డ్రైఈస్ట్‌ను ప్రకాశం యూనిట్‌కు పంపించేందుకు తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ
దగ్గరలో ఉన్న కట్టుపల్లి పోర్టును ఎందుకు ఎంపిక చేసుకోలేదు?
దూరంలో ఉన్న వైజాగ్‌కు తేవడం వెనుక ఆంతర్యం ఏమిటి?
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా.. ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకు రావడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కస్టమ్స్ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. దూరమైనా సరే కొందరు విశాఖ పోర్టును ఎంపిక చేసుకుంటున్నారన్న కోణంలోనూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
మరోవైపు.. డ్రై ఈస్ట్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని దర్యాప్తు బృందం శనివారం విచారించింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బయట పడటంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరా తీస్తుంటే.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సంధ్య ఆక్వా సంస్థకు విశాఖలో ఫీడ్ యూనిట్ లేదు.
ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. అంటే.. విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్‌ని ప్రకాశం యూనిట్‌కు తరలించేందుకు సంధ్య ఆక్వా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అలాంటప్పుడు.. నౌకని నేరుగా విశాఖ పోర్టుకు కాకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్‌ని కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
ఒకవేళ.. ప్రకాశంకు తరలించాల్సి వస్తే.. కట్టుపల్లికి ఈ నౌకని బెర్తింగ్ కోసం పర్మిషన్ పెట్టుకోవాలి. దీని వల్ల.. సమయం, వ్యయం కూడా సదరు సంస్థకు ఆదా అవుతుంది. కానీ.. విశాఖకు ఎందుకు తరలించారన్న విషయంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై సీబీఐ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది.
పోర్టు సిబ్బంది సహకారంపై సీబీఐ కన్ను
విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో కస్టమ్స్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. కస్టమ్స్ విభాగం వారు అడ్డుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో హడావిడి చెయ్యడం తగదంటూ సీబీఐతో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఫోన్‌లో జోక్యం చేసుకోవడంతో.. డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ ముందుకు వెళ్లగలిగింది. దీనిపై సీబీఐ గుర్రుగా ఉంది.
కస్టమ్స్ విభాగం వ్యవహారంపైనా సీబీఐ కన్నేసింది. కస్టమ్స్‌లో దిగువ స్థాయి సిబ్బంది కొంత మంది.. కంటైనర్స్ తీసుకొస్తున్న సంస్థలతో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల విశాఖలో 600కు పైగా ఈ–సిగరెట్ బాక్సుల్ని నగర పోలీసులు పట్టుకున్నారు. ఇవి కూడా కంటైనర్ ద్వారా విశాఖ చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ–సిగరెట్స్‌ని భారత్‌లో నిషేధించారు. అలాంటప్పుడు విశాఖ ఎలా చేరాయని ఆరాతీస్తే.. కంటైనర్ టెర్మి నల్‌లో కస్టమ్స్‌ని దాటుకొని నగరానికి వచ్చా యని తెలిసింది. ఇలా.. పలు అంశాల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన కొందరు దిగువ స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. ఈ తరహా నిషేధిత సరుకు బయటకి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు నిజమేనని ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం
తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. శనివారం కూడా మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి సంస్థ ఎండీ, డైరెక్టర్లను విచారించింది.
ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు.. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆదివారం కూడా వారు మరోమారు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment