కడప అర్బన్ : వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చిన్ననాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఆయనను శుక్రవారం ఉదయం కడప నగరంలోని సంధ్యా సర్కిల్ సమీపంలో బురఖాలను ధరించి వచ్చిన ఇద్దరు దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. వారికి దగ్గరనే మరో ఇద్దరు కాపలాగా వుండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా చూసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.
ఈ హత్య వెనుక ఎవరెవరి హస్తం వుంది? ఎవరు అతన్ని అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? అనే కోణంలో కూడా పోలీసు అధికారులు, తమ సిబ్బందితో కలిసి విచారణ చేస్తున్నారు. మరో వైపు ఈ హత్య జరగడానికి ముందు కొన్ని రోజుల నుంచి ప్రధాన నిందితుడు, సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మోపురు ప్రతాప్‌రెడ్డికి, శ్రీనివాసుల రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని విచారణలో భాగంగా తెలుస్తోంది.
అంతకు ముందు ఎంతో స్నేహంగా వున్న వీరు ఆర్థిక లావాదేవీలు, స్థల వివాదాల కారణంగానే దూరంగా వుండి, ఒకరినొకరు ఫోన్‌లలో దుర్భాషలాడుకుంటూ సంభాషించుకున్నారని సమాచారం. ఈ హత్యకు ఇంకా ప్రతాప్ రెడ్డితోపాటు మరికొందరి పాత్ర కీలకంగా వుందని భావిస్తున్నారు. మృతుడి భార్య మౌనిక అనుమానితులుగా తమ ఫిర్యాదులో ఇచ్చిన మేరకు ప్రధానంగా మోపురు ప్రతాప్‌రెడ్డి పేరు పేర్కొన్నారు. అతనితోపాటు టీడీపీ నాయకులైన జమీల్ మొబైల్స్ అధినేత జమీల్, పాలెం సుబ్బారెడ్డి, గుంటి నాగేంద్రతోపాటు, విశ్వనాథరెడ్డి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు.
వీరి పాత్ర ఏమేరకు ఈ హత్య కేసులో వుందో పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సూత్రదారి ప్రతాప్‌రెడ్డి, మరొకరు బురఖాలను ధరించి ప్రత్యక్షంగా.. శ్రీనివాసులరెడ్డిని దారుణంగా వేటకొడవళ్లతో, పిడిబాకు తో చంపారని సీసీ టీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారించారు. వారికి అండగా మరో ఇద్దరు సంఘటన స్థలం వద్ద వున్నారని తెలుసుకున్నారు. ఇంకా పై ఇద్దరు నిందితులతోపాటు మరో ఆరుగురి పాత్ర వుందని పోలీసులు తమ విచారణలో తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి, మరో ఐదుగురు పోలీసుల అదుపులో వున్నారనీ తెలిసింది.
ఇంకా పలువురి పాత్రపై విచారణ చేపట్టడంతోపాటు, మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు. వీరిని రహస్య ప్రాంతంలో కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్.వి నాగరాజు, కడప రూరల్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేడో, రేపో ఈ హత్యకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
పోలీసుల అదుపులో ప్రతాప్‌రెడ్డి,
మరో ఐదుగురు నిందితులు
పక్కాగా రెక్కీ నిర్వహించి చేశారని నిర్ధారణ
ఎవరెవరి పాత్రపై లోతుగా విచారణ
Comments
Please login to add a commentAdd a comment