
వడోదరలో పూల గడియారం... అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం. గాంధీనగర్‌లో అక్షరధామ్... పోర్‌బందర్‌లో కీర్తిమందిర్. ద్వారకలో కృష్ణుడి జగత్‌మందిర్... కేలాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. జామ్‌నగర్ లఖోటా కోట... సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం.
1 రోజు
సికింద్రాబాద్– పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఇది ఎనిమిది రోజుల టూర్. ఇందులో వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్, పోర్‌బందర్ కవర్ అవుతాయి.
2వ రోజు
ఉదయం పదకొండు గంటలకు రైలు వడోదర (Vadodara) స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవాలి. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూడడానికి తీసుకెళ్తారు (ఎంట్రీ టికెట్ ప్యాకేజ్‌లో వర్తించదు, పర్యాటకులు కొనుక్కోవాలి). రాత్రికి వడోదర హోటల్ గదిలో బస.
రాజ్యాలన్నింటికీ ఒకటే జెండా: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం. దీని ఎత్తు 597 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. గుజరాత్ రాష్ట్రం, కెవాడియా ప్రదేశంలో ఉంది. నర్మదానది మీద నిలబడి సర్దార్ సరోవర్ డ్యామ్‌ను చూస్తున్నట్లు ఉంటుంది. వడోదరకు వందకిలోమీటర్ల దూరం. దేశంలోని రాజ్యాల మధ్య ఐక్యత కోసం, జమీందారాలన్నింటినీ భారత్ రిపబ్లిక్‌లో విలీనం చేసి ఒక పతాకం కిందకు తీసుకురావడానికి పటేల్ చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు పెట్టారు.
3వరోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వడోదరలో హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. నగరంలో లక్ష్మీవిలాస్ ప్యాలెస్ తదితరాలను చూసిన తర్వాత అహ్మదాబాద్‌కు ప్రయాణం. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ టెంపుల్ (akshardham temple) చూసిన తర్వాత హోటల్ చెక్ ఇన్. రాత్రి బస.
ప్యాలెస్‌లో స్టెప్‌వెల్: వడోదర... చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరం. ఈ నగరం విశ్వమిత్రి నది తీరాన ఉంది. నగరంలో మహరాజా షాయాజీరావు యూనివర్శిటీ... సిటీ హాల్... ఇలా ప్రముఖమైన కట్టడాలన్నీ రాజా పేరుతోనే ఉంటాయి. ప్యాలెస్‌ల ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. గైక్వాడ్ రాజకుటుంబం నివసించిన మహారాజా ప్యాలెస్‌లో సర్కార్‌వాడా, లక్ష్మీవిలాస్ ప్యాలెస్, ప్రతాప్ ప్యాలెస్, మోతీబాగ్ ప్యాలెస్, మోతీబాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం, జూ, నవలాక్షి స్టెప్ వెల్ ఉన్నాయి.
ఇది తొమ్మిది మిలియన్ల గ్యాలన్ల నీటిని స్టోర్ చేయగలిగిన బావి. ఇక లక్ష్మీ ప్యాలెస్ అయితే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, గోడలకు మొజాయిక్ డెకరేషన్, టెర్రకోట శిల్పాలు... ఇలా ప్రతిదీ ఒక కళాఖండమే. ఫతే సింగ్ మ్యూజియం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇందులో గ్రీకు, రోమన్, యూరప్ శిల్పాలు, ఫ్రెంచ్ ఫర్నిచర్ ఉంది. రాజారవివర్మ చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి. షాయాజీ రావు గైక్వాడ్ ఆధునిక వాది. నగరాన్ని శాస్త్రసాంకేతికంగా వృద్ధి చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించాడు.
4వరోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ద్వారక వైపు సాగి΄ోవాలి. దారిలో జామ్ నగర్‌లోని లఖోటా ప్యాలెస్, మ్యూజియం విజిట్. సాయంత్రానికి ద్వారక చేరి హోటల్ చెక్ ఇన్, రాత్రి బస.
సరస్సులో కోట: కోటల చుట్టూ కందకాలుంటాయి. కానీ ఇక్కడ నీటి మధ్యలో దీవి మీద కోట ఉంటుంది. లఖోటా సరస్సు మధ్యలో ఉన్న కోట కావడంతో దీనిని లఖోటా కోట అనే పిలుస్తారు. జామ్‌నగర్ పాలకులు ఉపయోగించిన వస్తువులతోపాటు నాటి కళాకృతులతో కోటలోపల మ్యూజియం ఉంది.
ఐదవ రోజు
ఉదయం ద్వారకాధీశుని దర్శనం, బేట్ ద్వారక, నాగేశ్వర్ టెంపుల్ దర్శనం. ఆ తర్వాత ద్వారకకు తిరుగు ప్రయాణం. రాత్రి బస ద్వారకలోనే.
బీసీ కాలపు జగత్‌మందిర్: కృష్ణుడు పూజలందుకునే ఈ ఆలయాన్ని ద్వారకాధీశ్ మందిర్ అంటారు. ఐదంతస్థుల ఆలయం మనకు విచిత్రంగా అనిపిస్తుంది. క్రీ.పూ రెండు వందల ఏళ్ల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మనకు ఇప్పుడు కనిపిస్తున్నది క్రీ.శ 15–16 శతాబ్దాల నాటి పునర్నిర్మాణం. ఆలయాలు పశ్చిమముఖంగా ఉండడం కూడా అరుదైన విషయం. ఆలయంఅరేబియా సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రం చిత్తూరు జిల్లా, నాగులాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో విష్ణుమూర్తి పశ్చిమముఖంగా ఉంటాడు.
6వరోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి సోమనాథ్ వైపు సాగిపోవాలి. దారిలో పోర్‌బందర్‌లోని కీర్తిమందిర్, సుధామ టెంపుల్ విజిట్. సోమనాథ్ చేరిన తర్వాత సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతోపాటు ఆలయం చుట్టు పక్కల ఉన్నవాటిని తిరిగి చూడడం, సాయంత్రం తర్వాత పోర్‌బందర్‌కు ప్రయాణం. రాత్రికి పోర్ బందర్ రైల్వే స్టేషన్‌కి చేరడంతో యాత్ర పూర్తవుతుంది.
145 ఏళ్లుగా ఆగని గడియారం:
ఫ్లోరల్ క్లాక్... వడోదర సిటీసెంటర్‌లోని షాయాజీ బాగ్‌లో ఉంది. క్రీ.శ 1879లో మూడవ మహారాజా షాయాజీరావు నిర్మించాడు. 13 ఎకరాల ఉద్యానవనంలో బరోడా మ్యూజియం అండ్ పిక్చర్ గ్యాలరీ, ఒక జూ, సర్దార్‌పటేల్ ప్లానిటోరియం... గార్డెన్ మొత్తం చూడడానికి టాయ్‌ట్రైన్ ఉన్నాయి. ప్లానిటోరియం పక్కనే ఆస్ట్రానమీ పార్క్ ఉంది.
పురాతన కాలంలో వాడిన ఆస్ట్రనామికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. బరోడా మ్యూజియంలో పిక్చర్ గ్యాలరీలో మినియేచర్ కళాఖండాల నిలయం. హజీరా మఖ్బారా, న్యాయమందిర్, దభోయి ఫోర్ట్, మకాయ్ కోట, జమామసీదు, కీర్తి మందిర్, అరబిందో సొసైటీ చూడవచ్చు. స్థానికులు గుజరాతీతోపాటు సింధీ భాష కూడా మాట్లాడతారు.
అహ్మదాబాద్: అహ్మదాబాద్ గురించి మాట్లాడాలంటే సబర్మతి నది గురించి మాట్లాడాలి. నదికి రెండువైపులా విస్తరించిన నగరం ఇది. ఒక వైపు వాళ్లు మరో వైపుకు రావడానికి నగరంలో ఈ నది మీద పదకొండు వంతెనలున్నాయి. ఎల్లిస్, గాంధీ, నెహ్రూ, సుభాష్, వాదాజ్ దూధేశ్వర్, సర్దార్, చంద్రభాగా, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, ఫెర్నాండెజ్, దండి బ్రిడ్జిలు. బ్రిటిష్ పాలకుల తోపాటు జాతీయనాయకులను గౌరవిస్తూ నామకరణం చేయడం గొప్పగా అనిపిస్తుంది. మీరు నగరంలో ఏ వంతెన మీద ప్రయాణించారో సరదాగా గమనించండి. సబర్మతి రివర్ ఫ్రంట్ సూర్యోదయాలు, సాయంత్రాలను ఆస్వాదించడానికి మంచి ప్రదేశం.
ఇక మనకు చిన్నప్పటి నుంచి చిరపరిచితమైన సబర్మతి ఆశ్రమం గాంధీజీ నివసించిన ప్రదేశం. ఇక్కడ జాతీయోద్యమ చర్చలు జరిగేవి. గాంధీజీ దండి సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఆశ్రమంలో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను చూడవచ్చు. నగరంలో సయ్యద్ సిద్ధిఖీ జాలీలో రాతిలో సునిశితంగా చెక్కిన డిజైన్‌ని తప్పకుండా చూడాలి. జైన్ మందిరం, కాలికో మ్యూజియం, సర్దార్ పటేల్ మ్యూజియం కూడా చూడాల్సిన ప్రదేశాలు.
ప్రశాంత ధామం: అక్షరధామ్ టెంపుల్ గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది. అహ్మదాబాద్‌కు 40 కిమీల దూరం. నగరంలో రాజధాని హడావుడి, ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు, వాటి అనుబంధ భవనాలు తప్ప ఇతర వర్తక వాణిజ్యాలు ఉండవు. నగరం ప్రశాంతంగా ఉంటుంది.
గాంధీజీ ఇక్కడే పుట్టాడు:
పోర్‌బందర్.... గాంధీజీ పుట్టిన నేల. ఇక్కడ గాంధీజీ పుట్టిన ఇల్లు బాపూ మహల్ ఉంది. దాని పక్కనే స్మారక మందిరం కీర్తిమందిర్, బాపూ మహల్ వెనుకగా కస్తూర్బా గాంధీ ఇల్లు ఉన్నాయి. గాంధీజీ ఇంటిలో అటకల నిర్మాణాన్ని గమనించాలి. పోర్‌బందర్‌లో శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడికి మందిరం, వాళ్ల గురువు సాందీపుడి మందిరం ఉన్నాయి. సుధాముడి మందిరం విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా అటుకుల ప్యాకెట్ ఇస్తారు. ఈ ఐటెనరీ ప్రకారం సోమనాథ్ నుంచి తిరుగు ప్రయాణంలో పోర్‌బందర్‌కు చేరే ప్రయాణం అరేబియా తీరం వెంబడే సాగుతుంది. కాబట్టి జర్నీలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.
సోమనాథ జ్యోతిర్లింగం: సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుబూతి. సోమనాథుడిని దర్శనం తర్వాత ఆలయం ఆవరణలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను చూడవచ్చు. ఆలయం బేస్ మెంట్ ఎత్తుగా ఉంటుంది. ఆలయం వెనుక సముద్రపు అలలు ఆలయాన్ని అలవోకగా తాకుతూ ఉంటాయి. ఆయలం ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం నమూనాలోనే ఉంటుంది. నర్మద (Narmada) తీరాన పెద్ద విగ్రహస్థాపనకు ముందు నుంచే సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం ఉంది.
7వ రోజు
00.50 నిమిషాలకు (అర్ధరాత్రి 12.50 నిమిషాలు) ట్రైన్ నంబరు 20968 పోర్ బందర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ పోర్‌బందర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
8వ రోజు...
ట్రైన్ ఉదయం 8.20 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. బుధవారం మొదలైన పర్యటన బుధవారంతో పూర్తవుతుంది. ఈ ట్రైన్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇదే రైలు తిరిగి సికింద్రాబాద్ నుంచి పోర్‌బందర్‌కు బయలుదేరుతుంది. ఇది వీక్లీ ట్రైన్.
ప్యాకేజ్ ధరల వివరాలు..
సుందర సౌరాష్ట్ర (ఎస్‌హెచ్‌ఆర్066) టూర్‌లో భాగంగా... ట్రైన్ నంబర్ 20967 సికింద్రాబాద్– పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. కంఫర్ట్ కేటగిరీ అంటే థర్డ్ ఏసీలో ప్రయాణం. ఇందులో ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 30 వేలు, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 29 వేలవుతాయి. స్టాండర్డ్ కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కి దాదాపు 27 వేలు, ట్రిపుల్ షేరింగ్‌కి దాదాపు 26 వేలవుతుంది. ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. ప్యాకేజ్‌లో నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు రాత్రి భోజనాలు ఇస్తారు.