కేక్ కట్ చేస్తున్న మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కమిషనర్ దానకిశోర్ తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని, తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి ప్రజలు జీవనోపాధికై హైదరాబాద్ నగరానికి తరలివస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా బొంతు రామ్మోహన్ నేతృత్వంలోని పాలక మండలి మూడేళ్లుదిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన కేకు కట్‌చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబద్ధతతో పని చేయడం మూలానే నగరానికి అవార్డుల పంట పండుతుందని ఆయన కితాబిచ్చారు.
నగర రహదారులు ఇప్పటికే చాలా వరకు మెరుగుపడ్డాయని మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ దష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలను హోం మంత్రి కొనియాడారు. మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ ఇళ్లలో ఇప్పటికే 36 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని బలహీన వర్గాలకు అందించేందుకు ఉన్నతమైన పాలసీని రచిస్తున్నామన్నారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచించి, కార్యరూపం దాల్చే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి సూచించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
వసతులు మెరుగు: నాయిని
నగరంలో మంచినీటి సరఫరా, రహదారుల నిర్మాణం మెరుగయ్యాయని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్దియా పాలక మండలి నిబద్ధతకు నిదర్శనం శాసనసభ ఎన్నికల ఫలితాలని అన్నారు. చక్కగా పనిచేయడం వల్లే ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచారన్నారు. హైదరాబాద్ దేశానికి తలమానికంగా ఉండేలా సీఎం ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు.
నిర్దేశిత లక్ష్యాలతోనే అభివృద్ధి
నిర్దేశిత లక్ష్యాలతో జీహెచ్‌ఎంసీ సమున్నత అభివృద్ధిని సాధించేందుకు అందరం సమన్వయంతో కృషి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ‘సాఫ్ హైదరాబాద్...షాందార్ హైదరాబాద్’గా తీర్చిదిద్దేందుకు సకల ప్రయత్నాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
సంతప్తిగా మూడేళ్ల కాలం
మూడేళ్ల కాలంలో చేసిన పని సంతప్తినిచ్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర వాసుల కోసం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, నగరంలోని వివిధ వర్గాల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment