ఆలయ కమిటీ సభ్యుల నుంచి ప్రాణహాని
మదనపల్లె : రామసముద్రం మండలం బల్లసముద్రం గ్రామంలోని వాలీశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆలయ అర్చకులు లోక్ నాథ్ దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయానికి వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులే ప్రధాన అర్చకులుగా ఉన్నారన్నారు. ఆలయంలో పూజా కై ంకర్యాలు నిర్వహించేందుకు 124 ఎకరాల ఇనాము భూములు ఉన్నాయన్నారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ఈ ఆలయానికి ఇటీవలే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు, షామియానాలు, ఇతర సౌకర్యాలను, సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ ప్రధాన అర్చకుడైన తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. దీంతో ఆలయ ఆవరణలో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండగా, నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులు నందకుమార్, మల్లికార్జునలు తనపై దౌర్జన్యం చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారన్నారు. దేవదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఒకే కుటుంబానికి చెందిన వారిని తీసుకోవడంపై సీఎంకు ఫిర్యాదు చేశామన్నారు. నందకుమార్, శ్రీరాములు, మల్లికార్జున, గంగన్న, రామకృష్ణ, చిన్నరాయప్ప వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, కమిటీలో సభ్యులుగా ఎలా నియమించారో అర్థం కావడం లేదన్నారు. వీరందరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment