బి.కొత్తకోట: ప్రకృతి అందాలు తిలకించి, చల్లటి వాతావరణం అనుభూతితో వెనుదిరిగిన ఓ కుటుంబ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో లోయలోకి పడకుండా చేసిన ప్రయత్నాల్లో కారు తలకిందులై పడింది. అందులోని ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా..
బి.కొత్తకోటకు 18 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని గౌనిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రజిత భార్యాభర్తలు. వేసవి సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్లేందుకు వీరి కుమార్తె, కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న గగన, ఒకటవ తరగతి చదువుతున్న సుజిత్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఉదయం కారులో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి చల్లటి వాతావరణంలో సేదతీరారు. కొన్ని గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వెనుదిరిగారు.
కొండపై నుంచి కిందకు వస్తుండగా రేణిమాను మలుపు ముందున్న మలుపు వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసులురెడ్డి కారు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఎడమవైపు లోయలు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు గుర్తించి కారును కుడివైపు తిప్పారు. అప్పటికే చేతి బ్రేక్‌ను వేసి కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. దీంతో కారును కుడివైపునకు మళ్లించి కొండను ఢీకొని నిలిపేలా ప్రయత్నించారు. అయితే కొండబండను ఢీకొన్న కారు ఒక్కసారిగా రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో అగ్నికి ఆహుతి అయ్యేలా ఉందని ఆందోళనకు గురైన శ్రీనివాసులురెడ్డి కారులోంచి బయటకు వచ్చేందుకు డోర్లు తెరచుకునే పరిస్థితి లేదని గుర్తించారు.
దీంతో కుడికాలితో బలంగా తన్ని అద్దాలను పగులగొట్టారు. తర్వాత భార్య, పిల్లులు కారులోంచి బయటపడ్డారు. అద్దాలను తన్నడంతో శ్రీనివాసులురెడ్డి కుడి పాదానికి తీవ్ర గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాద ఘటనను గుర్తించి స్థానికులు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. పాదానికి అయిన గాయానికి బ్యాండేజి కట్టి కారులో బి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కాగా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న భార్య రజిత, పిల్లలు గగన, సుజిత్‌రెడ్డిలకు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు కారు ఎడమవైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే కారు 30 అడుగులపైనుంచి కిందకు పడి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment