గొంతు కోశారా.. తనే కోసుకున్నాడా ?
పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి పంచాయతీ సొన్నువారిపల్లికి చెందిన సోమశేఖర్ (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి వెళ్లిపోయారనే విషయం గురువారం సంచలనం రేకెత్తించింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమశేఖర్‌కు సంబంధించిన భూమిలోని ఇంటి స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వేరే వ్యక్తికి 2023లో విక్రయించాడు. కొనుగోలు చేసిన వ్యక్తి సదరు స్థలంలో పునాదులు వేస్తుండగా సోమశేఖర్ అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వివాదాస్పదంగా మారిన స్థలాన్ని సర్వేయర్ కొలతలు వేయగా విక్రయించిన స్థలం సోమశేఖర్‌దేనని అధికారులు ధ్రువీకరించారు. అప్పటి నుంచి తన పరువు పోయిందని భావించిన ఉద్యోగి వారిపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం కొంత కాలానికి ప్రభుత్వ ఉద్యోగి కొంత మందితో సోమశేఖర్ కుటుంబ సభ్యులపై దాడి చేయించి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ తరుణంలో ఇటీవల మళ్లీ కక్ష పెంచుకున్న ఉద్యోగి వారి సమీప బంధువైన మహిళను తెరమీదకు తెచ్చి పునాదులు మళ్లీ తవ్విస్తుండటంతో సోమశేఖర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం మద్యం మత్తులో ఉన్న సోమశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగా సోమశేఖరే మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా పోలీసుల సమగ్ర దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment