Begum
-
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
చీర...శక్తికి చిహ్నం
సంప్రదాయానికి ప్రతీకగానే కాదు... దక్షిణాసియా అంతటా సొగసైన వైభవంగా ఐకానిక్ సిక్స్ యార్డ్‌గా పేరొందింది చీరకట్టు.ఈ ఎవర్గ్రీన్ చీర కట్టును సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలోనూ వాడచ్చని నిరూపిస్తోంది అఫ్సానా బేగం. జపాన్‌లోని చిబా విశ్వవిద్యాలయంలో డాక్టోరల్ విద్యార్థి అఫ్సానా దక్షిణాసియాలోని సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా ప్రదర్శిస్తోంది. చీరకట్టుతో సైక్లింగ్, స్కై డైవింగ్, సర్ఫింగ్, గ్లైడింగ్.. వంటి క్రీడల్లో పాల్గొంటోంది.‘క్రీడలకు నిర్దిష్ట యూనిఫాం అవసరమనే సంప్రదాయాన్ని చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను. తరతరాలుగా చీర మన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణాసియా అంతటా ఉత్సవ వైభవంతో వెలిగిపోతుంటుంది. అయినప్పటికీ, స్నోబోర్డింగ్, స్కైడైవింగ్ వంటి సాహసోపేతమైన క్రీడల కోసం ఈ ఐకానిక్ సిక్స్– యార్డ్ ఫాబ్రిక్ ఎంపిక చేయదగిన వస్త్రం కాదనే అపోహ ఉంది. దీనిని ఎలా ఉపయోగించవచ్చో చూపాలనుకున్నాను. మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూనే, సాహసోపేతమైన క్రీడల ప్రపంచంలో చీర బలం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలనుకున్నాను.చరిత్రలో బలమైన శక్తినాకు సైకిల్ తొక్కడం వంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మా యూనివర్శిటీలో చీరకట్టుతో సైక్లింగ్ చేస్తుంటాను. అయితే, రైడింగ్ టైమ్‌లో చీరలు అంత అనుకూలమైనవి కావని నా స్నేహితులు అందులోని అసౌకర్యాన్ని ఫీలవుతుండేవారు. పైగా ఏవేవో కామెంట్స్ చేస్తుండేవారు. ఈ దృక్పథాన్ని మార్చాలనే ఆలోచన రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ‘చీర’ మన రోజువారీ కార్యకలపాలలో ఒక చైతన్యాన్ని తీసుకువస్తుంది.దక్షిణాసియాలో ముఖ్యమైన సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల సమయాల్లో చరిత్రలో మహిళలు ఈ వస్త్రాన్ని ఎలా ధరించారో నాకు తెలుసు. చీర ఎప్పుడూ నాకు శక్తికి చిహ్నంగా ఉంది. ఈ విషయాన్ని నా 30వ పుట్టినరోజు సందర్భంగా అసౌకర్యాన్ని సౌకర్యంగా, అత్యంత శక్తిమంతంగా ఎలా చూపించవచ్చో క్రీడల్లో ఆధునిక వస్త్రధారణ విధానాలను ఎలా సవాల్ చేయచ్చో నిరూపించాలనుకున్నాను. చీరలో స్కై డైవింగ్ చేసి ఆ శక్తిని చూపాను. దీంతో మా యూనివర్శిటీ విద్యార్థులందరికీ ఈ నా సవాల్ వెనక ఉన్న అంతరార్థం అర్థం అయ్యింది.మార్పు కోసమే సవాల్నేను పుట్టి పెరిగింది బంగ్లాదేశ్‌లో. అక్కడ సంప్రదాయ దుస్తులకు చాలా ్రపాధాన్యత ఉంటుంది. నేను జపాన్‌లోనూ నా సంప్రదాయ దుస్తుల్లోనే కాలేజీకి వెళ్లడం, రోజువారి కార్యకలాపాల్లో పాల్గొనడం చేసేదాన్ని అయితే, ఇక్కడి వారిలో చీరపైన సరైన అవగాహన లేదు. దాంతో నా చుట్టూ ఉన్న వారినుంచే కొన్ని కామెంట్స్ ఎదుర్కొనేదాన్ని. చీరకట్టు వల్ల కలిగే శక్తి, ప్రయోజనాల గురించి చాలా చెప్పాల్సి వచ్చేది. వాదించాల్సి వచ్చేది. ఇక్కడ మార్పు తీసుకురావాలనుకున్నాను.ముందుగా ప్రజా రవాణాలో చీరకట్టుకు గౌరవం పెరగడానికి కృషి చేశాను. అదే ఇప్పుడు సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనేలా చేసింది. ఢాకా యూనివర్శిటీ విద్యార్థిగా అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న రోజుల్లో చీరతోనే నా ప్రయాణం మొదలైంది. ప్రెజెంటేషన్ ల కోసం సంప్రదాయ దుస్తులను ధరించమని నా స్నేహితులను ్రపోత్సహించేదాన్ని. అసౌకర్యం అంటూ అయిష్టత చూపేవారు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కుట్టు లేకుండా తన అసమానమైన శక్తిని మనలోకి చేర్చే గుణం చీరకు ఉంది. భద్రతా సమస్యలను సవాల్ చేస్తూ!సాహసోపేతమైన క్రీడలలో భద్రత చాలా ముఖ్యమైనది. కోచ్‌లు కూడా తమ ్రపోటోకాల్స్ దృష్ట్యా వారు సూచించిన దుస్తులనే ధరించాలంటారు. కానీ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికే నేను చీరకట్టుతో సవాల్ చేస్తున్నాను అనే విషయం పట్ల అవగాహన కలిగించి, మరీ ఈ డ్రెస్‌ను ధరించాను. నా అభిరుచి కూడా ఇలాగే కొనసాగుతుంది. స్కైడైవింగ్ సమయంలో చీరకట్టుపై నుంచి బెల్ట్‌తో సెట్ చేసుకున్నాను. పెటికోట్కు బదులుగా జీన్స్ ధరించాను. స్నోబోర్డింగ్‌లో నా కదలికకు చీర అంతరాయం కలిగించకుండా, వెచ్చగా ఉండటానికి వేడిచేసిన గేర్ ధరించాను. ఈ జాగ్రత్తల మార్పుతో భద్రతకు భరోసానిస్తూ సాంస్కృతిక ్రపామాణికతను కాపాడుకోవడానికి అనుమతి లభించింది.ప్రయత్నాలకు ప్రతిస్పందనచీరతో సాహసోపేతమైన క్రీడా ప్రయత్నాలకు మంచి ప్రతిస్పందన, ప్రశంసలు లభించింది. నా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా మంచి ఉత్సుకత రేకెత్తించింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. తెల్లటి మంచులో ప్రకాశవంతమైన రంగుల చీరను చూసి ఎంతో మంది అభినందించారు. ఒకసారి, కిమోనోస్లో స్నోబోర్డింగ్ చేస్తున్నప్పుడు జపనీస్ జంటను ఎదురుపడింది. వారు ఎన్ని ప్రశ్నలు అడిగారో! ‘సాంస్కృతిక వస్త్రధారణ ఏదైనా అభిరుచిలో భాగమ’ని వారితో నా అనుభవాలను పంచుకున్నాను. భవిష్యత్తు కోసంవాటర్ స్కీయింగ్ లేదా చీరలో సర్ఫింగ్ వంటి మెరైన్ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. సాంస్కృతిక వారసత్వాన్ని అత్యాధునిక క్రీడలతో మిళితం చేసి కొనసాగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆధునిక, అసాధారణమైన మార్గాల్లో సంప్రదాయాలను పరిచయం చేయడానికి, ఎంతోమందిలో స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం. దీని వల్ల ఈ సాంస్కృతిక వైభవం ప్రపంచ వస్త్రాలలోనే సుసంపన్నం అవుతుంది. ఇతరులను శక్తివంతం చేయడానికి నా సాహసాన్ని అంకితం చేస్తున్నాను.మహిళలు తమ సాంస్కృతిక దుస్తులను ధరిస్తూనే అసాధారణ క్రీడల్లో పాల్గొనవచ్చు. ఎవరికైనా వారి సొంత ఎంపిక చాలా ముఖ్యం. వారి కంఫర్ట్ జోన్ నుండి బయటపడి కొత్తదాన్ని ప్రయత్నించేలా నా ఈ ప్రయత్నం ఉపయోగపడితే అది వారి వ్యక్తిగత వృద్ధికి దారితీస్తుందని నమ్ముతాను. సంప్రదాయం మనల్ని బంధించదు. కొత్త మార్గాల్లో ప్రయత్నించేందుకు కొత్త శక్తిని ఇస్తుంది’’ అంటుంది అఫ్సానా. -
స్పృహతప్పి ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర విషాదం!
రామచంద్రాపురం: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బీహెచ్ఈఎల్ కాలనీలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసముండే మదిహాబేగం (19) ఇంటర్మీడియట్ చదువుతుంది. శనివారం రాత్రి తన నివాసంలో చదువుకుంటూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా.. -
వానరాల వీరంగం.. తీవ్రగాయాలతో గృహిణి మృతి
మహబూబాబాద్ రూరల్: వానరాల మూక చేష్టలతో తీవ్రంగా గాయపడిన ఓ గృహిణి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అర్జున్‌రెడ్డి ఆస్పత్రి సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల కథనమిది. స్థానికంగా నివసించే ఎండీ గౌస్ భార్య సాబీరా బేగం (55) ఎప్పట్లాగే ఉదయం నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంటిపై సిమెంటు దిమ్మెకు కట్టిన విద్యుత్ తీగను కోతుల గుంపు ఊపడంతో.. ఆ దిమ్మె ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్లడానికి కదులుతున్న సాబీరాబేగంపై దిమ్మె పడిపోయింది. దీంతో ఆమె తలకు లోపలి భాగంలో తీవ్రగాయమై.. కాలు విరిగింది. రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. -
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులపై కొరడా
సాక్షి, అమరావతి: మహోన్నత ఆశయంతో దాతలు ఇచ్చిన వక్ఫ్ భూములు, ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడతామని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన వారిపై వక్ఫ్ బోర్డు కొరడా ఝళిపిస్తోంది. ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తున్నారు. తొలి దశలో కొన్ని ఆస్తులు గుర్తించగా, రెండో దశ సర్వే వేగంగా సాగుతోంది. ఈ సర్వే ద్వారా అన్యాక్రాంతమైనట్టు గుర్తించిన ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధిలోని టాస్‌్కఫోర్స్ విభాగం స్వాదీనం చేసుకుంటోంది. వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి షేక్ షిరీన్ బేగం పర్యవేక్షణలో అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న కొన్ని ప్రధాన చర్యలు.. ♦ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి – రైతు నగరం ప్రాంతాల మధ్య వక్ఫ్ భూముల్లో వ్యాపార సముదాయాలు నిరి్మంచిన కొందరు అక్రమార్కులకు చెక్ పెట్టారు. 231 సర్వే నంబర్లో 3.89 ఎకరాలు, 47వ సర్వే నంబర్లో 7.48 ఎకరాలు, 22వ సర్వే నంబర్లో 5.92 ఎకరాలకు నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ♦ అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ప్రత్యేకాధికారి షిరీన్ బేగం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గువ్వల చెరువు, రహీంషా వలి దర్గా, రాయచోటి జామియ మసీదు ఆస్తులవాస్తవ పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది. ఇవి అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసింది. ♦ రాయచోటి దర్గా భూమిని, దుకాణాల్లో ఆక్రమణలు లేవని గుర్తించి అటాచ్ చేశారు. ♦పల్నాడు జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించి సంబంధిత శాఖకు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ శివశంకర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ కోసం వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ♦ వినుకొండలో అన్యాక్రాంతమైన మసీదు మాన్యం భూమి స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. తిమ్మాయపాలెంలో ఆక్రమణకు గురైన ఆరు ఎకరాలపై కార్యాచరణ సిద్ధం చేశారు. ♦ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన స్థలాలు, అమ్మకాలు జరిపిన ఆస్తుల రికార్డులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన మసీదులు, శ్మశాన వాటికలు పరిశీలించారు. ఇచ్చాపురం హాస్పిటల్ రోడ్డులో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను గత నెల 21న తొలగించారు. వక్ఫ్ స్థలంలో వివాదాస్పదంగా మారిన కంటైనర్‌ను తొలగించారు. 4.82 ఎకరాల విస్తీర్ణంలో 30 ఏళ్లుగా షాపులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న 24 మంది దుకాణదారులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాం. అన్యాక్రాంతమైన ఆస్తులను స్వా«దీనం చేసుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల సహకారంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుకు చెందిన గజం భూమిని కూడా వదలం. ఆక్రమణలు ఖాళీ చేయకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – షేక్ షిరీన్‌బేగం, వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి -
20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..
లంగర్‌హౌస్: భార్యపై అనుమానంతో 20 ఏళ్లుగా ఆమెను గదిలో పెట్టి బంధించి, నరకం చూపించాడు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అనేకమార్లు ఇళ్లు మారాడు. చివరకు నాంపల్లి నుంచి లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. పక్కింటి వారితో మాట్లాడిందని ఆరాతీసి భా ర్యను అతికిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో నివాసముండే జహంగీర్‌కు పంజగుట్టలో నివాసముండే కనీజ్బేగం(40)తో 2004లో వివాహమైంది. వీరికి ఇద్ద రు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఆటో నడిపించే జహంగీర్ పెళ్లైన నాటినుంచే భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. చివరకు తన తల్లితో కూడా భార్యను ఎక్కువగా మాట్లాడనిచ్చేవాడు కాదు. అతను బ యటకు వెళ్లే సమయంలో భార్యను గదిలో ఉంచి బయట నుండి తాళం వేసుకొని వెళ్లిపోయే వాడు. గొడవలు చూసి ఇళ్ల యజమానులు హెచ్చరించడంతో పలుమార్లు ఇళ్లు మారాడు. 10 ఏళ్ల కిందట గొడవలు పెరగడంతో నలుగురు పిల్లలు అయ్యాక అనుమానమేంటని సర్ది చెప్పిన పెద్దలు కనీజ్ను మళ్లీ కాపురానికి పంపించారు. చిన్న కూతురును అడిగి... భార్యపై అనుమానంతో ఇళ్లు మారుతున్న జహంగీర్ పన్నెండు రోజుల క్రితం లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. ఐదు రోజుల కిందట తన చిన్న కూతురుని పిలిచి అమ్మ ఇక్కడ ఎవరితో అయిన మాట్లాడిందా అని అడిగాడు. పక్కింటి వారితో మాట్లాడిందని కూతురు చెప్పడంతో.. ఊగిపోయిన జహంగీర్ భార్యను నడివీధిలో దారుణంగా కొట్టాడు. దీంతో పిల్లలను తీసుకొని ఎండీలైన్స్‌లో నివాసముండే తన అన్న గఫార్ ఇంటికి వెళ్లింది. శనివారం సాయంత్రం గఫార్ ఇంటికి వెళ్లిన జహంగీర్.. కలిసి ఉందామని నమ్మబలికి, పిల్లలను అక్కడే వదిలి భార్యను బాగ్దాద్ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి భోజనం చేశాక భార్యతో మరోమారు గొడవ పడి... చున్నీతో ఆమె గొంతును బిగించి హత్య చేశాడు. అనంతరం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆమె చూపిన బడిబాట
తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్‌తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది. ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే... అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో... ‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్‌గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది. మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది. మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్‌గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్‌కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను. అన్నింటా రాణిస్తున్నారు! అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది. ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం. స్నేహితులు వచ్చారు! మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి -
కిడ్నాప్ చేశారని తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది..
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన అస్మాబేగం కుమార్తె తబ్బసుమ్ బేగం అదే ప్రాంతానికి చెందిన ముస్తఫా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన అస్మాబేగం తన కుమార్తెకు సల్మాన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిపించింది. ఇది నచ్చని తబ్బసుమ్ బేగం రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం తబ్బసుమ్ తన తల్లి ఫోన్‌కు వాట్సాప్‌లో తనను కిడ్నాప్ చేశారని...తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది. మరి కొద్ది సేపటి తర్వాత తనను బంధించారని ఎక్కడ ఉన్నానో తెలియదంటూ వాట్సాప్ కాల్లో మాట్లాడింది. దీంతో అస్మా బేగం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముస్తఫాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను పిలిచి విచారించగా అతని ప్రమేయం లేదని తేలింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె షాహిన్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడ గాలించగా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. -
చేర్యాల మఖ్మల్ కోర్ చున్నీపై ఏఎస్పీ విచారణ
చేర్యాల: మండల కేంద్రంలో మొగల్ కాలంలోని సంపద తల్లిదండ్రులు వారసత్వంగా ఫాతిమున్నీసాబేగంకు ఇచ్చిన సుమారు 40 వేల వజ్రాలతో ఉన్న మఖ్‌మల్‌కోర్ చున్నీ వ్యవహారం గత ఏడాది వెలుగు చూసిన విషయం తెలిసిందే. చేర్యాలకు చెందిన ఫాతిమున్నీసాబేగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె ఇటీవల వారసత్వ సంపదలో తనకు భాగం ఉంటుందని పోలీసులను ఆశ్రరుుంచడంతో ఆదివారం రాత్రి వరంగల్ ఏఎస్పీ జాన్‌వెస్లి చేర్యాలలో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. పలు విషయూలపై ఆరాతీశారు. -
రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రగాయూలపాలైన గులాం సాధికున్నీసా బేగం (48) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.