* భారీగా తూటాలు, డిటోనేటర్లు స్వాధీనం
* నగరంలోని ఆర్మరీ నిర్వాహకులుగా గుర్తింపు
* లోతుగా విచారిస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్
* ముదస్సీర్ ఉదంతం నేపథ్యంలో ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో ముగ్గురు హైదరాబాదీలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో భారీగా తూటా లు, డిటోనేటర్లు ఉండటంతో మహారాష్ట్ర ఏటీఎస్ లోతుగా విచారిస్తోంది. ప్రాథమిక వివరా ల ప్రకారం వీరు నగరంలోని ఓ ఆయుధ విక్ర య దుకాణానికి చెందినవారని తెలిసింది.
అయితే 2014లో హైదరాబాద్‌లో అరెస్టయిన షా ముదస్సీర్‌ను గతేడాది మరో కేసులో యవత్‌మాల్ పోలీసులే అరెస్టు చేయడం, అది ఉగ్రకోణంతో కూడింది కావడంతో ఈ ముగ్గురినీ ఏటీఎస్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
పఠాన్‌కోట్ ఎఫెక్ట్‌తో తనిఖీలు: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సోదాలు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి యవత్‌యాల్ పోలీసులు ఏపీ రిజిస్ట్రేషన్‌తో వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో .22 క్యాలిబర్ తూటాలు 50, .6030 క్యాలిబర్ తూటాలు 10, మరికొన్ని డిటోనేటర్లు కనిపిం చాయి. దీంతో వాహనంలోని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
వీరు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మసివుద్దీన్ ఓవైసీ, మహ్మద్ ఉమర్ ఘాజీ, మహ్మద్ మిరాజుద్దీన్‌గా గుర్తిం చారు. తాము అబిడ్స్‌లోని ఓ ఆర్మరీలో పనిచేస్తామని, యవత్‌మాల్ జిల్లాలో ఉన్న పుసద్ టౌన్‌లో ఒకరికి వీటిని ఇచ్చేందుకు వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది. పుసద్‌లో డెలివరీ అనే విషయం తెలియగానే అప్రమత్తమైన యవత్‌మాల్ పోలీసులు ఏటీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీఎస్ టీమ్ ముగ్గురినీ ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి తరలించి విచారిస్తోంది.
పుసద్ లింకుతో ఉలికిపాటు: మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ జిల్లా షా కాలనీకి చెందిన షా ముదస్సీర్ అలియాస్ తల్హా, అంగోలీ జిల్లా అఖడ్‌బాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద బాటపట్టి సిమిలో చేరారు. అల్ కాయిదా శిక్షణ పొందేం దుకు అఫ్ఘానిస్థాన్‌కు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా నగరానికి చేరుకున్న వీరిని సికింద్రాబాద్(2014)లో పోలీసులు అరెస్టు చేశారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు సహకరించినట్లూ వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ముదస్సీర్ బెయిల్‌పై వచ్చాడు. కాగా, గతేడాది మహారాష్ట్రలోని పుసద్‌లో జరిగిన ఘర్షణల్లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన అబ్దుల్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని ప్రేరేపించింది ముదస్సీర్ అని తేలడంతో అతడినీ అరెస్టు చేశారు. ఇప్పుడు యావత్‌మాల్‌లో చిక్కిన ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారు కావడం, తూటాలు, డిటోనేటర్లను పుసద్‌లో డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పడంతో మహారాష్ట్ర పోలీసులు ఉలిక్కిపడ్డారు.
వీరిని విచారిస్తున్న ఏటీఎస్ బృందం తెలంగాణ పోలీసులతోనూ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర నిఘా వర్గాలు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ ముగ్గురూ యవత్‌మాల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటాడటానికి వెళ్లినట్లు తేలిందని తెలిసింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ఏటీఎస్‌కు చేరవేశారు.
మహారాష్ట్రలో ముగ్గురు హైదరాబాదీల అరెస్టు
Published Tue, Jan 5 2016 4:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement