- జగనన్నా...చూడన్నా... | jagan tour east godavari | Sakshi
Sakshi News home page

- జగనన్నా...చూడన్నా...

Published Sat, Jul 1 2017 12:16 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

- జగనన్నా...చూడన్నా... - Sakshi

- జగనన్నా...చూడన్నా...

మరణశయ్యపై మన్యం 
- మలేరియా, విషజ్వరాలకు ప్రాణాలు అర్పణం
- పట్టించుకోని పాలకులు
- గిరిజన గ్రామాలకు కనీస వసతులు కరువు
- జ్వరాల నివారణ చర్యలు శూన్యం
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైద్య పోస్టులు ఖాళీ
- పల్లెలకు అందని వైద్య సేవలు
- గ్రామాల్లో జరగని స్ప్రేయింగ్‌
- దోమతెరలకు అతీగతి లేదు
- చాపరాయి ఘటనతోనైనా కనువిప్పు కలగదా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సాధారణంగా చినుకు పడితే ఊరూవాడా పులకరిస్తుంది. కానీ మన్యం పరిస్థితి వేరు. చినుకుల సీజన్‌ వస్తుందంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. రుతు పవనాలు ఇక్కడ మృత్యు పవనాలవుతున్నాయి. వరుణుడికంటే ముందే యముడు వస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మన్యం మరణశయ్యగా మారిపోతుంది. అనారోగ్యానికి కేరాఫ్‌ అడ్రస్సుగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రోగ నివారణ, నియంత్రణ, రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, వైద్య సిబ్బంది పర్యవేక్షణ, మందుల సరఫరా, చికిత్స విషయాల్లో సరైన చర్యలు తీసుకోనందున గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏటా వందల ప్రాణాల్ని మలేరియాకి, విషజ్వరాలకు అర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఏటా మన్యం గజగజ
‘తూర్పు’ మన్యం ఏటా మరణాలతో గజగజలాడుతోంది. గతేడాది ఇదే సమయంలో కాళ్ల వాపు వ్యాధితో 16 మంది గిరిజనులు చనిపోయారు. ఇక, పౌష్టికాహారం లోపం, రక్తహీనతతో ఏడాది కాలంలో 60 మంది శిశువులు, బాలింతలు మృతి చెందారు. ఇప్పుడేమో ఒక్క చాపరాయిలోనే 16 మంది మరణించారు. మన్యంలో మలేరియా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవరెక్కడ చనిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకుంది. చాపరాయి ఘటన వెలుగు చూడకముందు జిల్లాలో అసలు మరణాలే లేవని అధికారులు బుకాయించారు. వాస్తవానికి ఇక్కడ జూన్‌ 8వ తేదీ నుంచి రోజుకొకరు, ఇద్దరు చొప్పున మరణిస్తూ వస్తున్నారు. కానీ, బయటి ప్రపంచానికి తెలియలేదు. ఒక్క చాపరాయిలోనే ఇలా ఉంటే ఏజెన్సీలోని 11 మండలాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ 2,979 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జూన్‌లోనే వేలాదిగా కేసులొచ్చాయి. ఏటా ఇదే పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమవడం లేదు.
సగానికి పైగా గ్రామాల్లో మలేరియా తీవ్రత
రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధుల్లోని 11 మండలాల్లో 1,180 గ్రామాలున్నాయి. వీటిలో అధిక గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల సంఖ్య 434గా గుర్తించారు. చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీలు హైరిస్క్‌ జోన్‌లో నిలిచాయి. మలేరియా నియంత్రణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 2,187 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా ఈ ఏడాది జూన్‌ వరకు ఆ సంఖ్య 2,979గా ఉంది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 3 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలి. ఈ మేరకు 2015లో ప్రతిపాదనలు పంపిస్తే గత ఏడాది లక్షా 35 వేల దోమతెరలు మాత్రమే మంజూరయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఈ ఏడాది 2 లక్షల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఇంతవరకూ ఒక్క దోమతెరను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు.
నామమాత్రంగా స్ప్రేయింగ్‌
మలేరియా నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా యాంటీ లార్వా స్ప్రే చేయాలి. ప్రభుత్వం రెండేళ్లుగా విలీన మండలాల్లో స్ప్రేయింగ్‌ అనే మాటనే మరిచిపోయింది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 7 మండలాల్లో రెండు విడతలుగా చేయాల్సిన స్ప్రేయింగ్‌ను ఒక విడతే చేసినట్టు చెబుతున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. సాధారణంగా మే నెలాఖరుకు తొలి విడత స్ప్రేయింగ్‌ పూర్తవ్వాలి. రెండో విడత జూన్‌ నాటికి పూర్తి చేయాలి. కానీ, రెండో విడతకు సంబం«ధించి స్ప్రేయింగ్‌ డబ్బాలు ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్నారు.  జనవరి, ఫిబ్రవరి నెలల్లో మలేరియా నియంత్రణకు ప్రైమాక్విన్‌ డ్రగ్‌ సరఫరా ఉండటం లేదు. ఈ మందు అందుబాటులో లేకపోవడంతో పీహెచ్‌సీలకు వచ్చే మలేరియా వ్యాధిగ్రస్తులకు క్లోరోక్విన్, పారాసిటమాల్‌తోనే సరిపెడుతున్నారు. దీంతో వ్యాధి నయం కాకపోగా మరింత తీవ్రమవుతోంది.
వైద్య పోస్టులు ఖాళీ
మన్యంలోని పీహెచ్‌సీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏజెన్సీలో వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పోస్టు ఎంతో కాలంగా ఇన్‌చార్జీలతో నడుస్తోంది. దీంతో వారు పూర్తిస్థాయిలో రంపచోడవరంలో ఉండి పర్యవేక్షణ చేయడం లేదు. జిల్లా టీబీ కంట్రోల్‌ అధికారికి ఏడీఎంఅండ్‌హెచ్‌ఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఫైలేరియా రీసెర్చ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వైద్యాధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ అదనపు వైద్య, ఆరోగ్య అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉంది. జిల్లా లెప్రసీ అధికారి ఈ పోస్టులో ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. వీరంతా ఇన్‌చార్జ్‌లు కావడంతో ఏజెన్సీకి అందుబాటులో ఉండటం లేదు. అలాగే ఉన్న ఒక్క సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్‌ ఆఫీసర్లు (వైద్యులు) 38కి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీహెచ్‌ఓ 8 పోస్టులకు రెండు ఖాళీగా ఉన్నాయి. ఎంపీహెచ్‌ఎస్‌ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరు గ్రామస్థాయిలో జ్వరాల కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.
కనీస సౌకర్యాలు కరువు
ఏజెన్సీలోని గ్రామాలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఊటలు, చెలమనీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఏజెన్సీలోని 1,180 గ్రామాల్లో 300 వరకూ తాగునీటికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. స్వచ్ఛ జలాలు అందకపోవడంతో కలుషిత నీరు తాగి గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. పౌష్టికాహారం లోపమైతే చెప్పనక్కర్లేదు. సిబ్బంది అక్కడికెళ్లడమే గగనమనుకుంటే పౌష్టికాహారం అందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. గతంలో వెలుగు ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం వీటిని ఎత్తేశారు. పౌష్టికాహారం లోపంవల్లనే గిరిజనులు రక్తహీనతకు గురై వ్యాధుల బారిన పడుతున్నారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని 11 మండలాల్లో మెజార్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 844 గ్రామాలున్నాయి. వాటిలో 298 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో 336 గ్రామాలున్నాయి. ఇక్కడ 96 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. 5 సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని 57 గ్రామాలకుగాను 19 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్లు లేవు. మొత్తం 1237 గ్రామాలకుగాను 413 గ్రామాలకు కనెక్టవిటీ రోడ్ల సౌకర్యం లేదు. రహదారుల విషయంలో ఇంత దారుణమైన పరిస్థితులు అక్కడున్నాయి. ఇక్కడ కాలిబాటే దిక్కు. అత్యవసర పరిస్థితుల్లో కావిడి, జెట్టీలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక మార్గం మధ్యలోనే రోగులు చనిపోతున్నారు. ఆ మధ్య ఒక శిశువు కూడా ఈవిధంగానే మృతి చెందింది. ఇక మంజూరైన 90 రోడ్లు అటవీ శాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిపోయాయి. అటవీ అభ్యంతరాలను తొలగించేందుకు ఐటీడీఏ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు నిర్మాణాలు పూర్తి కావడం లేదు. ఇదిలా ఉండగా విలీన మండలాల్ని విసిరేసిన వాటిగా ప్రభుత్వం వదిలేసింది. తాజాగా 16 మంది మృతి చెందిన చాపరాయి పరిస్థితి మరింత దారుణం. ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కాటారికోట గ్రామం నుంచి చాపరాయికి ఘాట్‌ రోడ్డు కావడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఆరు బోర్లున్నాయి. వాటిల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదు. దీంతో కొండకాలువ(వాగు) నీటినే వినియోగిస్తున్నారు.
వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్‌
ఏజెన్సీలో వర్షాకాలం వస్తే కొండవాగులు పొంగి ప్రవహిస్తాయి. దీంతో గిరిజనులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా గ్రామంలో మగ్గిపోవాల్సిందే. అనేక గ్రామాలకు వంతెనలు, కల్వర్టులు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఏజెన్సీ ఏడు మండలాల్లో సుమారు 100 గ్రామాలకు వంతెనలు లేవు. రంపచోడవరం సమీపంలోని ధరమడుగుల గ్రామానికి చేపట్టిన వంతెన నిర్మాణం సగంలో వదిలేశారు. మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కొండకాలువపై వంతెన నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.
వారం వారం అందని వైద్య సేవలు
వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో గిరిజనులకు సోకుతున్న వ్యాధిమూలాలను కనిపెట్టలేకపోతున్నారు. దీంతో వ్యాధులు ముదిరి గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. మరణాలు వెలుగు చూశాకే వైద్య సిబ్బంది, అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప ముందు జాగ్రత్తలు చేపట్టడం లేదు. జిల్లాస్థాయి అధికారులు ప్రతి నెలా మూడు రోజులపాటు ఏజెన్సీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు అమలుకు నోచుకోవడంలేదు. మరోవైపు స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన కింది స్థాయి సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే గ్రామాలకు వెళ్లి తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement