బి.కొత్తకోట: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఓ మినీబస్సు బ్రేక్ ఫెయిల్ కాగా డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల 25 మంది పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నియోజకవర్గం చిన్నమండేనికి చెందిన పర్యాటకులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సును అద్దెకు తీసుకుని హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు.
సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రొద్దుటూరు మలుపు వద్దకు రాగానే మినీబస్సు వేగం నియంత్రించేందుకు డ్రైవర్ ఖాదర్‌వలీ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని అలాగే ముందుకు పోనిస్తే మలుపు వద్ద ప్రమాదం జరిగేది. కానీ అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా గ్రిల్ పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టించి బస్సు ఆగేలా చేశారు.
ఈ సంఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలానికి వెళ్లారు. చాలా తక్కువ వేగంతో వస్తున్నందునే ప్రమాదాన్ని నివారించగలిగానని డ్రైవర్ ఖాదర్‌వలీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment