సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్. వేదికపై మంత్రి అమర్‌నాథ్ తదితరులు
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు
పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు.
క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment