తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్‌స్టార్ కృష్ణకు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. తాను నటించిన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వేసవిలో హార్సిలీహిల్స్‌పై విడిది చేసేవారు. ఇలా హార్సిలీహిల్స్‌తో కృష్ణకు పెనవేసుకున్న కొండంత అనుబంధం సాక్షి పాఠకుల కోసం..
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌తో సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. పర్యాటక, వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై సినిమా షూటింగులకు ఆద్యుడు ఆయనే. చిత్రపరిశ్రమకు హార్సిలీహిల్స్‌ను పరిచయం చేసింది కృష్ణనే. ఆయన రెండో చిత్రం కన్నెమనుసులు 1966లో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగాలు కొండపైనే చిత్రీకరించారు. ఈ ఏడాదిలో మొదలు పెట్టిన సినిమాల చిత్రీకరణ 1997 వరకు కొనసాగింది. కొండపై తీసిన కృష్ణ మొదటి సినిమా కన్నెమనుసులు కాగా చివరి సినిమా పాతికేళ్ల క్రితం 1997లో ఎన్‌కౌంటర్ తీశారు. ఆ తర్వాత సినిమాలు చిత్రీకరించనప్పటికి 2007లో ఒకసారి విజయనిర్మల, నరేష్‌తో కలిసి కొండపై ఒక రోజు విడిది చేసి వెళ్లారు. ఆ తర్వాత కృష్ణ ఇక్కడికి రాలేదు.
తొలి సెట్టింగ్ గాలిబండపై
సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో కృష్ణ సినిమాల చిత్రీకరణలు జరిగాయి. కృష నటించిన కన్నెమనసులు చిత్రం కోసం గాలిబండపై తొలి సెట్టింగ్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించగా అందులో ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్ బంగ్లా, దాని ఆవరణలో కృష్ణ, ఇతర నటులతో చివరి భాగం నిర్మించారు. ఈ చిత్రంతో కృష్ణకు కొండతో అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం తదితర 25కుపైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి.
1997 అగస్టు 14న విడుదలైన ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమా అత్యధికభాగంగా, పాటలను నెలరోజులు హార్సిలీహిల్స్ అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మే 31న కొండపై జన్మదినవేడుకలు జరుపుకోగా సతీమణీ విజయనిర్మల, ప్రముఖ నటులు వేడుకలకు హజరయ్యారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకు అటవీశాఖ అతిథి గృహాలైన హార్సిలీ సూట్, మిల్క్‌హౌస్‌లో విడిది చేశారు. కాగా హార్సిలీహిల్స్‌పై షూటింగ్‌లను ప్రారంభించింది తానేనని, ఆ తర్వాత మిగతా నటులు ఇక్కడికి వచ్చారని ఎన్‌కౌంటర్ షూటింగ్ సందర్బంగా కృష్ణ చెప్పారు. తాను నటించిన అత్యధిక చిత్రాల షూటింగ్ హార్సిలీహిల్స్‌లోనే జరిపినట్టు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మారనని ప్రకటన
1997 మేనెలలో ఎన్‌కౌంటర్ సినిమా షూటింగ్ హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మారనని, ఏ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని ప్రకటించారు. నెలరోజులు షూటింగ్ కోసం కొండపై ఉన్నారు. ఈ సమయంలో ఆయన తాను రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానని, ఆయ న మరణించాక పార్టీలో క్రీయాశీల రాజకీయాల్లో ఉండలేనని చెప్పారు. ఓసేయ్ రామ్ములమ్మ సినిమాలో కొన్ని వ్యవస్థల తీరుపై కృష్ణ వ్యాఖ్యలపై ఆయన విజయశాంతితో కలిసి పార్టీ పెట్టబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయన అప్పట్లో అన్న మాటకు చివరిదాకా కట్టుబడ్డారు. సతీమణీ విజయనిర్మల టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా అండగా నిలవలేదు.
అతిథిగృహం కోసం ప్రయత్నం
నటుడు కృష్ణ ప్రతివేసవి ఊటీలో గడుపుతారు. అయితే హార్సిలీహిల్స్‌పైనా అతిథిగృహం ఉండాలని కృష్ణ ఆశించారు. దీనికోసం 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చారు. ఇక్కడి సొసైటీ స్థలాలను పరిశీలించారు. శరత్‌బాబుకు చెందిన అసంపూర్తి అతిథిగృహం చూశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. అతిథిగృహం నిర్మించుకోలేకపోయారు.
మదనపల్లె అంటే భలే అభిమానం
మదనపల్లె సిటీ: సూపర్‌స్టార్ కృష్ణకు మదనపల్లె అంటే ఎంతో అభిమానం. 1962లో కృష్ణ, విజయనిర్మల నటించిన రక్తసంబంధం సినిమా విజయోత్సవ సభకు మదనపల్లెకు వచ్చారు. స్థానిక పంచరత్న టాకీసులో సినిమా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పంచరత్న టాకీసు అధినేత బాబా వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించారు. 1976లో పాడిపంటలు సినిమా విజయోత్సవాలకు కూడా హాజరయ్యారు. కృష్ణ మృతితో పట్టణంలోని అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
ఎన్నికల ప్రచారంలో...
1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment