కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న హరిచందన, శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ ఏడాదీ జాతీయ పర్యాటక పుర స్కారం వరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉత్తమ పౌరసేవలకు గుర్తింపు గా 2016–17 ఏడాదికి కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ.. పర్యాటకాభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలకు, కార్పొరేషన్లకు, స్వచ్ఛంద సంస్థలకు గురువారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది.
హైదరాబాద్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన మక్కా మసీదు, గోల్కొండ, చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురావస్తు శాఖ మ్యూజియం, పురానీ హవేలి, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం తదితర ప్రదేశాల్లో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిర్వహణకు గానూ జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌కు ఈ పురస్కారం వరించింది.
కార్పొరేషన్ తరఫున శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.జె.ఆల్ఫోన్స్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ, దక్షిణ మధ్య రైల్వే, అపోలో హెల్త్ సిటీలకు కూడా అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2020కి విదేశీ పర్యాటకుల సంఖ్యను 5 కోట్లకు పెంచడం, వారి నుంచి సమకూరుతున్న 27 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment