నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కేశప్ప, సీఐలు
మదనపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను.. ప్రియుడు, కన్నతండ్రితో కలిసి భార్య కిరాతకంగా కడతేర్చిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ దొనబైలు అటవీప్రాంతం గుర్రోళ్లగుట్టలో పూడ్చిపెట్టిన మృతదేహం వెలికితీతతో హత్య గుట్టు రట్టయింది. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన శ్రీనివాసులు(34)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన మేనమామ వెంకటరమణ వద్ద పెరిగాడు. తర్వాత జీవనోపాధిలో భాగంగా మదనపల్లెకు వచ్చి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో మదనపల్లె మండలంలో దిగువదొనబైలుకు చెందిన గీతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు మగపిల్లలు. కొన్నేళ్లక్రితం మదనపల్లె మండలం జమ్ముకుంటపల్లె వద్ద ఇంటిని కొనుగోలు చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంత కాలం వేరుగా ఉంటున్నారు. గీత తన పుట్టినిల్లు దిగువ దొనబైలు వద్ద ఉంటుండగా, శ్రీనివాసులు మదనపల్లెలో నివాసం ఉన్నాడు. జనవరి 26న పిల్లలను చూసి వస్తానని వెళ్లిన శ్రీనివాసులు తర్వాత కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు కర్ణాటక సరిహద్దు రాయల్పాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ చెరువులో శ్రీనివాసులు మోటార్‌సైకిల్ లభ్యమైంది.
వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కర్ణాటక పోలీసులు ఫోన్ చేయగా, వారు మృతుడి మేనమామ వెంకటరమణ ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారు. దీంతో వెంకటరమణ రాయల్పాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారణ చేయగా, మోటార్‌సైకిల్ తన మేనల్లుడిదేనని నిర్ధారించి, ఆచూకీ కోసం గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కర్ణాటక పోలీసుల సూచన మేరకు జనవరి 28న మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించిన పోలీసులు శ్రీనివాసులు పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉన్నట్లు తేలడంతో టూటౌన్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బండతో మోది హత్య చేసి..
టూటౌన్ పోలీసుల విచారణలో... చీకలబైలు పంచాయతీ ఎగువదొనబైలుకు చెందిన హరికృష్ణ కుమారుడు ముదిమడుగు ప్రసాద్(25)కు, మృతుడు శ్రీనివాసులు భార్య మండెంగీతమ్మ(33)కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. జనవరి 26న శ్రీనివాసులు తన ఇద్దరు పిల్లలను చూసేందుకు చీకలబైలు పంచాయతీ జమ్మికుంటకు వచ్చి, భార్యతో గొడవపడ్డాడన్నారు. అనంతరం మద్యం తాగి, ఇంట్లో పడుకుని ఉండగా, గీత తనకు ఫోన్ చేసి తన తండ్రి పొగాకు రామస్వామిని తీసుకుని, ఇంటికి రావాల్సిందిగా చెప్పిందన్నాడు. తమ సంబంధం సజావుగా సాగాలంటే, భర్త శ్రీనివాసులు అడ్డు తొలగించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. దీంతో ప్రసాద్, గీత తండ్రి రామస్వామి ఇద్దరూ కలిసి మద్యం మత్తులో పడుకున్న శ్రీనివాసులు తలపై బండరాయితో మోది హత్య చేశారు.
అటవీ ప్రాంతంలో పూడ్చివేత
అనంతరం శవాన్ని దొనబైలు గ్రామసమీపంలోని అటవీప్రాంతం గుర్రోళ్లగుట్టకు తీసుకెళ్లి ఎవ్వరికీ అనుమానం రాకుండా పూడ్చివేశారు. శ్రీనివాసులు ద్విచక్రవాహనాన్ని కర్ణాటక రాయల్పాడు సమీపంలోని చెరువులో పడేశారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తాలూకా సీఐ శేఖర్, టూటౌన్ ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, తాలూకా ఎస్‌ఐ రవికుమార్ గురువారం సాయంత్రం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అప్పటికే చీకటి పడటంతో వెనుదిరిగి, శుక్రవారం ఉదయం సీఐలు వలీబాషు, కృష్ణయ్య, శేఖర్, యువరాజ్‌లు నిందితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యజరిగి 13 రోజులు కావడం, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో అక్కడే శవపంచనామా నిర్వహించారు.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 సెల్‌ఫోన్స్, ఒక మోటార్‌సైకిల్, హత్యకు ఉపయోగించిన బండరాయి, పార స్వాధీనం చేసుకున్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పుచేసి విచారణ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఇనాయతుల్లా, హెడ్‌కానిస్టేబుల్ రామమూర్తి, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. కాగా, హత్యకేసులో గీత తల్లి, తమ్ముడిని అరెస్ట్ చేయాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు పొదల నరసింహులు స్థానికులతో కలిసి చీకలబైలు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment