రవిశంకర్ ఆచారి, సరస్వతమ్మ (ఫైల్)
వైఎస్సార్: కుటుంబ కలహాలతో దంపతులు కొర్రపాటి రవిశంకర్ ఆచారి(52) ఆయన భార్య సరస్వతమ్మ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన చెన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలోని రూకవారిపల్లెలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొర్రపాటి రవిశంకర్ ఆచారి, సరస్వతమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. కాగా పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకోవడంతో కుటుంబంలో మన స్పర్థలు ఏర్పడ్డాయి. అయితే కొద్ది రోజులకు పెద్దమ్మాయి కుటుంబంతో కలిసిపోయినప్పటికీ మనస్పర్ధలు తొలగలేదు. అప్పటికే చిన్న కుమార్తె అయిన లిఖితేశ్వరి అమెరికా వెళ్లి చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోకపోవడంతో, తన అక్కతో ఈ విషయాన్ని చెప్పి ఆమె ప్రోత్సాహంతో లా‘చదువుల కోసం అమెరికాకు వెళ్లింది.
పెద్ద కుమారుడు విక్రమ్ ఆదిత్య ఆచారి గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేస్తూ బచ్చుంపల్లెకు చెందిన ఒక అమ్మాయిని నాలుగు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు, ఈ క్రమంలో రవిశంకర్ ఆచారి, చిన్న కుమారుడు వినయ్ ఆనంద్ ఆచారి వృత్తి రీత్యా బంగారు అంగడికి వెళ్లగా, సరస్వతమ్మ తన ఇంటిలో ఒక్కటే ఉండింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉండే విషద్రావణాన్ని తాగింది.
మంట తాళ లేక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కడపలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మరణ వార్త విన్న భర్త తాను పనిచేస్తున్న అంగడి వద్దకు వెళ్లి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, భార్యాభర్తల మృత దేహాలను చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment