బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని అధికారులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, వాసన లేని స్ఫటికాకార పదార్ధం. ఇది సాధారణంగా ఎరువుగా ఉపయోగిస్తారు. ఇప్పుడే కాకుండా పలు దశాబ్దాలుగా అనేక పారిశ్రామిక పేలుళ్లకు కారణమయింది. అమ్మోనియం నైట్రేట్ కారణంగా 2013లో టెక్సాస్ ఎరువుల కర్మాగారంలో 15 మంది మృతి చెందారు. 2001లో ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని ఒక రసాయన కర్మాగారంలో 31 మంది మృతి చెందారు.
అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకారి ఎందుకు?
ఇంధన నూనెలతో కలిపినప్పుడు, అమ్మోనియం నైట్రేట్ శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని సృష్టిస్తుంది. అందుకే పేలుడు పదార్థాల కోసం తాలిబాన్ వంటి గ్రూపులు కూడా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తాయి. వ్యవసాయంలో, అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినప్పుడు తేమ కారణంగా త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా మొక్కల పెరుగుదలకు కీలకమైన నత్రజని మట్టిలో కలవడానికి ఉపయోగపడుతుంది. అమ్మోనియం నైట్రేట్ కారణంగానే పేలుడు సంభవించిందని లెబనాన్ ప్రధాని తెలిపారు. సాధారణ నిల్వ పరిస్థితులలో అధిక వేడి లేకుండా, అమ్మోనియం నైట్రేట్ మండటం కష్టమని ఐలాండ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జిమ్మీ ఆక్స్లీ తెలిపారు.
జిమ్మీ ఆక్స్లీ మాట్లాడుతూ.. ‘మీరు బీరూట్ పేలుడు వీడియోను చూస్తే దాంట్లో నల్లటి, ఎర్రటి పొగను చూడవచ్చు. అది ఒక అసంపూర్ణ ప్రతిచర్య. అక్కడ అమ్మోనియం నైట్రేట్ ప్రతిచర్యను ప్రేరేపించే ఒక చిన్న పేలుడు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న పేలుడు ప్రమాదమా లేదా కావాలనే చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్ ఒక ఆక్సిడైజర్ ఇది దహన చర్యను వేగవంతం చేస్తోంది. అదేవిధంగా ఇతర పదార్థాలను మరింత సులభంగా మండించటానికి అనుమతిస్తుంది. అంతేకానీ దాని అంతట అది ఎక్కువగా మండదు. ఈ కారణాల వల్ల, సాధారణంగా దీనిని ఎక్కడ నిల్వ చేయవచ్చనే దానిపై చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి.
దీనిని ఇంధనాలు, వేడి వనరులు ఉన్న చోటుకు దూరంగా ఉంచాలి. చాలా యూరోపియన్ యూనియన్ దేశాలు అమ్మోనియం నైట్రేట్‌లో కాల్షియం కార్బోనేట్ కలిపి కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌గా మార్చాలి అని నిబంధనలు విధిస్తున్నాయి. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్‌తో పోలిస్తే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ చాలా సురక్షితం. యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఓక్లహోమా సిటీ దాడి తరువాత నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి. కెమికల్ ఫెసిలిటీ యాంటీ టెర్రరిజం స్టాండర్డ్స్ కింద 900 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్ కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే వాటి కోసం ప్రత్యేకమైన అనుమతులు అవసరం. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వ్యవసాయం, నిర్మాణ రంగంలో అమ్మోనియం నైట్రేట్ ఎంతో అవసరమ’ని ఆక్స్లీ చెప్పారు. ‘పేలుడు పదార్థాలు లేని ఈ ఆధునిక ప్రపంచం మనకు ఉండదు, అమ్మోనియం నైట్రేట్ ఎరువులు లేకుండా ఈ రోజు మన జనాభాకు ఆహారం ఇవ్వలేం. అందుకే దానిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి’ అని ఆయన వివరించారు.
బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా?
Published Wed, Aug 5 2020 11:20 AM | Last Updated on Wed, Aug 5 2020 1:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment