Detonators
-
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి
బద్వేలు/కలసపాడు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో పేలడంతో ముగ్గురాళ్ల క్వారీలో పనిచేయడానికి వచ్చిన 9 మంది కూలీలు అక్కడికక్కడే అశువులు బాశారు. ఈ ఘటనలోకారు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు తునాతునకలై అర కిలోమీటర్ దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి మామిళ్లపల్లె గ్రామ శివారులో తిరుమల కొండస్వామి తిప్పపై ముగ్గురాళ్ల క్వారీని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముగ్గురాళ్లను పగులగొట్టేందుకు పులివెందుల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు (ఈడీ) కారులో తీసుకువచ్చారు. కూలీలు వీటిని కారులో నుంచి తీసే సమయంలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో కారు డ్రైవర్, తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డిటోనేటర్లను కారు నుంచి దింపుతున్న సమయంలో ఇద్దరు కూలీలు తాగునీటి కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా పేలుడు శబ్దం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించడంతో సమీప గ్రామాలైన మామిళ్లపల్లె, మహానందిపల్లె, అక్కివారిపల్లె, ముదిరెడ్డిపల్లె, కలసపాడులతోపాటు మరో 15 గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని వణికిపోయారు. మృతులు వీరే.. ప్రమాదంలో మరణించిన పది మందిలో ఏడుగురు వైఎస్సార్ జిల్లా వేముల మండలానికి చెందినవారు కాగా మిగతా ముగ్గురు కలసపాడు, పోరుమామిళ్ల, వేంపల్లె మండలాల వారు. వేముల మండలంలోని వేములకు చెందిన అబ్దుల్ (30), ఈ.కొత్తపల్లెకు చెందిన బాలగంగులు (35), వెంకటరమణ (25), లక్ష్మిరెడ్డి (60), బుచ్చయ్యగారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య (45), గొందిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (45), రంగోరిపల్లెకు చెందిన గంగిరెడ్డి (50), వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన వెంకటేష్ (25), కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన ప్రసాద్ (40), పోరుమామిళ్లకు చెందిన కారు డ్రైవర్ కొరివి ప్రసాద్ (35)లు పేలుడులో అశువులు బాశారు. తాగునీటి కోసం బయటకు వచ్చిన వేముల మండలానికి చెందిన రామాంజులరెడ్డి (55), శ్రీరాములరెడ్డి (50) త్రుటిలో తమ ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి కూడా ఘటనాస్థలికి వెళ్లి సమీప గ్రామాల ప్రజలు, ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరు కూలీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భీతావహంగా ఘటనా స్థలం డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలడంతో అక్కడ వాటిని దించుతున్న కూలీలతోపాటు కారుడ్రైవర్ శరీరభాగాలు ఛిద్రమైపోయాయి. మృతుల శరీర భాగాలు తునాతునకలైపోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. అర కిలోమీటర్ పరిధిలో ఎటుచూసినా వెదజల్లినట్టు కాళ్లు, చేతులు, వేళ్లు, పేగులు, ఇతర అవయవాలే. ఇవి గుట్టలు, రాళ్లపైనే కాక చెట్లపైన కూడా పడ్డాయి. సమీపంలోని చెట్లు పూర్తిగా కాలిపోయి మోడు బారాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. నిబంధనల ప్రకారం.. ప్రత్యేక వాహనంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను వేర్వేరుగా నిపుణుల సహాయంతో క్వారీల వద్దకు తీసుకురావాలి. వాటిని నిపుణుల సహకారంతో పూర్తి జాగ్రత్తలతో క్వారీల్లో అమర్చి పేల్చాలి. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను దించేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తత అవసరం. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించి ప్రత్యేక వాహనంలో కాకుండా కారులో వీటిని తెచ్చింది. కూలీలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. డిటోనేటర్లు యాక్టివేట్ కావాలంటే విద్యుత్ అవసరం ఉంటుంది లేదా తీవ్రస్థాయిలో వాటిపై ఒత్తిడి పడాలి. దించే సమయంలో ఒత్తిడి పడి ఉండటం లేదంటే వాటి సమీపంలో ఎవరైనా మాట్లాడేందుకు సెల్‌ఫోన్ ఆన్ చేయడమో చేసి ఉండటమే ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ ఆన్ చేయగానే దాని నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరంగాలను ఈడీలు గ్రహించి పేలుడు జరిగి ఉంటుందని అంటున్నారు. పక్కనే జిలెటిన్ స్టిక్స్ ఉండటంతో వీటి పేలుడు తీవ్రత అధికమైందని అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వైఎస్సార్ జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు రవిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిళ్లపల్లె పరిధిలో సర్వే నంబర్లు–1, 133లో బెరైటీస్ ఖనిజం వెలికితీయడానికి 30.696 హెక్టార్లలో సి.కస్తూరిబాయి పేరు మీద 2001 నవంబర్ 2న లీజుకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది నవంబర్ 1 వరకు లీజు అనుమతి ఉండగా మైనింగ్ నిర్వహణను సి.నాగేశ్వరరెడ్డికి జీపీఏ హోల్డర్‌గా 2013లో కస్తూరిబాయి ఇచ్చారని తెలిపారు. పేలుడు పదార్థాల రవాణా, అన్లోడింగ్ విషయంలో లీజుదారుడి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనిపై జేసీ, రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రెవెన్యూ శాఖ సిబ్బందితో కమిటీ వేసి ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కౌలుదారులు, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతోపాటు కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పేలుడు పదార్థాలను జాగ్రత్తలు పాటించకుండా వినియోగించడంపై లీజుదారుడు నాగేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. మృతుల కుటుంబాలకు గవర్నర్, సీఎం ప్రగాఢ సానుభూతి ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో పది మంది మృత్యువాత పడటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులను అడిగి ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. -
భయంకరమైన నైట్రేట్ స్లర్రీ గురించి విస్తుపోయే నిజాలు
సాక్షి నెట్వర్క్: అవును.. కావాలనుకున్న వారికి.. మనింటి పక్కన దుకాణంలో కొవ్వొత్తి, దాన్ని వెలిగించేందుకు అవసరమైన అగ్గిపెట్టె ఎంత సులభంగా దొరుకుతాయో.. అంతే సులువుగా పేలుడు పదార్థాలు, డిటొనేటర్లు దొరుకుతున్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. ఇటీవలి కొన్ని ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, వ్యాపారంపై దృష్టి సారించిన ‘సాక్షి’.. ఈ వ్యవహారమేంటో తేల్చడానికి సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన డ్రిల్లింగ్ మిషన్ తో కూడిన ఓ ట్రాక్టర్ యజమానిని స్వయంగా సంప్రదించింది. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ.. పేస్ట్‌లా ఉండే అమ్మోనియం నైట్రేట్‌నే అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ అంటారు. ఇదో శక్తివంతమైన పేలుడు పదార్థం. 2013 ఫిబ్రవరిలో 18 మందిని బలి తీసుకున్న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఉగ్రవాదులు ఉపయోగించింది కేవలం ఒకటిన్నర కిలోల స్లర్రీ మాత్రమే అంటేనే.. ఇది ఎంతటి మారణహోమాన్ని సృష్టించగలదో అర్థమవుతుంది. 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరిల్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న పేలుళ్ళు సహా దేశ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద, మావోయిస్టు కార్యకలాపాల్లో వినియోగించిన బాంబులను ముష్కరులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీతోనే రూపొందించారు. ఇంతటి శక్తివంతమైన, ప్రమాదకరమైన పేలుడు పదార్థం, దీన్ని పేల్చడానికి ఉపయోగించే డిటొనేటర్లు (పూసలు) సామాన్యులకు సైతం సులువుగా దొరుకుతున్నాయా? అన్ని రిస్క్‌లు మీవే అయితే 350 డిటోనేటర్లు, 350 స్లర్రీ ప్యాకెట్లతో (ఒక్కొక్కటి 200 గ్రాములు) కూడిన బాక్సును రూ.7 వేలకు ఇస్తా అంటూ జంకూ బొంకూ లేకుండా ఆయన చెప్పడం నివ్వెరపరిచింది. ఇంత మొత్తం పేలుడుపదార్థాలతో అసాంఘికశక్తులు భారీ మారణహోమాలు ఎన్నో సృష్టించవచ్చు.రాష్ట్రంలో పేలుడు పదార్థాలు ఈజీగా దొరుకుతున్న విషయం ఈ ఉదంతంతో బట్టబయలైంది. నిరాటంకంగా అక్రమ దందా తయారీదారులు, డీలర్ల లాభాపేక్ష, ఎక్కడికక్కడ పోలీసులు, ప్రజా ప్రతినిధుల అండతో పేలుడు పదార్థాల అక్రమ దందా, రవాణా నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా అక్రమ మార్గం పడుతున్న పేలుడు పదార్థాలు కేవలం క్వారీలు, వెంచర్లు, బావుల తవ్వకం తదితర వ్యవహారాలకు మాత్రమే వినియోగం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో మావోయిస్టులకు, ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు చేరుతుండటం ఆందోళన కలిగించే అంశం. కేరళలోని కోజికోడ్ రైల్వే పోలీసులు ఇటీవల ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 100 స్లర్రీ ప్యాకెట్లు, 350 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి తెలంగాణ నుంచే వచ్చినట్లు వారు అనుమానిస్తున్నారు. కిలోక్కూడా లెక్కుండాలి కానీ... తయారీ మొదలు, వినియోగం వరకు, చివరకు వాడగా మిగిలింది వాపస్ చేసే వరకు ప్రతి కేజీ స్లర్రీకి పక్కా లెక్క రికార్డుల సహితంగా ఉండాలి. కానీ ఏ పరిశ్రమలోనూ, డీలర్, రిటైలర్ వద్దా సరైన రికార్డులు ఉండటం లేదు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశ్రమల నుండి పేలుడు పదార్ధాలు సరఫరా అయ్యే క్రమంలో నెలవారీగా రూ.లక్షల్లో ముడుపులు ముడుతుండటమే ఇందుకు కారణం. సరఫరా ఆయ్యే పేలుడు పదార్థాల ఇండెక్స్‌ను జిల్లా ఎస్పీకి పరిశ్రమల నిర్వాహకులు తెలియజేయటంతో పాటు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. పరిశ్రమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ధ్రువీకరణ పత్రాలను సమర్పించి.. లైసెన్స్డ్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ముడుపులు చేతులు మారుతున్నాయని అంటున్నారు. గోదాములు ఉన్న మండలాల్లో ఎస్ఐ స్థాయి అధికారికి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, సబ్ డివిజనల్ స్థాయి అధికారికి ప్రతి మూడు నెలలకోసారి రూ.10 వేల దాకా ముట్టజెబుతున్నారు. ప్రజా ప్రతినిధులకూ ఇవ్వాల్సిందే..! పరిశ్రమల నిర్వాహకులు తమకు అన్ని విధాల సహకారం అందించే ఆయా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు, మండల స్థాయి నాయకుల జేబులు సైతం తడుపుతున్నారు. ఎన్నికల ఖర్చులు, పార్టీ సభల నిర్వహణ.. తదితర అవసరాలకు సైతం కొన్ని యాజమాన్యాలు రూ.లక్షల్లో ముట్టచెప్పడం సర్వసాధారణమని తేలింది. ఈ కారణంగానే ఆ పరిశ్రమల్లో పేలుళ్ల వంటి ఘటనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకులు మృతి చెందినప్పుడు వీరు పరిశ్రమల నిర్వాహకులకు అండగా ఉంటున్నారు. పరిమితికి మించి నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 15 పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమల్లో అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, ఇమిల్యూషన్, గన్‌పౌడర్, డిటోనేటర్లు, డిటొనేటింగ్ ఫ్యూజ్‌లు, పీఈటీఎం,పెంటాలైట్ వంటివి తయారవుతున్నాయి. వీటికి తెలంగాణలోని పలు జిల్లాల్లో, అలాగే ఏపీలో పలువురు లైసెన్స్డ్ డీలర్లు ఉన్నారు. వీరంతా గ్రామాల్లోనే పలు చోట్ల లైసెన్స్ కలిగి ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. అయితే నిబంధనలను అతిక్రమించి ఈ గోదాముల్లో పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. ఏడాది కిందట నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం పల్లెలపహాడ్ గ్రామంలోని ఓ గోదాములో నిబంధనలు అతిక్రమించి పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం అధికారుల తనిఖీల్లో బయటపడడంతో ఆ గోదామును సీజ్ చేశారు. మూడున్నరేళ్ళ కిందట వెలిమినేడు గ్రామానికి చెందిన పేలుడు పదార్థాలు నిల్వ చేసే లైసెన్స్డ్ ఉన్న డీలర్ నిబంధనలకు విరుద్ధంగా యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం శివారుల్లోని కోళ్ళ ఫారాల్లో పేలుడు పదార్ధాలు నిల్వ చేసి దొరికిపోయారు. ఇప్పుడు కూడా అధికారులు దాడులు నిర్వహిస్తే అనేక గోదాముల్లో అక్రమ నిల్వలు బయటపడతాయి. నిబంధనల ప్రకారం ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అన్ని జాగ్రత్తలతో రూపొందించిన మ్యాగజీన్ వ్యాన్లలోనే తరలించాలి. అయితే ఈ అక్రమ దందాలు చేసే వాళ్లు సాధారణ కార్లు, ఆటోలు, లారీలు వినియోగిస్తున్నారు. వ్యవస్థీకృతంగానే వ్యవహారం ఈ రకంగా పేలుడు పదార్థాలు (ఎక్స్‌ప్లోజివ్స్) అడ్డ దారిలో అక్రమ వ్యాపారుల వద్దకు చేరడం వెనుక వ్యవస్థీకృతంగా సాగే వ్యవహారం ఉంటోంది. ఫ్యాక్టరీలో తయారీ దశ నుంచి హోల్‌సేలర్, రిటైలర్ల వద్దకు చేరడం... చివరకు వినియోగం వివరాలు కూడా పక్కా పారదర్శకంగా, రికార్డులతో కూడి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే వీటికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రతి దశలోనూ అవకాశం ఉన్నంత వరకు ఎక్స్‌ప్లోజివ్స్‌ను పక్కదారి పట్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న రికార్డులను తారుమారు చేస్తూ పని కానిస్తున్నారు. వీటి రవాణా, నిల్వ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జనావాసాల మధ్యే ఉంచుతున్నారు. వెంచర్, రోడ్డు, క్వారీ, ఇతర పనులకు కావాల్సిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు.. ఆ పనులు చేయగా కొంత మిగులుతుంది. ఒక్కోసారి 20 నుంచి 30 కేజీల వరకు మిగులుతుంటుంది. ఇలా అనేకసార్లుగా పెద్ద మొత్తంలో పోగుపడిన పేలుడు పదార్థాలను, తమకు అవసరమని వచ్చే వారికి వారెవరో తెలిసి, కొన్ని సందర్భాల్లో తెలియకపోయినా అమ్మేస్తుంటారు. వారే ‘మేనేజ్’ చేస్తారు భువనగిరిలోని ఓ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నుంచి మల్లేష్ (పేరు మార్చాం) అనే లైసెన్స్డ్ డీలర్ 500 క్వింటాళ్ల గన్‌పౌడర్, 1,000 కేజీల డిటొనేటర్లు కొనుగోలు చేశాడు. సదరు డీలర్ నుంచి రిటైలర్ రాజు (పేరు మార్చాం) 100 క్వింటాళ్ల గన్‌పౌడర్, 200 కేజీల డిటొనేటర్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ వెంచర్లో బండరాళ్లు పగులగొట్టే కాంట్రాక్ట్‌ను శ్రీనివాస్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఇందుకు అతనికి 40 క్వింటాళ్ల గన్‌పౌడర్ 100 కేజీల డిటొనేటర్లు అవసరం. శ్రీనివాస్ తనకు ఫలానా పేలుడు పదార్థాలు కావాలని రాజును సంప్రదించాడు. శ్రీనివాస్ చట్టబద్ధంగా కొనాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకు ఆ ఏరియా పరిధిలోని పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సై నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. ఇదంతా పెద్దరిస్క్. అన్నీ ‘నేనే చూసుకుంటా’అని సదరు కాంట్రాక్టర్‌కు రిటైలర్ రాజు చెప్పి పేమెంట్ తీసుకున్నాడు. ఆ పేలుడు పదార్థాలు రవాణా అయ్యే మార్గంలోని అందరినీ ‘మేనేజ్’చేసి సదరు కాంట్రాక్టర్ వద్దకు చేర్చేశాడు. వేబిల్ కొంత.. రవాణా మరింత రమేష్ (పేరు మార్చాం) అనే రిటైలర్‌కు నల్లగొండ జిల్లా చిట్యాలలో గోదాము ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన ఓ లైసెన్స్డ్ డీలర్‌నుంచి కొనుగోలుచేసిన పేలుడు పదార్థాలను అందులో భద్రపరిచాడు. కొత్త రోడ్డు నిర్మాణంలో పెద్ద బండలను పగులగొట్టేందుకు పేలుడు పదార్థాలు కావాలని కాంట్రాక్టర్ సదరు రిటైలర్ను సంప్రదించాడు. అప్పటికే అతని దగ్గర 500 డిటొనేటర్లు , పది క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ సరఫరాకు అవసరమైన వేబిల్ (అధికారికంగా) ఉంటుంది. కానీ సదరు రిటైలర్ పరస్పర అవగాహనతో అదే వేబిల్పై కాంట్రాక్టర్‌కు 1,000 పూసలు, 20 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేశాడు. ఇక్కడ అదనంగా పంపిన పేలుడు పదార్థాలను రిటైలర్ తనకున్న పరిచయాల మేరకు ఇతరులకు అక్రమంగా, అధిక ధరకు విక్రయించేస్తాడు. ఈ అదనపు లెక్కలన్నీ కంపెనీ నుంచి డీలర్‌కు, డీలర్ నుంచి రిటైలర్‌కు ఇలా.. ఓ లింక్ ప్రకారం నడుస్తాయన్నమాట. మహా నగరంలో మరింత ఈజీగా.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో పేలుడు పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. రాతి నేల కావడంతో పునాదులు, బావుల తవ్వకంలో అడ్డుగా వచ్చిన రాళ్ళను పగలకొట్టడానికి అప్పట్లో జిలెటిన్ స్టిక్స్ ఇప్పుడు స్లర్రీ వినియోగిస్తున్నారు. లైసెన్స్డ్ వ్యాపారుల నుంచి వీటిని కొనుగోలు చేయడం, అదీకృత ఎక్స్ప్లోజర్స్ను సంప్రదించి వారితో బ్లాస్టింగ్ పని చేయించడం ఖర్చుతో కూడింది. దీంతో అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ‘అడ్డదారి’లో దొరికే పేలుడు పదార్థాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్రమ వ్యాపారుల దందాలు సాగుతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలోని బిల్డర్లు, రాచకొండలోని వృత్తి కార్మికులతో పాటు డ్రిల్లింగ్ మెషీన్లతో కూడిన ట్రాక్టర్లు కలిగిన వారిలో అనేక మంది వద్ద ఇటు స్లర్రీ, అటు డిటొనేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడైనా మన స్లర్రీయే! ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని షిమోగ శివార్లలో ఉన్న హునసోడు వద్ద ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కారణంగా జరిగిన ఈ ఘోరం 14 మందిని పొట్టనపెట్టుకుంది. ఆ తర్వాతి నెల్లో అదే రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ సమీపంలోని హిరేనాగవల్లిలోని మరో క్వారీలో ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ రెండు క్వారీలకు పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ అక్రమంగా రవాణా అయింది తెలంగాణ నుంచే అని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలడం ఆందోళన కలిగించే అంశం. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులకు అవసరమైన అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ, డిటొనేటర్లు తెలంగాణలోని కొందరు పేలుడు పదార్థాల (ఎక్స్‌ప్లోజివ్స్) డీలర్ల నుంచే అందుతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించడం (ఈ ఏడాది ఫిబ్రవరిలో) కూడా గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు రెండు నెలల క్రితం భువనగిరి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి డాల్ఫిన్ హోటల్ వద్ద వల పన్నిన టౌన్ పోలీసులు ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ ప్యాకెట్లు 1,792, దీన్ని పేల్చడానికి ఉపకరించే డిటోనేటర్లు 1,600 గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు. రిటైలర్‌కు వచ్చేసరికే ధర రెట్టింపు కంపెనీల నుంచి డీలర్‌కు వెళ్లే పేలుడు పదార్థాలు రిటైల్ వ్యాపారులకు వెళ్లే సరికి 100 శాతం అదనపు రేటుతో విక్రయిస్తున్నారు. ఉదాహరణకు 50 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ కంపెనీ ధర రూ.2,500 కాగా రిటైలర్‌కు రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే ఒక పూస ధర రూ.4.50 కాగా రూ.6.50 కు విక్రయిస్తున్నారు. రిటైలర్లు తమ లాభం కలుపుకొని అమ్మకాలు సాగిస్తుంటారు. ఇలా చేతులు మారే కొద్దీ ధర పెరుగుతూ పోతుంది. పోలీస్ స్టేషన్లే అడ్డాలుగా.. పలు పోలీస్ స్టేషన్లు పేలుడు పదార్థాల అక్రమ దందాకు అడ్డాగా మారుతున్నాయి. బొమ్మలరామారం మండలంలోని పలు ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీల నుంచి డిటొనేటర్ల లోడు బయటకు రవాణా చేస్తున్న సమయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతుల కోసం వచ్చే డిటొనేటర్లు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు.. పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రాలపై స్వయంగా పోలీస్ స్టేషన్ స్టాంపు ముద్రలను వేసుకొనేంత చనువు ఉందంటే అతిశయోక్తి కాదు. విధుల్లో ఉన్న పోలీసులు సదరు పత్రాలను ఏ మాత్రం పరిశీలించడం లేదు. అక్రమ బ్లాస్టింగ్స్‌లో కాసుల వేట హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని పోలీసుస్టేషన్లకు కూడా ఈ అక్రమ పేలుడు పదార్థాల దందా, అక్రమ బ్లాస్టింగ్స్ కాసులు కురిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించి కంట్రోల్డ్ బ్లాస్టింగ్స్ చేయడానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అధీకృత డీలర్ల వద్దే పేలుడు పదార్థాలు ఖరీదు చేశామని, లైసెన్స్ కలిగిన వ్యక్తే పేలుడు జరుపుతారంటూ అందుకు సంబంధించిన పత్రాలను వారం రోజుల ముందే పోలీసుస్టేషన్ లో సమర్పించాలి. ఆ ప్రదేశాలను ఏసీపీ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. అయితే ఏ ఒక్క ప్రాంతంలోనూ ఇది పక్కాగా జరగట్లేదు. మామూళ్లకు అలవాటుపడిన పోలీసులు అక్రమ పేలుళ్లకు ప్రత్యక్షంగా, పేలుడు పదార్థాల దందాకు పరోక్షంగా సహకరిస్తున్నారు. సిబ్బంది కొరతలో ‘పెసో’ ‘డంప్’లు దొరికినప్పుడు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసులు హడావుడి చేస్తుంటారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులు, గతంలో ఈ తరహా కేసుల్లో అరెస్టయిన వాళ్ళతో పాటు లైసెన్స్డ్ డీలర్ల వద్ద తనిఖీలు చేస్తుంటారు. వాస్తవానికి ఎక్స్‌ప్లోజివ్స్ ఆడిటింగ్‌పై పూర్తి అవగాహన లేని సివిల్ పోలీసులు కేవలం వారి వద్ద ఉన్న పెట్టెలు లెక్కించడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆ సాకుతో చేతులు ‘తడుపుకోవడమో’, దులుపుకోవడమో చేస్తున్నారు. ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్‌ల జారీ, రెన్యువల్, ఆడిటింగ్ తదితరాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ (పెసో)పై ఉంటుంది. ఈ సంస్థ సిబ్బంది, వనరులు ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో చేష్టలుడిగి చూస్తోంది. ‘అధికార సహకారానికి’ఇవీ ఉదాహరణలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి మండలం రాయిగిరి వద్ద ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులకు 2019 డిసెంబర్లో ఒక లారీ పట్టుబడింది. ఆ లారీలో ఎలాంటి అనుమతులూ లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో తయారైన పేలుడు పదార్థాలు దొరికింది భువనగిరి మండలంలో.. కాబట్టి, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావాలి.. కానీ, ఈ కేసును తారుమారు చేసి నిందితులను రక్షించేందుకు బీబీనగర్ మండలంలోని టోల్‌ప్లాజా వద్ద లారీ పట్టుబడినట్లు ఆ మండల స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇలా అరెస్టు.. అలా బెయిలు.. బొమ్మలరామారంలో, చిట్యాల మండలంలో రెండు ప్రధాన పేలుడు పదార్థాల కంపెనీలు ఉన్నాయి. బొమ్మలరామారంలోని కంపెనీ యజమానికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మునుగోడు మాజీ ఎమ్యెల్యే ఒకరికి ఈ కంపెనీ యజమాని దగ్గరి బంధువు. గత ఏడాది ఆగస్టు 18వ తేదీన కంపెనీ యజమానిని పేలుడు పదార్థాల కేసుల్లో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం, రిమాండ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుండగా.. అధికార పారీ్టకి చెందిన ఉన్నత స్థాయి ప్రజా ప్రతిని«ధి ఒకరి నుంచి ఫోన్ రావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. డీసీఎం కేసు తెరమరుగు.. రెండేళ్ల క్రితం నార్సింగి ప్రాంతంలో ఓ పేలుడు చోటు చేసుకుంది. ఓ సైట్లో వినియోగించడానికి అవసరమైన పేలుడు పదార్థాలను మ్యాగజీన్ వ్యాన్‌లో తీసుకువెళ్లాల్సి ఉండగా... డీసీఏం వ్యాన్‌లో తరలించారు. ఇవి ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఈ కేసు విషయంలో హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో మిన్నకుండిపోయారు. పవర్ ఇదీ స్లర్రీ నిరంతర నిఘా కొనసాగుతోంది పేలుడు పదార్థాల తయారీ, అమ్మకాలపై నిఘా కొనసాగుతోంది. పోలీస్‌శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా కొందరు పేలుళ్లు చేపడుతున్నారు. అవగాహన లోపంతో కొందరు, పన్నులు ఎగవేయడం కోసం మరికొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. చిన్న వైరు దొరికినా వదిలిపెట్టడం లేదు. –కె.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి -శ్రీరంగం కామేష్, సాక్షి నెట్వర్క్ -
కరీంనగర్లో తీగ... ఫలక్‌నుమాలో డొంక
చంద్రాయణగుట్ట: దీపావళి టపాసులు తయారు చేయడానికి వినియోగించి గన్‌పౌడర్‌తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటొనేటర్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్లో పట్టుబడిన ఇద్దరి విచారణలో వీటి మూలాలు ఫలక్‌నుమాలో ఉన్నట్లు తేలాయి. సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈది బజార్‌కు చెందిన మహ్మద్ జైనుల్లా హబీబ్ అలియాస్ షబ్బీర్‌కు గతంలో గన్‌పౌడర్ తయారీకి సంబంధించి లైసెన్స్ ఉండేది. బొగ్గు, అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ తదితరాలను కలిపి దీనిని తయారు చేసే అతగాడు టపాసుల తయారీదారులకు విక్రయించేవాడు. రెయిన్‌బజార్ కేంద్రంగా ఈ వ్యాపారం చేయడానికి కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ జారీ చేసిన దీని కాల పరిమితి 2018లో ముగిసింది. ఆ తర్వాత దాన్ని షబ్బీర్ రెన్యువల్ చేయించుకోలేదు. అయితే అప్పటికే అతడి వద్ద కొంత ముడిసరుకు మిగిలిపోయింది. ఫాతీమానగర్‌లో బొగ్గు విక్రయానికి లైసెన్స్ కలిగిన హమీద్ ఖాన్‌తో కలిసి ఆ ప్రాంతంలోనే దీన్ని అక్రమంగా తయారు చేయడం మొదలెట్టాడు. నిర్మాణ రంగంలో అక్రమ పేలుళ్ల కోసం డిటొనేటర్లకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకున్న షబ్బీర్ గన్‌పౌడర్ వినియోగించి తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లను తయారు చేస్తున్నాడు. వివిధ జిల్లాలకు పాలిష్ పౌడర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడి వద్ద వీటిని ఖరీదు చేస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన సతీష్, విష్ణువర్థన్‌రెడ్డి సైతం ఉన్నారు. గురువారం ఉదయం వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి పోలీసులు వారి నుంచి భారీ మొత్తంలో డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తమకు వీటిని హైదరాబాద్ నుంచి షబ్బీర్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు ఫాతీమానగర్‌లోని స్థావరంపై దాడి చేసి షబ్బీర్‌తో పాటు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు టన్ను గన్‌పౌడర్ స్వాధీనం చేసుకున్నారు -
పల్నాడులో కలకలం!
సాక్షి, గుంటూరు: జిల్లాలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ, బ్లాస్టింగ్ల కోసం అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వినియోగించడంతో పాటు వాటిని సాధారణ ప్రజలకు విక్రయించడం వంటి వాటికి పాల్పడ్డారు. క్వారీల్లో బ్లాస్టింగ్లు సైతం అనుభవం లేని కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పలు ఘటనల్లో సుమారుగా 20 మందికి పైగా మృతి చెందినా మైనింగ్ మాఫియా మాత్రం ధనార్జనే ధ్యేయంగా అక్రమ బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ రెచ్చిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టీడీపీ మైనింగ్ మాఫియా వాసనలు మాత్రం పోవడం లేదు. మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గుండ్లకమ్మ, ప్రకాశం జిల్లా కురిచేడు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై డిటోనెటర్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ వెంబడి బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏఎన్ఎస్(యాంటీ నక్స్‌ల్స్ స్క్వాడ్), ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వు) బలగాలు డిటోనేటర్లు లభ్యమైన ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ నెల పదో తేదీన గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ పరిధిలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్ రైల్వే విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు పట్టాల లింక్‌లను సుత్తెతో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చి నిప్పురవ్వలు ఎగిసిపడి స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కొంత దూరంలో రెండు డిటోనేటర్లు కిరణ్ కంటపడ్డాయి. వాటిని జీఆర్పీ పోలీసులకు అందించి జరిగిన విషయాన్ని కిరణ్ తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రమాదం గతేడాది నవంబర్ 18న పల్నాడు ప్రాంతంలోని కోనంకి గ్రామంలో మైనింగ్ క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్లు పేలి ఓర్సు విష్ణు, కందులూరి తిరపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. తిరపతిరావుకు కళ్లు, రెండు చేతులు పోయాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ తరహాలో తరచూ పల్నాడు ప్రాంతంలో ఏదో ఒక మూలన పేలుడు పదార్థాలు లభ్యమవుతుండటం పరిపాటిగా మారింది. ఈ పేలుడు పదార్థాల సరఫరా, నిల్వల్లో పిడుగురాళ్ల, దాచేపల్లి లైమ్ స్టోన్ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ మైనింగ్ మాఫియా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేపడుతున్న సీబీసీఐడీ మిల్లర్లు, లారీ యజమానులు, డ్రైవర్లు, కూలీలను విచారించిందే తప్ప పేలుడు పదార్థాల సరఫరా, నిల్వ తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టలేదు. దీంతో నేటికీ గురజాల నియోజకవర్గానికి చెందిన మైనింగ్ మాఫియా సభ్యులు తెలంగాణా నుంచి పేలుడు పదార్థాలు తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ పరిధిలో లభ్యమైన డిటోనేటర్లు సైతం చుట్టుపక్కల మైనింగ్‌కు పాల్పడే వారికి సంబంధించినవే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో ప్రమాద ఘంటికలు నల్లమల అటవీ ప్రాంతం ఉన్న పల్నాడు ప్రాంతం నిన్నమొన్నటి వరకు మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటం, గతంలో వీరికి పేలుడు సామగ్రిని మైనింగ్ నిర్వహించే వారే సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. రాజధాని జిల్లాలో తరచూ పేలుడు సామగ్రి పట్టుబడుతుండటం రాజధాని భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ పేలుడు సామగ్రి అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే పెను విధ్వంసం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పల్నాడు సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న పేలుడు సామగ్రిపై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టకపోతే భద్రతకు పెను ప్రమాదం తప్పదని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు. -
పేలుడు సామాగ్రి పట్టివేత
సాక్షి, కొత్తగూడెం : జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో భారీగా పేలుడు సామాగ్రి పట్టుబడింది. కొత్తగూడెం నుంచి చర్ల వైపు వెళ్లున్న లారీలో పేలుడు సామాగ్రి ఉన్నట్లు జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. స్పందించిన వెంటనే ఆయన పట్టణ ఎస్సైని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేశ్ సారపాక వద్ద లారీని తనిఖీ చేయగా 1000 డిటోనేటర్లు, 75 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని, 8 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తిరుమలలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల కలకలం
సాక్షి, తిరుమల: పేలుళ్లకు వాడే నిషేధిత జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తిరుమలలో కలకలం రేపాయి. తిరుమలలో 24 జిలెటిన్ స్టిక్స్, మరో 38 డిటోనేటర్ల సంచిని స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ సీవీఎస్వో ఆకే రవికృష్ణ ఆదివారం మీడియాకు వెల్లడించారు. వీటిని కొండలు, బండలు పేల్చే క్వారీల్లో వాడుతుంటారు. వీటిని తిరుమలలో వాడకూడదని టీటీడీ నిబంధనలు విధించింది. అయినప్పటికీ పాపవినాశనం మార్గంలో నిర్మాణంలో ఉన్న మూడోదశ తిరువేంకటపథం రింగ్‌రోడ్డు నిర్మాణంలో వీటిని వాడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో టీటీడీ సీవీఎస్వో ఆదేశాల మేరకు విజిలెన్స్ వింగ్ విభాగం ఏవీఎస్వో శ్రీనాథరెడ్డి, వీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది బృందం నిఘా పెట్టింది. ఆదివారం రింగ్‌రోడ్డు ప్రాంతంలోని కొండమీద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు గుర్తించిన సిబ్బంది స్వాధీనం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు రవికృష్ణ తెలిపారు. -
తిరుమలలో జిలెటిన్ స్టిక్స్ పట్టివేత
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో విజిలెన్స్ అధికారులు జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నారు. వెంకట పథం రోడ్డులో 28 జిలెటిన్ స్టిక్స్,34 డిటోనేటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్ధాలన్నీ ఓ బ్యాగులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు. ఇంజనీరింగ్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటపథం మూడో విడత పనుల నిమిత్తం నిబంధనలకు వ్యతిరేకంగా తెప్పించారని ఆరోపణలు వస్తోన్నాయి. -
మహారాష్ట్రలో ముగ్గురు హైదరాబాదీల అరెస్టు
* భారీగా తూటాలు, డిటోనేటర్లు స్వాధీనం * నగరంలోని ఆర్మరీ నిర్వాహకులుగా గుర్తింపు * లోతుగా విచారిస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ * ముదస్సీర్ ఉదంతం నేపథ్యంలో ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని యవత్మాల్లో ముగ్గురు హైదరాబాదీలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో భారీగా తూటా లు, డిటోనేటర్లు ఉండటంతో మహారాష్ట్ర ఏటీఎస్ లోతుగా విచారిస్తోంది. ప్రాథమిక వివరా ల ప్రకారం వీరు నగరంలోని ఓ ఆయుధ విక్ర య దుకాణానికి చెందినవారని తెలిసింది. అయితే 2014లో హైదరాబాద్‌లో అరెస్టయిన షా ముదస్సీర్ను గతేడాది మరో కేసులో యవత్మాల్ పోలీసులే అరెస్టు చేయడం, అది ఉగ్రకోణంతో కూడింది కావడంతో ఈ ముగ్గురినీ ఏటీఎస్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. పఠాన్‌కోట్ ఎఫెక్ట్‌తో తనిఖీలు: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సోదాలు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి యవత్యాల్ పోలీసులు ఏపీ రిజిస్ట్రేషన్‌తో వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో .22 క్యాలిబర్ తూటాలు 50, .6030 క్యాలిబర్ తూటాలు 10, మరికొన్ని డిటోనేటర్లు కనిపిం చాయి. దీంతో వాహనంలోని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మసివుద్దీన్ ఓవైసీ, మహ్మద్ ఉమర్ ఘాజీ, మహ్మద్ మిరాజుద్దీన్గా గుర్తిం చారు. తాము అబిడ్స్‌లోని ఓ ఆర్మరీలో పనిచేస్తామని, యవత్మాల్ జిల్లాలో ఉన్న పుసద్ టౌన్లో ఒకరికి వీటిని ఇచ్చేందుకు వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది. పుసద్‌లో డెలివరీ అనే విషయం తెలియగానే అప్రమత్తమైన యవత్మాల్ పోలీసులు ఏటీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీఎస్ టీమ్ ముగ్గురినీ ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి తరలించి విచారిస్తోంది. పుసద్ లింకుతో ఉలికిపాటు: మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ జిల్లా షా కాలనీకి చెందిన షా ముదస్సీర్ అలియాస్ తల్హా, అంగోలీ జిల్లా అఖడ్‌బాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద బాటపట్టి సిమిలో చేరారు. అల్ కాయిదా శిక్షణ పొందేం దుకు అఫ్ఘానిస్థాన్‌కు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా నగరానికి చేరుకున్న వీరిని సికింద్రాబాద్(2014)లో పోలీసులు అరెస్టు చేశారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు సహకరించినట్లూ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముదస్సీర్ బెయిల్‌పై వచ్చాడు. కాగా, గతేడాది మహారాష్ట్రలోని పుసద్‌లో జరిగిన ఘర్షణల్లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన అబ్దుల్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని ప్రేరేపించింది ముదస్సీర్ అని తేలడంతో అతడినీ అరెస్టు చేశారు. ఇప్పుడు యావత్మాల్లో చిక్కిన ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారు కావడం, తూటాలు, డిటోనేటర్లను పుసద్‌లో డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పడంతో మహారాష్ట్ర పోలీసులు ఉలిక్కిపడ్డారు. వీరిని విచారిస్తున్న ఏటీఎస్ బృందం తెలంగాణ పోలీసులతోనూ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర నిఘా వర్గాలు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ ముగ్గురూ యవత్మాల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటాడటానికి వెళ్లినట్లు తేలిందని తెలిసింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ఏటీఎస్‌కు చేరవేశారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
అక్రమంగా నిలవ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో శనివారం ఉదయం పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. స్థానికంగా రాళ్లు కొట్టే పని చేసే ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను పెద్ద మొత్తంలో కనుగొన్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిలవ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి. వీటిని ఎవరికి అందజేయనున్నారు. పేలుడు పదార్థాల అక్రమ నిలవ వెనుక ఎవరి ప్రమేయం ఉందని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి శివారులోని ఇద్దరు కార్మికుల ఇళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. వారిళ్లల్లో నిల్వ ఉంచిన 1319 జెలిటిన్ స్టిక్స్, 1002 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. కంచెం మైసయ్య, పురాణి మల్లేశం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పదార్థాలను రాళ్లు పగులగొట్టేందుకు వాడుతున్నట్టు తెలిసింది. -
ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం
-
ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం
తరగతి గదిలో పేలిన డిటోనేటర్ ముగ్గురు విద్యార్థులకు గాయాలు ఒకరి పరిస్థితి విషమం ఇబ్రహీంపూర్ హైస్కూల్లో ఘటన రఘునాథపల్లి, న్యూస్‌లైన్ : రోడ్డుపై దొరికిన డిటోనేటర్‌తో సరదాగా చేసిన ప్రయోగం ఓ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. రిమోట్ కారును మొబైల్ బ్యాటరీతో నడిపిన ఆ విద్యార్థి అదే తరహాలో చేసిన ప్రయోగం వికటించింది. సెలఫోన్ బ్యాటరీకి డిటోనేటర్ వైరును అనుసంధానం చేయడంతో అది పేలి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రయోగం చేసిన విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ హైస్కూల్లో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపూర్ హైస్కూల్లో అదే గ్రామానికి చెందిన సర్జన మల్లేష్, రమ దంపతుల కుమారుడు నరేష్(11) ఆరో తరగతి చదువుతున్నాడు. రోజులాగే శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళుతున్న నరేష్‌కు రోడ్డుపై డిటోనేటర్ కనిపించింది. దానిని అతడు బ్యాగులో వేసుకుని పాఠశాలకు చేరుకున్నాడు. అప్పటికే తన బ్యాగులోని రిమోట్కారును మొబైల్ బ్యాటరీతో అనుసంధానం చేసి విద్యార్థులతో కలిసి ఆడాడు. క్లాస్ టీచర్ సిద్దులు రావడంతో విద్యార్థులు ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. వెనక బెంచీలో కూర్చున్న నరేష్ డిటోనేటర్ తీసి బ్యాగులో బ్యాటరీకి అనుసంధానం చేశాడు. బ్యాటరీ నుంచి వచ్చిన శక్తికి డిటోనేటర్ పెద్దపెట్టున పేలింది. దీంతో పక్కన ఉన్న విద్యార్థులు బండ్ర క్రాంతికుమార్, పబ్బ అజయ్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడుతో విద్యార్థులు అరుస్తూ బయటకు పరుగులు పెట్టారు. భయూందోళనకు గురైన ఉపాధ్యాయులు కొద్దిసేపట్లో తేరుకుని సంఘటన స్థలానికి చేరుకోగా నరేష్ చేతి వేళ్లు నుజ్జునుజ్జరుు విలవిలలాడుతూ కనిపించాడు. తీవ్ర రక్తస్రావమవుతుండడంతో వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడు శబ్దం విని గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఎక్కడిది ఈ డిటోనేటర్.. పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్ విద్యార్థికి ఎక్కడి నుంచి వచ్చింది.. గ్రామంలో రోడ్డుపై దానిని ఎవరు పడేశారు.. ప్రమాదమని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామశివారులోని గుట్టపై బండలను పగులకొట్టేందుకు క్రషర్ యజమా ని డిటోనేటర్లను తరలిస్తుండగా రోడ్డుపైపడి ఉంటుందని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పేలుడుకు అభంశుభం తెలియని విద్యార్థి పరిస్థితి విషమంగా మా రిందని, డిటోనోటర్ను నిర్లక్ష్యంగా పడేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రషర్‌ను రద్దుచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వరుస పేలుళ్లతో ఆందోళన మండలంలోని గోవర్ధనగిరి క్రషర్ వద్ద జనవరి 3న జిలెటెన్ స్టిక్స్ పేలి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. నెల రోజులు గడవక ముందే ఇబ్రహీంపూర్లో డిటోనేటర్ పేలడం గ్రామస్తులను భయూందోళనకు గురిచేసింది. ఇలా క్రషర్ల కారణంగా వరుస పేలుళ్లు జరుగుతున్నా పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వె లువెత్తుతున్నాయి. ఎంపీ రాజయ్య పరామర్శ కాగా పేలుడు జరిగిన విషయాన్ని తెలుసుకు న్న ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కాసర్ల నర్సమ్మ పాఠశాలకు చేరుకుని వివరాలు హెచ్ఎం సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.