తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్‌తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్‌ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది.
ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే...
అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో...
‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్‌గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది.
మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది.
మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్‌గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్‌లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్‌కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను.
అన్నింటా రాణిస్తున్నారు!
అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది.
ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం.
స్నేహితులు వచ్చారు!
మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్‌టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను.
ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్‌లో చేర్పిస్తున్నాం.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment