ఇద్దరు అరెస్ట్..పరారీలో మరొకరు
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి.
అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి.
కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment