలని ఆ కులానికి చెందిన కుండల సాయికుమార్ కోరారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నాగిరెడ్డి భాస్కర్ కూలి పనులతో జీవిస్తున్న తమని బీసీ ‘డి’ నుంచి ‘ఎ’కు మార్చాలని కోరారు. శాలివాహన కులానికి చెందిన వీరభద్రరావు మాట్లాడుతూ కుమ్మర్లుగా పిలిచే తాము స్టీల్ సామగ్రి వచ్చాక కుల వృత్తికి దూరమయ్యామని తమ కులాన్ని బీసీ నుంచి ఎస్టీలోకి మార్చాలని కోరారు. భోజన విరామం అనంతరం కాపు కులాలను బీసీల్లో చేర్చాలని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ కోరారు. కాపులు దుర్భరమైన, భద్రత లేని వృత్తులు నిర్వహించడంతో పాటు కూలి, పాచిపనులు కూడా వెళుతూ జీవనాన్ని గడుపుతున్నారని వివరించారు. ఈ స్థితి గతులను పరిగణనలోనికి తీసుకొని న్యాయం చేకూర్చాలని కోరారు. కాపు నాయకులు మాట్లాడాక తమకు ప్రతిసారి అవకాశం ఇవ్వాలని కొందరు బీసీ ప్రతినిధులు కోరగా చైర్మన్‌నిరాకరించారు. మొదట వారు చెప్పింది వినాలని, తర్వాత అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ దశలో బీసీ నాయకులు వాదోపవాదాల నడుమ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ మంజునాథ అర్ధాంతరంగా ప్రజాభిప్రాయసేకరణను ముగించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నిజమైన వెనుక బడిన తరగతులు వారి హక్కులను పరిరక్షించాలని కోరుతూ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయ సేకరణలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వేంకటేశ్వరరావు, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ –2 రాధాకృష్ణమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, కాపు ఉద్యమ జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, ప్రూటీ కుమార్, సంగిశెట్టి అశోక్, బీసీ నాయకులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పాటి శివకుమార్, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కుట్రలో భాగంగానే రామానుజయ హాజరు : కాపునేతలు
కుట్రలో భాగంగానే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారని కాపు నేతలు మిండగుదిటి మోహన్, పేపకాయల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు వాపోయారు. ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిశాక వారు విలేకరులతో మాట్లాడుతూ బీసీలు మాట్లాడుతున్నంత సేపు తాము ఏమీ మాట్లాడలేదని, తాము మాట్లాడుతుంటే బీసీలు కావాలనే రభస చేశారని, కాపు కార్పొరేషన్ చైర్మన్ పేరు తాము ఇచ్చిన జాబితాలో లేకున్నా అతనితో ఎలా మాట్లాడించారని వాపోయారు. కాగా కాపు కల్యాణమండపంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఇది ప్రభుత్వ ప్రచార వేదికలా రామానుజయ మాట్లాడారని విమర్శించారు. ప్రజాభిప్రాయసేకరణ ప్రభుత్వ పథకాల ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేర్వేరుగా విచారణ చేపట్టాలన్నారు.
Advertisement
Advertisement