జగన్ పర్యటనను విజయవంతం చేద్దాం
వైఎస్సార్‌సీపీ నేత అనంత బాబు పిలుపు
ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో సమీక్ష
రంపచోడవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో బుధ, గురువారాల్లో జరిపే పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి రంపచోడవరంలో సోమవారం అనంత బాబు సమీక్షించారు. బుధవారం గోపవరం నుంచి మారేడుమిల్లి వరకు జరిగే రోడ్డు షోను, పోలవరం నిర్వాసితులు, రైతులతో పార్టీ అధినేత నిర్వహించే సమావేశంపైనా నాయకులతో చర్చించారు. విలీన మండలం రేఖపల్లిలో గురువారం జగన్‌మోహనరెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఏజెన్సీ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కళ్లకు కట్టినట్టుగా తీసుకువెళదామని అనంత బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విలీన మండలాల నుంచి పెద్దఎత్తున జనం జగన్‌మోహన్‌రెడ్డి సభకు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు చేసిన మేలేమీ లేదన్నారు.తమకు జరుగుతున్న అన్యాయాన్ని రంపచోడవరంలో జగన్‌మోహనరెడ్డితో జరిగే ముఖాముఖీ కార్యక్రమంలో పోలవరం నిర్వాసితులు అయన దృష్టికి తీసుకువస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాంజనేయులు, పార్టీ మండల ప్రచార విభాగం అధ్యక్షుడు వీఎం కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.