బైకును ఢీకొన్న ఆటో
దంపతుల దుర్మరణం కుమారుడి పరిస్థితి విషమం
మద్యం మత్తులో ఆటో నడపడమే ప్రమాదానికి కారణం
ఓబులవారిపల్లె : మద్యం మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మద్యం తాగి ఆటోను నడుపుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొనడంతో రాజంపేట మండలం, భువనగిరిపల్లి గ్రామానికి చెందిన కోలాటం నరసింహులు (42), భార్య సుజాత (38) దుర్మరణం చెందారు. వారి కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా.. భువనగిరిపల్లికి చెందిన కోలాటం నరసింహులు తన అత్తగారి ఊరైన ఓబులవారిపల్లి మండలం, వై.కోట గ్రామానికి వచ్చి తన భార్య, కుమారుడు చరణ్, తమ్ముడి కుమార్తె త్రిషాన్వీతో కలిసి పల్సర్ బైకుపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వై.కోట నుంచి బయల్దేరారు. రెడ్డిపల్లి చెరువుకట్ట వద్దకు రాగానే టాటా ఏస్ లగేజీ ఆటో వేగంగా వచ్చి బైకును ఢీ కొంది.
దీంతో బైకు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన భార్య సుజాతను రాజంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుమారుడు చరణ్ తేజ్ (12) పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. నరసింహులు తమ్ముడి కుమార్తె త్రిషాన్వీ చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో బైకును వేగంగా ఢీ కొని టాటా ఏస్ వాహనం వెళ్లిపోయింది. ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇంటి నుంచి బయల్దేరిన అరగంటలోనే కుమార్తె చనిపోయిందన్న చేదు వార్తను విని సుజాత తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. భువనగిరిపల్లిలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నరసింహులుకు భార్య సుజాత, కుమారుడు చరణ్ తేజ్ ఉన్నారు. గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న నరసింహులు ఇటీవల అయ్యప్పస్వామి మాల ధరించి శబరిమలైకు వెళ్లి వచ్చి అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వై.కోట, భువనగిరిపల్లి గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ పి.మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment