సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్‌నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది.
జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి
సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment