విశాఖ తీరం..క్రూయిజ్‌ విహార కేంద్రం | Cruise tourism Visakhapatnam newest tourist attraction | Sakshi
Sakshi News home page

విశాఖ తీరం..క్రూయిజ్‌ విహార కేంద్రం

Published Sun, Sep 3 2023 4:13 AM | Last Updated on Sun, Sep 3 2023 4:58 AM

Cruise tourism Visakhapatnam newest tourist attraction - Sakshi

అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు.

పోర్టులోని గ్రీన్‌ చానల్‌ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్‌ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్‌ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్‌ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం

ఏపీ టూరిజంతో కలిసి...
ఈ టెర్మినల్‌ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్‌ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్‌ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్‌ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ టూరిజం గణనీయంగా పెరగనుంది.

ఇవీ విశాఖ క్రూయిజ్‌ టెర్మినల్‌ ప్రత్యేకతల్లో కొన్ని...

  •  2,500 చదరపు మీటర్లలో టెర్మినల్‌ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్‌లు, గ్యాంగ్‌ వే, రెస్టారెంట్, స్పెషల్‌ లాంజ్, షాపింగ్, రెస్ట్‌ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్‌ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు.
  • క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్‌ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్‌ లాంజ్‌ నిర్మించారు.
  • టెర్మినల్‌ పార్కింగ్‌ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు.
  •  గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్‌ ప్రొటెక్షన్‌ వాల్‌ కూడా ఇందులో నిర్మిస్తున్నారు.
  •  రెగ్యులర్‌ బెర్త్‌ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్‌ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్‌ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్‌ చేశారు.

స్థానికులకు ఉపాధి పెరుగుతుంది
గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్‌ టెర్మినల్‌ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్‌ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్‌ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్‌ చేయడం, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది.

సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్‌ టెర్మినల్‌ ప్రారంభించిన తర్వాత ట్రయల్‌ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్‌ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్‌ సీజన్‌లో కొత్త టెర్మినల్‌ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్‌ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement