mamillapalli
-
‘బ్లాస్టింగ్’పై పారదర్శకంగా విచారణ
సాక్షి, కడప/బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి క్వారీ వద్ద 10 మందిని బలితీసుకున్న భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతానికి తావులేకుండా బాధ్యులందరిపైనా చర్యలకు ఆదేశించడంతో విచారణ వేగం పుంజుకుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు, పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు వై.ఎస్.ప్రతాపరెడ్డిని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తద్వారా తప్పు చేసిన వారి విషయంలో తన–మన అనే తేడాలుండవని ప్రభుత్వం గట్టి సంకేతాలనిచ్చింది. సంఘటనపై దర్యాప్తునకు ఐదుగురు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించటంతో ఈ కమిటీ బుధవారం మామిళ్లపల్లెను సందర్శించి విచారణ ఆరంభించింది. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, మైన్స్ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్స్ శాఖలకు చెందిన అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వారు తెలియజేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, క్షుణ్నంగా విచారణ చేస్తున్నామని జేసీ గౌతమి విలేకరులకు చెప్పారు. జిల్లాలో మిగతా క్వారీలను కూడా తనిఖీ చేసి అక్రమాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఈనెల 8వ తేదీన జిలెటిన్ స్టిక్స్‌ను క్వారీ వద్ద దించుతుండగా పేలుడు ఘటనలో మృతి చెందిన పది మందికి లీజుదారుడి నుంచి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం మరో రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ పరిహారం తాలూకు చెక్కుల్ని అధికారులతో కలిసి స్థానిక నేతలు బుధవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. దీంతో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున సాయం అందినట్లయింది. ఐదు రోజుల్లోనే... ఘటన జరిగిన ఐదు రోజుల్లోనే ప్రభుత్వం వేగంగా స్పందించి అండగా నిలవడంపై బాధిత కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. ఘటన జరిగిన మూడో రోజే లీజుదారుడి నుంచి రూ.50 లక్షలు పరిహారం బాధితులకు ఇప్పించగా ప్రభుత్వం కూడా తన సాయాన్ని అందజేసింది. నిబంధనలు పాటించకుండా ఎల్రక్టానిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను ఒకేసారి వాహనంలో క్వారీ వద్దకు తరలించడం, జాగ్రత్తలు తీసుకోకుండా ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో దించడంతో ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులు, క్షతగాత్రులను ఆదుకోవడంతోపాటు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిమాండ్‌కు వైఎస్ ప్రతాప్‌రెడ్డి దాదాపు 33 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఈ క్వారీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి పేరుతో ఉండగా బి.మఠం ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. లీజుదారుడు నాగేశ్వర్‌రెడ్డిని, ఎక్స్‌ప్లోజివ్స్ మేనేజర్ రఘునాథరెడ్డిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. పేలుడు పదార్థాల విక్రయాల్లో నిబంధనలు పాటించలేదని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డరు పులివెందులకు చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బద్వేలు మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆయన సమీప బంధువు అయినప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యులందరిపైనా పోలీసులు చర్యలు చేపట్టారు. -
మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో ముగ్గురాళ్ల క్వారీ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన పేలుడుకు సంబంధించి బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్ మేనేజర్ రఘునాథరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. కడపలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేలుడులో 10 మంది మృతిచెందారని, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారిగా కడప ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్‌ను నియమించామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో మేనేజర్ లక్ష్మిరెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించామన్నారు. మిగిలిన మృతులను గుర్తించేందుకు నమూనాలను పరీక్షించేందుకు విజయవాడకు పంపించినట్లు తెలిపారు. ఇంకా ఈ కేసులో మైనింగ్ ఓనర్లకు, ఇతర బాధ్యులైనవారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు, పేలుళ్లకు అనుమతులు లేవన్నారు. పేలుడు సమయానికి ముందు పులివెందుల నుంచి 20 బాక్స్‌లలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కారులో తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్, ఎస్బీ డీఎస్పీ బీవీ శివారెడ్డి పాల్గొన్నారు. -
మామిళ్లపల్లె బ్లాస్టింగ్పై ఐదుగురితో కమిటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 1లో జరిగిన బ్లాస్టింగ్ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు ఐదు శాఖలకు చెందిన అధికారులతో నియమించిన కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటైన కమిటీ ఐదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని మంత్రి తెలిపారు. పేలుడు ఘటనలో పదిమంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు జిల్లా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధి నుంచి తక్షణం రూ.పది లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కడప కలెక్టర్ ఘటనపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేశారని చెప్పారు. కార్మిక నష్ట పరిహార చట్టం 1923 ప్రకారం మృతి చెందిన కూలీల కుటుంబాలకు లీజుదారు నుంచి పరిహారం ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏపీ ఎంఎండీ అండ్ ఆర్ చట్ట ప్రకారం బాధ్యులందరిపై చర్యలు.. తాజా ఘటనపై ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, ఎంఎండీ అండ్ ఆర్ చట్టం–1957 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. బాధ్యులు అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన సమాచారం తెలియగానే గనులు, భూగర్భశాఖ డైరెక్టర్ (డీఎంజి) వి.జి. వెంకటరెడ్డి, ఉప సంచాలకులు ఎం.బాలాజీ నాయక్, కడప అసిస్టెంట్ డైరెక్టర్ డి. రవి ప్రసాద్, రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్, మైనింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. పేలుడు పదార్థాల రవాణా, అన్ లోడింగ్‌లో నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. -
మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు చదవండి: ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి పూలింగ్.. భారీ కుట్ర -
ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి
బద్వేలు/కలసపాడు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో పేలడంతో ముగ్గురాళ్ల క్వారీలో పనిచేయడానికి వచ్చిన 9 మంది కూలీలు అక్కడికక్కడే అశువులు బాశారు. ఈ ఘటనలోకారు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు తునాతునకలై అర కిలోమీటర్ దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి మామిళ్లపల్లె గ్రామ శివారులో తిరుమల కొండస్వామి తిప్పపై ముగ్గురాళ్ల క్వారీని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముగ్గురాళ్లను పగులగొట్టేందుకు పులివెందుల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు (ఈడీ) కారులో తీసుకువచ్చారు. కూలీలు వీటిని కారులో నుంచి తీసే సమయంలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో కారు డ్రైవర్, తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డిటోనేటర్లను కారు నుంచి దింపుతున్న సమయంలో ఇద్దరు కూలీలు తాగునీటి కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా పేలుడు శబ్దం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించడంతో సమీప గ్రామాలైన మామిళ్లపల్లె, మహానందిపల్లె, అక్కివారిపల్లె, ముదిరెడ్డిపల్లె, కలసపాడులతోపాటు మరో 15 గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని వణికిపోయారు. మృతులు వీరే.. ప్రమాదంలో మరణించిన పది మందిలో ఏడుగురు వైఎస్సార్ జిల్లా వేముల మండలానికి చెందినవారు కాగా మిగతా ముగ్గురు కలసపాడు, పోరుమామిళ్ల, వేంపల్లె మండలాల వారు. వేముల మండలంలోని వేములకు చెందిన అబ్దుల్ (30), ఈ.కొత్తపల్లెకు చెందిన బాలగంగులు (35), వెంకటరమణ (25), లక్ష్మిరెడ్డి (60), బుచ్చయ్యగారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య (45), గొందిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (45), రంగోరిపల్లెకు చెందిన గంగిరెడ్డి (50), వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన వెంకటేష్ (25), కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన ప్రసాద్ (40), పోరుమామిళ్లకు చెందిన కారు డ్రైవర్ కొరివి ప్రసాద్ (35)లు పేలుడులో అశువులు బాశారు. తాగునీటి కోసం బయటకు వచ్చిన వేముల మండలానికి చెందిన రామాంజులరెడ్డి (55), శ్రీరాములరెడ్డి (50) త్రుటిలో తమ ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి కూడా ఘటనాస్థలికి వెళ్లి సమీప గ్రామాల ప్రజలు, ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరు కూలీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భీతావహంగా ఘటనా స్థలం డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలడంతో అక్కడ వాటిని దించుతున్న కూలీలతోపాటు కారుడ్రైవర్ శరీరభాగాలు ఛిద్రమైపోయాయి. మృతుల శరీర భాగాలు తునాతునకలైపోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. అర కిలోమీటర్ పరిధిలో ఎటుచూసినా వెదజల్లినట్టు కాళ్లు, చేతులు, వేళ్లు, పేగులు, ఇతర అవయవాలే. ఇవి గుట్టలు, రాళ్లపైనే కాక చెట్లపైన కూడా పడ్డాయి. సమీపంలోని చెట్లు పూర్తిగా కాలిపోయి మోడు బారాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. నిబంధనల ప్రకారం.. ప్రత్యేక వాహనంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను వేర్వేరుగా నిపుణుల సహాయంతో క్వారీల వద్దకు తీసుకురావాలి. వాటిని నిపుణుల సహకారంతో పూర్తి జాగ్రత్తలతో క్వారీల్లో అమర్చి పేల్చాలి. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను దించేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తత అవసరం. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించి ప్రత్యేక వాహనంలో కాకుండా కారులో వీటిని తెచ్చింది. కూలీలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. డిటోనేటర్లు యాక్టివేట్ కావాలంటే విద్యుత్ అవసరం ఉంటుంది లేదా తీవ్రస్థాయిలో వాటిపై ఒత్తిడి పడాలి. దించే సమయంలో ఒత్తిడి పడి ఉండటం లేదంటే వాటి సమీపంలో ఎవరైనా మాట్లాడేందుకు సెల్‌ఫోన్ ఆన్ చేయడమో చేసి ఉండటమే ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ ఆన్ చేయగానే దాని నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరంగాలను ఈడీలు గ్రహించి పేలుడు జరిగి ఉంటుందని అంటున్నారు. పక్కనే జిలెటిన్ స్టిక్స్ ఉండటంతో వీటి పేలుడు తీవ్రత అధికమైందని అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వైఎస్సార్ జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు రవిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిళ్లపల్లె పరిధిలో సర్వే నంబర్లు–1, 133లో బెరైటీస్ ఖనిజం వెలికితీయడానికి 30.696 హెక్టార్లలో సి.కస్తూరిబాయి పేరు మీద 2001 నవంబర్ 2న లీజుకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది నవంబర్ 1 వరకు లీజు అనుమతి ఉండగా మైనింగ్ నిర్వహణను సి.నాగేశ్వరరెడ్డికి జీపీఏ హోల్డర్‌గా 2013లో కస్తూరిబాయి ఇచ్చారని తెలిపారు. పేలుడు పదార్థాల రవాణా, అన్లోడింగ్ విషయంలో లీజుదారుడి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనిపై జేసీ, రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రెవెన్యూ శాఖ సిబ్బందితో కమిటీ వేసి ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కౌలుదారులు, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతోపాటు కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పేలుడు పదార్థాలను జాగ్రత్తలు పాటించకుండా వినియోగించడంపై లీజుదారుడు నాగేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. మృతుల కుటుంబాలకు గవర్నర్, సీఎం ప్రగాఢ సానుభూతి ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో పది మంది మృత్యువాత పడటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులను అడిగి ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. -
ముగ్గురాయి గనుల్లో పేలుడు: 5 మంది మృతి
-
ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తరలించారు. అన్లోన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్వారీలో పేలుడు ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కారణాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.. పేలుడు ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో పేలుడు ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ మద్యం మత్తులో దారుణం.. -
రెడ్‌క్రాస్ భోజన పంపిణి కార్యక్రమం
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం భోజన పంపిణి కార్యక్రమం నిర్వహించారు. జనతా కర్ఫ్యూ లోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, కలెక్టరేట్ సిబ్బందికి, ఆశ వర్కర్స్‌కి సిబ్బందికి అలాగే రోడ్డు ప్రక్కల నిరాశ్రయులకు, బిక్షాటన చేసుకునేవారికి భోజనాన్ని అందించారు. దాదాపు 1000 మందికి ఈ కార్యక్రమం ద్వారా ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ జయప్రకాష్ మాట్లాడుతూ దాతలు శ్రీనివాస్ 600 మందికి, కన్యకా పరమేశ్వరి సత్రం వారు 400 మందికి భోజనాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిరిశాల వరప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన లైన్‌మన్
కనగానపల్లి (రాప్తాడు) : విద్యుత్ కనెక్షన్ కోసం లైన్‌మన్ ఆదినారాయణ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని దాదులూరులో రైతు ముచ్చురాం నాగిరెడ్డి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2013లో దరఖాస్తు చేసుకోగా 2016లో మంజూరైంది. ఏడాది అవుతున్నా బోరుబావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి సిబ్బంది ఆలస్యం చేశారు. దీంతో రైతు కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పలుమార్లు విద్యుత్ అధికారులు, సిబ్బందిని కలసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. డబ్బు ఇవ్వనిదే కనెక్షన్ ఇవ్వబోమని లైన్‌మన్ ఆదినారాయణ తేల్చి చెప్పాడు. అంతటి ఆర్థిక స్థోమత లేక ఆ రైతు నాలుగు రోజులు క్రితం అనంతపురంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు బుధవారం మామిళ్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో లైన్‌మన్‌కు రూ.6వేలు డబ్బు ఇచ్చేందుకు వెళ్లాడు. డబ్బు తీసుకుంటున్న సమయంలో లైన్‌మన్ ఆదినారాయణను ఏసీబీ జిల్లా ఇన్చార్జ్ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా, సిబ్బందితో అక్కడికెళ్లి పట్టుకున్నారు. తర్వాత లైన్‌మన్‌ను సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రాథమిక విచారణ జరిపి, రైతు నుంచి తీసుకున్న డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.