సంప్రదాయానికి ప్రతీకగానే కాదు... దక్షిణాసియా అంతటా సొగసైన వైభవంగా ఐకానిక్ సిక్స్ యార్డ్‌గా పేరొందింది చీరకట్టు.ఈ ఎవర్‌గ్రీన్ చీర కట్టును సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలోనూ వాడచ్చని నిరూపిస్తోంది అఫ్సానా బేగం. జపాన్‌లోని చిబా విశ్వవిద్యాలయంలో డాక్టోరల్ విద్యార్థి అఫ్సానా దక్షిణాసియాలోని సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా ప్రదర్శిస్తోంది. చీరకట్టుతో సైక్లింగ్, స్కై డైవింగ్, సర్ఫింగ్, గ్లైడింగ్.. వంటి క్రీడల్లో పాల్గొంటోంది.
‘క్రీడలకు నిర్దిష్ట యూనిఫాం అవసరమనే సంప్రదాయాన్ని చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను. తరతరాలుగా చీర మన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణాసియా అంతటా ఉత్సవ వైభవంతో వెలిగిపోతుంటుంది. అయినప్పటికీ, స్నోబోర్డింగ్, స్కైడైవింగ్ వంటి సాహసోపేతమైన క్రీడల కోసం ఈ ఐకానిక్ సిక్స్– యార్డ్ ఫాబ్రిక్ ఎంపిక చేయదగిన వస్త్రం కాదనే అపోహ ఉంది. దీనిని ఎలా ఉపయోగించవచ్చో చూపాలనుకున్నాను. మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూనే, సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలో చీర బలం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలనుకున్నాను.
చరిత్రలో బలమైన శక్తి
నాకు సైకిల్ తొక్కడం వంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మా యూనివర్శిటీలో చీరకట్టుతో సైక్లింగ్ చేస్తుంటాను. అయితే, రైడింగ్ టైమ్‌లో చీరలు అంత అనుకూలమైనవి కావని నా స్నేహితులు అందులోని అసౌకర్యాన్ని ఫీలవుతుండేవారు. పైగా ఏవేవో కామెంట్స్ చేస్తుండేవారు. ఈ దృక్పథాన్ని మార్చాలనే ఆలోచన రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ‘చీర’ మన రోజువారీ కార్యకలపాలలో ఒక చైతన్యాన్ని తీసుకువస్తుంది.
దక్షిణాసియాలో ముఖ్యమైన సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల సమయాల్లో చరిత్రలో మహిళలు ఈ వస్త్రాన్ని ఎలా ధరించారో నాకు తెలుసు. చీర ఎప్పుడూ నాకు శక్తికి చిహ్నంగా ఉంది. ఈ విషయాన్ని నా 30వ పుట్టినరోజు సందర్భంగా అసౌకర్యాన్ని సౌకర్యంగా, అత్యంత శక్తిమంతంగా ఎలా చూపించవచ్చో క్రీడల్లో ఆధునిక వస్త్రధారణ విధానాలను ఎలా సవాల్ చేయచ్చో నిరూపించాలనుకున్నాను. చీరలో స్కై డైవింగ్ చేసి ఆ శక్తిని చూపాను. దీంతో మా యూనివర్శిటీ విద్యార్థులందరికీ ఈ నా సవాల్ వెనక ఉన్న అంతరార్థం అర్థం అయ్యింది.
మార్పు కోసమే సవాల్
నేను పుట్టి పెరిగింది బంగ్లాదేశ్‌లో. అక్కడ సంప్రదాయ దుస్తులకు చాలా ్రపాధాన్యత ఉంటుంది. నేను జపాన్‌లోనూ నా సంప్రదాయ దుస్తుల్లోనే కాలేజీకి వెళ్లడం, రోజువారి కార్యకలాపాల్లో పాల్గొనడం చేసేదాన్ని అయితే, ఇక్కడి వారిలో చీరపైన సరైన అవగాహన లేదు. దాంతో నా చుట్టూ ఉన్న వారినుంచే కొన్ని కామెంట్స్ ఎదుర్కొనేదాన్ని. చీరకట్టు వల్ల కలిగే శక్తి, ప్రయోజనాల గురించి చాలా చెప్పాల్సి వచ్చేది. వాదించాల్సి వచ్చేది. ఇక్కడ మార్పు తీసుకురావాలనుకున్నాను.
ముందుగా ప్రజా రవాణాలో చీరకట్టుకు గౌరవం పెరగడానికి కృషి చేశాను. అదే ఇప్పుడు సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనేలా చేసింది. ఢాకా యూనివర్శిటీ విద్యార్థిగా అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న రోజుల్లో చీరతోనే నా ప్రయాణం మొదలైంది. ప్రెజెంటేషన్ ల కోసం సంప్రదాయ దుస్తులను ధరించమని నా స్నేహితులను ్రపోత్సహించేదాన్ని. అసౌకర్యం అంటూ అయిష్టత చూపేవారు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కుట్టు లేకుండా తన అసమానమైన శక్తిని మనలోకి చేర్చే గుణం చీరకు ఉంది.
భద్రతా సమస్యలను సవాల్ చేస్తూ!
సాహసోపేతమైన క్రీడలలో భద్రత చాలా ముఖ్యమైనది. కోచ్‌లు కూడా తమ ్రపోటోకాల్స్ దృష్ట్యా వారు సూచించిన దుస్తులనే ధరించాలంటారు. కానీ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికే నేను చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను అనే విషయం పట్ల అవగాహన కలిగించి, మరీ ఈ డ్రెస్‌ను ధరించాను. నా అభిరుచి కూడా ఇలాగే కొనసాగుతుంది. స్కైడైవింగ్ సమయంలో చీరకట్టుపై నుంచి బెల్ట్‌తో సెట్ చేసుకున్నాను. పెటికోట్‌కు బదులుగా జీన్స్ ధరించాను. స్నోబోర్డింగ్‌లో నా కదలికకు చీర అంతరాయం కలిగించకుండా, వెచ్చగా ఉండటానికి వేడిచేసిన గేర్ ధరించాను. ఈ జాగ్రత్తల మార్పుతో భద్రతకు భరోసానిస్తూ సాంస్కృతిక ్రపామాణికతను కాపాడుకోవడానికి అనుమతి లభించింది.
ప్రయత్నాలకు ప్రతిస్పందన
చీరతో సాహసోపేతమైన క్రీడా ప్రయత్నాలకు మంచి ప్రతిస్పందన, ప్రశంసలు లభించింది. నా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా మంచి ఉత్సుకత రేకెత్తించింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. తెల్లటి మంచులో ప్రకాశవంతమైన రంగుల చీరను చూసి ఎంతో మంది అభినందించారు. ఒకసారి, కిమోనోస్‌లో స్నోబోర్డింగ్ చేస్తున్నప్పుడు జపనీస్ జంటను ఎదురుపడింది. వారు ఎన్ని ప్రశ్నలు అడిగారో! ‘సాంస్కృతిక వస్త్రధారణ ఏదైనా అభిరుచిలో భాగమ’ని వారితో నా అనుభవాలను పంచుకున్నాను.
భవిష్యత్తు కోసం
వాటర్ స్కీయింగ్ లేదా చీరలో సర్ఫింగ్ వంటి మెరైన్ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. సాంస్కృతిక వారసత్వాన్ని అత్యాధునిక క్రీడలతో మిళితం చేసి కొనసాగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆధునిక, అసాధారణమైన మార్గాల్లో సంప్రదాయాలను పరిచయం చేయడానికి, ఎంతోమందిలో స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం. దీని వల్ల ఈ సాంస్కృతిక వైభవం ప్రపంచ వస్త్రాలలోనే సుసంపన్నం అవుతుంది. ఇతరులను శక్తివంతం చేయడానికి నా సాహసాన్ని అంకితం చేస్తున్నాను.
మహిళలు తమ సాంస్కృతిక దుస్తులను ధరిస్తూనే అసాధారణ క్రీడల్లో పాల్గొనవచ్చు. ఎవరికైనా వారి సొంత ఎంపిక చాలా ముఖ్యం. వారి కంఫర్ట్ జోన్ నుండి బయటపడి కొత్తదాన్ని ప్రయత్నించేలా నా ఈ ప్రయత్నం ఉపయోగపడితే అది వారి వ్యక్తిగత వృద్ధికి దారితీస్తుందని నమ్ముతాను. సంప్రదాయం మనల్ని బంధించదు. కొత్త మార్గాల్లో ప్రయత్నించేందుకు కొత్త శక్తిని ఇస్తుంది’’ అంటుంది అఫ్సానా.
Comments
Please login to add a commentAdd a comment