
ఏపీ టూరిజం అథారిటికీ రూ.171 కోట్లు కేటాయింపు
ఇందులో ఈవెంట్లు, ఫంక్షన్ల కోసమే రూ.150 కోట్లు
పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖకు రూ.460 కోట్లు
ఏపీటీడీసీ బడ్జెట్‌లో భారీగా కోత
కేవలం రూ.64 లక్షలు మాత్రమే ప్రతిపాదన
సాక్షి, అమరావతి : దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపుతానన్న సీఎం చంద్రబాబు మాటలు ఒట్టి కోతలని తేలిపోయింది. 2025–26 బడ్జెట్‌లో ఏపీ పర్యాటక అభివృద్ధి కంటే తాత్కాలిక ఈవెంట్ల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమైంది. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖకు మొత్తంగా రూ.460 కోట్లు కేటాయించారు. ఇందులో పర్యాటక శాఖలో తమ అనుయాయుల కంపెనీలకు ఈవెంట్, ఫంక్షన్ కాంట్రాక్టులు దక్కేలా చేసి, వారికి లబ్ధి చేకూర్చేలా ఏపీ టూరిజం అథారిటీకి రూ.171 కోట్లు కేటాయించగా.. అందులో రూ.150 కోట్లు ఒక్క ఈవెంట్ల నిర్వహణకే ఇవ్వడం గమనార్హం.
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)ను నిర్లక్ష్యం చేసింది. సంస్థ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహ భాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులుండేవి. కానీ, ఈ బడ్జెట్‌లో వాటిని రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఏపీటీడీసీలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు జీతాల కింద నెలకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది.
రెగ్యులర్ ఉద్యోగులకు రూ.50–60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించే మొత్తం సుమారు ఐదారు నెలల వరకు రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వీలుగా ఉండేది. ఇప్పుడు నిధులు తగ్గడంతో ఏపీటీడీసీపై ఆర్థిక భారం పెరగనుంది. ఇక 40 కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసమని రూ.50 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కో ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.కోటికి మించి కేటాయించలేని దుస్థితి.
ఇలా పర్యాటక శాఖ, భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్, శిల్పారామం సొసైటీకి కలిపి రూ.230 కోట్లు కేటాయింపులు చేసింది. క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ, కల్చరల్ కమిషన్‌కు కలిపి మరో రూ.230 కోట్ల వరకు కేటాయింపులు ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment