central tourism department
-
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
సింహాచలం: కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బృందం పర్యటన
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రతినిధులతో ప్రసాదం పథకంపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మాణం తలపెట్టామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. గిరి ప్రదక్షిణ కోసం ఒక మట్టి రోడ్‌తో ట్రాక్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ, ఈ పథకం పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోందన్నారు. పరిశీలన పూర్తయ్యాక డీపీఆర్ పనులు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.వర్మ తెలిపారు. -
లుక్కుండాలె.. లెక్కుండాలె..!
సాక్షి, హైదరాబాద్: ఇక ఇష్టారాజ్యంగా సాహసక్రీడలు నిర్వహించడం కుదరదు. వీటిపై ఓ లుక్కుండాలి.. వీటికో లెక్కుండాలని కేంద్రం స్పష్టం చేసింది. విధివిధానాలు రూపొందించింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టతోపాటు భువనగిరి గుట్ట వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న యువ కులు కనిపిస్తారు.. ఈ ట్రెక్కింగ్‌కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఏంటి? వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో తరచూ మోటారు సైకిల్, సాధారణ బైసికిల్ రేసులు కనిపిస్తాయి. కానీ, వీటిని నిర్వహిస్తున్నదెవరు? వీటి గురించి తెలంగాణ పర్యాటకశాఖ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న సంస్థలేవో కూడా సమాచారం లేకుండా పర్యాటకశాఖ ఉండటమేంటని ప్రశ్నించింది. ఇక నుంచి సాహస క్రీడలకు సంబంధించి విధివిధానాలను అనుసరిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరు పడితేవారు నిర్వహించొద్దు రాష్ట్రంలో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మోటారు బైక్స్ రేసింగ్, సైక్లింగ్, టెర్రయిన్ కార్ స్పోర్ట్స్... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసుకుని గో కార్టింగ్లు నిర్వహిస్తున్నాయి. కొన్నిసంస్థలు క్లబ్‌గా ఏర్పడి సభ్యులను చేర్చుకుని తరచూ సైక్లింగ్, బైక్ రైడింగ్ లాంటివి నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ధనార్జన లక్ష్యంగా లేకున్నా, సాహసక్రీడలను నిర్వహించే కుతూహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి భూమి మీద నిర్వహించే 15 రకాల సాహస క్రీడలు, నీటిలో, గాలిలో నిర్వహించే ఏడు చొప్పున క్రీడలకు సంబంధించి ఈ విధివిధానాలను సిద్ధం చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే ఈ సాహస క్రీడలను విస్తృతం చేయాలని గతంలోనే కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్థానిక వనరుల ఆధారంగా సాహస క్రీడలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ రూపంలో 430 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఇది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ, మనదేశంలో చాలా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్న తీరును గుర్తించింది. విదేశీ పర్యాటకులు సైతం వీటిపై ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొంది. చాలాచోట్ల కనీస జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విధివిధానాలను రూపొందించింది. మనోహర్, ఎండీ, టీఎస్‌టీడీసీ సాహస క్రీడల విధివిధానాలపట్ల కేంద్ర పర్యాటక శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి పరిణామమే. ఇటీవలే ఢిల్లీలో దీనిపై సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఎవరికి వారుగా వాటిని నిర్వహించే పద్ధతి ఇక ఉండదు. దీనిపై నిర్వాహకులకు కూడా త్వరలో స్పష్టతనిస్తాం ఇలా ఉండాలి.. ఇక నుంచి సాహసక్రీడలు నిర్వహించే సంస్థలన్నీ తెలంగాణ పర్యాటకశాఖలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి క్రీడలు నిర్వహించబోతున్నారో ముందుగా స్థానిక పర్యాటక శాఖ కార్యాలయంలో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి ఆయా క్రీడలకు సంబంధించి కనీసం మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉన్నట్టుగా పర్యాటక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందినవారే వాటి నిర్వహణకు అర్హులు నిర్వాహకులు, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు ఆయా క్రీడల్లో కనీస శిక్షణ తీసుకుని ఉండాలి. వారు కనీస విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి పర్యాటక శాఖ నిర్దేశించిన పరికరాలనే వినియోగించాలి. వాటిల్లో పాల్గొనేవారు కచ్చితంగా హెల్మెట్లులాంటి రక్షణపరికరాలు వాడాలి. క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ప్రమాద నియంత్రణ పరికరాలుండాలి. గాయపడ్డవారికి చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి -
జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ ఏడాదీ జాతీయ పర్యాటక పుర స్కారం వరించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉత్తమ పౌరసేవలకు గుర్తింపు గా 2016–17 ఏడాదికి కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ.. పర్యాటకాభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలకు, కార్పొరేషన్లకు, స్వచ్ఛంద సంస్థలకు గురువారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది. హైదరాబాద్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన మక్కా మసీదు, గోల్కొండ, చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురావస్తు శాఖ మ్యూజియం, పురానీ హవేలి, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం తదితర ప్రదేశాల్లో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిర్వహణకు గానూ జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌కు ఈ పురస్కారం వరించింది. కార్పొరేషన్ తరఫున శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.జె.ఆల్ఫోన్స్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ, దక్షిణ మధ్య రైల్వే, అపోలో హెల్త్ సిటీలకు కూడా అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2020కి విదేశీ పర్యాటకుల సంఖ్యను 5 కోట్లకు పెంచడం, వారి నుంచి సమకూరుతున్న 27 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. -
‘దత్తపుత్రుడు’ రామప్ప
సాక్షి, హైదరాబాద్: చారిత్రకంగా ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నిధుల్లేక అభివృద్ధికి నోచు కోవట్లేదు. ఈ నేపథ్యంలో చారిత్రక నిర్మాణాలను దత్తతకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. దశల వారీగా ముఖ్యమైన కట్టడాలను కార్పొరేట్ సంస్థలకు దత్తత ఇవ్వాలని భావి స్తోంది. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు చారిత్రక కట్టడాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇందు లో భాగంగా తొలుత రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్‌ల దత్తతకు సంబం ధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృ తిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలు దీన్ని జారీ చేశాయి. దీనికి జీఎమ్మార్, కాక తీయ హెరిటేజ్ ట్రస్టులతో పాటు మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఆయా సంస్థలకు లేఖలు అందజేసింది. రామప్ప దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించి మూడు వారాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రపర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ సమక్షంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి పాండురంగారావుకు అధికారులు లేఖ అందజేశారు. జీఎమ్మార్ సంస్థ కూడా గతంలో ప్రతిపాదన సమర్పించింది. మూడువారాల్లో వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి దత్తత సంస్థను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది. దత్తత తీసుకుని ఏం చేస్తారు..? రామప్ప దేవాలయం ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. నిర్మాణ బరువును తగ్గించేందుకు నీటిలో తేలే ఇటుకలను రూపొందించి ఈ గుడిని నిర్మించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతోంది. కానీ ఆ అద్భుత నిర్మాణం వద్ద పర్యాటకులకు కనీస వసతుల్లేవు. సరైన రోడ్డు వసతి లేదు. ప్రస్తుతం ఆ కట్టడం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అధీనంలో ఉండగా, నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ సంరక్షిస్తోంది. కానీ పర్యాటకులకు వసతులు కల్పించటం సాధ్యం కావ టం లేదు. మంచి రోడ్డు, పచ్చిక బయళ్లు, లైటింగ్ వ్యవస్థ, సౌండ్, లైట్ షో లాంటి ఏర్పాట్లు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆ పనులు చేపట్టబోతోంది. దత్తతకు తీసుకునే సంస్థ ఆ నిధుల జమ బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పనులు మాత్రం పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. -
5 నుంచి స్కాల్ వరల్డ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. పర్యాటక రంగంలో పేరొందిన ట్రావెల్ ఆర్గనైజేషన్ ‘స్కాల్ (ఎస్‌కేఏఎల్)’78వ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు ఈసారి హైదరాబాద్‌ను ఎంపిక చేశారు. అక్టోబర్ 5 నుంచి 9 వరకు హెచ్ఐసీసీలో ఈ సదస్సు జరగనుంది. 85 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ సదస్సును రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి తదితరులు హాజరు కానున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం వెల్లడించారు. -
జుహూలో రన్‌వే నిర్మాణానికి ‘పచ్చ’ జెండా
సాక్షి, ముంబై: సముద్రంతీరంలోని జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. సముద్రంలో ఎలాంటి మట్టి వేయకుండా 800 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు అనుమతి లభించింది.ఈ నిర్మాణం పూర్తయితే సముద్రతీరం సమీపంలో ఉన్న జుహూ విమానాశ్రయం నుంచి త్వరలో విమనాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం శాంత్రాకజ్ డొమెస్టిక్ విమానాశ్రయంపై పడుతున్న ట్రాఫిక్ భారం కొంతమేర తగ్గుతుంది. కొన్ని దశాబ్దాల కిందట నగరంలో మొట్ట మొదటిసారి జుహూ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా విమానాల సంఖ్య పెరిగిపోవడంతో శాంతాక్రజ్, ఆ తరువాత అంధేరిలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రాయాలను నెలకొల్పారు. ప్రస్తుతం జుహూ నుంచి చిన్న తరహా చార్టెడ్ విమానాలు, హెలికాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాశ్రయాన్ని జుహూ హెలిప్యాడ్‌గా పిలుస్తారు. సహార్, శాంతాక్రజ్ విమానాశ్రయాలపై పడుతున్న ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరమని అధికారులు ఆలోచిస్తుండగా ఎయిర్ అథారిటీ వర్గాలు జుహూ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావించాయి. జుహూలో రన్‌వే ఆధునిక విమానాల రాకపోకలకు అనుకూలంగా లేదు. రన్‌వే పొడవు పెంచాలని నిపుణులు సూచించడంతో 800 మీటర్ల రన్‌వే ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా సముద్రాన్ని పూడ్చి రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లర్లు వేసి వంతెనపై రన్‌వే ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జుహూ విమానాశ్రయానికి పూర్వ వైభవం రానుంది.