ప్రతీకాత్మక చిత్రం
లంగర్‌హౌస్: భార్యపై అనుమానంతో 20 ఏళ్లుగా ఆమెను గదిలో పెట్టి బంధించి, నరకం చూపించాడు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అనేకమార్లు ఇళ్లు మారాడు. చివరకు నాంపల్లి నుంచి లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. పక్కింటి వారితో మాట్లాడిందని ఆరాతీసి భా ర్యను అతికిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.
ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో నివాసముండే జహంగీర్‌కు పంజగుట్టలో నివాసముండే కనీజ్‌బేగం(40)తో 2004లో వివాహమైంది. వీరికి ఇద్ద రు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఆటో నడిపించే జహంగీర్ పెళ్లైన నాటినుంచే భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. చివరకు తన తల్లితో కూడా భార్యను ఎక్కువగా మాట్లాడనిచ్చేవాడు కాదు.
అతను బ యటకు వెళ్లే సమయంలో భార్యను గదిలో ఉంచి బయట నుండి తాళం వేసుకొని వెళ్లిపోయే వాడు. గొడవలు చూసి ఇళ్ల యజమానులు హెచ్చరించడంతో పలుమార్లు ఇళ్లు మారాడు. 10 ఏళ్ల కిందట గొడవలు పెరగడంతో నలుగురు పిల్లలు అయ్యాక అనుమానమేంటని సర్ది చెప్పిన పెద్దలు కనీజ్‌ను మళ్లీ కాపురానికి పంపించారు.
చిన్న కూతురును అడిగి...
భార్యపై అనుమానంతో ఇళ్లు మారుతున్న జహంగీర్ పన్నెండు రోజుల క్రితం లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి మకాం మార్చాడు. ఐదు రోజుల కిందట తన చిన్న కూతురుని పిలిచి అమ్మ ఇక్కడ ఎవరితో అయిన మాట్లాడిందా అని అడిగాడు. పక్కింటి వారితో మాట్లాడిందని కూతురు చెప్పడంతో.. ఊగిపోయిన జహంగీర్ భార్యను నడివీధిలో దారుణంగా కొట్టాడు. దీంతో పిల్లలను తీసుకొని ఎండీలైన్స్‌లో నివాసముండే తన అన్న గఫార్ ఇంటికి వెళ్లింది.
శనివారం సాయంత్రం గఫార్ ఇంటికి వెళ్లిన జహంగీర్.. కలిసి ఉందామని నమ్మబలికి, పిల్లలను అక్కడే వదిలి భార్యను బాగ్దాద్ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి భోజనం చేశాక భార్యతో మరోమారు గొడవ పడి... చున్నీతో ఆమె గొంతును బిగించి హత్య చేశాడు. అనంతరం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment