Ammonium nitrate
-
భయంకరమైన నైట్రేట్ స్లర్రీ గురించి విస్తుపోయే నిజాలు
సాక్షి నెట్వర్క్: అవును.. కావాలనుకున్న వారికి.. మనింటి పక్కన దుకాణంలో కొవ్వొత్తి, దాన్ని వెలిగించేందుకు అవసరమైన అగ్గిపెట్టె ఎంత సులభంగా దొరుకుతాయో.. అంతే సులువుగా పేలుడు పదార్థాలు, డిటొనేటర్లు దొరుకుతున్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. ఇటీవలి కొన్ని ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, వ్యాపారంపై దృష్టి సారించిన ‘సాక్షి’.. ఈ వ్యవహారమేంటో తేల్చడానికి సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన డ్రిల్లింగ్ మిషన్ తో కూడిన ఓ ట్రాక్టర్ యజమానిని స్వయంగా సంప్రదించింది. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ.. పేస్ట్‌లా ఉండే అమ్మోనియం నైట్రేట్‌నే అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ అంటారు. ఇదో శక్తివంతమైన పేలుడు పదార్థం. 2013 ఫిబ్రవరిలో 18 మందిని బలి తీసుకున్న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఉగ్రవాదులు ఉపయోగించింది కేవలం ఒకటిన్నర కిలోల స్లర్రీ మాత్రమే అంటేనే.. ఇది ఎంతటి మారణహోమాన్ని సృష్టించగలదో అర్థమవుతుంది. 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరిల్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న పేలుళ్ళు సహా దేశ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద, మావోయిస్టు కార్యకలాపాల్లో వినియోగించిన బాంబులను ముష్కరులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీతోనే రూపొందించారు. ఇంతటి శక్తివంతమైన, ప్రమాదకరమైన పేలుడు పదార్థం, దీన్ని పేల్చడానికి ఉపయోగించే డిటొనేటర్లు (పూసలు) సామాన్యులకు సైతం సులువుగా దొరుకుతున్నాయా? అన్ని రిస్క్‌లు మీవే అయితే 350 డిటోనేటర్లు, 350 స్లర్రీ ప్యాకెట్లతో (ఒక్కొక్కటి 200 గ్రాములు) కూడిన బాక్సును రూ.7 వేలకు ఇస్తా అంటూ జంకూ బొంకూ లేకుండా ఆయన చెప్పడం నివ్వెరపరిచింది. ఇంత మొత్తం పేలుడుపదార్థాలతో అసాంఘికశక్తులు భారీ మారణహోమాలు ఎన్నో సృష్టించవచ్చు.రాష్ట్రంలో పేలుడు పదార్థాలు ఈజీగా దొరుకుతున్న విషయం ఈ ఉదంతంతో బట్టబయలైంది. నిరాటంకంగా అక్రమ దందా తయారీదారులు, డీలర్ల లాభాపేక్ష, ఎక్కడికక్కడ పోలీసులు, ప్రజా ప్రతినిధుల అండతో పేలుడు పదార్థాల అక్రమ దందా, రవాణా నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా అక్రమ మార్గం పడుతున్న పేలుడు పదార్థాలు కేవలం క్వారీలు, వెంచర్లు, బావుల తవ్వకం తదితర వ్యవహారాలకు మాత్రమే వినియోగం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో మావోయిస్టులకు, ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు చేరుతుండటం ఆందోళన కలిగించే అంశం. కేరళలోని కోజికోడ్ రైల్వే పోలీసులు ఇటీవల ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 100 స్లర్రీ ప్యాకెట్లు, 350 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి తెలంగాణ నుంచే వచ్చినట్లు వారు అనుమానిస్తున్నారు. కిలోక్కూడా లెక్కుండాలి కానీ... తయారీ మొదలు, వినియోగం వరకు, చివరకు వాడగా మిగిలింది వాపస్ చేసే వరకు ప్రతి కేజీ స్లర్రీకి పక్కా లెక్క రికార్డుల సహితంగా ఉండాలి. కానీ ఏ పరిశ్రమలోనూ, డీలర్, రిటైలర్ వద్దా సరైన రికార్డులు ఉండటం లేదు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశ్రమల నుండి పేలుడు పదార్ధాలు సరఫరా అయ్యే క్రమంలో నెలవారీగా రూ.లక్షల్లో ముడుపులు ముడుతుండటమే ఇందుకు కారణం. సరఫరా ఆయ్యే పేలుడు పదార్థాల ఇండెక్స్‌ను జిల్లా ఎస్పీకి పరిశ్రమల నిర్వాహకులు తెలియజేయటంతో పాటు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. పరిశ్రమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ధ్రువీకరణ పత్రాలను సమర్పించి.. లైసెన్స్డ్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ముడుపులు చేతులు మారుతున్నాయని అంటున్నారు. గోదాములు ఉన్న మండలాల్లో ఎస్ఐ స్థాయి అధికారికి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, సబ్ డివిజనల్ స్థాయి అధికారికి ప్రతి మూడు నెలలకోసారి రూ.10 వేల దాకా ముట్టజెబుతున్నారు. ప్రజా ప్రతినిధులకూ ఇవ్వాల్సిందే..! పరిశ్రమల నిర్వాహకులు తమకు అన్ని విధాల సహకారం అందించే ఆయా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, మండల స్థాయి నాయకుల జేబులు సైతం తడుపుతున్నారు. ఎన్నికల ఖర్చులు, పార్టీ సభల నిర్వహణ.. తదితర అవసరాలకు సైతం కొన్ని యాజమాన్యాలు రూ.లక్షల్లో ముట్టచెప్పడం సర్వసాధారణమని తేలింది. ఈ కారణంగానే ఆ పరిశ్రమల్లో పేలుళ్ల వంటి ఘటనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకులు మృతి చెందినప్పుడు వీరు పరిశ్రమల నిర్వాహకులకు అండగా ఉంటున్నారు. పరిమితికి మించి నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 15 పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమల్లో అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, ఇమిల్యూషన్, గన్‌పౌడర్, డిటోనేటర్లు, డిటొనేటింగ్ ఫ్యూజ్‌లు, పీఈటీఎం,పెంటాలైట్ వంటివి తయారవుతున్నాయి. వీటికి తెలంగాణలోని పలు జిల్లాల్లో, అలాగే ఏపీలో పలువురు లైసెన్స్డ్ డీలర్లు ఉన్నారు. వీరంతా గ్రామాల్లోనే పలు చోట్ల లైసెన్స్ కలిగి ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. అయితే నిబంధనలను అతిక్రమించి ఈ గోదాముల్లో పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. ఏడాది కిందట నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం పల్లెలపహాడ్ గ్రామంలోని ఓ గోదాములో నిబంధనలు అతిక్రమించి పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం అధికారుల తనిఖీల్లో బయటపడడంతో ఆ గోదామును సీజ్ చేశారు. మూడున్నరేళ్ళ కిందట వెలిమినేడు గ్రామానికి చెందిన పేలుడు పదార్థాలు నిల్వ చేసే లైసెన్స్డ్ ఉన్న డీలర్ నిబంధనలకు విరుద్ధంగా యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం శివారుల్లోని కోళ్ళ ఫారాల్లో పేలుడు పదార్ధాలు నిల్వ చేసి దొరికిపోయారు. ఇప్పుడు కూడా అధికారులు దాడులు నిర్వహిస్తే అనేక గోదాముల్లో అక్రమ నిల్వలు బయటపడతాయి. నిబంధనల ప్రకారం ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అన్ని జాగ్రత్తలతో రూపొందించిన మ్యాగజీన్ వ్యాన్లలోనే తరలించాలి. అయితే ఈ అక్రమ దందాలు చేసే వాళ్లు సాధారణ కార్లు, ఆటోలు, లారీలు వినియోగిస్తున్నారు. వ్యవస్థీకృతంగానే వ్యవహారం ఈ రకంగా పేలుడు పదార్థాలు (ఎక్స్‌ప్లోజివ్స్) అడ్డ దారిలో అక్రమ వ్యాపారుల వద్దకు చేరడం వెనుక వ్యవస్థీకృతంగా సాగే వ్యవహారం ఉంటోంది. ఫ్యాక్టరీలో తయారీ దశ నుంచి హోల్‌సేలర్, రిటైలర్ల వద్దకు చేరడం... చివరకు వినియోగం వివరాలు కూడా పక్కా పారదర్శకంగా, రికార్డులతో కూడి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే వీటికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రతి దశలోనూ అవకాశం ఉన్నంత వరకు ఎక్స్‌ప్లోజివ్స్‌ను పక్కదారి పట్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న రికార్డులను తారుమారు చేస్తూ పని కానిస్తున్నారు. వీటి రవాణా, నిల్వ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జనావాసాల మధ్యే ఉంచుతున్నారు. వెంచర్, రోడ్డు, క్వారీ, ఇతర పనులకు కావాల్సిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు.. ఆ పనులు చేయగా కొంత మిగులుతుంది. ఒక్కోసారి 20 నుంచి 30 కేజీల వరకు మిగులుతుంటుంది. ఇలా అనేకసార్లుగా పెద్ద మొత్తంలో పోగుపడిన పేలుడు పదార్థాలను, తమకు అవసరమని వచ్చే వారికి వారెవరో తెలిసి, కొన్ని సందర్భాల్లో తెలియకపోయినా అమ్మేస్తుంటారు. వారే ‘మేనేజ్’ చేస్తారు భువనగిరిలోని ఓ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నుంచి మల్లేష్ (పేరు మార్చాం) అనే లైసెన్స్డ్ డీలర్ 500 క్వింటాళ్ల గన్‌పౌడర్, 1,000 కేజీల డిటొనేటర్లు కొనుగోలు చేశాడు. సదరు డీలర్ నుంచి రిటైలర్ రాజు (పేరు మార్చాం) 100 క్వింటాళ్ల గన్‌పౌడర్, 200 కేజీల డిటొనేటర్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ వెంచర్లో బండరాళ్లు పగులగొట్టే కాంట్రాక్ట్‌ను శ్రీనివాస్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఇందుకు అతనికి 40 క్వింటాళ్ల గన్‌పౌడర్ 100 కేజీల డిటొనేటర్లు అవసరం. శ్రీనివాస్ తనకు ఫలానా పేలుడు పదార్థాలు కావాలని రాజును సంప్రదించాడు. శ్రీనివాస్ చట్టబద్ధంగా కొనాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకు ఆ ఏరియా పరిధిలోని పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సై నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. ఇదంతా పెద్దరిస్క్. అన్నీ ‘నేనే చూసుకుంటా’అని సదరు కాంట్రాక్టర్‌కు రిటైలర్ రాజు చెప్పి పేమెంట్ తీసుకున్నాడు. ఆ పేలుడు పదార్థాలు రవాణా అయ్యే మార్గంలోని అందరినీ ‘మేనేజ్’చేసి సదరు కాంట్రాక్టర్ వద్దకు చేర్చేశాడు. వేబిల్ కొంత.. రవాణా మరింత రమేష్ (పేరు మార్చాం) అనే రిటైలర్‌కు నల్లగొండ జిల్లా చిట్యాలలో గోదాము ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన ఓ లైసెన్స్డ్ డీలర్‌నుంచి కొనుగోలుచేసిన పేలుడు పదార్థాలను అందులో భద్రపరిచాడు. కొత్త రోడ్డు నిర్మాణంలో పెద్ద బండలను పగులగొట్టేందుకు పేలుడు పదార్థాలు కావాలని కాంట్రాక్టర్ సదరు రిటైలర్ను సంప్రదించాడు. అప్పటికే అతని దగ్గర 500 డిటొనేటర్లు , పది క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ సరఫరాకు అవసరమైన వేబిల్ (అధికారికంగా) ఉంటుంది. కానీ సదరు రిటైలర్ పరస్పర అవగాహనతో అదే వేబిల్పై కాంట్రాక్టర్‌కు 1,000 పూసలు, 20 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేశాడు. ఇక్కడ అదనంగా పంపిన పేలుడు పదార్థాలను రిటైలర్ తనకున్న పరిచయాల మేరకు ఇతరులకు అక్రమంగా, అధిక ధరకు విక్రయించేస్తాడు. ఈ అదనపు లెక్కలన్నీ కంపెనీ నుంచి డీలర్‌కు, డీలర్ నుంచి రిటైలర్‌కు ఇలా.. ఓ లింక్ ప్రకారం నడుస్తాయన్నమాట. మహా నగరంలో మరింత ఈజీగా.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో పేలుడు పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. రాతి నేల కావడంతో పునాదులు, బావుల తవ్వకంలో అడ్డుగా వచ్చిన రాళ్ళను పగలకొట్టడానికి అప్పట్లో జిలెటిన్ స్టిక్స్ ఇప్పుడు స్లర్రీ వినియోగిస్తున్నారు. లైసెన్స్డ్ వ్యాపారుల నుంచి వీటిని కొనుగోలు చేయడం, అదీకృత ఎక్స్ప్లోజర్స్ను సంప్రదించి వారితో బ్లాస్టింగ్ పని చేయించడం ఖర్చుతో కూడింది. దీంతో అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ‘అడ్డదారి’లో దొరికే పేలుడు పదార్థాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్రమ వ్యాపారుల దందాలు సాగుతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలోని బిల్డర్లు, రాచకొండలోని వృత్తి కార్మికులతో పాటు డ్రిల్లింగ్ మెషీన్లతో కూడిన ట్రాక్టర్లు కలిగిన వారిలో అనేక మంది వద్ద ఇటు స్లర్రీ, అటు డిటొనేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడైనా మన స్లర్రీయే! ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని షిమోగ శివార్లలో ఉన్న హునసోడు వద్ద ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కారణంగా జరిగిన ఈ ఘోరం 14 మందిని పొట్టనపెట్టుకుంది. ఆ తర్వాతి నెల్లో అదే రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ సమీపంలోని హిరేనాగవల్లిలోని మరో క్వారీలో ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ రెండు క్వారీలకు పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ అక్రమంగా రవాణా అయింది తెలంగాణ నుంచే అని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలడం ఆందోళన కలిగించే అంశం. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులకు అవసరమైన అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, డిటొనేటర్లు తెలంగాణలోని కొందరు పేలుడు పదార్థాల (ఎక్స్‌ప్లోజివ్స్) డీలర్ల నుంచే అందుతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించడం (ఈ ఏడాది ఫిబ్రవరిలో) కూడా గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు రెండు నెలల క్రితం భువనగిరి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి డాల్ఫిన్ హోటల్ వద్ద వల పన్నిన టౌన్ పోలీసులు ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ ప్యాకెట్లు 1,792, దీన్ని పేల్చడానికి ఉపకరించే డిటోనేటర్లు 1,600 గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు. రిటైలర్‌కు వచ్చేసరికే ధర రెట్టింపు కంపెనీల నుంచి డీలర్‌కు వెళ్లే పేలుడు పదార్థాలు రిటైల్ వ్యాపారులకు వెళ్లే సరికి 100 శాతం అదనపు రేటుతో విక్రయిస్తున్నారు. ఉదాహరణకు 50 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ కంపెనీ ధర రూ.2,500 కాగా రిటైలర్‌కు రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే ఒక పూస ధర రూ.4.50 కాగా రూ.6.50 కు విక్రయిస్తున్నారు. రిటైలర్లు తమ లాభం కలుపుకొని అమ్మకాలు సాగిస్తుంటారు. ఇలా చేతులు మారే కొద్దీ ధర పెరుగుతూ పోతుంది. పోలీస్ స్టేషన్లే అడ్డాలుగా.. పలు పోలీస్ స్టేషన్లు పేలుడు పదార్థాల అక్రమ దందాకు అడ్డాగా మారుతున్నాయి. బొమ్మలరామారం మండలంలోని పలు ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీల నుంచి డిటొనేటర్ల లోడు బయటకు రవాణా చేస్తున్న సమయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతుల కోసం వచ్చే డిటొనేటర్లు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు.. పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రాలపై స్వయంగా పోలీస్ స్టేషన్ స్టాంపు ముద్రలను వేసుకొనేంత చనువు ఉందంటే అతిశయోక్తి కాదు. విధుల్లో ఉన్న పోలీసులు సదరు పత్రాలను ఏ మాత్రం పరిశీలించడం లేదు. అక్రమ బ్లాస్టింగ్స్‌లో కాసుల వేట హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని పోలీసుస్టేషన్లకు కూడా ఈ అక్రమ పేలుడు పదార్థాల దందా, అక్రమ బ్లాస్టింగ్స్ కాసులు కురిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించి కంట్రోల్డ్ బ్లాస్టింగ్స్ చేయడానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అధీకృత డీలర్ల వద్దే పేలుడు పదార్థాలు ఖరీదు చేశామని, లైసెన్స్ కలిగిన వ్యక్తే పేలుడు జరుపుతారంటూ అందుకు సంబంధించిన పత్రాలను వారం రోజుల ముందే పోలీసుస్టేషన్ లో సమర్పించాలి. ఆ ప్రదేశాలను ఏసీపీ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. అయితే ఏ ఒక్క ప్రాంతంలోనూ ఇది పక్కాగా జరగట్లేదు. మామూళ్లకు అలవాటుపడిన పోలీసులు అక్రమ పేలుళ్లకు ప్రత్యక్షంగా, పేలుడు పదార్థాల దందాకు పరోక్షంగా సహకరిస్తున్నారు. సిబ్బంది కొరతలో ‘పెసో’ ‘డంప్’లు దొరికినప్పుడు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసులు హడావుడి చేస్తుంటారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులు, గతంలో ఈ తరహా కేసుల్లో అరెస్టయిన వాళ్ళతో పాటు లైసెన్స్డ్ డీలర్ల వద్ద తనిఖీలు చేస్తుంటారు. వాస్తవానికి ఎక్స్‌ప్లోజివ్స్ ఆడిటింగ్‌పై పూర్తి అవగాహన లేని సివిల్ పోలీసులు కేవలం వారి వద్ద ఉన్న పెట్టెలు లెక్కించడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆ సాకుతో చేతులు ‘తడుపుకోవడమో’, దులుపుకోవడమో చేస్తున్నారు. ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్‌ల జారీ, రెన్యువల్, ఆడిటింగ్ తదితరాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ (పెసో)పై ఉంటుంది. ఈ సంస్థ సిబ్బంది, వనరులు ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో చేష్టలుడిగి చూస్తోంది. ‘అధికార సహకారానికి’ఇవీ ఉదాహరణలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి మండలం రాయిగిరి వద్ద ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులకు 2019 డిసెంబర్లో ఒక లారీ పట్టుబడింది. ఆ లారీలో ఎలాంటి అనుమతులూ లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో తయారైన పేలుడు పదార్థాలు దొరికింది భువనగిరి మండలంలో.. కాబట్టి, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావాలి.. కానీ, ఈ కేసును తారుమారు చేసి నిందితులను రక్షించేందుకు బీబీనగర్ మండలంలోని టోల్‌ప్లాజా వద్ద లారీ పట్టుబడినట్లు ఆ మండల స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇలా అరెస్టు.. అలా బెయిలు.. బొమ్మలరామారంలో, చిట్యాల మండలంలో రెండు ప్రధాన పేలుడు పదార్థాల కంపెనీలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని కంపెనీ యజమానికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మునుగోడు మాజీ ఎమ్యెల్యే ఒకరికి ఈ కంపెనీ యజమాని దగ్గరి బంధువు. గత ఏడాది ఆగస్టు 18వ తేదీన కంపెనీ యజమానిని పేలుడు పదార్థాల కేసుల్లో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం, రిమాండ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుండగా.. అధికార పారీ్టకి చెందిన ఉన్నత స్థాయి ప్రజా ప్రతిని«ధి ఒకరి నుంచి ఫోన్ రావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. డీసీఎం కేసు తెరమరుగు.. రెండేళ్ల క్రితం నార్సింగి ప్రాంతంలో ఓ పేలుడు చోటు చేసుకుంది. ఓ సైట్లో వినియోగించడానికి అవసరమైన పేలుడు పదార్థాలను మ్యాగజీన్ వ్యాన్‌లో తీసుకువెళ్లాల్సి ఉండగా... డీసీఏం వ్యాన్‌లో తరలించారు. ఇవి ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఈ కేసు విషయంలో హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో మిన్నకుండిపోయారు. పవర్ ఇదీ స్లర్రీ నిరంతర నిఘా కొనసాగుతోంది పేలుడు పదార్థాల తయారీ, అమ్మకాలపై నిఘా కొనసాగుతోంది. పోలీస్‌శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా కొందరు పేలుళ్లు చేపడుతున్నారు. అవగాహన లోపంతో కొందరు, పన్నులు ఎగవేయడం కోసం మరికొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. చిన్న వైరు దొరికినా వదిలిపెట్టడం లేదు. –కె.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి -శ్రీరంగం కామేష్, సాక్షి నెట్వర్క్ -
వేలానికి మాజీ పోర్న్ స్టార్ కళ్లజోడు
వాషింగ్టన్: బీరుట్ పేలుడు ఘటనలో బాధితులకు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. మాజీ పోర్న్ స్టార్, క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బీరుట్ బాధితులకు సాయం చేసేందుకు తన ఫేవరెట్ కళ్లద్దాలను ఆమె ‘ఈబే’ ఆన్లైన్ పోర్టల్‌లో వేలానికి పెట్టారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును... పేలుడు బాధితుల సహాయార్థం లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థకు ఇస్తానని చెప్పారు. (బీరుట్ ప్రమాదం: నెల కిత్రమే హెచ్చరించినా) వేలానికి పెట్టిన మొదటి 11 గంటల్లోనే తన కళ్లజోడుకు రూ.75 లక్షల దాకా పలికినట్లు తెలిపారు. ఇప్పటివరకు 189 మంది బిడ్డింగ్ వేశారని పేర్కొన్నారు. మరింతమంది బిడ్డింగ్‌లో పాల్గొని ఎక్కువ మొత్తం అందించాలని ఆమె కోరారు. మీరిచ్చే ప్రతిపైసా బీరుట్ పచ్చదనానికి ఉపయోగపడుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, మియా ఖలీఫా పుట్టింది లెబనాన్‌లోనే. 2001లో ఆమె అమెరికా వెళ్లిపోయారు. ఇక బీరుట్ పేలుడు ఘటనలో 178 మంది చనిపోగా... 6000 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. (నా గత జీవితం దారుణమైంది : పోర్న్ స్టార్) -
ఏపీకి ఎలాంటి ముప్పు లేదు: డీజీపీ
సాక్షి, గుంటూరు: బీరూట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ఎలాంటి ముప్పు లేదని డీజీపీ తెలిపారు. శుక్రవారం మంగళగిరి కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. బీరూట్ లోని అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో పోలీస్ శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం, వినియోగంపై ప్రత్యేక ద్రుష్టి సారించామని తెలిపారు. అమ్మోనియం నైట్రేట్ వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని కంపెనీలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని గౌతం సవాంగ్ సూచించారు. కాగా అమ్మోనియం నైట్రేట్ పై 2012 సంవత్సరంలో రూపొందించిన నిబంధనలు : ►లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు. ►అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు. ►లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే నిల్వ ఉంచాలి. ►నిబంధనలకు లోబడి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలి. ►ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే సరఫరా చేయాలి. ►పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేయరాదు. ►కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు అనుమతి లేదు. ►18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించకూడదు. ►అనుమతి లేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్‌లకు ఉపయోగించరాదు. ►అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. -
‘హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్’
సాక్షి, హైదరాబాద్ : కట్టుదిట్టమైన భద్రత మధ్య చెన్నై పోర్టునుంచి అమ్మోనియం నైట్రేట్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం ఎనిమిది కంటైనర్లలో వచ్చిన అమ్మోనియం నైట్రేట్‌ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నిల్వ చేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సాల్వో కంపెనీ రీప్రాసెస్ చేయనుంది. ఈ ప్రక్రియ తర్వాత కోల్ ఇండియా, సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. రెండో రోజుల్లో రీప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతుందని సాల్వో కంపెనీ పేర్కొంది. (హైదరాబాద్‌కు ‘అమ్మో’నియం నైట్రేట్) అయితే ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్ల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బీరుట్ పేలుళ్ల అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించారు. లెబనాన్ పేలుళ్లతో చెన్నై పోర్టు నుంచి హైదరాబాద్ తరలించినట్లు సాల్వో కంపెనీ పేర్కొంది. కాగా అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపుపై సోమవారం ట్విట్టర్లో గవర్నర్ స్పందించిన విషయం తెలిసిందే. 'ఆదివారం రాత్రి అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలియడంతో ప్రజల భద్రత గురించి ఆందోళనకు గురయ్యాను. పరిస్థితిని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడాను.' అని ట్విట్టర్లో తమిళిసై పేర్కొన్నారు. -
నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా
బీరుట్: లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్‌ను దేవుడే రక్షించు గాక’ అని టీవీలో తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్) -
హైదరాబాద్‌కు ‘అమ్మో’నియం నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల లెబనాన్‌లోని బీరుట్ పోర్టులో నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ విస్ఫోటనం చెంది భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పోర్టుల్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై పోర్టుకు సమీపంలోని మనాలిలో గల ఓ ప్రైవేటు గోదాములో 740 టన్నుల అమోనియం నైట్రేట్‌ను గత ఐదేళ్లుగా నిల్వ ఉంచడం పట్ల స్థానిక రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీంతో కస్టమ్స్ అధికారులు 180 టన్నుల అమోనియం నైట్రేట్‌ను 10 కంటైనర్ ట్రక్కుల ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం రాత్రి ఈ విషయం తెలియడంతో ప్రజల భద్రత పట్ల ఆందోళనకు గురయ్యామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పరిస్థితిని అంచనా వేయడంతో పాటు తగు చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. తమిళనాడులోని కరూర్‌కు చెందిన ఓ కంపెనీ లైసెన్స్ లేకుండా దక్షిణ కొరియా నుంచి 2015లో 742 టన్నుల అమోనియం నైట్రేట్‌ను చెన్నై పోర్టుకు తరలించగా కస్టమ్స్ అధికారులు జప్తుచేశారు. సదరు కంపెనీ, కస్టమ్స్ విభాగం మధ్య న్యాయ వివాదాల నేపథ్యంలో ఐదేళ్లుగా అమోనియం నైట్రేట్‌ను ప్రైవేటు గోదాములో నిల్వ ఉంచారు. ప్రస్తుతం 10 కంటైనర్లలో 180 టన్నుల సరుకును హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మరో 27 కంటైనర్లలో 561 టన్నుల అమోనియం నైట్రేట్‌ను మరో వారం రోజుల్లో అక్కడి నుంచి తరలించనున్నారు. చెన్నై పోలీసులు, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌కు అమోనియం నైట్రేట్ తరలింపునకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కస్టమ్స్ నిర్వహించిన వేలం ద్వారా సరుకును కొనుగోలు చేసిన నగరానికి చెందిన ఓ వ్యాపారికి దీనిని అప్పగించనున్నారని తెలిసింది. -
‘విశాఖ ప్రజలు ఆ పుకార్లను నమ్మవద్దు’
సాక్షి, విశాఖపట్నం: అమ్మోనియం నైట్రేట్ వల్ల నగరానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. (ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!) అమ్మోనియం నైట్రేట్‌ని బొగ్గు గనులలో వినియోగిస్తారని రామ్మోహన రావు తెలిపారు. విశాఖ పోర్టులో కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. షిప్ వచ్చే ముందు పోర్టుకి సమాచారం వస్తుందని.. అన్ని అనుమతుల తర్వాతే హ్యాండ్లింగ్‌కి అనుమతిస్తామన్నారు. అమ్మోనియం నైట్రేట్ గురించి విశాఖ ప్రజలు అపోహ పడవద్దని రామ్మోహనరావు కోరారు. -
ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!
సాక్షి, విశాఖ పట్నం: లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. అయితే పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాక పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి. ఇక విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్లోడ్ చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు అని నిపుణులు, అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు. దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. విశాఖలో సురక్షితమనే కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏయూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కె.బసవయ్య మాట్లాడుతూ, ‘ఒకప్పుడు దేశంలోని అనేక పోర్టులకు వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతయ్యేది. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్‌కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని ఎగుమతి దిగుమతులపైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది. దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు’ అని తెలిపారు. ఇక విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్ మాట్లాడుతూ, ‘అమ్మోనియం నైట్రేట్‌తో వచ్చిన నౌకకు పోర్టులో బెర్త్ ఇవ్వాలంటే స్థానిక పోలీస్ శాఖతో పాటు కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి అనుమతులుండాలి. అన్లోడ్ జరుగుతున్నంత సేపూ బెర్త్ వద్ద ఫైర్ టెండర్ని పోర్టు సిద్ధంగా ఉంచుతుంది. ఒక్క కిలో కూడా పోర్టులో నిల్వలేకుండా ప్రత్యేక గోడౌన్లకు తరలిస్తారు. నిర్దిష్ట సమయంలో అన్లోడ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. అంతేకాక విశాఖ నుండి 35 రోజుల్లోపే ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. సురక్షితంగా హ్యాండ్లింగ్ చేసే సౌకర్యం ఉన్నందువల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. నౌక వచ్చిన కొద్దిసేపటిలోనే ఇక్కడి నుంచి ఏజెన్సీ ద్వారా గోడౌన్లకు వెళ్లిపోతుంటుంది అని తెలిపారు. వీరితో పాటు విశాఖ షిప్పింగ్స్ ఎండీ శ్రవణ్ మాట్లాడుతూ, విశాఖ పోర్టులో పేలుడు జరిగే పరిస్థితులు లేవు. భారత్‌లో అమ్మోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఎరువులకు, బొగ్గు గనుల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. పేలుడు జరగాలంటే ఏదైనా రసాయనంతో కలవాలి. ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తేలేదు. డైరెక్టర్ నిబంధనల మేరకే 20 ఏళ్లుగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, హ్యాండ్లింగ్, ఎగుమతికి సంబంధించిన ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాం. ఎలాంటి ప్రమాదం జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఒకేచోట ఎక్కువ కాలం ఉంటేనే పేలుడు సంభవిస్తుంది. కానీ, మా గోడౌన్ల నుంచి నెల రోజుల్లోనే అమ్మోనియం నైట్రేట్ మొత్తాన్ని తరలిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? -
చెన్నైలో భారీగా అమ్మోనియం నైట్రేట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: లెబనాన్ దేశ రాజధాని నగరం బీరుట్లో అత్యంత భారీ పేలుడు ఘటన నేపథ్యంలో చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై హార్బర్ గిడ్డంగిలో అయిదేళ్లుగా 700 టన్నుల ప్రమాదకర అమోనియం నైట్రేట్ నిల్వలు ఉండటమే ఇందుకు కారణం. 2015లో చెన్నైకి చెందిన ఓ సంస్థ రూ.1.80 కోట్ల విలువైన 700 టన్నుల అమోనియం నైట్రేట్‌ను దక్షిణ కొరియా నుంచి తెప్పించింది. అయితే, ఎరువుల తయారీ గ్రేడ్ రసాయనం పేరుతో పేలుడు పదార్థాలకు వాడే గ్రేడ్ అమోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంది. దీంతో ప్రమాదకరమైన ఆ కెమికల్‌ను అధికారులు సీజ్ చేసి, 37 కంటైనర్లలో హార్బర్లోని గిడ్డంగిలో ఉంచారు. అయిదేళ్లయినా ఆ కంటైనర్లు అక్కడే ఉన్నాయి. బీరుట్ హార్బర్లో సంభవించిన పేలుడు.. అమ్మోనియం నైట్రేట్‌ను ఏళ్లపాటు ఒకే చోట ఉంచిన కారణంగానే సంభవించడం తెలిసిందే. చెన్నై హార్బర్లో సైతం 2015 నుంచి అమ్మోనియం నైట్రేట్ గిడ్డంగికే పరిమితం కావడం వల్ల అదే తీరులో పేలుళ్లకు దారితీస్తే చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, కస్టమ్స్ అధికారులు గురువారం చెన్నై హార్బర్లో అమోనియం నైట్రేట్ నిల్వలు, భద్రతా చర్యలపై తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నిల్వలతో ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 2015లో చెన్నై వరదల సమయంలో సుమారు 7 టన్నుల అమోనియం నైట్రేట్ పాడైపోగా మిగతా 690 టన్నులను త్వరలోనే ఈ–వేలం ద్వారా విక్రయిస్తామని వెల్లడించారు. -
‘స్పందించకపోతే చెన్నై మరో బీరూట్’
చెన్నై: అసురక్షిత పద్దతిలో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రైట్ బీరూట్‌లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో రెండు రోజుల క్రితం ప్రత్యక్షంగా చూశాం. ఈ ఘటనలో దాదాపు 135 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇళ్లు, వీధులు సర్వనాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకనైనా అప్రమత్తం కాకపోతే.. చెన్నై కూడా మరో బీరూట్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏళ్ల తరబడి సుమారు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని నిల్వ ఉంచారు. బీరూట్ సంఘటనతో స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని.. అది కస్టమ్స్ శాఖ కంట్రోల్లో ఉందని అధికారులు తెలిపారు. (బీరూట్ పేలుళ్లు: వైరల్ వీడియోలు) బాణాసంచా, ఎరువుల తయారీలో వినియోగించే ఈ పేలుడు పదార్థాన్ని ఫైర్‌వర్క్‌ను ..పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే శివకాశిలోని ఓ గ్రూపు కోసం ఉద్దేశించినదన్నారు. 2015లో ఈ అమోనియం నైట్రేట్‌ని చెన్నై పోర్టులో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మొత్తం 36 కంటెయినర్లు ఉన్నాయని వారు వెల్లడించారు. ఒక్కో కంటెయినర్ లో దాదాపు 20 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందన్నారు. దీన్ని శ్రీ అమ్మాన్ కెమికల్స్ అనే సంస్థ అక్రమంగా దిగుమతి చేసుకుందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తాము కోర్టుకెక్కామని.. గత ఏడాది నవంబరులోనే కోర్టు రూలింగ్ ఇచ్చిందన్నారు. త్వరలోనే వేలం వేస్తామని ఆయన చెప్పారు. -
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా?
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని అధికారులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, వాసన లేని స్ఫటికాకార పదార్ధం. ఇది సాధారణంగా ఎరువుగా ఉపయోగిస్తారు. ఇప్పుడే కాకుండా పలు దశాబ్దాలుగా అనేక పారిశ్రామిక పేలుళ్లకు కారణమయింది. అమ్మోనియం నైట్రేట్ కారణంగా 2013లో టెక్సాస్ ఎరువుల కర్మాగారంలో 15 మంది మృతి చెందారు. 2001లో ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని ఒక రసాయన కర్మాగారంలో 31 మంది మృతి చెందారు. అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకారి ఎందుకు? ఇంధన నూనెలతో కలిపినప్పుడు, అమ్మోనియం నైట్రేట్ శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని సృష్టిస్తుంది. అందుకే పేలుడు పదార్థాల కోసం తాలిబాన్ వంటి గ్రూపులు కూడా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తాయి. వ్యవసాయంలో, అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినప్పుడు తేమ కారణంగా త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా మొక్కల పెరుగుదలకు కీలకమైన నత్రజని మట్టిలో కలవడానికి ఉపయోగపడుతుంది. అమ్మోనియం నైట్రేట్ కారణంగానే పేలుడు సంభవించిందని లెబనాన్ ప్రధాని తెలిపారు. సాధారణ నిల్వ పరిస్థితులలో అధిక వేడి లేకుండా, అమ్మోనియం నైట్రేట్ మండటం కష్టమని ఐలాండ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జిమ్మీ ఆక్స్లీ తెలిపారు. జిమ్మీ ఆక్స్లీ మాట్లాడుతూ.. ‘మీరు బీరూట్ పేలుడు వీడియోను చూస్తే దాంట్లో నల్లటి, ఎర్రటి పొగను చూడవచ్చు. అది ఒక అసంపూర్ణ ప్రతిచర్య. అక్కడ అమ్మోనియం నైట్రేట్ ప్రతిచర్యను ప్రేరేపించే ఒక చిన్న పేలుడు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న పేలుడు ప్రమాదమా లేదా కావాలనే చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్ ఒక ఆక్సిడైజర్ ఇది దహన చర్యను వేగవంతం చేస్తోంది. అదేవిధంగా ఇతర పదార్థాలను మరింత సులభంగా మండించటానికి అనుమతిస్తుంది. అంతేకానీ దాని అంతట అది ఎక్కువగా మండదు. ఈ కారణాల వల్ల, సాధారణంగా దీనిని ఎక్కడ నిల్వ చేయవచ్చనే దానిపై చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. దీనిని ఇంధనాలు, వేడి వనరులు ఉన్న చోటుకు దూరంగా ఉంచాలి. చాలా యూరోపియన్ యూనియన్ దేశాలు అమ్మోనియం నైట్రేట్‌లో కాల్షియం కార్బోనేట్ కలిపి కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌గా మార్చాలి అని నిబంధనలు విధిస్తున్నాయి. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్‌తో పోలిస్తే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ చాలా సురక్షితం. యునైటెడ్ స్టేట్స్లో కూడా ఓక్లహోమా సిటీ దాడి తరువాత నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి. కెమికల్ ఫెసిలిటీ యాంటీ టెర్రరిజం స్టాండర్డ్స్ కింద 900 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్ కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే వాటి కోసం ప్రత్యేకమైన అనుమతులు అవసరం. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వ్యవసాయం, నిర్మాణ రంగంలో అమ్మోనియం నైట్రేట్ ఎంతో అవసరమ’ని ఆక్స్లీ చెప్పారు. ‘పేలుడు పదార్థాలు లేని ఈ ఆధునిక ప్రపంచం మనకు ఉండదు, అమ్మోనియం నైట్రేట్ ఎరువులు లేకుండా ఈ రోజు మన జనాభాకు ఆహారం ఇవ్వలేం. అందుకే దానిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి’ అని ఆయన వివరించారు. చదవండి: బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
తూప్రాన్(మెదక్): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లింగారెడ్డిపల్లిలోని అమెజాన్ స్టోన్ క్రషర్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 50 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తోపాటు 50 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రషర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమోనియం నైట్రేట్పై నిఘా!
కొయ్యూరు : తీవ్ర పేలుడు ప్రబావం కలిగిన అమోనియం నైట్రేట్ మావోయిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. క్వారీలకు సరఫరాపై కూడా నిఘా ఉంచారు. ఇటీవల కొందరినుంచి సుమా రు 300 కిలోల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకుని కేసులు పెట్టడం తెలిసిందే. లోతుగా దర్యాప్తు.. ఒకప్పుడు మావోయిస్టులకు విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు చేరేవి. కొంత కాలంగా ఆ పరిస్థితి లేకపోవడంతో మందుపాతరలు పేల్చే అవకాశం తగ్గింది. పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చేరుతున్నాయని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు స్టోన్ క్వారీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకుని అరెస్టులు చేశారు. పెదబొడ్డేపల్లిలో కూడా పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, దీంతో సంబంధాలున్న వారిపై కేసు నమోదు చేశారు. నాతవరం మండలంపై దృష్టి... మన్యంలో కొన్ని చోట్ల మాత్రమే క్వారీలున్నాయి. అక్కడ వినియోగించేది తక్కువే. దీంతో పోలీసులు మైదాన ప్రాంతంపై దృష్టిపెట్టారు. నాతవరం మండలంలో క్వారీలు ఎక్కువగా ఉండడంతో వాటిపై దృష్టి సారించారు. మన్యంలో ఎర్రమట్టి క్వారీలు నిర్వహించే వారిపై మావోయిస్టులు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం పోవడాన్ని పోలీసులు అనుమానించారు. వారికి అవసరమైంది ఏదో నిర్వాహకులు సరఫరా చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరిపారు. అమోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థం సరఫరా చేశారన్న అభియోగంపై ఇద్దరిని అరెస్టు చేశారు. క్వారీలపై పర్యవేక్షణ.. రూరల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ క్వారీలపై పూర్తిగా సిబ్బందితో దృష్టి సారించారు. అమోనియం నైట్రేట్‌ను డీజిల్ లేదా మండే ఏ పదార్థం దేనితో కలిపినా భారీ పేలుడు సంభవిస్తుంది. మావోయిస్టులు వాటితో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానిక సీఐ సోమశేఖర్‌ను సంప్రదించగా కొయ్యూరు మండలంలో పెద్దగా క్వారీలు లేవని చెప్పారు. ఉన్నవాటిని తనిఖీ చేశామని తెలిపారు.