అభివృద్ధి పనులు చేయనివ్వకుండా..
ఆదాయం తగ్గిందని చూపి అప్పగించే వ్యూహం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం. రాష్ట్రంలో ఏకైక పర్వత నివాస ప్రాంతం కూడా ఇదే. తిరుపతి డివిజన్ పరిధిలోని హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించే యత్నాలు మొదలయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్ ప్రతినిధులు హార్సిలీహిల్స్‌పైనున్న టూరిజం ఆస్తులపై పరిశీలన పూర్తి చేసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇటీవల సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా యూనియన్ నేతలు వినతిపత్రం అందించారు.
రూ.9.13 కోట్లతో పనులు
హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రూ.9.13 కోట్ల నిధులు కేటాయించింది.
అతిథిగృహాల ఆధునికీకరణ, కొత్త నిర్మాణాల కోసం పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 54 అతిథి గృహాలుండగా గవర్నర్ బంగ్లాను మినహాయించి మిగిలిన గదులకు రంగులు, కొత్తగా రెస్టారెంట్ భవనం నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు.
పర్యాటకశాఖ 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్‌లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్‌ఫాల్ భవనంలోని 4 అతిథి గృహాలను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. 18 అతిథిగృహలను ఏప్రిల్ నుంచి పర్యాటకులకు కేటాయించడం లేదు.
9నెలల్లో రూ.55 లక్షల నష్టం
ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాలను పనుల కోసం కాంట్రాక్టర్‌కు అప్పగించడం, వాటిని పర్యాటకులకు అద్దెకు ఇవ్వకపోవడంతో పర్యాటకశాఖకు గడచిన 9 నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉన్నతాధికారులకు సమాచారం. పనులు పూర్తి కాకపోవడంతో నెలకు రూ.6లక్షల నష్టం వస్తుంది. డిసెంబర్‌లో పనులు పూర్తి చేసి పర్యాటకశాఖకు భవనాలను అప్పగించాలి. ఇంతవరకు ఒక్క గది పనీ పూర్తి చేయలేదు. పనుల కోసం గదుల్లోని వాష్‌రూమ్‌ల గోడలను పడగొట్టి అలా ఉంచేశారు.
ఆదాయం లేదని చూపే యత్నం
హార్సిలీహిల్స్ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలన్న యత్నాల్లో భాగంగానే ప్రభుత్వంలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏటా రూ.3.50 నుంచి రూ.4.50 కోట్ల వరకు హార్సిలీహిల్స్ ఆదాయం ఉంటుంది. అలాంటిది గదుల పనులు పూర్తి చేయకుండా ఆదాయం తగ్గిపోయేలా చేస్తే దాన్ని ప్రైవేటుకు అప్పగించవచ్చన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారని టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment