ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే! | Visakha Port Is Safe For Ammonium Nitrate Imports | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!

Published Fri, Aug 7 2020 9:25 AM | Last Updated on Fri, Aug 7 2020 10:09 AM

Visakha Port Is Safe For Ammonium Nitrate Imports  - Sakshi

సాక్షి, విశాఖ పట్నం: లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.  అయితే పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్‌ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాక పోర్టులో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి. ఇక  విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్‌ మాత్రమే  జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు స్పష్టం చేశారు. 
 నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్‌లోడ్‌  చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు  అని నిపుణులు, అధికారులు తెలిపారు. 

దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు.  దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు.  విశాఖలో సురక్షితమనే కేంద్రప్రభుత్వం  అనుమతినిచ్చినట్లు తెలిపారు. 
 
దీనికి సంబంధించి ఏయూ స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కె.బసవయ్య మాట్లాడుతూ, ‘ఒకప్పుడు దేశంలోని అనేక పోర్టులకు వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతయ్యేది. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్‌కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని ఎగుమతి దిగుమతులపైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది. దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు’ అని తెలిపారు. 

ఇక  విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్‌  హరనాథ్ మాట్లాడుతూ, ‘అమ్మోనియం నైట్రేట్‌తో వచ్చిన నౌకకు పోర్టులో బెర్త్‌ ఇవ్వాలంటే స్థానిక పోలీస్‌ శాఖతో పాటు కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి అనుమతులుండాలి. అన్‌లోడ్‌ జరుగుతున్నంత సేపూ బెర్త్‌ వద్ద ఫైర్‌ టెండర్‌ని పోర్టు సిద్ధంగా ఉంచుతుంది. ఒక్క కిలో కూడా పోర్టులో నిల్వలేకుండా ప్రత్యేక గోడౌన్లకు తరలిస్తారు. నిర్దిష్ట సమయంలో అన్‌లోడ్‌ ప్రక్రియ పూర్తిచేస్తారు.  అంతేకాక విశాఖ నుండి 35 రోజుల్లోపే ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు.  సురక్షితంగా హ్యాండ్లింగ్‌ చేసే సౌకర్యం ఉన్నందువల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. నౌక వచ్చిన కొద్దిసేపటిలోనే ఇక్కడి నుంచి ఏజెన్సీ ద్వారా గోడౌన్లకు వెళ్లిపోతుంటుంది అని తెలిపారు. వీరితో పాటు విశాఖ షిప్పింగ్స్‌ ఎండీ శ్రవణ్‌ మాట్లాడుతూ, విశాఖ పోర్టులో పేలుడు జరిగే పరిస్థితులు లేవు. భారత్‌లో అమ్మోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఎరువులకు, బొగ్గు గనుల్లో మాత్రమే వినియోగిస్తున్నారు.  పేలుడు జరగాలంటే ఏదైనా రసాయనంతో కలవాలి. ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తేలేదు.  డైరెక్టర్‌  నిబంధనల మేరకే 20 ఏళ్లుగా అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు, హ్యాండ్లింగ్, ఎగుమతికి సంబంధించిన ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాం. ఎలాంటి ప్రమాదం జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఒకేచోట ఎక్కువ కాలం ఉంటేనే పేలుడు సంభవిస్తుంది. కానీ, మా గోడౌన్ల నుంచి నెల రోజుల్లోనే  అమ్మోనియం నైట్రేట్‌ మొత్తాన్ని తరలిస్తున్నాం’ అని తెలిపారు.  

చదవండి: బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement