
కోనంకిలో డిటోనేటర్లు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తిరుపతిరావు, ట్రాక్‌పై లభ్యమైన ఎలక్ట్రిక్ డిటోనేటర్లు
సాక్షి, గుంటూరు: జిల్లాలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ, బ్లాస్టింగ్‌ల కోసం అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వినియోగించడంతో పాటు వాటిని సాధారణ ప్రజలకు విక్రయించడం వంటి వాటికి పాల్పడ్డారు. క్వారీల్లో బ్లాస్టింగ్‌లు సైతం అనుభవం లేని కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పలు ఘటనల్లో సుమారుగా 20 మందికి పైగా మృతి చెందినా మైనింగ్ మాఫియా మాత్రం ధనార్జనే ధ్యేయంగా అక్రమ బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ రెచ్చిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టీడీపీ మైనింగ్ మాఫియా వాసనలు మాత్రం పోవడం లేదు. మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గుండ్లకమ్మ, ప్రకాశం జిల్లా కురిచేడు రైల్వే స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌పై డిటోనెటర్‌లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ వెంబడి బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏఎన్‌ఎస్(యాంటీ నక్స్‌ల్స్ స్క్వాడ్), ఏఆర్(ఆర్మ్‌డ్ రిజర్వు) బలగాలు డిటోనేటర్లు లభ్యమైన ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ నెల పదో తేదీన గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ పరిధిలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్ రైల్వే విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు పట్టాల లింక్‌లను సుత్తెతో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చి నిప్పురవ్వలు ఎగిసిపడి స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కొంత దూరంలో రెండు డిటోనేటర్లు కిరణ్ కంటపడ్డాయి. వాటిని జీఆర్‌పీ పోలీసులకు అందించి జరిగిన విషయాన్ని కిరణ్ తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ప్రమాదం
గతేడాది నవంబర్ 18న పల్నాడు ప్రాంతంలోని కోనంకి గ్రామంలో మైనింగ్ క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్లు పేలి ఓర్సు విష్ణు, కందులూరి తిరపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. తిరపతిరావుకు కళ్లు, రెండు చేతులు పోయాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ తరహాలో తరచూ పల్నాడు ప్రాంతంలో ఏదో ఒక మూలన పేలుడు పదార్థాలు లభ్యమవుతుండటం పరిపాటిగా మారింది. ఈ పేలుడు పదార్థాల సరఫరా, నిల్వల్లో పిడుగురాళ్ల, దాచేపల్లి లైమ్ స్టోన్ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ మైనింగ్ మాఫియా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
అక్రమ మైనింగ్‌పై విచారణ చేపడుతున్న సీబీసీఐడీ మిల్లర్లు, లారీ యజమానులు, డ్రైవర్లు, కూలీలను విచారించిందే తప్ప పేలుడు పదార్థాల సరఫరా, నిల్వ తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టలేదు. దీంతో నేటికీ గురజాల నియోజకవర్గానికి చెందిన మైనింగ్ మాఫియా సభ్యులు తెలంగాణా నుంచి పేలుడు పదార్థాలు తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ పరిధిలో లభ్యమైన డిటోనేటర్లు సైతం చుట్టుపక్కల మైనింగ్‌కు పాల్పడే వారికి సంబంధించినవే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడులో ప్రమాద ఘంటికలు
నల్లమల అటవీ ప్రాంతం ఉన్న పల్నాడు ప్రాంతం నిన్నమొన్నటి వరకు మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటం, గతంలో వీరికి పేలుడు సామగ్రిని మైనింగ్ నిర్వహించే వారే సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. రాజధాని జిల్లాలో తరచూ పేలుడు సామగ్రి పట్టుబడుతుండటం రాజధాని భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ పేలుడు సామగ్రి అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే పెను విధ్వంసం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పల్నాడు సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న పేలుడు సామగ్రిపై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టకపోతే భద్రతకు పెను ప్రమాదం తప్పదని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment