బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్డీఓ మురళీ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్‌పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాంగణానికి తాళం
కొండపై బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు.
ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు.
విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు
రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్‌షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్‌షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment