సాక్షి, హైదరాబాద్: ఇక ఇష్టారాజ్యంగా సాహసక్రీడలు నిర్వహించడం కుదరదు. వీటిపై ఓ లుక్కుండాలి.. వీటికో లెక్కుండాలని కేంద్రం స్పష్టం చేసింది. విధివిధానాలు రూపొందించింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టతోపాటు భువనగిరి గుట్ట వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న యువ కులు కనిపిస్తారు.. ఈ ట్రెక్కింగ్‌కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఏంటి? వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో తరచూ మోటారు సైకిల్, సాధారణ బైసికిల్ రేసులు కనిపిస్తాయి. కానీ, వీటిని నిర్వహిస్తున్నదెవరు? వీటి గురించి తెలంగాణ పర్యాటకశాఖ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న సంస్థలేవో కూడా సమాచారం లేకుండా పర్యాటకశాఖ ఉండటమేంటని ప్రశ్నించింది. ఇక నుంచి సాహస క్రీడలకు సంబంధించి విధివిధానాలను అనుసరిం చాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎవరు పడితేవారు నిర్వహించొద్దు
రాష్ట్రంలో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మోటారు బైక్స్ రేసింగ్, సైక్లింగ్, టెర్రయిన్ కార్ స్పోర్ట్స్... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసుకుని గో కార్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. కొన్నిసంస్థలు క్లబ్‌గా ఏర్పడి సభ్యులను చేర్చుకుని తరచూ సైక్లింగ్, బైక్ రైడింగ్ లాంటివి నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ధనార్జన లక్ష్యంగా లేకున్నా, సాహసక్రీడలను నిర్వహించే కుతూహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి భూమి మీద నిర్వహించే 15 రకాల సాహస క్రీడలు, నీటిలో, గాలిలో నిర్వహించే ఏడు చొప్పున క్రీడలకు సంబంధించి ఈ విధివిధానాలను సిద్ధం చేసింది.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే ఈ సాహస క్రీడలను విస్తృతం చేయాలని గతంలోనే కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్థానిక వనరుల ఆధారంగా సాహస క్రీడలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ రూపంలో 430 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఇది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ, మనదేశంలో చాలా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్న తీరును గుర్తించింది. విదేశీ పర్యాటకులు సైతం వీటిపై ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొంది. చాలాచోట్ల కనీస జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విధివిధానాలను రూపొందించింది.
మనోహర్, ఎండీ, టీఎస్‌టీడీసీ
సాహస క్రీడల విధివిధానాలపట్ల కేంద్ర పర్యాటక శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి పరిణామమే. ఇటీవలే ఢిల్లీలో దీనిపై సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఎవరికి వారుగా వాటిని నిర్వహించే పద్ధతి ఇక ఉండదు. దీనిపై నిర్వాహకులకు కూడా త్వరలో స్పష్టతనిస్తాం
ఇలా ఉండాలి..
ఇక నుంచి సాహసక్రీడలు నిర్వహించే సంస్థలన్నీ తెలంగాణ పర్యాటకశాఖలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి.
ఎక్కడ ఎలాంటి క్రీడలు నిర్వహించబోతున్నారో ముందుగా స్థానిక పర్యాటక శాఖ కార్యాలయంలో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి
ఆయా క్రీడలకు సంబంధించి కనీసం మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉన్నట్టుగా పర్యాటక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందినవారే వాటి నిర్వహణకు అర్హులు
నిర్వాహకులు, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు ఆయా క్రీడల్లో కనీస శిక్షణ తీసుకుని ఉండాలి. వారు కనీస విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి
పర్యాటక శాఖ నిర్దేశించిన పరికరాలనే వినియోగించాలి. వాటిల్లో పాల్గొనేవారు కచ్చితంగా హెల్మెట్లులాంటి రక్షణపరికరాలు వాడాలి.
క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ప్రమాద నియంత్రణ పరికరాలుండాలి. గాయపడ్డవారికి చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment