visakha port
-
మంత్రి నాదెండ్లకు షాక్.. పోర్టులో బియ్యానికి క్లీన్ చిట్
సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
విశాఖ పోర్టుకు అరుదైన ఘనత
విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీ(సీపీపీఐ)లో టాప్–20లో స్థానం సంపాదించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ అద్భుత ప్రతిభ కనబరిచి 18వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ పోర్టుల పనితీరును సీపీపీఐ పరిగణనలోకి తీసుకోగా.. ఇందులో విశాఖ పోర్టు సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ సూచీల ద్వారా వ్యాపారవేత్తలు పోర్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. పోర్టు సామర్థ్యం, నౌక టర్న్ అరౌండ్ సమయాలు ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా నౌకల యజమానులు భావిస్తారు. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో క్రేన్లు గంటకు 27.5 కదలికలను నమోదు చేస్తుంటాయి. బెర్త్‌లో షిప్ నిలిపే సమయం 13 శాతంగా ఉంటోంది. అలాగే పోర్టులో టర్న్ రౌండ్‌కు 21.4 గంటల రికార్డు సమయం ద్వారా అత్యుత్తమ సూచీలను నెలకొల్పింది. 65కు పైగా కంటైనర్ లైన్లు కలిగి ఉంది.కంటైనర్ టెర్మినల్‌కు 8 నిరంతర సర్వీసులున్నాయి. ఈ అసాధారణ ఘనతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్లు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందించాయి. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఘనతను సాధించడంలో కీలకంగా పనిచేసిన సిబ్బందిని విశాఖ పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. పోర్టు సమర్థతను ఈ ఘనత చాటి చెప్పిందన్నారు.సరుకు రవాణాలో 4వ స్థానం2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తును ప్రశంసించింది. -
విశాఖ పోర్టు.. ఏమిటో లోగుట్టు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా.. ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకు రావడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కస్టమ్స్ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. దూరమైనా సరే కొందరు విశాఖ పోర్టును ఎంపిక చేసుకుంటున్నారన్న కోణంలోనూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు.. డ్రై ఈస్ట్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని దర్యాప్తు బృందం శనివారం విచారించింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బయట పడటంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరా తీస్తుంటే.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సంధ్య ఆక్వా సంస్థకు విశాఖలో ఫీడ్ యూనిట్ లేదు. ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. అంటే.. విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్‌ని ప్రకాశం యూనిట్‌కు తరలించేందుకు సంధ్య ఆక్వా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అలాంటప్పుడు.. నౌకని నేరుగా విశాఖ పోర్టుకు కాకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్‌ని కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ.. ప్రకాశంకు తరలించాల్సి వస్తే.. కట్టుపల్లికి ఈ నౌకని బెర్తింగ్ కోసం పర్మిషన్ పెట్టుకోవాలి. దీని వల్ల.. సమయం, వ్యయం కూడా సదరు సంస్థకు ఆదా అవుతుంది. కానీ.. విశాఖకు ఎందుకు తరలించారన్న విషయంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై సీబీఐ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. పోర్టు సిబ్బంది సహకారంపై సీబీఐ కన్ను విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో కస్టమ్స్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. కస్టమ్స్ విభాగం వారు అడ్డుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో హడావిడి చెయ్యడం తగదంటూ సీబీఐతో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఫోన్లో జోక్యం చేసుకోవడంతో.. డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ ముందుకు వెళ్లగలిగింది. దీనిపై సీబీఐ గుర్రుగా ఉంది. కస్టమ్స్ విభాగం వ్యవహారంపైనా సీబీఐ కన్నేసింది. కస్టమ్స్‌లో దిగువ స్థాయి సిబ్బంది కొంత మంది.. కంటైనర్స్ తీసుకొస్తున్న సంస్థలతో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల విశాఖలో 600కు పైగా ఈ–సిగరెట్ బాక్సుల్ని నగర పోలీసులు పట్టుకున్నారు. ఇవి కూడా కంటైనర్ ద్వారా విశాఖ చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ–సిగరెట్స్‌ని భారత్‌లో నిషేధించారు. అలాంటప్పుడు విశాఖ ఎలా చేరాయని ఆరాతీస్తే.. కంటైనర్ టెర్మి నల్లో కస్టమ్స్ని దాటుకొని నగరానికి వచ్చా యని తెలిసింది. ఇలా.. పలు అంశాల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన కొందరు దిగువ స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. ఈ తరహా నిషేధిత సరుకు బయటకి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు నిజమేనని ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. శనివారం కూడా మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి సంస్థ ఎండీ, డైరెక్టర్లను విచారించింది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు.. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆదివారం కూడా వారు మరోమారు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిందని తెలిసింది. -
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు. విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్.. 'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి'
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. -
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
‘విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిస్ టెర్మినల్‌ను పోర్ట్‌లు షిప్పింగ్శాఖ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయి అని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి చెందడానికి క్రూయిజ్ ఎంతోగానో దోహదం పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. త్వరలో విశాఖకు జాతీయ,అంతర్జాతీయ క్రూయిజ్‌లు రాబోతున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర విశేషమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుందని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
లోడింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు.. ఒక్కరోజులో
దొండపర్తి(విశాఖ దక్షిణ): సరుకు రవాణాలో రికార్డులు సృష్టిస్తున్న విశాఖ పోర్టు తాజాగా లోడింగ్‌లో కూడా చరిత్ర సృష్టించింది. నూతన సాంకేతికత సాయంతో రెండునెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఎంవీ జీసీఎల్ నర్మద కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50,450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసి పోర్టు అధికారులు, సిబ్బంది సత్తా చాటారు. ఈ ఏడాది మార్చి 26న అత్యధికంగా చేసిన 44,374 మెట్రిక్ టన్నుల లోడింగ్ రికార్డును అధిగమించారు. ఈ విషయాన్ని పోర్టు అధికారులు సోమవారం వెల్లడించారు. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్‌ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్‌ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
విశాఖ అభివృద్ధిలో పోర్టుదే కీలక పాత్ర: చైర్మన్ కె రామ్మోహనరావు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ సందర్భంగా సాక్షి టీవితో విశాఖ పోర్టు చైర్మన్ కే రామ్మోహన్రావు కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం. ఏపీలో సహజ వనరుల తోపాటు తగినంతలో మానవ వనరులు కూడా ఉన్నాయి. సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంత ఏపీ సొంతం. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్)కి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కావడం ఎంతో శుభపరిణామం. ఏపీ ప్రభుత్వ విధానాల వల్లే లక్షల కోట్ల రూపాయాలు పెట్లుబడుల వచ్చాయాని సీఎం జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో మౌలిక సదుపాయాలు, రహదారులు, పోర్టులు అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతేగాదు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర. ఈ విశాఖ పోర్టు ఏర్పాటై సుమారు 90 ఏళ్లు అయ్యింది. ఈ పోర్టు ద్వారా రికార్డు స్థాయిలో 77 మిలియన్ల టన్నుల సరుకు రవాణ అయ్యింది. అంతేగాదు పెట్టుబడులకు విశాఖ నగరం అన్ని విధాల అనువైన నగరమే గాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ పోర్టు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ జరగబోతుంది. "అని చెప్పుకొచ్చారు. (చదవండి: ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో: సీఎం జగన్) -
Visakha Port: నెంబర్ వన్ లక్ష్యం.. ‘ల్యాండ్ లార్డ్ పోర్టు’ దిశగా అడుగులు
సాక్షి, విశాఖపట్నం : పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు సరికొత్త సొబగులద్దుకుంటోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు.. రాబోయే ఐదేళ్లలో ల్యాండ్ లార్డ్ పోర్టుగా అభివృద్ధి చెందేదిశగా అడుగులు వేస్తోంది. రూ.655 కోట్లతో పోర్టు ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సరకు రవాణాలో ఈ ఏడాది ఇప్పటికే 11 శాతం వృద్ధి సాధించిన వీపీఏ.. ఈ ఆర్థిక సంవత్సరంలో నంబర్‌వన్ స్థానంలో నిలవాలని ప్రయత్నిస్తోంది. విశాఖ పోర్టును ఏ విధంగా విస్తరించాలనే అంశంపై విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు ఛానెల్స్, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల సైతం నుంచి ఆదాయం ఆర్జించేలా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తులు రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్తులో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీ సామర్థ్యాన్ని కూడా పెంచేలా పోర్టు.. పనులు ప్రారంభించింది. రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్ వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలకు వీపీఏ ఉపక్రమించింది. పోర్టులోని ఆర్అండ్డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్ల నిర్మాణం, ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 11 శాతం వృద్ధి రేటు నమోదు ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాలను అనుసరిస్తూ విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 26 మిలియన్ టన్నుల ఎగుమతి దిగుమతులు నిర్వహించింది. గతేడాది ఈ కాలానికి కేవలం 23.5 మిలియన్ టన్నులు మాత్రమే హ్యాండ్లింగ్ చేసింది. మొత్తంగా 11 శాతం వృద్ధి కనబరిచిన విశాఖ పోర్టు ట్రస్టు.. దేశంలోని మేజర్ పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ పరంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ మార్కు దాటే దిశగా లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలోనూ వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ వద్ద 36 నుంచి 38 మీటర్ల పొడవైన కేప్ సైజ్ షిప్స్‌ను కూడా బెర్తింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇన్నర్ హార్బర్, ఔటర్ హార్బర్లో కచ్చితమైన డెప్త్లని అందించేందుకు సింగిల్ బీమ్ ఎకో సౌండర్ని మల్టీబీమ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా బెర్తుల ఆధునికీకరణ చేపడుతున్నారు. రూ.655 కోట్లతో నాలుగు బెర్తుల యాంత్రీకరణ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా రూ.655 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత నౌకాశ్రయంలోని వెస్ట్రన్ క్వే–7(డబ్ల్యూక్యూ–7), డబ్ల్యూక్యూ–8, ఈస్ట్రన్ క్వే–7 (ఈక్యూ–7), ఈక్యూ–6 బెర్త్‌ల యాంత్రీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించి పోర్టు.. రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) పిలిచింది. అదేవిధంగా చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఇన్నర్ హార్బర్లోని ఓఆర్–1,2 బెర్త్‌ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా రూ.106 కోట్లతో అవసరమైన సౌకర్యాలతో మూడు స్టోరేజీ షెడ్ల నిర్మాణానికి వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. భవిష్యత్తు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు గతిశక్తితో పాటు పీపీపీ పద్ధతిలో వివిధ ప్రాజెక్టుల పనులు విశాఖ పోర్టు అథారిటీ నిర్వహిస్తోంది. 2023 నుంచి 2025 నాటికి పలు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇవన్నీ పూర్తయితే అంతర్జాతీయ వాణిజ్య కేంద్ర బిందువుగా ల్యాండ్ లార్డ్ పోర్టుగా వీపీఏ రూపాంతరం చెందనుంది. సరుకు రవాణా, సామర్ధ్య నిర్వహణ పరంగా విశాఖ పోర్టు ప్రస్తుతం దేశంలోని మేజర్ పోర్టుల్లో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చేపడుతున్న వందల కోట్ల రూపాయల పనులు పూర్తయితే నంబర్ వన్‌గా మారనుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. – కె. రామ్మోహన్రావు, విశాఖ పోర్టు అథారిటీ ఛైర్మన్ -
Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..
దొండపర్తి(విశాఖ దక్షిణ): మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం.. సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. హ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది. విశాఖ వాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహార నౌక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విదేశాలతో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక ఇప్పుడు విశాఖ తీరానికి వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది. నగరానికి 1,200 మంది పర్యాటకులతో.. చెన్నై నుంచి 36 గంటల పాటు ప్రయాణించిన ఈ కార్డిలియా నౌకలో 1,200 మంది పర్యాటకులు విశాఖకు చేరుకున్నారు. ఇందులో సుమారు 800 మంది ప్రయాణికులు ఇక్కడ దిగిపోయారు. మిగిలిన వారు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు అదే క్రూయిజ్‌లో ప్రయాణించనున్నారు. విశాఖకు చేరుకున్న తరువాత వీరికి ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పించి నగరంలో వివిధ సందర్శనీయ ప్రదేశాలకు తీసుకువెళ్లారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి వీరిని క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి 1,345 మంది పర్యాటకులు విశాఖ నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు ఈ కార్డీలియా నౌక విశాఖ నుంచి బయలుదేరింది. ఉదయం 8 గంటలకే పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌కు నౌక చేరుకున్నప్పటికీ.. సాయంత్రం 4 గంటల నుంచి పర్యాటకులను అనుమతించారు. ఇక్కడి నుంచి 1,345 మంది బయలుదేరారు. వారందరిని తనిఖీ చేసి క్రూయిజ్‌లోకి అనుమతించారు. చాలా మంది విశాఖ నుంచి టికెట్లు దొరక్కపోవడంతో చెన్నై నుంచి టికెట్లు కొనుగోలు చేశారు. ముందుగానే చెన్నై వెళ్లిపోయి అక్కడ నుంచి క్రూయిజ్‌లో విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్ కార్డీలియా క్రూయిజ్ సర్వీసు వాస్తవానికి విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లో ఉండేది. దేశంలోనే కాకుండా శ్రీలంకకు కూడా ఈ నౌకా యాత్ర ఉండేది. అయితే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో క్రూయిజ్ యాజమాన్యం శ్రీలంక సర్వీసును నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఇతర ప్రాంతానికి క్రూయిజ్ సర్వీస్ నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్వీసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందు మూడు సర్వీసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ విహారయాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించింది. అద్భుత స్పందన చెన్నై–విశాఖ–పుదుచ్చేరి–చెన్నై సర్వీసు నడుపుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన వెంటనే విక్రయాలు జోరుగా సాగాయి. ఈ నెలలో మూడు సర్వీసులకు ఇప్పటికే 90 శాతం మేర టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న మాదిరిగానే సెప్టెంబర్ వరకు విశాఖ నుంచి సర్వీసు నడపాలని నిర్వాహకులు నిర్ణయించారు. విశాఖలో ఈ క్రూయిజ్ నిర్వహణ బాధ్యతలను విశాఖ పోర్టు అథారిటీ అధికారులు జేఎం భక్షీ అనే సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి ప్రతీ బుధవారం సర్వీసు కార్టీలియా క్రూయిజ్‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో ప్రతీ బుధవారం విశాఖ నుంచి చెన్నైకు సర్వీసును నడపనున్నారు. ప్రతీ సోమవారం చెన్నై నుంచి నౌక బయలుదేరి బుధవారం విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి పుదుచ్చేరి మీదుగా చెన్నైకు వెళుతుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11వ తేదీన చెన్నైకు వెళుతుంది. తిరిగి ఈ నెల 13వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ముందు ఒకవైపు టికెట్ తీసుకున్నప్పటికీ.. అటునుంచి కూడా విశాఖకు ప్రయాణాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. అయితే ఎయిర్‌పోర్టు తరహా తనిఖీలు చేసి పర్యాటకులను క్రూయిజ్‌లోకి అనుమతిస్తున్నారు. పర్యాటకంగా విశాఖ మరో అడుగు క్రూయిజ్ రాకతో విశాఖ పర్యాటకంగా మరో అడుగు ముందుకేసినట్టయింది. ఈ విలాసవంతమైన నౌక రాకతో విశాఖలో పర్యాటక సందడి మరింత పెరిగే అవకాశముంది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖకు వస్తారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో విశాఖ నుంచి విదేశాలకు క్రూయిజ్ విహార యాత్రకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. నెరవేరిన కల చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రూయిజ్ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల కల నెరవేరినట్టయింది. విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు తెలిపారు. మూవింగ్ స్టార్ హోటల్ కార్డీలియా క్రూయిజ్ ఒక మూవింగ్ స్టార్ హోటల్. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్‌లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ అన్ని సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర ఇది. – జయకర్, విశాఖపట్నం క్రూయిజ్‌లో సదుపాయాలు ► కార్డీలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ► మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ► మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ► అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ► పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెర్రస్ ఉంటుంది. ► పదకొండో అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ► లగ్జిరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ► ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ► చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డీలియా కిడ్స్ అకాడమీ పేరితో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ► జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ► డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ► అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ► టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ► లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరిలో సైతం విశాఖ ప్రత్యేకత చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది. రక్షణ రంగంలో బలమైన శక్తిగా.. రక్షణ పరంగా తూర్పు నావికాదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖ తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు ఆతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది. తూర్పున ఏపీకి అగ్రస్థానం.. భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. 4వ స్థానంలో విశాఖ పోర్టు.. 2021–22 ఏడాదికి సంబంధించి మేజర్ పోర్టుల కేటగిరీలో విశాఖ ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో విశాఖ పోర్టు 4వ స్థానంలో నిలిచింది. 20.7శాతం వాటాతో 102.8 మిలియన్ టన్నుల లావాదేవీలతో దీనదయాళ్ పోర్టు తొలిస్థానంలో ఉండగా 13.5 శాతం వాటాతో పారాదీప్ పోర్టు, 13.1 శాతం 3వ స్థానంలో జేఎన్పీటి నిలిచాయి. ఈ కేటగిరీలో విశాఖ పోర్టు 8.7 శాతం వాటాతో 4వ స్థానంలో నిలిచింది. కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో లావాదేవీల్లో విశాఖపోర్టు మూడో స్థానంలో నిలిచింది. 24 శాతం వాటాతో 37.0 మిలియన్ టన్నుల లావాదేవీలతో పారాదీప్ పోర్టు తొలిస్థానంలో నిలవగా 14.3శాతం వాటాతో ముంబాయి పోర్టు 2వ స్థానంలోను, 12.5 శాతం వాటాతో విశాఖపోర్టు మూడు స్థానంలోని నిలిచాయి. మేజర్ పోర్ట్‌ల కేటగిరీలో తూర్పున సముద్ర వాణిజ్యంలో పారాదీప్ తరువాతి స్థానంలో విశాఖ నిలిచింది. ఏపీ మారిటైం బోర్డు బలోపేతం సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఏపీ మారిటైం బోర్డును బలోపేతం చేస్తున్నాం. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 13 నాన్ మేజర్ పోర్టులో ఏపీ తీరంలో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం ఏటా పెరుగుతోంది. త్వరలోనే రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రకాశం జిల్లా రామయ్యపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. చేపల నిల్వ, విక్రయాలకు అనువుగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశం ఆశ్చర్యపోయే రీతిలో మారీటైం బోర్డును బలోపేతం చేయనున్నాం. – కనకాల వెంకటరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ -
Milan 2022: శభాష్.. నావికా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం సాయంత్రం 5.30 గంటలు.. సుందర సంద్రం ఎదురుగా జనసంద్రం.. సాగరంలో అలల సవ్వడి సందడి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా వేదికపైకి చేరుకున్నారు.. జనసంద్రంలో కేరింతలు.. అందరికీ సీఎం అభివాదం చేసి ఆశీనులయ్యారు.. ఆహ్లాదకర వాతావరణం మధ్య వీనుల విందుగా సంగీతం వినిపించింది.. కొద్ది నిమిషాల వ్యవధిలో పెద్ద పేలుడు.. సందర్శకులతో పాటు సాగరతీరం ఉలిక్కిపడింది.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఏం జరిగిందో అర్థం కాకముందే.. రయ్‌మంటూ డోర్నియర్ విమానాలు జనం పై నుంచి.. బంగాళాఖాతం వైపు దూసుకెళ్లి మాయమైపోయాయి.. ఎక్కడికి వెళ్లాయోనని ఆదుర్దాగా ఎదురు చూస్తుండగా.. మబ్బుల్ని చీల్చుకుంటూ వివిధ విన్యాసాలతో తిరిగి దూసుకొచ్చాయి.. ఈ షాక్ నుంచి సందర్శకులు తేరుకోకముందే ఆకాశంలో రంగు రంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు ప్యారాచూట్ల సాయంతో స్కై డైవింగ్ చేస్తూ జాతీయ పతాకాన్ని, భారత నావికాదళం జెండాను చేతబట్టుకుని నేలకు దిగారు.. వారికి సీఎం వైఎస్ జగన్ మెమోంటో అందజేశారు.. ఇంతలో.. మిగ్ 29 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.. సాగరాన్ని చీల్చుకుంటూ యుద్ధ నౌకల విన్యాసాలు, నింగీ, నేల, నీరు ఏకం చేసేలా సాగిన హెలికాఫ్టర్లు, చేతక్‌ల కదన కవాతు ఒళ్లు గగుర్పొరిచేలా సాగింది.. దివిపై.. భువిపై నౌకాదళ సిబ్బంది.. శత్రు సైన్యంపై పోరుని తలపించేలా 25 నిమిషాల పాటు సాగిన ఎన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది.. విశాఖ వాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశాక నేవీ అధికారులతో సీఎం జగన్ విన్యాసాలు అద్భుతం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ దంపతులకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సతీసమేతంగా స్వాగతం పలికారు. ఆర్కే బీచ్ వద్ద మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంను స్వాగతించారు. 25 నిమిషాల పాటు వివిధ రకాల విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరు వేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారాజంపింగ్ చేసిన స్కైడైవర్లు గాల్లో ప్యారాచూట్ల సహాయంతో విన్యాసాలు చేస్తూ వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా దిగారు. అనంతరం వారు వేదికపైకి వచ్చి ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో పయనించగల మిగ్ 29 విమానాలు పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటుకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒడ్డున ఉన్న శత్రువులపై మోటారు బోట్లపై దూకుడుగా వచ్చి తుపాకులతో కాల్పు?లు జరపడం వంటివి ప్రత్యక్షంగా యుద్ధాన్ని చూసిన అనుభూతిని కలిగించాయి. నేవీ విజిటర్స్ బుక్‌లో సంతకం చేస్తున్న సీఎం ఈ విన్యాసాల్ని చూసేందుకు నౌకాదళాధికారులు, ప్రజా ప్రతినిధులు, సెయిలర్స్, నేవీ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. అద్భుతమైన రీతిలో విన్యాసాలు చేశారని నౌకాదళ బృందాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. విన్యాసాలు చేస్తున్న వివిధ విభాగాల పనితీరు, సామర్థ్యం గురించి ముఖ్యమంత్రికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ వివరించారు. విన్యాసాలు ముగిసిన తర్వాత బంగాళాఖాతంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణలో ధగధగ మెరిసిపోతుండగా.. సాగిన లేజర్ షో చూపరులకు కనువిందు చేసింది. సిటీ పరేడ్ ముగింపు సందర్భంగా మిరుమిట్లు గొలిపేలా నౌకాదళం బాణసంచా కాల్చింది. వేలా జలాంతర్గామి నమూనాను పరిశీలిస్తున్న సీఎం దంపతులు హైలైట్‌గా నిలిచిన నవరత్నాల శకటం యుద్ధ విన్యాసాల అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, సీషెల్స్, మలేషియా, మయన్మార్ దేశాలకు చెందిన నౌకాదళం, రక్షణ శాఖ బృందాలు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. వీటికి తోడుగా.. రాష్ట్రానికి చెందిన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన, శకటాల ప్రదర్శన.. ఎన్సీసీ, సీ కేడెట్ కారŠప్స్ కవాతులు ఆద్యంతం అలరించాయి. గరగలు డ్యాన్స్, కూచిపూడి నృత్యం, థింసా నృత్యం, కొమ్ముకోయ, డప్పు నృత్యం, పులివేషం ప్రదర్శనలు, చెక్క భజన, అమ్మవారి వేషాలు, కోలాటం, తప్పెట గుళ్లు, బుట్టబొమ్మల జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ‘మిలాన్’లో భాగంగా విశాఖ తీరంలో బాంబుల వర్షం కురిపిస్తున్న యుద్ధ విమానాలు.. శకటాల ప్రదర్శనలో జాతీయ పక్షి నెమలి శకటం, విశాఖపట్నం స్మార్ట్ సిటీ శకటం ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటం సిటీ పరేడ్‌కు హైలైట్‌గా నిలిచింది. పరేడ్ ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అందరికీ అభివాదం చేస్తూ.. బీచ్ రోడ్డు నుంచి రాత్రి 7.25 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి 8 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, జి.మాధవి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, చెట్టిఫాల్గుణ, వాసుపల్లి గణేష్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ మనీశ్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం జగన్ దంపతులు నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం మాటామంతి ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేసిన అనంతరం.. సతీమణి వైఎస్ భారతితో కలసి ఆద్యంతం పరిశీలించారు. భారత నౌకాదళ సంపత్తిని చూసి గర్వంగా ఫీలయ్యారు. యుద్ధ నౌకలో ఏ ఏ భాగాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న వివరాల్ని నౌకాదళాధికారులు సీఎం దంపతులకు వివరించారు. ఈ యుద్ధ నౌక పై నుంచే ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. విశాఖ యుద్ధ నౌక కెప్టెన్‌తో పాటు సెయిలర్స్‌తో సీఎం దంపతులు కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అత్యాధునిక ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ (జలాంతర్గామి)ను సందర్శించారు. దాని పనితీరును అధికారులు వారికి వివరించారు. సాహసోపేతంగా సముద్ర అంతర్భాగంలో ప్రయాణిస్తూ.. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సబ్‌మెరైన్ క్రూ కు వైఎస్ భారతి హ్యాట్సాఫ్ చెప్పారు. భారత నౌకాదళం హ్యాట్ ధరించిన వైఎస్ జగన్‌ను చూసి.. సతీమణి భారతి మురిసిపోయారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ విశాఖపట్నం వార్ షిప్, ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ సిబ్బంది, నౌకాదళ ప్రధానాధికారులతో షిప్ డెక్‌పై ముఖ్యమంత్రి దంపతులు గ్రూప్ ఫొటో దిగారు. సంప్రదాయం ప్రకారం.. నేవల్ విజిటర్స్ బుక్‌లో సీఎం వైఎస్ జగన్ దంపతులు సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ జ్ఞాపిక అందించారు. నేవీ అధికారులు, సిబ్బందితో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు -
విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆదివారం ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం (21వ తేదీ) విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. అంతకుముందే విశాఖకు చేరుకున్న గవర్నర్, సీఎంలు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సందడి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పీఎఫ్ఆర్లో ప్రెసిడెన్షియల్ యాచ్‌గా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. పీఎఫ్ఆర్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఏపీ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఉన్నారు. ‘ఐఎన్ఎస్ విశాఖ’కు అరుదైన గౌరవం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. పీఎఫ్ఆర్ ప్రారంభమైన వెంటనే ప్రెసిడెన్షియల్ యాచ్ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి తొలుత ఈ యుద్ధ నౌక వద్దకు చేరుకుంటారు. అక్కడ నౌకాదళ అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఈ నౌకను గతేడాది నవంబర్ 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్–15బి పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈ నౌకను తయారు చేశారు. 2013లోనే ఈ నౌక తయారీ పనులను ముంబయిలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు వివిధ నావికాదళాల 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పీఎఫ్ఆర్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ చెన్నై, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి ఐఎన్ఎస్ ఢిల్లీ, విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాయద్రీ, కొచ్చి కేంద్రంగా ఉన్న దక్షిణ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాపుత్ర పాల్గొంటున్నాయి. శివాలిక్ క్లాస్ కింద ఉన్న 4 నౌకలు, కమోర్టా క్లాస్‌లో ఉన్న 3 నౌకలు, చేతక్, ఏఎల్‌హెచ్, సీ కింగ్స్ హెలికాప్టర్స్‌తో పాటు కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్–38ఎస్డీ, పీ8ఐ, హాక్స్, మిగ్ 29 కే యుద్ధ విమానాలు కూడా పీఎఫ్ఆర్లో విన్యాసాలు చేయనున్నట్టు భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. పీఎఫ్ఆర్కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకపై నుంచే ఈ నెల 18న బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. -
ప్రస్తుతానికి పోర్టుల ప్రైవేటీకరణ ఆలోచన లేదు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాకూర్ తెలిపారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న ఆయన ఇక్కడి పోర్టులో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లును ఏపీతో పాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో మరోసారి చర్చించి ముందుకెళ్తామని తెలిపారు. ప్రైవేటు పోర్టుల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో విశాఖ పోర్టు అమలుచేస్తున్న బెర్తు లీజులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రూయిజ్ టెర్మినల్, పలు బెర్తుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో విశాఖపట్నం పోర్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఇక మారిటైం ఇండియా సమ్మిట్‌లో పోర్టు ఏకంగా రూ.26 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 8 నెలల్లో విశాఖ–రాయపూర్ సాగరమాల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు చైర్మన్ రామ్మోహన్రావు, డిప్యూటీ చైర్మన్ దూబె పాల్గొన్నారు. -
భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకం: వెంకయ్యనాయుడు
సాక్షి, విశాఖపట్నం: నౌకాయాన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన విశాఖ పోర్ట్ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతికి ప్రజెంటేషన్ ద్వారా పోర్టు పురోగతి వివరాలను విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్ వెల్లడించారు. విశాఖ ట్రస్టు విస్తరణ ప్రణాళికలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకమన్నారు. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్మాల’ కార్యక్రమం చేపట్టిందన్నారు. 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. సాగరమాల ద్వారా రూ.3.57లక్షల కోట్ల మౌలికవసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్రావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సి.వి.వో ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
‘విశాఖ ప్రజలు ఆ పుకార్లను నమ్మవద్దు’
సాక్షి, విశాఖపట్నం: అమ్మోనియం నైట్రేట్ వల్ల నగరానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. (ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!) అమ్మోనియం నైట్రేట్‌ని బొగ్గు గనులలో వినియోగిస్తారని రామ్మోహన రావు తెలిపారు. విశాఖ పోర్టులో కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. షిప్ వచ్చే ముందు పోర్టుకి సమాచారం వస్తుందని.. అన్ని అనుమతుల తర్వాతే హ్యాండ్లింగ్‌కి అనుమతిస్తామన్నారు. అమ్మోనియం నైట్రేట్ గురించి విశాఖ ప్రజలు అపోహ పడవద్దని రామ్మోహనరావు కోరారు. -
ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!
సాక్షి, విశాఖ పట్నం: లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. అయితే పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాక పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి. ఇక విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్లోడ్ చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు అని నిపుణులు, అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు. దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. విశాఖలో సురక్షితమనే కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏయూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కె.బసవయ్య మాట్లాడుతూ, ‘ఒకప్పుడు దేశంలోని అనేక పోర్టులకు వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతయ్యేది. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్‌కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని ఎగుమతి దిగుమతులపైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది. దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు’ అని తెలిపారు. ఇక విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్ మాట్లాడుతూ, ‘అమ్మోనియం నైట్రేట్‌తో వచ్చిన నౌకకు పోర్టులో బెర్త్ ఇవ్వాలంటే స్థానిక పోలీస్ శాఖతో పాటు కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి అనుమతులుండాలి. అన్లోడ్ జరుగుతున్నంత సేపూ బెర్త్ వద్ద ఫైర్ టెండర్ని పోర్టు సిద్ధంగా ఉంచుతుంది. ఒక్క కిలో కూడా పోర్టులో నిల్వలేకుండా ప్రత్యేక గోడౌన్లకు తరలిస్తారు. నిర్దిష్ట సమయంలో అన్లోడ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. అంతేకాక విశాఖ నుండి 35 రోజుల్లోపే ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. సురక్షితంగా హ్యాండ్లింగ్ చేసే సౌకర్యం ఉన్నందువల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. నౌక వచ్చిన కొద్దిసేపటిలోనే ఇక్కడి నుంచి ఏజెన్సీ ద్వారా గోడౌన్లకు వెళ్లిపోతుంటుంది అని తెలిపారు. వీరితో పాటు విశాఖ షిప్పింగ్స్ ఎండీ శ్రవణ్ మాట్లాడుతూ, విశాఖ పోర్టులో పేలుడు జరిగే పరిస్థితులు లేవు. భారత్‌లో అమ్మోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఎరువులకు, బొగ్గు గనుల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. పేలుడు జరగాలంటే ఏదైనా రసాయనంతో కలవాలి. ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తేలేదు. డైరెక్టర్ నిబంధనల మేరకే 20 ఏళ్లుగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, హ్యాండ్లింగ్, ఎగుమతికి సంబంధించిన ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాం. ఎలాంటి ప్రమాదం జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఒకేచోట ఎక్కువ కాలం ఉంటేనే పేలుడు సంభవిస్తుంది. కానీ, మా గోడౌన్ల నుంచి నెల రోజుల్లోనే అమ్మోనియం నైట్రేట్ మొత్తాన్ని తరలిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? -
సీఎం సహాయనిధికి విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ విరాళం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ. 75,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే. రామమోహన్ రావు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అందజేశారు. చదవండి: భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగానే ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ. 50,00,000 విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ని ముఖ్యమంత్రి కార్యాలయంలో హోం మంత్రి సుచరిత సమక్షంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రామచంద్రా రెడ్డి, ప్రతినిధులు తులసి విష్ణుప్రసాద్, ఎంవీ రావు, ఎంఎస్ఎన్ రెడ్డి, విజయ్ విరాళం చెక్కును అందజేశారు. చదవండి: సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం -
విశాఖ పోర్టుకి చైనా షిప్: సిబ్బందికి వైద్య పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా ఫిష్ షిప్ నిన్న(శుక్రవారం) విశాఖ పోర్టుకు చేరుకుంది. మొత్తం 22 మంది షిప్ సిబ్బందిలో 17 మంది చైనా, 5 మంది మయ్యున్మార్కు చెందిన వారు ఉన్నారు. కాగా రోనా వైరస్(కోవిడ్-19) కారణంగా అధికారులు షిప్‌ను పోర్టుకు దూరంగా నిలిపివేశారు. ప్రస్తుతం వైద్యులు షిప్ సిబ్బందికి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల వెల్లడించారు. -
తీరంలో హై అలెర్ట్
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖపట్టణం): ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో ఉగ్ర దాడికి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ చర్యలతో దేశవ్యాప్తంగా అప్రమత్తం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కేంద్రం హోంశాఖ హై అలెర్ట్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాల మేరకు భద్రతా బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. అందులో భాగంగా విశాఖ తీరం పొడవునా నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్, సివిల్ పోలీసు దళాలు గస్తీ ముమ్మరం చేశాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద బోట్లు సముద్రంలో సంచరించే అవకాశం ఉందన్న సమాచారంతో తీరం పొడవునా డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. నిఘా చర్యలు కట్టదిట్టం చేశారు. అదే విధంగా ఫిషింగ్ హార్బర్లో మెరైన్, కోస్ట్‌గార్డ్ అధికారులు మత్స్యకారులకు రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, బోట్లు కనిపిస్తే వెంటనే కోస్ట్‌గార్డ్, మెరైన్ కంట్రోల్ రూములకు సమాచారం అందించాలని సూచించారు. -
పోర్టులో మరో క్రేన్ దగ్ధం
నెలరోజుల వ్యవధిలో విశాఖ పోర్టులో ఇలా వరుసగా మూడు ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి ప్రమాదంలో హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న టగ్ కాలిపోగా.. రెండో ప్రమాదంలో పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీపోల్ కంపెనీకి చెందిన భారీ క్రేన్ మంటల పాలైంది. తాజాగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే సీపోల్ కంపెనీకి చెందిన మరో భారీ మొబైల్ క్రేన్ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన క్యూ7 బెర్త్‌పై జరిగినా.. రెండు ప్రమాదాలకు కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూటేనని చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా.. వాటికి కారణాలేమిటన్నది పోర్టు గానీ.. సంబంధిత సంస్థలు గానీ వెల్లడించడం లేదు. ఆగస్టు 12.. ఔటర్ హార్బర్లో ఉన్న భారీ నౌకలో నిర్వహణ పనులకు సిబ్బందిని తీసుకెళ్లిన టగ్ మంటల బారిన పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒకరు గల్లంతయ్యారు. ఆగస్టు 26.. ఇన్నర్ హార్బర్ క్యూ1 బెర్త్‌పై నౌక నుంచి ఎరువులు అన్లోడ్ చేస్తున్న హార్బర్ మొబైల్ క్రేన్ దగ్ధమై భారీ నష్టం వాటిల్లింది. సెప్టెంబర్ 9.. ఇన్నర్ హార్బర్ క్యూ7 బెర్త్‌పై నౌక నుంచి ఎరువులు అన్లోడ్ చేస్తున్న మరో హార్బర్ మొబైల్ క్రేన్ పూర్తిగా కాలిపోయింది. సాక్షి, విశాఖపట్టణం : పోర్టులో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించి మొబైల్ క్రేన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1 గంట సమయంలో డబ్ల్యూక్యూ – 7 బెర్త్ మీద నిలిపి ఉంచిన లీబెర్ర్ మేకింగ్ హార్బర్ మొబైల్ క్రేన్ (హెచ్ఎంసీ) పూర్తిగా దగ్ధమయ్యింది. వివరాల్లోకి వెళ్తే... పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీ పోల్ కంపెనీకి చెందిన హార్బర్ మొబైల్ క్రేన్ (హెచ్ఎంసీ) ఇన్నర్ హార్బర్లోని డబ్ల్యూక్యూ – 7 బెర్త్ మీద నిలిపి ఉంచిన ఎం.వి.ఎస్.ఫాల్కన్ సిలో డి ఫ్రాన్సిస్కో నౌక నుంచి డీఏపీ (యూరియా)ను అన్లోడ్ చేస్తుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1 గంటకు మొబైల్ క్రేన్ ఇంజిన్ రూం (కేబిన్)లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవరు క్రేన్‌ను నౌకకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా కిందకు దిగిపోయాడు. లేకుంటే నౌకకూ ప్రమాదం సంభవించేది. పోర్టు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో క్రేన్ ఇంజిన్ రూం పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంజిన్ రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని, అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని పోర్టు యాజమాన్యం తెలిపింది. ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. మంటలను అదుపుచేసిన తరువాత యధావిధిగా డబ్ల్యూక్యూ – 7 బెర్త్‌మీద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బెర్త్ వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాదంలో సుమారు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అసలేం జరుగుతోంది..? పోర్టులో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అవుటర్ హార్బర్లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన నిర్వహణ టగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన ఘటన సంచలనం రేపింది. అది మరువకముందే గత నెల 26న పోర్టు డబ్ల్యూక్యూ – 1 బెర్త్ మీద నిలిపి ఉంచిన మొబైల్ క్రేన్ (ఎంఈఎల్ లీబెర్ర్ 400) కేబిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం అర్ధరాత్రి మరో మొబైల్ క్రేన్ దగ్ధమైపోయింది. అయితే వరుసగా మొబైల్ క్రేన్లు దగ్ధం కావడం వెనుక ఏదైనా కారణం ఉందా అన్న అనుమానాన్ని పోర్టు సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరగడంతోపాటు ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. పదిహేను రోజల వ్యవధిలో కోట్లాది రూపాయల విలువ చేసే భారీ క్రేన్లు తగలబడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీని వెనుక ఏదైనా కుట్ర దాక్కుందేమోనన్న ఆరోపణలు బలంగా పోర్టు ఆవరణలో వినిపిస్తున్నాయి. పోర్టు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే కమిటీ వేసి నిజనిర్థారణ చేయాలని పోర్టు ఉద్యోగులు కోరుతున్నారు. -
పోర్టులో మరో ప్రమాదం
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఇటీవల ఔటర్ హార్బర్లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన నిర్వహణ టగ్‌లో జరిగిన భారీ ప్రమాదాన్ని మరిచిపోకముందే సోమవారం విశాఖ పోర్టు డబ్ల్యూక్యూ–1 బెర్త్‌పై నిలిపి ఉంచిన మొబైల్ క్రేన్ (ఎంఈఎల్ లీబెర్ 400) హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్రేన్ క్యాబిన్ పూర్తిగా దగ్ధం అయింది. పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీ పోల్ కంపెనీకి చెందిన హార్బర్ మొబైల్ క్రేన్ (హెచ్ఎంసీ) ఇన్నర్ హార్బర్లోని డబ్ల్యూక్యూ–1 బెర్త్ మీద నిలిపి ఉంచిన ఎం.వి.ఎస్ ఫాల్కన్ నౌకలోకి ఇనుప ఖనిజాన్ని లోడ్ చేస్తోంది. కాగా సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రేన్ ఇంజిన్ రూము(క్యాబిన్) లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవరు వేగంగా స్పందించి క్రేన్‌ను నౌకకు దూరంగా తీసుకువెళ్లి నిలిపేసి.. తాను కిందికి దూకేశాడు. ఇంజిన్ రూములో షార్ట్ సస్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోర్టు అధికారులు పేర్కొన్నారు. పోర్టు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు శ్రమించి మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో క్రేన్ ఇంజిన్ రూమ్ పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుందని తెలిసింది. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని, ప్రాణనష్టం, వ్యక్తులు గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు జరగలేదని పోర్టు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపుచేసిన తరువాత డబ్ల్యూక్యూ–1 బెర్త్‌మీద కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే పోర్టులో కొద్దిరోజుల తేడాలోనే రెండు భారీ ప్రమాదాలు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.