బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి... | The lady threw the snake at the conductor | Sakshi
Sakshi News home page

బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...

Published Fri, Aug 9 2024 4:33 AM | Last Updated on Fri, Aug 9 2024 7:49 AM

The lady threw the snake at the conductor

మద్యం మత్తులో మహిళ హల్‌చల్‌... 

చెయ్యెత్తినా బస్సు ఆపలేదని ఆగ్రహం   

నల్లకుంట (హైదరాబాద్‌): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్‌చల్‌ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్‌ బాటిల్‌ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్‌–ఎన్‌సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్‌ రోడ్‌ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. 

ఆ సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్‌ నెంబర్‌ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్‌ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్‌ బాటిల్‌ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్‌ స్వప్న బేగంను నిలదీశారు. 

మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 

పాము కోసం స్నేక్‌ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్‌ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement