ఏసీబీకి చిక్కిన లైన్‌మన్‌ | lineman arrest | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన లైన్‌మన్‌

Published Wed, Feb 15 2017 10:39 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కిన లైన్‌మన్‌ - Sakshi

ఏసీబీకి చిక్కిన లైన్‌మన్‌

కనగానపల్లి (రాప్తాడు) : విద్యుత్‌ కనెక‌్షన్‌ కోసం లైన్‌మన్‌ ఆదినారాయణ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని దాదులూరులో రైతు ముచ్చురాం నాగిరెడ్డి వ్యవసాయ విద్యుత్‌ కనెక‌్షన్‌ కోసం 2013లో దరఖాస్తు చేసుకోగా 2016లో మంజూరైంది. ఏడాది అవుతున్నా బోరుబావికి విద్యుత్‌ కనెక‌్షన్‌ ఇవ్వడానికి సిబ్బంది ఆలస్యం చేశారు. దీంతో రైతు కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పలుమార్లు విద్యుత్‌ అధికారులు, సిబ్బందిని కలసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు.

డబ్బు ఇవ్వనిదే కనెక‌్షన్‌ ఇవ్వబోమని లైన్‌మన్‌ ఆదినారాయణ తేల్చి చెప్పాడు. అంతటి ఆర్థిక స్థోమత లేక ఆ రైతు నాలుగు రోజులు క్రితం అనంతపురంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు బుధవారం మామిళ్లపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో లైన్‌మన్‌కు రూ.6వేలు డబ్బు ఇచ్చేందుకు వెళ్లాడు. డబ్బు తీసుకుంటున్న సమయంలో లైన్‌మన్‌ ఆదినారాయణను ఏసీబీ జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా, సిబ్బందితో అక్కడికెళ్లి పట్టుకున్నారు. తర్వాత లైన్‌మన్‌ను సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రాథమిక విచారణ జరిపి, రైతు నుంచి తీసుకున్న డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని కర్నూల్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement