పేలుడు ధాటికి ఎగిసిన పొగ
బద్వేలు/కలసపాడు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో పేలడంతో ముగ్గురాళ్ల క్వారీలో పనిచేయడానికి వచ్చిన 9 మంది కూలీలు అక్కడికక్కడే అశువులు బాశారు. ఈ ఘటనలోకారు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు తునాతునకలై అర కిలోమీటర్ దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి మామిళ్లపల్లె గ్రామ శివారులో తిరుమల కొండస్వామి తిప్పపై ముగ్గురాళ్ల క్వారీని నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ముగ్గురాళ్లను పగులగొట్టేందుకు పులివెందుల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు (ఈడీ) కారులో తీసుకువచ్చారు. కూలీలు వీటిని కారులో నుంచి తీసే సమయంలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో కారు డ్రైవర్, తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డిటోనేటర్లను కారు నుంచి దింపుతున్న సమయంలో ఇద్దరు కూలీలు తాగునీటి కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా పేలుడు శబ్దం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించడంతో సమీప గ్రామాలైన మామిళ్లపల్లె, మహానందిపల్లె, అక్కివారిపల్లె, ముదిరెడ్డిపల్లె, కలసపాడులతోపాటు మరో 15 గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని వణికిపోయారు.
మృతులు వీరే..
ప్రమాదంలో మరణించిన పది మందిలో ఏడుగురు వైఎస్సార్ జిల్లా వేముల మండలానికి చెందినవారు కాగా మిగతా ముగ్గురు కలసపాడు, పోరుమామిళ్ల, వేంపల్లె మండలాల వారు. వేముల మండలంలోని వేములకు చెందిన అబ్దుల్ (30), ఈ.కొత్తపల్లెకు చెందిన బాలగంగులు (35), వెంకటరమణ (25), లక్ష్మిరెడ్డి (60), బుచ్చయ్యగారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య (45), గొందిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (45), రంగోరిపల్లెకు చెందిన గంగిరెడ్డి (50), వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన వెంకటేష్ (25), కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన ప్రసాద్ (40), పోరుమామిళ్లకు చెందిన కారు డ్రైవర్ కొరివి ప్రసాద్ (35)లు పేలుడులో అశువులు బాశారు.
తాగునీటి కోసం బయటకు వచ్చిన వేముల మండలానికి చెందిన రామాంజులరెడ్డి (55), శ్రీరాములరెడ్డి (50) త్రుటిలో తమ ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి కూడా ఘటనాస్థలికి వెళ్లి సమీప గ్రామాల ప్రజలు, ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరు కూలీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
భీతావహంగా ఘటనా స్థలం
డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలడంతో అక్కడ వాటిని దించుతున్న కూలీలతోపాటు కారుడ్రైవర్ శరీరభాగాలు ఛిద్రమైపోయాయి. మృతుల శరీర భాగాలు తునాతునకలైపోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. అర కిలోమీటర్ పరిధిలో ఎటుచూసినా వెదజల్లినట్టు కాళ్లు, చేతులు, వేళ్లు, పేగులు, ఇతర అవయవాలే. ఇవి గుట్టలు, రాళ్లపైనే కాక చెట్లపైన కూడా పడ్డాయి. సమీపంలోని చెట్లు పూర్తిగా కాలిపోయి మోడు బారాయి.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే..
నిబంధనల ప్రకారం.. ప్రత్యేక వాహనంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను వేర్వేరుగా నిపుణుల సహాయంతో క్వారీల వద్దకు తీసుకురావాలి. వాటిని నిపుణుల సహకారంతో పూర్తి జాగ్రత్తలతో క్వారీల్లో అమర్చి పేల్చాలి. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను దించేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తత అవసరం. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించి ప్రత్యేక వాహనంలో కాకుండా కారులో వీటిని తెచ్చింది. కూలీలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. డిటోనేటర్లు యాక్టివేట్ కావాలంటే విద్యుత్ అవసరం ఉంటుంది లేదా తీవ్రస్థాయిలో వాటిపై ఒత్తిడి పడాలి. దించే సమయంలో ఒత్తిడి పడి ఉండటం లేదంటే వాటి సమీపంలో ఎవరైనా మాట్లాడేందుకు సెల్‌ఫోన్ ఆన్ చేయడమో చేసి ఉండటమే ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ ఆన్ చేయగానే దాని నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరంగాలను ఈడీలు గ్రహించి పేలుడు జరిగి ఉంటుందని అంటున్నారు. పక్కనే జిలెటిన్ స్టిక్స్ ఉండటంతో వీటి పేలుడు తీవ్రత అధికమైందని అంచనా వేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వైఎస్సార్ జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు రవిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిళ్లపల్లె పరిధిలో సర్వే నంబర్లు–1, 133లో బెరైటీస్ ఖనిజం వెలికితీయడానికి 30.696 హెక్టార్లలో సి.కస్తూరిబాయి పేరు మీద 2001 నవంబర్ 2న లీజుకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది నవంబర్ 1 వరకు లీజు అనుమతి ఉండగా మైనింగ్ నిర్వహణను సి.నాగేశ్వరరెడ్డికి జీపీఏ హోల్డర్‌గా 2013లో కస్తూరిబాయి ఇచ్చారని తెలిపారు. పేలుడు పదార్థాల రవాణా, అన్‌లోడింగ్ విషయంలో లీజుదారుడి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనిపై జేసీ, రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రెవెన్యూ శాఖ సిబ్బందితో కమిటీ వేసి ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కౌలుదారులు, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతోపాటు కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పేలుడు పదార్థాలను జాగ్రత్తలు పాటించకుండా వినియోగించడంపై లీజుదారుడు నాగేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు గవర్నర్, సీఎం ప్రగాఢ సానుభూతి
ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో పది మంది మృత్యువాత పడటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులను అడిగి ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment