horsley hills
-
ప్రైవేటు చేతికి హార్సిలీహిల్స్?
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం. రాష్ట్రంలో ఏకైక పర్వత నివాస ప్రాంతం కూడా ఇదే. తిరుపతి డివిజన్ పరిధిలోని హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించే యత్నాలు మొదలయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్ ప్రతినిధులు హార్సిలీహిల్స్పైనున్న టూరిజం ఆస్తులపై పరిశీలన పూర్తి చేసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇటీవల సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా యూనియన్ నేతలు వినతిపత్రం అందించారు. రూ.9.13 కోట్లతో పనులు హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రూ.9.13 కోట్ల నిధులు కేటాయించింది. అతిథిగృహాల ఆధునికీకరణ, కొత్త నిర్మాణాల కోసం పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 54 అతిథి గృహాలుండగా గవర్నర్ బంగ్లాను మినహాయించి మిగిలిన గదులకు రంగులు, కొత్తగా రెస్టారెంట్ భవనం నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పర్యాటకశాఖ 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్‌లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్‌ఫాల్ భవనంలోని 4 అతిథి గృహాలను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. 18 అతిథిగృహలను ఏప్రిల్ నుంచి పర్యాటకులకు కేటాయించడం లేదు. 9నెలల్లో రూ.55 లక్షల నష్టం ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాలను పనుల కోసం కాంట్రాక్టర్‌కు అప్పగించడం, వాటిని పర్యాటకులకు అద్దెకు ఇవ్వకపోవడంతో పర్యాటకశాఖకు గడచిన 9 నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉన్నతాధికారులకు సమాచారం. పనులు పూర్తి కాకపోవడంతో నెలకు రూ.6లక్షల నష్టం వస్తుంది. డిసెంబర్లో పనులు పూర్తి చేసి పర్యాటకశాఖకు భవనాలను అప్పగించాలి. ఇంతవరకు ఒక్క గది పనీ పూర్తి చేయలేదు. పనుల కోసం గదుల్లోని వాష్‌రూమ్‌ల గోడలను పడగొట్టి అలా ఉంచేశారు. ఆదాయం లేదని చూపే యత్నంహార్సిలీహిల్స్ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలన్న యత్నాల్లో భాగంగానే ప్రభుత్వంలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏటా రూ.3.50 నుంచి రూ.4.50 కోట్ల వరకు హార్సిలీహిల్స్ ఆదాయం ఉంటుంది. అలాంటిది గదుల పనులు పూర్తి చేయకుండా ఆదాయం తగ్గిపోయేలా చేస్తే దాన్ని ప్రైవేటుకు అప్పగించవచ్చన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారని టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు -
హార్సిలీహిల్స్ ఘాట్‌పై తప్పిన ప్రమాదం
బి.కొత్తకోట: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఓ మినీబస్సు బ్రేక్ ఫెయిల్ కాగా డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల 25 మంది పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నియోజకవర్గం చిన్నమండేనికి చెందిన పర్యాటకులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సును అద్దెకు తీసుకుని హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రొద్దుటూరు మలుపు వద్దకు రాగానే మినీబస్సు వేగం నియంత్రించేందుకు డ్రైవర్ ఖాదర్‌వలీ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని అలాగే ముందుకు పోనిస్తే మలుపు వద్ద ప్రమాదం జరిగేది. కానీ అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా గ్రిల్ పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టించి బస్సు ఆగేలా చేశారు. ఈ సంఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలానికి వెళ్లారు. చాలా తక్కువ వేగంతో వస్తున్నందునే ప్రమాదాన్ని నివారించగలిగానని డ్రైవర్ ఖాదర్‌వలీ చెప్పారు. -
హార్సిలీ హిల్స్‌తో సూపర్‌స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం
తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్‌స్టార్ కృష్ణకు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. తాను నటించిన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వేసవిలో హార్సిలీహిల్స్‌పై విడిది చేసేవారు. ఇలా హార్సిలీహిల్స్‌తో కృష్ణకు పెనవేసుకున్న కొండంత అనుబంధం సాక్షి పాఠకుల కోసం.. బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌తో సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. పర్యాటక, వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై సినిమా షూటింగులకు ఆద్యుడు ఆయనే. చిత్రపరిశ్రమకు హార్సిలీహిల్స్‌ను పరిచయం చేసింది కృష్ణనే. ఆయన రెండో చిత్రం కన్నెమనుసులు 1966లో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగాలు కొండపైనే చిత్రీకరించారు. ఈ ఏడాదిలో మొదలు పెట్టిన సినిమాల చిత్రీకరణ 1997 వరకు కొనసాగింది. కొండపై తీసిన కృష్ణ మొదటి సినిమా కన్నెమనుసులు కాగా చివరి సినిమా పాతికేళ్ల క్రితం 1997లో ఎన్కౌంటర్ తీశారు. ఆ తర్వాత సినిమాలు చిత్రీకరించనప్పటికి 2007లో ఒకసారి విజయనిర్మల, నరేష్‌తో కలిసి కొండపై ఒక రోజు విడిది చేసి వెళ్లారు. ఆ తర్వాత కృష్ణ ఇక్కడికి రాలేదు. తొలి సెట్టింగ్ గాలిబండపై సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో కృష్ణ సినిమాల చిత్రీకరణలు జరిగాయి. కృష నటించిన కన్నెమనసులు చిత్రం కోసం గాలిబండపై తొలి సెట్టింగ్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించగా అందులో ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్ బంగ్లా, దాని ఆవరణలో కృష్ణ, ఇతర నటులతో చివరి భాగం నిర్మించారు. ఈ చిత్రంతో కృష్ణకు కొండతో అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం తదితర 25కుపైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. 1997 అగస్టు 14న విడుదలైన ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధికభాగంగా, పాటలను నెలరోజులు హార్సిలీహిల్స్ అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మే 31న కొండపై జన్మదినవేడుకలు జరుపుకోగా సతీమణీ విజయనిర్మల, ప్రముఖ నటులు వేడుకలకు హజరయ్యారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకు అటవీశాఖ అతిథి గృహాలైన హార్సిలీ సూట్, మిల్క్హౌస్లో విడిది చేశారు. కాగా హార్సిలీహిల్స్‌పై షూటింగ్‌లను ప్రారంభించింది తానేనని, ఆ తర్వాత మిగతా నటులు ఇక్కడికి వచ్చారని ఎన్కౌంటర్ షూటింగ్ సందర్బంగా కృష్ణ చెప్పారు. తాను నటించిన అత్యధిక చిత్రాల షూటింగ్ హార్సిలీహిల్స్లోనే జరిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మారనని ప్రకటన 1997 మేనెలలో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మారనని, ఏ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని ప్రకటించారు. నెలరోజులు షూటింగ్ కోసం కొండపై ఉన్నారు. ఈ సమయంలో ఆయన తాను రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానని, ఆయ న మరణించాక పార్టీలో క్రీయాశీల రాజకీయాల్లో ఉండలేనని చెప్పారు. ఓసేయ్ రామ్ములమ్మ సినిమాలో కొన్ని వ్యవస్థల తీరుపై కృష్ణ వ్యాఖ్యలపై ఆయన విజయశాంతితో కలిసి పార్టీ పెట్టబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయన అప్పట్లో అన్న మాటకు చివరిదాకా కట్టుబడ్డారు. సతీమణీ విజయనిర్మల టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా అండగా నిలవలేదు. అతిథిగృహం కోసం ప్రయత్నం నటుడు కృష్ణ ప్రతివేసవి ఊటీలో గడుపుతారు. అయితే హార్సిలీహిల్స్‌పైనా అతిథిగృహం ఉండాలని కృష్ణ ఆశించారు. దీనికోసం 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చారు. ఇక్కడి సొసైటీ స్థలాలను పరిశీలించారు. శరత్‌బాబుకు చెందిన అసంపూర్తి అతిథిగృహం చూశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. అతిథిగృహం నిర్మించుకోలేకపోయారు. మదనపల్లె అంటే భలే అభిమానం మదనపల్లె సిటీ: సూపర్‌స్టార్ కృష్ణకు మదనపల్లె అంటే ఎంతో అభిమానం. 1962లో కృష్ణ, విజయనిర్మల నటించిన రక్తసంబంధం సినిమా విజయోత్సవ సభకు మదనపల్లెకు వచ్చారు. స్థానిక పంచరత్న టాకీసులో సినిమా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పంచరత్న టాకీసు అధినేత బాబా వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించారు. 1976లో పాడిపంటలు సినిమా విజయోత్సవాలకు కూడా హాజరయ్యారు. కృష్ణ మృతితో పట్టణంలోని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో... 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. -
Horsley Hills: అదిరేటి అందం.. ఆంధ్ర ఊటీ సొంతం
సాక్షి, బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వేసవి విడిది కేంద్రంగా ఎలా మారింది, దీని వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్‌ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత బ్రిటిష్ కలెక్టర్ హార్సిలీ కొండపై చేపట్టిన పనులు, దాని చరిత్ర ఆనవాళ్లు ఇప్పటికి కళ్లముందు కనిపిస్తున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌పై దీన్ని కనుగొన్న డబ్ల్యూడీ హార్సిలీ చెరగని ముద్రవేశారు. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్‌పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్ మొత్తం నిషేధిత రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో ఉండేది. అతిథి గృహానికి ఇంగ్లాండ్ పెంకులు వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్‌కు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్9న జీఓఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు. ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే. 4,141 అడుగుల ఎత్తులో బావి హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా మార్చుకోవడం, అతిథిగృహం నిర్మించుకొన్న కలెక్టర్ హార్సిలీకి నీటికోసం ప్రస్తుత అటవీ ప్రాంగణంలో బావిని తవ్వించగా పుష్కలంగా నీళ్లు లభ్యమయ్యాయి. బావి చుట్టూ ఇటుకల్లా బండరాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం అప్పట్లో అద్భుతంగా చెప్పబడుతోంది. బావి నిర్మాణంలో నేటికి ఒక్క రాయి కూడా చెక్కుచెదరలేదు. నీళ్లు నిండుగా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో బావి ఎండినా సాధారణ రోజుల్లో నీళ్లుంటాయి. 1869 నుంచి వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. ఒకేరోజు జననం, మరణం హార్సిలీహిల్స్‌పై మక్కువ పెంచుకొన్న కలెక్టర్ హార్సిలీ నిండుగర్భిణి అయిన సతీమణీతో కొండపై విడిది చేశారు. 1864 మే 31న ప్రసవం జరిగి కుమారుడు జన్మించగా అదేరోజు చనిపోయాడు. ఈ పసిబిడ్డకు జార్జ్హార్సిలీ అని నామకరణం చేసి కొండపై (టూరిజం ముఖద్వారం వద్ద) ఖననం చేశారు. హార్సిలీకి ఇష్టమైన విడిదిచోటనే బిడ్డ పుట్టడం, ఆ ఆనందం అదేరోజు ఆవిరి కావడం బాధాకరం. 90 ఏళ్లకు డీ రిజర్వ్ ఫారెస్ట్ హార్సిలీహిల్స్‌పై రెవెన్యూ, ఇతర శాఖలకు అడుగుపెట్టేందుకు చోటులేదు. 1869లోనే వేసవి విడిది కేంద్రంగా ప్రకటించినప్పటికి అటవీశాఖకు తప్ప ఎవరికి ప్రవేశంలేని పరిస్థితి. బ్రిటీష్ పాలన అంతమైనా మార్పులేదు. వేసవి విడిది కేంద్రంగా మారిన 90 ఏళ్ల తర్వాత 1959 ఏప్రిల్ 15న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 101523/సీ1/58–5 మెమో జారీ చేసింది. ఈ మెమో ద్వారా కోటావూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని హార్సిలీహిల్స్‌పై సర్వేనంబర్ 538లోని 103 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను డీ రిజర్వ్‌ఫారెస్ట్‌గా మార్పుచేసింది. ఈ 103 ఎకరాలను రెవెన్యూశాఖ 1959 జూలై 25న స్వాధీనం చేసుకొంది. -
Horsley Hills: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో వేసవి విడిది కేంద్రంగా, ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌పై కోవిడ్ ప్రభావం ఆర్థికంగా దెబ్బతీసింది. సందర్శకులు కరువై ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కోవిడ్ అనంతర పరిస్థితులతో పర్యాటకం గాడిలో పడటంతో సందర్శకుల రాకతో పాటు, వారిని ఆకట్టుకునే చర్యలు సఫలమై ఆదాయం పెరుగుతోంది. 2000 ఏడాదిలో కొండపై టూరిజం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయంతో మొదలై ప్రస్తుతం రూ.4 కోట్లను దాటింది. అత్యధికంగా వేసవి, సెలవురోజుల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తారు. బెంగళూరు, చెన్నై, చిత్తూరు, తిరుపతి, పుట్టపర్తి, అనంతపురం జిల్లాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు బృందాలుగా ఇక్కడికి వచ్చి విడిది చేస్తారు. ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బందిని విహారయాత్రగా పంపుతుంటారు. ఈ కంపెనీలను ముందుగా టూరిజం అధికారులు సంప్రదించడం ద్వారా హార్సిలీహిల్స్‌కు పంపేలా కృషి చేస్తుంటారు. ఒక్కో కంపెనీ నుంచి కనీసం లక్షకుపైబడిన ఆదాయం సమకూరుతుంది. దీనిపైనే స్థానిక టూరిజం అధికారులు దృష్టిపెట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి. దీనివల్ల ఒకసారి వచ్చివెళ్లిన సందర్శకులు మళ్లీ వస్తుంటారు. గత ఏడాది కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదాయం మొదలైంది. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ 12 నెలల కాలంలో రూ.4,02,53,364 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం అభివృద్ధి విషయంలో చర్యలు మొదలయ్యాయి. కొండను ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దడమే కాకుండా స్టార్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు టూరిజం ఎండీ కన్నబాబు ఇటీవల హార్సిలీహిల్స్‌పై పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల పర్యాటకశాఖ ఉన్నతాధికారులు కొండకు వచ్చి చేపట్టాల్సిన అభివృద్ధిపై పరిశీలించి వెళ్లారు. దీనిపై ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. అభివృద్ధికి నిధులు హార్సిలీహిల్స్ యూనిట్ ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గదుల ఆధునీక రణ, ఇతర పనులకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు, చెన్నై పర్యాటకులను ఆకర్షిస్తున్న హార్సిలీహిల్స్‌పై స్టార్‌హోటల్ స్థాయి వసతులు కల్పించేందుకు పర్యాటకశాఖ దృష్టికి తీసుకెళ్లాం. – మిట్టపల్లె భాస్కర్‌రెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్ పరిశీలన పూర్తి హార్సిలీహిల్స్‌పై టూరిజం కార్యకలాపాల విస్తరణ, ఆధునీకరణ పనులపై ఉన్నతస్థాయి అధికార బృందం పరిశీలనలు పూర్తి చేసింది. భవిష్యత్తులో హార్సిలీహిల్స్ ఆదాయం భారీగా పెంచుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. –నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, టూరిజం మేనేజర్, హార్సిలీహిల్స్ -
హార్సిలీహిల్స్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణానికి తాళం కొండపై బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు. బీఎస్ఎన్ఎల్కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు. -
Horsley Hills: షూటింగ్‌లకు ఆద్యుడు కృష్ణ
బి.కొత్తకోట(వైఎస్సార్ కడప): పర్యాటక, వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సినిమా షూటింగులకు ఆద్యుడు, చిత్రపరిశ్రమకు ఈ అందమైన ప్రాంతాన్ని పరిచయం చేసింది మాత్రం సూపర్ కృష్ణనే. మొట్టమొదటగా ఆయన సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం మొదలయ్యాకే.. మిగిలిన నటులు హార్సిలీహిల్స్ దారిపట్టారు. కృష్ణ షూటింగుల వల్లే హార్సిలీహిల్స్‌కు ప్రాచు ర్యం వచ్చింది. అప్పటి వరకు సినిమా స్టూడియోలకే పరిమితమైన షూటింగులను ఔట్‌డోర్ చిత్రీకరణ మొదలైందని చెప్పవచ్చు. 1966లో కృష్ణ నటించిన కన్నెమనసు సినిమా చాలా భాగం హార్సిలీహిల్స్‌లో చిత్రీకరణ జరిగింది. కొండపై కృష్ణ తొలి సినిమా షూటింగ్ ఇదేనని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం, సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లోనే సిని మా చిత్రీకరణలు జరిగాయి. కృష్ణ నట జీవితంలో హార్సిలీహిల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిగా అప్పుడప్పుడే గుర్తింపు లభిస్తున్న రోజుల నుంచే తాను నటించే చిత్రాలను హార్సిలీకొండపై చిత్రీకరించే వారు. కన్నెమనసులు చిత్రం ఎక్కువ భాగం కొండపైనే చిత్రీకరించారు. కొండపై తొలి సినిమా సెట్టింగ్ వేసింది ఈ సినిమాకే. గాలిబండపై వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించి ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్‌బంగ్లా, ఆవరణలో కృష్ణ, ఇతరా నటులతో చివరి భాగం నిర్మించారు. అప్పటి నుంచే కృష్ణకు కొండపై అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నటించిన అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం ఇలా సుమారు 25కు పైగా సినిమాల నిర్మాణం జరుపుకొంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధిక భాగంగా, పాటలను కొండపైన, అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొండపై జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కృష్ణ తర్వాత ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగార్జున, రాజేంద్రప్రసాద్, కాంతారావు ఇలా ఎందరో నటుల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినిమాలు అత్యధికంగా ఇక్కడ నిర్మాణం జరుపుకొన్నాయి. కాగా హార్సిలీహిల్స్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని 1997లో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ సమయంలో చెప్పుకొన్నారు. చివరగా కృష్ణ 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చివెళ్లారు. కొండపై నటుడు శరత్‌బాబు ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ నిర్మించుకొన్న ఇంటిని ప్రముఖ నటి జమున విక్రయించుకొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి జమునా బిల్టింగ్ అనే పిలుస్తారు. -
మంచు దుప్పటి
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హార్సిలీ హిల్స్‌పై తిరుమల కంటే తక్కువగా.. రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్‌పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
సబ్ కలెక్టర్‌కే నకిలీ టోల్ రశీదు!
నకిలీ రశీదులతో టోల్గేట్ రుసుం వసూలు చేస్తూ మోసం చేస్తున్న వీఆర్ఏల ఉదంతాన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గుట్టురట్టు చేశారు. సాధారణ పర్యాటకురాలిగా హార్సిలీహిల్స్ వెళ్లారు. రూ.25 చెల్లించి తీసుకొన్న రశీదుపై సబ్‌కలెక్టర్ అధికారిక సంతకం, సీలు లేకపోవడంతో ఆరా తీస్తే నకిలీదని తేలింది. ఫలితంగా ఇద్దరు వీఆర్ఏలను సస్పెండ్ చేశారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు): మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి రుసుం వసూలుచేసే బాధ్యతను కోటావూరు పంచాయతీకి చెందిన వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌సాబ్‌కు అప్పగించారు. వీరు పదేళ్లకు పైగా రుసుం వసూలు చేస్తూ ఈ విధులకే పరిమితం అయ్యారు. ఈ వసూళ్లపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గత నెల 29, 30 తేదీల్లో సాధారణ పర్యాటకురాలిగా కొండకు కారులో వెళ్తుండగా వీఆర్ఏలు టోల్‌గేటుగా రెండు సార్లు రెండు రశీదులు ఇచ్చి రూ.50 తీసుకొన్నారు. వీరు ఇచ్చిన రశీదుల నంబర్లు 9281, 8137. అయితే ప్రస్తుతం రుసుం వసూళ్లకు కేటాయించిన అధికారిక రసీదు పుస్తకాల్లోని సీరియల్ నంబర్లు 12,500, 13,200గా ఉన్నాయి. దీంతో ఈ అసలు నంబర్లకు సంబంధం లేని నకిలీ రశీదు పుస్తకాలను తయారు చేసి నగదు వసూలు చేస్తూ, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జమ చేయకుండా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బి.కొత్తకోట తహసీల్దార్ నిర్మలాదేవిని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. దీంతో వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌వలీని సస్పెండ్ చేస్తూ బుధవారం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజులో రూ.1,700 బుధవారం టోల్‌గేటు వసూలుకు ఇద్దరు వీఆర్ఏలను కొత్తగా నియమించగా ఊహించని విధంగా రూ.1,700 వసూలు కావడం చూసి రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోయారు. సాధారణ రోజుల్లో ఈ స్థాయిలో టోల్ వసూలైనట్టు గత పదేళ్లలో ఎన్నడూ చూపలేదని స్పష్టమైంది. దీన్నిబట్టి చూస్తే తీవ్ర రద్దీగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు కనీసం రూ.5వేలు తగ్గకుండా వసూలు కావాలి. ఏడాదికి కనీసం రూ.7లక్షలు వసూలవ్వాలి. ఈ స్థాయిలో నగదు జమ అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తే ఏ మేరకు నకిలీ రశీదులతో దోచుకున్నారో తేలుతుంది. వసూళ్ల జమపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సబ్ కలెక్టరే నిజాలు నిగ్గుతేల్చడంతో వీఆర్ఏల వ్యవహారానికి చెక్‌పడింది. 11న వేలం పాట హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు అవకతవకల నేపథ్యలో ఈ కాంట్రాక్ట్‌ను ప్రయివేటుకు అప్పగించేందుకు సబ్ కలెక్టర్ జాహ్నవి నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 11న వేలం పాట నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పాటదారులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. -
హార్సిలీహిల్స్‌కు కోవిడ్ ముప్పు!
ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్. ఇది ప్రఖ్యాత వేసవి విడది కేంద్రం. వేసవిలో సేద తీరడానికి ఇక్కడికి పలు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి వెళుతున్నారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల కాలంలో కర్ణాటక పర్యాటకులతోపాటు విదేశీయులూ వచ్చి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థానికులు, ఉద్యోగులకూ కోవిడ్ సోకే ప్రమాదం ఉంది. సాక్షి, చిత్తూరు: మండలంలోని హార్సిలీహిల్స్‌పై కోవిడ్ ముప్పు పొంచివుంది. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం నేపథ్యంలో వ్యాధి ఉధృతమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. హార్సిలీహిల్స్‌కు వస్తున్న సందర్శకుల్లో అత్యధికులు సరిహద్దులోని కర్ణాటకకు చెందినవారే. ఆ రాష్ట్రంలో కోవిడ్ అధికమైన పరిస్థితుల్లో హార్సిలీహిల్స్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. బెంగళూరుకు చెందిన సందర్శకులు అత్యధికులు ఇక్కడికి వస్తున్నారు. ముందుగానే గదులను ఆన్లైన్లో నమోదు చేసుకుని ఇక్కడికి వస్తారు. విడిది చేసి తిరిగి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో వ్యాధి సోకిన వారు గదులను తీసుకుని విడిది చేసి వెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వారితో వ్యాధి ఒకసారిగా విజృంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల కొండకు వస్తున్న సందర్శకుల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. గతనెల రోజుల్లో ఇటలీ, బ్రిటన్ దేశాలకు చెందిన సందర్శకులు వచ్చి వెళ్లారు. అంతకుముందు కూడా కొందరు సందర్శకులు నాలుగైదురోజులు గడిపి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వ్యాధి వారి ద్వారా కూడా ప్రబలే ప్రమాదం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు కాలేదు. ఆన్లైన్ మూసేయాలి హార్సిలీహిల్స్‌లో టూరిజంశాఖ 54కు పైగా అతిథిగృహాలను బార్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రైవేటుగా మరో ముగ్గురు అతిథిగృçహాలను నిర్వహించుకుంటున్నారు. వీటిని తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్లే వారి వివరాలు టూరిజంశాఖ వద్ద ఉంటా యి. టూరిజంశాఖ గదుల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేయడమేకాక, ప్రైవేటు అతిథిగృహలను మూసివేస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతకాలం సందర్శకులను నిషేధించడం లేదా పరీక్షలు నిర్వహించాక అనుమతించడం చేయాల్సివుంది. -
రోమాంచిత సంబరం.. తాకెను అంబరం
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): కొండలపై సైక్లింగ్ పోటీలు దుమ్ము రేపాయి. సాహస విన్యాసాలు సందడి చేశాయి. పారా మోటార్ విహారం ఉత్సాహం నింపింది. తాళ్లతో చేసిన వలపై నిలువుగా పైకి ఎగబాకటం.. తాళ్ల ఆధారంగా ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణించటం.. ఆకాశ వీధిలో తాళ్లు ఆధారంగా ఉంచిన చెక్కలపై నడవటం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌పై రెండు రోజుల పాటు నిర్వహించే అడ్వెంచర్ ఫెస్టివల్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ చేపట్టిన ఈ ఉత్సవాలు పండుగ వాతావరణంలో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వంద మందికి పైగా క్రీడాకారులు సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృధ్వీతేజ్ అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించారు. చేకూరి కీర్తి, పృధ్వీతేజ్ వేర్వేరుగా పారా మోటార్లో అరగంట పాటు ఆకాశంలో విహారం చేశారు. రోప్ సైక్లింగ్, బైక్ రైడింగ్, జిప్ సైకిల్, ట్రెక్కింగ్ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు యాత్రికులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. విన్యాసాలు, క్రీడలను తిలకించి ఆహ్లాదం పొందారు. సాహస క్రీడలపై మక్కువ గల క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ అడ్వెంచర్ ఫెస్టివల్ వేదికగా నిలిచింది. టూరిజం డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారి చంద్రమౌళి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలరించిన వినోద కార్యక్రమాలు అడ్వెంచర్ ఫెస్టివల్లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు అలరించాయి. టీవీ యాంకర్లు గీతా భగత్, చైతూ సందడి చేశారు. హాస్యనటులు బుల్లెట్ భాస్కర్, రాజమౌళి హాస్యం పండించారు. పలు చిత్రాల్లోని సినీ నేపథ్య గేయాలు ఆలపించారు. డీజే నృత్యాలతో సభికులను ఉత్సాహపరిచారు. నివేదిక కూచిపూడి, యశ్వని జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలను సందర్శకులు ఉత్సాహంతో తిలకించారు. -
హార్సిలీహిల్స్‌పై అడ్వెంచర్ ఫెస్టివల్
బి.కొత్తకోట(చిత్తూరుజిల్లా): రాష్ట్రంలో అరకు తర్వాత అత్యంత శీతల ప్రదేశంగా పేరుపొందిన హార్సిలీహిల్స్ సాహస ఉత్సవాలకు సంసిద్ధమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీహిల్స్‌లో చరిత్రలో మొట్టమొదటిసారిగా అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా సాహస క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లా అధికారులు వారం రోజులుగా శ్రమించారు. పోటీల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ స్టాళ్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలను అలరించేలా ఉత్సాహభరితమైన కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. సినీ నేపథ్య గాయకులు, హాస్య నటులు కార్యక్రమాలతో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై పండగ సందడి నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సాహస క్రీడా పోటీలు ఇలా.. ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 9 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో 3 కిలోమీటర్ల సైక్లింగ్, 3 కిలోమీటర్ల రన్నింగ్, అడవిలో 3 కిలోమీటర్ల నడక పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వందమందికిపైగా పాల్గొంటారని అంచనా. ఇవికాకుండా కొండపైన హీట్ బెలూన్స్, రోప్ సైకిలింగ్, జిప్ సైకిల్, ఎయిర్ బెలూన్స్, సర్వైవల్ క్యాంప్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే క్రీడాకారులు, యాత్రికుల కోసం కొండపై 50 టెంట్లు సిద్ధం చేశారు. నాటి ఏనుగు మల్లమ్మ కొండే నేటి హార్సిలీహిల్స్! ఆహ్లాదకర వాతావరణంతో హార్సిలీహిల్స్ పర్యాటకుల మనస్సు దోస్తూ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. దీన్ని బ్రిటీష్ పాలనలో 1850లలో చిత్తూరు–కడప జిల్లాల కలెక్టర్ డబ్ల్యూడీ హార్సిలీ కనుగొన్నారు. దీంతో ఏనుగు మల్లమ్మ కొండగా పిలువబడుతున్న ఈ కొండ హార్సిలీహిల్స్‌గా మారింది. అత్యంత చల్లటి హార్సిలీహిల్స్‌లో 2000 సంవత్సరం నుంచి పర్యాటక శాఖ కార్యకలాపాలు ప్రారంభించడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వేసవి విడిదిగా పర్యాటకులను ఆకర్షిస్తూ మంచి ఆదాయం గడిస్తోంది. హార్సిలీహిల్స్‌ను సాహస క్రీడలకు కేంద్రంగా నిలపడం ద్వారా మరింతమంది పర్యాటకులను ఆకర్షించాలని భావించిన పర్యాటక శాఖ ఇందులో భాగంగా తొలిసారిగా అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం రూ.కోటి నిధులను వినియోగిస్తోంది. -
పవన్ ఉన్నాడంటూ ఓవర్ యాక్షన్..
సాక్షి, చిత్తూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన.. పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పవన్ కల్యాణ్ గురువారం హార్సిలీ హిల్స్‌లోని గాలిబండకు చేరుకున్నారు. గాలిబండ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హార్సిలీ హిల్స్‌కు వచ్చిన ప్రతి టూరిస్ట్ గాలిబండకు వెళ్లాలని, అక్కడి అందాలను చూడాలని అనుకుంటాడు. కానీ, పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నారంటూ పర్యాటకుల పట్ల జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పర్యాటకులు గాలిబండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి జనసేన కార్యకర్తలు పర్యాటకులను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గాలిబండకు వెళ్లాలకుంటున్న పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల తీరు బాగాలేదని టూరిస్టులు తప్పుబడుతున్నారు. బుధవారం మదనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అటు నుంచి నేరుగా హార్సిలి హిల్స్‌కు చేరుకున్నారు. -
గూగుల్‌లో చూసి.. రష్యా నుంచి హార్సిలీహిల్స్‌కు!
బి.కొత్తకోట : ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించినా ఏపీ టూరిజంలా ఎక్కడా లేదని రష్యాకు చెందిన పర్యాటకులు డేనియల్, దిమిత్రి తెలిపారు. మిత్రులైన వీరు రష్యాలోని మాస్కోలో వృత్తిపరమైన వ్యాపారం చేసుకొంటూ జీవిస్తున్నారు. వీరికి పర్యాటక ప్రాంతాల సందర్శన అంటే ఇష్టం. పర్యాటక స్థలాల గురించి గూగుల్‌లో వెతుకుతుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొన్నారు. బెంగళూరులో ఉన్న ప్రాంతాలు చూసుకుని ఆదివారం హార్సిలీహిల్స్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని కొండపైనున్న ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి మొక్కలు, యూకలిప్టస్ వృక్షాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం తమ హాబీ అని తెలిపారు. గూగుల్‌లో హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొని వచ్చామన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు, చల్లటి వాతావరణం మరెక్కడా చూడలేదని వివరించారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ టూరిజంశాఖ నిర్వహణ, పనితీరు బాగుందని వారు ప్రశంసించారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హార్సిలీహిల్స్: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. రేణుమాను మిట్ట వద్ద కారు దగ్దమైన సంఘటన జరిగింది. కడప నుంచి హార్సిలీహిల్స్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కారులో తొమ్మిదిమంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పొగలు రావడంతో గమనించి అందులోని వారు కిందకు దిగిపోయారు. వెంటనే మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. బాధితుడు కడపకు చెందిన బంగారు షాపు యజమాని మహమ్మద్ గా తెలుస్తోంది. పర్యాటక కేంద్రం సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమందించగా వారు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. -
హార్సిలీహిల్స్‌లో లోయలో పడిన కారు
మదనపల్లె: కారు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి హార్సిలీహిల్స్ లోయలో పడటంతో.. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు, పోలీసులు సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్ బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేం ద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరి జం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారు లు, సిబ్బంది 2కె రన్లో పాల్గొన్నా రు. గవర్నర్ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వశాఖకు చెంది న సిబ్బంది, అధికారులతో ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హార్సిలీహిల్స్‌లో కన్నడ చిత్రం లీ షూటింగ్
* గాలిబండపై ద్రోణ్ ద్వారా సన్నివేశాల చిత్రీకరణ * చిత్ర దర్శకుడు మదనపల్లె యువకుడు బి.కొత్తకోట: కన్నడ చిత్రం లీ సినిమా షూటింగ్ శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో జరిగింది. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలకు కేంద్రమైన గాలిబండపై చిత్ర హీరో హీరోయిన్లపై ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా గాలిబండ అంచులో హీరోయిన్ నబా నటేష్ నిలబడివున్న సన్నివేశాన్ని కెమెరాతో ఎదురుగా చిత్రీకరించే వీలులేకపోవడంతో దర్శకులు శ్రీనందన్ ద్రోణ్‌ను వినియోగించారు. హీరోయిన్ వైపు నుంచి ద్రోణ్ ఎదురుగా ఉన్న లోతైన లోయపై నుంచి సుందరమైన దృశ్యాలను చిత్రీంచింది. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకొన్న పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మదనపల్లె రేంజర్ మాధవరావు, సిబ్బంది కూడా షూటింగ్ తిలకించారు. రెండు మతాల మధ్య ప్రేమకథ లీ చిత్రం పూర్తిగా యాక్షన్, ప్రేమ కథనంతో నడుస్తుందని చిత్ర దర్శకుడు హెచ్ఎం. శ్రీనందన్ చెప్పారు. మదనపల్లెకు చెందిన శ్రీనందన్కు దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఈ సినిమాకు నిర్మాత సాధు రమేష్, సంగీతం గురుకిరణ్కాగా ప్రముఖ విలన్ పాత్రధారి రాహుల్దేవ్ది కీలక పాత్రని చెప్పారు. రంగయ్యరఘు, సాధుకోకిల, చిన్నక్క, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్
చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల భవనం పై కప్పు కూలి ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు.. మరో పది మంది విద్యార్థులకు గాయలైన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాదితు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా విద్యాధికారికి సూంచించారు. -
మండుటెండల్లో...మంచుకొండలు
హార్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్‌లో వేసవి విడిదిగా పేరొందిన పర్వత ప్రాంతం హార్స్లీ హిల్స్. తిరుపతికి 144 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని నాటి కడపజిల్లా కలెక్టర్ డబ్ల్యుడి హార్స్లీనివాసప్రాంతంగా నిర్ణయించుకున్నారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి హార్స్లీఅనే పేరు వచ్చింది. ఇక్కడి అడవులలో ఆకాశాన్నంటినట్టుండే వృక్షాలు, దట్టంగా అల్లుకుపోయిన పచ్చని పొదలు, అడవి జంతువుల మధ్య ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 29 - 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మార్చ్ నుంచి జూన్ వరకు ఈ ప్రాంతం సందర్శనకు అనుకూలం. ఇలా వెళ్లాలి: హైదరాబాద్ నుంచి 556 కి.మీ, విజయవాడ నుంచి 525 కి.మీ, విశాఖపట్టణం నుంచి 891 కి.మీ దూరంలో ఉంది. దగ్గరలో బెంగళూరు విమానాశ్రయం ఉంది. చిత్తూరు, మదనపల్లిలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. చిత్తూరు నుంచి రోడ్డు మార్గంలో 90 కి.మీ. వసతి: గవర్నర్ బంగ్లా, చిత్తూరు కో ఆపరేటివ్‌సొసైటీ గెస్ట్ హౌజ్, ఫారెస్ట్ గెస్ట్ హౌజ్‌లు ఉన్నాయి. పున్నమి హోటల్ ఫోన్ నెం: 08571279, 279 324, సెల్ నెం. 9440272241 చూడదగినవి: దట్టమైన గుల్మొహర్, యూకలిప్టస్ చెట్లు, గంగోత్రి సరస్సు, రిషీ వ్యాలీ స్కూల్, లేపాక్షి దేవాలయం, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. మొదలైనవి. బడ్జెట్: రైలు, బస్సులలో వెళ్లిరావడానికి, ఒక రోజు ఉండటానికి ఒకరికి రూ.5,000/- నుంచి రూ.10,000/- లోపు ఖర్చు అవుతుంది.