Super Star Krishna First Introduced Movie Shootings In Horsley Hills - Sakshi
Sakshi News home page

Horsley Hills: షూటింగ్‌లకు ఆద్యుడు కృష్ణ

Published Mon, Apr 25 2022 11:32 AM | Last Updated on Mon, Apr 25 2022 5:17 PM

Super Star Krishna First Introduced Movie Shootings In Horsley Hills - Sakshi

కన్నెమనసులులో కృష్ణ, నటి సంధ్యారాణి మధ్య పాట సన్నివేశం, హార్సిలీహిల్స్‌ గాలిబండపై కృష్ణ నటించిన అసాధ్యుడు సినిమా ఫైట్‌ సన్నివేశం

బి.కొత్తకోట(వైఎస్సార్‌ కడప): పర్యాటక, వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సినిమా షూటింగులకు ఆద్యుడు, చిత్రపరిశ్రమకు ఈ అందమైన ప్రాంతాన్ని పరిచయం చేసింది మాత్రం సూపర్‌ కృష్ణనే. మొట్టమొదటగా ఆయన సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం మొదలయ్యాకే.. మిగిలిన నటులు హార్సిలీహిల్స్‌ దారిపట్టారు. కృష్ణ షూటింగుల వల్లే హార్సిలీహిల్స్‌కు ప్రాచు ర్యం వచ్చింది. అప్పటి వరకు సినిమా స్టూడియోలకే పరిమితమైన షూటింగులను ఔట్‌డోర్‌ చిత్రీకరణ మొదలైందని చెప్పవచ్చు.

1966లో కృష్ణ నటించిన కన్నెమనసు సినిమా చాలా భాగం హార్సిలీహిల్స్‌లో చిత్రీకరణ జరిగింది. కొండపై కృష్ణ తొలి సినిమా షూటింగ్‌ ఇదేనని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం, సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లోనే సిని మా చిత్రీకరణలు జరిగాయి. కృష్ణ నట జీవితంలో హార్సిలీహిల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిగా అప్పుడప్పుడే గుర్తింపు లభిస్తున్న రోజుల నుంచే తాను నటించే చిత్రాలను హార్సిలీకొండపై చిత్రీకరించే వారు.

కన్నెమనసులు చిత్రం ఎక్కువ భాగం కొండపైనే చిత్రీకరించారు. కొండపై తొలి సినిమా సెట్టింగ్‌ వేసింది ఈ సినిమాకే. గాలిబండపై వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించి ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్‌బంగ్లా, ఆవరణలో కృష్ణ, ఇతరా నటులతో చివరి భాగం నిర్మించారు. అప్పటి నుంచే కృష్ణకు కొండపై అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నటించిన అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం ఇలా సుమారు 25కు పైగా సినిమాల నిర్మాణం జరుపుకొంది.

ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్‌ సినిమా అత్యధిక భాగంగా, పాటలను కొండపైన, అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే కొండపై జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కృష్ణ తర్వాత ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగార్జున, రాజేంద్రప్రసాద్, కాంతారావు ఇలా ఎందరో నటుల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు.

కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినిమాలు అత్యధికంగా ఇక్కడ నిర్మాణం జరుపుకొన్నాయి. కాగా హార్సిలీహిల్స్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని 1997లో ఎన్‌కౌంటర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో చెప్పుకొన్నారు. చివరగా కృష్ణ 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్‌ వచ్చివెళ్లారు. కొండపై నటుడు శరత్‌బాబు ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ నిర్మించుకొన్న ఇంటిని ప్రముఖ నటి జమున విక్రయించుకొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి జమునా బిల్టింగ్‌ అనే పిలుస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement