సాక్షి నెట్‌వర్క్: అవును.. కావాలనుకున్న వారికి.. మనింటి పక్కన దుకాణంలో కొవ్వొత్తి, దాన్ని వెలిగించేందుకు అవసరమైన అగ్గిపెట్టె ఎంత సులభంగా దొరుకుతాయో.. అంతే సులువుగా పేలుడు పదార్థాలు, డిటొనేటర్లు దొరుకుతున్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. ఇటీవలి కొన్ని ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, వ్యాపారంపై దృష్టి సారించిన ‘సాక్షి’.. ఈ వ్యవహారమేంటో తేల్చడానికి సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన డ్రిల్లింగ్ మిషన్ తో కూడిన ఓ ట్రాక్టర్ యజమానిని స్వయంగా సంప్రదించింది.
అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ..
పేస్ట్‌లా ఉండే అమ్మోనియం నైట్రేట్‌నే అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ అంటారు. ఇదో శక్తివంతమైన పేలుడు పదార్థం. 2013 ఫిబ్రవరిలో 18 మందిని బలి తీసుకున్న దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఉగ్రవాదులు ఉపయోగించింది కేవలం ఒకటిన్నర కిలోల స్లర్రీ మాత్రమే అంటేనే.. ఇది ఎంతటి మారణహోమాన్ని సృష్టించగలదో అర్థమవుతుంది.
2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరిల్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న పేలుళ్ళు సహా దేశ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద, మావోయిస్టు కార్యకలాపాల్లో వినియోగించిన బాంబులను ముష్కరులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీతోనే రూపొందించారు. ఇంతటి శక్తివంతమైన, ప్రమాదకరమైన పేలుడు పదార్థం, దీన్ని పేల్చడానికి ఉపయోగించే డిటొనేటర్లు (పూసలు) సామాన్యులకు సైతం సులువుగా దొరుకుతున్నాయా?
అన్ని రిస్క్‌లు మీవే అయితే 350 డిటోనేటర్లు, 350 స్లర్రీ ప్యాకెట్లతో (ఒక్కొక్కటి 200 గ్రాములు) కూడిన బాక్సును రూ.7 వేలకు ఇస్తా అంటూ జంకూ బొంకూ లేకుండా ఆయన చెప్పడం నివ్వెరపరిచింది. ఇంత మొత్తం పేలుడుపదార్థాలతో అసాంఘికశక్తులు భారీ మారణహోమాలు ఎన్నో సృష్టించవచ్చు.రాష్ట్రంలో పేలుడు పదార్థాలు ఈజీగా దొరుకుతున్న విషయం ఈ ఉదంతంతో బట్టబయలైంది.
నిరాటంకంగా అక్రమ దందా
తయారీదారులు, డీలర్ల లాభాపేక్ష, ఎక్కడికక్కడ పోలీసులు, ప్రజా ప్రతినిధుల అండతో పేలుడు పదార్థాల అక్రమ దందా, రవాణా నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా అక్రమ మార్గం పడుతున్న పేలుడు పదార్థాలు కేవలం క్వారీలు, వెంచర్లు, బావుల తవ్వకం తదితర వ్యవహారాలకు మాత్రమే వినియోగం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో మావోయిస్టులకు, ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు చేరుతుండటం ఆందోళన కలిగించే అంశం.
కేరళలోని కోజికోడ్ రైల్వే పోలీసులు ఇటీవల ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 100 స్లర్రీ ప్యాకెట్లు, 350 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి తెలంగాణ నుంచే వచ్చినట్లు వారు అనుమానిస్తున్నారు.
కిలోక్కూడా లెక్కుండాలి కానీ...
తయారీ మొదలు, వినియోగం వరకు, చివరకు వాడగా మిగిలింది వాపస్ చేసే వరకు ప్రతి కేజీ స్లర్రీకి పక్కా లెక్క రికార్డుల సహితంగా ఉండాలి. కానీ ఏ పరిశ్రమలోనూ, డీలర్, రిటైలర్ వద్దా సరైన రికార్డులు ఉండటం లేదు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశ్రమల నుండి పేలుడు పదార్ధాలు సరఫరా అయ్యే క్రమంలో నెలవారీగా రూ.లక్షల్లో ముడుపులు ముడుతుండటమే ఇందుకు కారణం. సరఫరా ఆయ్యే పేలుడు పదార్థాల ఇండెక్స్‌ను జిల్లా ఎస్‌పీకి పరిశ్రమల నిర్వాహకులు తెలియజేయటంతో పాటు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
పరిశ్రమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ధ్రువీకరణ పత్రాలను సమర్పించి.. లైసెన్స్‌డ్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ముడుపులు చేతులు మారుతున్నాయని అంటున్నారు. గోదాములు ఉన్న మండలాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారికి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, సబ్ డివిజనల్ స్థాయి అధికారికి ప్రతి మూడు నెలలకోసారి రూ.10 వేల దాకా ముట్టజెబుతున్నారు.
ప్రజా ప్రతినిధులకూ ఇవ్వాల్సిందే..!
పరిశ్రమల నిర్వాహకులు తమకు అన్ని విధాల సహకారం అందించే ఆయా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, మండల స్థాయి నాయకుల జేబులు సైతం తడుపుతున్నారు. ఎన్నికల ఖర్చులు, పార్టీ సభల నిర్వహణ.. తదితర అవసరాలకు సైతం కొన్ని యాజమాన్యాలు రూ.లక్షల్లో ముట్టచెప్పడం సర్వసాధారణమని తేలింది. ఈ కారణంగానే ఆ పరిశ్రమల్లో పేలుళ్ల వంటి ఘటనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకులు మృతి చెందినప్పుడు వీరు పరిశ్రమల నిర్వాహకులకు అండగా ఉంటున్నారు.
పరిమితికి మించి నిల్వలు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 15 పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమల్లో అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, ఇమిల్యూషన్, గన్‌పౌడర్, డిటోనేటర్లు, డిటొనేటింగ్ ఫ్యూజ్‌లు, పీఈటీఎం,పెంటాలైట్ వంటివి తయారవుతున్నాయి. వీటికి తెలంగాణలోని పలు జిల్లాల్లో, అలాగే ఏపీలో పలువురు లైసెన్స్‌డ్ డీలర్లు ఉన్నారు. వీరంతా గ్రామాల్లోనే పలు చోట్ల లైసెన్స్ కలిగి ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. అయితే నిబంధనలను అతిక్రమించి ఈ గోదాముల్లో పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు.
ఏడాది కిందట నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం పల్లెలపహాడ్ గ్రామంలోని ఓ గోదాములో నిబంధనలు అతిక్రమించి పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం అధికారుల తనిఖీల్లో బయటపడడంతో ఆ గోదామును సీజ్ చేశారు. మూడున్నరేళ్ళ కిందట వెలిమినేడు గ్రామానికి చెందిన పేలుడు పదార్థాలు నిల్వ చేసే లైసెన్స్‌డ్ ఉన్న డీలర్ నిబంధనలకు విరుద్ధంగా యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం శివారుల్లోని కోళ్ళ ఫారాల్లో పేలుడు పదార్ధాలు నిల్వ చేసి దొరికిపోయారు. ఇప్పుడు కూడా అధికారులు దాడులు నిర్వహిస్తే అనేక గోదాముల్లో అక్రమ నిల్వలు బయటపడతాయి. నిబంధనల ప్రకారం ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అన్ని జాగ్రత్తలతో రూపొందించిన మ్యాగజీన్ వ్యాన్లలోనే తరలించాలి. అయితే ఈ అక్రమ దందాలు చేసే వాళ్లు సాధారణ కార్లు, ఆటోలు, లారీలు వినియోగిస్తున్నారు.
వ్యవస్థీకృతంగానే వ్యవహారం
ఈ రకంగా పేలుడు పదార్థాలు (ఎక్స్‌ప్లోజివ్స్) అడ్డ దారిలో అక్రమ వ్యాపారుల వద్దకు చేరడం వెనుక వ్యవస్థీకృతంగా సాగే వ్యవహారం ఉంటోంది. ఫ్యాక్టరీలో తయారీ దశ నుంచి హోల్‌సేలర్, రిటైలర్‌ల వద్దకు చేరడం... చివరకు వినియోగం వివరాలు కూడా పక్కా పారదర్శకంగా, రికార్డులతో కూడి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే వీటికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రతి దశలోనూ అవకాశం ఉన్నంత వరకు ఎక్స్‌ప్లోజివ్స్‌ను పక్కదారి పట్టించి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న రికార్డులను తారుమారు చేస్తూ పని కానిస్తున్నారు. వీటి రవాణా, నిల్వ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జనావాసాల మధ్యే ఉంచుతున్నారు. వెంచర్, రోడ్డు, క్వారీ, ఇతర పనులకు కావాల్సిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు.. ఆ పనులు చేయగా కొంత మిగులుతుంది. ఒక్కోసారి 20 నుంచి 30 కేజీల వరకు మిగులుతుంటుంది. ఇలా అనేకసార్లుగా పెద్ద మొత్తంలో పోగుపడిన పేలుడు పదార్థాలను, తమకు అవసరమని వచ్చే వారికి వారెవరో తెలిసి, కొన్ని సందర్భాల్లో తెలియకపోయినా అమ్మేస్తుంటారు.
వారే ‘మేనేజ్’ చేస్తారు
భువనగిరిలోని ఓ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నుంచి మల్లేష్ (పేరు మార్చాం) అనే లైసెన్స్‌డ్ డీలర్ 500 క్వింటాళ్ల గన్‌పౌడర్, 1,000 కేజీల డిటొనేటర్లు కొనుగోలు చేశాడు. సదరు డీలర్ నుంచి రిటైలర్ రాజు (పేరు మార్చాం) 100 క్వింటాళ్ల గన్‌పౌడర్, 200 కేజీల డిటొనేటర్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ వెంచర్‌లో బండరాళ్లు పగులగొట్టే కాంట్రాక్ట్‌ను శ్రీనివాస్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు.
ఇందుకు అతనికి 40 క్వింటాళ్ల
గన్‌పౌడర్ 100 కేజీల డిటొనేటర్లు అవసరం. శ్రీనివాస్ తనకు ఫలానా పేలుడు పదార్థాలు కావాలని రాజును సంప్రదించాడు. శ్రీనివాస్ చట్టబద్ధంగా కొనాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకు ఆ ఏరియా పరిధిలోని పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సై నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. ఇదంతా పెద్దరిస్క్. అన్నీ ‘నేనే చూసుకుంటా’అని సదరు కాంట్రాక్టర్‌కు రిటైలర్ రాజు చెప్పి పేమెంట్ తీసుకున్నాడు. ఆ పేలుడు పదార్థాలు రవాణా అయ్యే మార్గంలోని అందరినీ ‘మేనేజ్’చేసి సదరు కాంట్రాక్టర్ వద్దకు చేర్చేశాడు.
వేబిల్ కొంత.. రవాణా మరింత
రమేష్ (పేరు మార్చాం) అనే రిటైలర్‌కు నల్లగొండ జిల్లా చిట్యాలలో గోదాము ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన ఓ లైసెన్స్‌డ్ డీలర్‌నుంచి కొనుగోలుచేసిన పేలుడు పదార్థాలను అందులో భద్రపరిచాడు. కొత్త రోడ్డు నిర్మాణంలో పెద్ద బండలను పగులగొట్టేందుకు పేలుడు పదార్థాలు కావాలని కాంట్రాక్టర్ సదరు రిటైలర్‌ను సంప్రదించాడు. అప్పటికే అతని దగ్గర 500 డిటొనేటర్లు , పది క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ సరఫరాకు అవసరమైన వేబిల్ (అధికారికంగా) ఉంటుంది.
కానీ సదరు రిటైలర్ పరస్పర అవగాహనతో అదే వేబిల్‌పై కాంట్రాక్టర్‌కు 1,000 పూసలు, 20 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేశాడు. ఇక్కడ అదనంగా పంపిన పేలుడు పదార్థాలను రిటైలర్ తనకున్న పరిచయాల మేరకు ఇతరులకు అక్రమంగా, అధిక ధరకు విక్రయించేస్తాడు. ఈ అదనపు లెక్కలన్నీ కంపెనీ నుంచి డీలర్‌కు, డీలర్ నుంచి రిటైలర్‌కు ఇలా.. ఓ లింక్ ప్రకారం నడుస్తాయన్నమాట.
మహా నగరంలో మరింత ఈజీగా..
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో పేలుడు పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. రాతి నేల కావడంతో పునాదులు, బావుల తవ్వకంలో అడ్డుగా వచ్చిన రాళ్ళను పగలకొట్టడానికి అప్పట్లో జిలెటిన్ స్టిక్స్ ఇప్పుడు స్లర్రీ వినియోగిస్తున్నారు. లైసెన్స్‌డ్ వ్యాపారుల నుంచి వీటిని కొనుగోలు చేయడం, అదీకృత ఎక్స్‌ప్లోజర్స్‌ను సంప్రదించి వారితో బ్లాస్టింగ్ పని చేయించడం ఖర్చుతో కూడింది.
దీంతో అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ‘అడ్డదారి’లో దొరికే పేలుడు పదార్థాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్రమ వ్యాపారుల దందాలు సాగుతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలోని బిల్డర్లు, రాచకొండలోని వృత్తి కార్మికులతో పాటు డ్రిల్లింగ్ మెషీన్లతో కూడిన ట్రాక్టర్లు కలిగిన వారిలో అనేక మంది వద్ద ఇటు స్లర్రీ, అటు డిటొనేటర్లు అందుబాటులో ఉంటున్నాయి.
ఎక్కడైనా మన స్లర్రీయే!
- ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని షిమోగ శివార్లలో ఉన్న హునసోడు వద్ద ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కారణంగా జరిగిన ఈ ఘోరం 14 మందిని పొట్టనపెట్టుకుంది. ఆ తర్వాతి నెల్లో అదే రాష్ట్రంలోని చిక్‌బల్లాపూర్ సమీపంలోని హిరేనాగవల్లిలోని మరో క్వారీలో ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ రెండు క్వారీలకు పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ అక్రమంగా రవాణా అయింది తెలంగాణ నుంచే అని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలడం ఆందోళన కలిగించే అంశం.
- ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులకు అవసరమైన అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, డిటొనేటర్లు తెలంగాణలోని కొందరు పేలుడు పదార్థాల (ఎక్స్‌ప్లోజివ్స్) డీలర్ల నుంచే అందుతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించడం (ఈ ఏడాది ఫిబ్రవరిలో) కూడా గమనార్హం.
- యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు రెండు నెలల క్రితం భువనగిరి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి డాల్ఫిన్ హోటల్ వద్ద వల పన్నిన టౌన్ పోలీసులు ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ ప్యాకెట్లు 1,792, దీన్ని పేల్చడానికి ఉపకరించే డిటోనేటర్లు 1,600 గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.
రిటైలర్‌కు వచ్చేసరికే ధర రెట్టింపు
కంపెనీల నుంచి డీలర్‌కు వెళ్లే పేలుడు పదార్థాలు రిటైల్ వ్యాపారులకు వెళ్లే సరికి 100 శాతం అదనపు రేటుతో విక్రయిస్తున్నారు. ఉదాహరణకు 50 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ కంపెనీ ధర రూ.2,500 కాగా రిటైలర్‌కు రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే ఒక పూస ధర రూ.4.50 కాగా రూ.6.50 కు విక్రయిస్తున్నారు. రిటైలర్లు తమ లాభం కలుపుకొని అమ్మకాలు సాగిస్తుంటారు. ఇలా చేతులు మారే కొద్దీ ధర పెరుగుతూ పోతుంది.
పోలీస్ స్టేషన్లే అడ్డాలుగా..
పలు పోలీస్ స్టేషన్లు పేలుడు పదార్థాల అక్రమ దందాకు అడ్డాగా మారుతున్నాయి. బొమ్మలరామారం మండలంలోని పలు ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీల నుంచి డిటొనేటర్ల లోడు బయటకు రవాణా చేస్తున్న సమయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనుమతుల కోసం వచ్చే డిటొనేటర్‌లు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు.. పోలీస్ స్టేషన్‌లో అనుమతి పత్రాలపై స్వయంగా పోలీస్ స్టేషన్ స్టాంపు ముద్రలను వేసుకొనేంత చనువు ఉందంటే అతిశయోక్తి కాదు. విధుల్లో ఉన్న పోలీసులు సదరు పత్రాలను ఏ మాత్రం పరిశీలించడం లేదు.
అక్రమ బ్లాస్టింగ్స్‌లో కాసుల వేట
హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని పోలీసుస్టేషన్లకు కూడా ఈ అక్రమ పేలుడు పదార్థాల దందా, అక్రమ బ్లాస్టింగ్స్ కాసులు కురిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించి కంట్రోల్డ్ బ్లాస్టింగ్స్ చేయడానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అధీకృత డీలర్ల వద్దే పేలుడు పదార్థాలు ఖరీదు చేశామని, లైసెన్స్ కలిగిన వ్యక్తే పేలుడు జరుపుతారంటూ అందుకు సంబంధించిన పత్రాలను వారం రోజుల ముందే పోలీసుస్టేషన్ లో సమర్పించాలి. ఆ ప్రదేశాలను ఏసీపీ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. అయితే ఏ ఒక్క ప్రాంతంలోనూ ఇది పక్కాగా జరగట్లేదు. మామూళ్లకు అలవాటుపడిన పోలీసులు అక్రమ పేలుళ్లకు ప్రత్యక్షంగా, పేలుడు పదార్థాల దందాకు పరోక్షంగా సహకరిస్తున్నారు.
సిబ్బంది కొరతలో ‘పెసో’
‘డంప్’లు దొరికినప్పుడు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసులు హడావుడి చేస్తుంటారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులు, గతంలో ఈ తరహా కేసుల్లో అరెస్టయిన వాళ్ళతో పాటు లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద తనిఖీలు చేస్తుంటారు. వాస్తవానికి ఎక్స్‌ప్లోజివ్స్ ఆడిటింగ్‌పై పూర్తి అవగాహన లేని సివిల్ పోలీసులు కేవలం వారి వద్ద ఉన్న పెట్టెలు లెక్కించడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆ సాకుతో చేతులు ‘తడుపుకోవడమో’, దులుపుకోవడమో చేస్తున్నారు. ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్‌ల జారీ, రెన్యువల్, ఆడిటింగ్ తదితరాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ (పెసో)పై ఉంటుంది. ఈ సంస్థ సిబ్బంది, వనరులు ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో చేష్టలుడిగి చూస్తోంది.
‘అధికార సహకారానికి’ఇవీ ఉదాహరణలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి మండలం రాయిగిరి వద్ద ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులకు 2019 డిసెంబర్‌లో ఒక లారీ పట్టుబడింది. ఆ లారీలో ఎలాంటి అనుమతులూ లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో తయారైన పేలుడు పదార్థాలు దొరికింది భువనగిరి మండలంలో.. కాబట్టి, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావాలి.. కానీ, ఈ కేసును తారుమారు చేసి నిందితులను రక్షించేందుకు బీబీనగర్ మండలంలోని టోల్‌ప్లాజా వద్ద లారీ పట్టుబడినట్లు ఆ మండల స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఇలా అరెస్టు.. అలా బెయిలు..
బొమ్మలరామారంలో, చిట్యాల మండలంలో రెండు ప్రధాన పేలుడు పదార్థాల కంపెనీలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని కంపెనీ యజమానికి అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మునుగోడు మాజీ ఎమ్యెల్యే ఒకరికి ఈ కంపెనీ యజమాని దగ్గరి బంధువు. గత ఏడాది ఆగస్టు 18వ తేదీన కంపెనీ యజమానిని పేలుడు పదార్థాల కేసుల్లో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం, రిమాండ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుండగా.. అధికార పారీ్టకి చెందిన ఉన్నత స్థాయి ప్రజా ప్రతిని«ధి ఒకరి నుంచి ఫోన్ రావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.
డీసీఎం కేసు తెరమరుగు..
రెండేళ్ల క్రితం నార్సింగి ప్రాంతంలో ఓ పేలుడు చోటు చేసుకుంది. ఓ సైట్‌లో వినియోగించడానికి అవసరమైన పేలుడు పదార్థాలను మ్యాగజీన్ వ్యాన్‌లో తీసుకువెళ్లాల్సి ఉండగా... డీసీఏం వ్యాన్‌లో తరలించారు. ఇవి ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఈ కేసు విషయంలో హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో మిన్నకుండిపోయారు.
పవర్ ఇదీ స్లర్రీ
నిరంతర నిఘా కొనసాగుతోంది
పేలుడు పదార్థాల తయారీ, అమ్మకాలపై నిఘా కొనసాగుతోంది. పోలీస్‌శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా కొందరు పేలుళ్లు చేపడుతున్నారు. అవగాహన లోపంతో కొందరు, పన్నులు ఎగవేయడం కోసం మరికొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. చిన్న వైరు దొరికినా వదిలిపెట్టడం లేదు.
–కె.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి
-శ్రీరంగం కామేష్, సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment