lineman arrest
-
విద్యుత్ మీటరుకు రూ.10,000 లంచం డిమాండ్
సాక్షి, గుంటూరు: విద్యుత్ మీటరుకు వినియోగదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసి, అతని నుంచి రూ.5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి లైన్‌మన్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం మండలంలోని తురకపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తురకపాలెం గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తన ఇంటికి విద్యుత్ మీటరు కోసం లైన్‌మన్ డేవిడ్‌ను సంప్రదించారు. విద్యుత్ మీటరు కావాలంటే రూ.10 వేలు మీటరు బిల్లుకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో మూడు నెలలుగా లైన్‌మన్ చుట్టూ తిరిగిన పూర్ణచంద్రరావు తాను కూలీ పనులు చేసుకునే వాడినని, అంత ఇవ్వలేనని చెప్పగా అందుకు ససేమిరా అని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాధితుడు లైన్‌మన్‌ను బతిమాలుకుని రూ.5వేలు ముందు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సోమవారం సాయంత్రం గ్రామంలోని తన ఇంటి వద్దకు రావాలని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ అల్లంగి సురేష్‌బాబు, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని బాధితుడి నుంచి లైన్‌మన్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లైన్‌మన్‌పై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. -
ఏసీబీకి చిక్కిన లైన్‌మన్
కనగానపల్లి (రాప్తాడు) : విద్యుత్ కనెక్షన్ కోసం లైన్‌మన్ ఆదినారాయణ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని దాదులూరులో రైతు ముచ్చురాం నాగిరెడ్డి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2013లో దరఖాస్తు చేసుకోగా 2016లో మంజూరైంది. ఏడాది అవుతున్నా బోరుబావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి సిబ్బంది ఆలస్యం చేశారు. దీంతో రైతు కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పలుమార్లు విద్యుత్ అధికారులు, సిబ్బందిని కలసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. డబ్బు ఇవ్వనిదే కనెక్షన్ ఇవ్వబోమని లైన్‌మన్ ఆదినారాయణ తేల్చి చెప్పాడు. అంతటి ఆర్థిక స్థోమత లేక ఆ రైతు నాలుగు రోజులు క్రితం అనంతపురంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు బుధవారం మామిళ్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో లైన్‌మన్‌కు రూ.6వేలు డబ్బు ఇచ్చేందుకు వెళ్లాడు. డబ్బు తీసుకుంటున్న సమయంలో లైన్‌మన్ ఆదినారాయణను ఏసీబీ జిల్లా ఇన్చార్జ్ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా, సిబ్బందితో అక్కడికెళ్లి పట్టుకున్నారు. తర్వాత లైన్‌మన్‌ను సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రాథమిక విచారణ జరిపి, రైతు నుంచి తీసుకున్న డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.