గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది పర్యటన
2019–20తో పోలిస్తే దేశీయంగా 85 శాతం పెరిగిన ప్రయాణాలు
రూ.45వేల కోట్లతో వివిధ రకాల క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
విశాఖలో రూ.100 కోట్లతో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్‌లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.
దేశీయంగా పెరుగుదల..
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్‌లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
క్రూయిజ్ పర్యటనలు ఇలా..
ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.
అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..
దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment